శ్రీ శ్రీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ శ్రీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జూన్ 2013, సోమవారం

జ్ఞాపకాలు పంచుకోవడం అంటే ఇదే.


శ్రీ శ్రీ వర్ధంతికి ప్రసార మాధ్యమాల్లో తగిన ప్రాధాన్యత లభించలేదని బాధ పడుతున్నవారికి స్వాంతన కలిగేలా వుంది ఈ విషాద స్మృతి . ముప్పయ్ ఏళ్ళక్రితం శ్రీ శ్రీ మరణించిన రోజు ఈనాడు దినపత్రికలో పనిచేస్తున్న  నవీన్ RJY గారి జ్ఞాపకాలు:

మహాకవి శ్రీశ్రీ  

"శ్రీశ్రీ మరణాన్ని మరణవార్తగా కాక ఉద్వేగభరితమైన అనుభూతిగా పాఠకుల ముందుంచిన అనుకోని/యాధృచ్ఛిక ఈనాడు "ప్రయోగం"లో నేను కూడా చిన్న భాగస్వామినే!
ఆమహాకవి 30 వర్ధంతి జూన్ 16 అన్న ఫేస్ బుక్ ప్రస్తావన చూశాక ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అప్పటి టెలిప్రింటర్ ఆపరేటర్ గుండిమెడ (రామచంద్ర) శర్మతో ఫోన్ లో మాట్లాడి వివరాలు ధృవీకరించుకున్నాక ఇది రాస్తున్నాను.
అప్పుడు నేను తిరుపతి ఈనాడు ఎడిషన్ మఫిషియల్ డెస్క్ ఇన్ చార్జని. కెఎన్ వై పతంజలి గారు జనరల్ డెస్క్ ఇన్ చార్జ్....ఆరోజురాత్రి 7 గంటల ప్రాంతం...బోయ్ ఏకాంబరం వచ్చి ప్రకాష్ సార్ పిలుస్తున్నారంటే జనరల్ డెస్క్ కి వెళ్ళా. షిఫ్ట్ ఇన్ చార్జ్ ప్రకాష్ ఫస్ట్ ఎడిషన్ డ్యూటీ అయిపోయింది. ఇంకో షిఫ్ట్ ఇన్ చార్జ్ రామశేషుగారు నైట్ ఎడిషన్ల డ్యూటీకి వచ్చేశారు. సబ్ ఎడిటర్లు రామశేషుగారు, ప్రకాష్ గారు, విలాసిని గారూ గంభీరంగా వున్నారు.
శ్రీశ్రీ మద్రాస్ లో పోయారు. వార్తతెప్పించండి అని ఓ టెలిప్రింటర్ మెసేజ్ నా చేతికిచ్చారు. అది విజయవాడ ఆఫీస్ నుంచి వచ్చింది. శ్రీశ్రీ మరణవార్తను చలసాని ప్రసాద్ గారు ఫోన్ లో చెప్పారు. వార్తతెప్పించండి అని అందులోవుంది.
మద్రాస్ లో సితార కు మిక్కిలినేని జగదీష్ బాబు రిపోర్టర్. మద్రాసు ఈనాడు ఆఫీస్ కి జగదీష్ బాబు ఇంటికీ, ఆరుద్రగారి ఇంటికీ(నెంబరు ప్రకాష్ ఇచ్చారు) ట్రంకాల్ బుక్ చేశాను. (బహుశ ఈ విషయం ప్రపంచానికి నేనే చెప్పాలన్న బాధ్యత అధికారాలను ఒలకబోస్తూ) ప్రెస్ కాల్ అర్జంట్ అని ఆపరేటర్ నిఅడిగాను. విషయం చెప్పాను.  శ్రీ శ్రీ ఎవరు అని అతను అడిగాడు.
అంతలో కరెంటుపోయింది. ఎవరో "మహాప్రస్ధానం" పుస్తకాన్ని తీసుకు వచ్చారు. కొవ్వొత్తి వెలుగులో శర్మ ఒకో కవితనీ బిగ్గరగా చదువుతూంటే నా డెస్క్ లో సబ్ ఎడిటర్ దాట్ల నారాయణ మూర్తిరాజు కావలసిన లైన్ లను నోట్ చేసుకున్నారు. నా డెస్క్ లో కళత్తూరు సుధాకరరెడ్డి బయటికి వెళ్ళి ఎక్కడినుంచో ఖఢ్గసృష్టి పుస్తకం తెచ్చి ప్రకాష్ కి ఇచ్చారు.
ఆరుద్రగారినుంచి కాల్ వచ్చింది నేను రాసుకుంటూనే సైగచేసేస్తే ఏకాంబరం వెళ్ళి ప్రకాష్ ని తీసుకువచ్చారు. ఆయన సంతాపసందేశాన్ని పూర్తిగా రాసుకున్నారు.
ఇంతలో  నామిని సుబ్రమణ్యం నాయుడు ఓ రిపోర్టు రాసుకొచ్చాడు. శ్రీశ్రీ మరణానికి ఆకాశం బోరున ఏడుస్తోందని...అప్పటి వరకూ బయట పెద్దవాన పడుతోందన్న స్పృహే మాకెవరికీ లేదు.
శ్రీశ్రీ గారి కవితలనే కోట్ చేస్తూ మరణవార్తను దాట్లనారాయణ మూర్తిరాజు రాశారు. చర్చించుకుని చిన్న మార్పులు చేశారు.
హైదరాబాద్ ఈనాడు సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డునుంచి వర్మగారు నాకు ఫోన్ చేసి "ఎట్టి పరిస్ధితుల్లోనూ మాస్ట్ హెడ్ (ఈనాడు లోగో) దించడానికి వీల్లేదని చెప్పు" అన్నారు.
అపుడు రామశేషుగారు - బ్యానర్ వార్తేగాని మాస్ట్ హెడ్ దించవలసింది కానేకాదు అని తెగేసి చెప్పారు. (ఆ ఎడిషన్ రామశేషుగారు ఇవ్వవలసింది. ప్రకాష్ బృందం ఉద్వేగాన్ని గౌరవించి వారికి బాధ్యతలు అప్పగించేసి పక్కనే వుండి మొత్తం పరిస్ధితిని ఫాలోఅవుతున్నారు.)
"
మహాకవి శ్రీశ్రీ మహాప్రస్ధానం" అని బ్యానర్ రాశారు.ఇది అందరికీ అర్ధమౌతుందా అని నాకు అనుమానమొచ్చంది. ఈ అనుమానాన్నే శర్మ అడిగితే "శ్రీశ్రీ గురించి తెలిసిన వాళ్ళకి ఇది అర్ధమౌతుంది" అని రామశేషుగారు రూలింగ్ యిచ్చారు.
ఈ మొత్తం ప్రక్రియలో ప్రకాష్, దాట్ల, రామశేషు గార్లదే యాక్టివ్ రోల్. డెస్క్ ఎదురగా దూరంగా వుండే ఇన్ చార్జ్ సీటులో పతంజలిగారు కూర్చుని కొవ్వొత్తి వెలుగులో ఆలోచిస్తూ రాసుకుంటున్న రూపం మెదులుతున్నట్టువుంది. మామూలుగా ఫస్ట్ ఎడిషన్ పేజీలు ఇచ్చేశాక పతంజలి వెళ్ళిపోతారు. ఆరోజు ఆయన తిరుపతి టౌన్ కి వెళ్ళారనీ(ఎడిషన్ ఆఫీస్ రేణిగుంటలో వుంటుంది) ఫలానాఫలానా చోట వుండొచ్చనీ రిపోర్టర్ వల్లీశ్వర్ గారికి ఫోన్ చేసి పతంజలిగారికి కబురందేలా చూడాలనీ ప్రకాష్ గారు నన్ను అడిగినట్టు లీలగా గుర్తుంది..లేట్ గా ఆయన వచ్చారో లేక రాలేదో ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు అయితేవార్త మొత్తం కాపీ తయారు చేసింది దాట్లగారే! మెరుగులు దిద్దింది ప్రకాష్ గారే! తుదిమెరుగులన్నీ పతంజలిగారివేననీ, ఆయన విజయవాడ న్యూస్ ఎడిటర్ వాసుదేవరావుగారూ చాలాసార్లు ఫోన్ లో మాట్లాడుకున్నారనీ నాకు లీలగా గుర్తొస్తోంది. శర్మ మాత్రం ఆ రాత్రి పతంజలిగారు కనబడలేదని గట్టిగాచెబుతున్నారు. నేనైతే దాట్ల ముడి సరుక్కి ఉద్వేగాన్ని అద్దింది పతంజలిగారేనని గట్టిగా నమ్ముతున్నాను.
ఎడిషన్ అయిపోయాక చాలాసేపు వుండిపోయాము. టీలు సిగరెట్లూ తీసుకురావడానికి ఏకాంబరం ఆరోజు కనీసం 60/70 సార్లయినా పైకీ కిందికీ తిరిగివుంటాడు.
మూడోరోజుకల్లా చైర్మన్ గారి(రామోజీరావుగారు) కామెంట్స్ వచ్చాయి. "బాగుంది. శ్రీశ్రీ కుటుంబ వివరాలు లేవు.సామాన్యపాఠకులకు ఈ వార్త అర్ధమౌతుందా" అని పేపర్ మీద పచ్చసిరాతో ఆయన రాశారు."(17-06-2013)

25, అక్టోబర్ 2010, సోమవారం

రేడియో గురించి ఇంకా ఇంకా రాయాలని ఉంది – భండారు శ్రీనివాసరావు

రేడియో గురించి ఇంకా ఇంకా రాయాలని ఉంది – భండారు శ్రీనివాసరావు

రేడియో అన్న మూడక్షరాలు కాలగర్భంలో కలిసి పోయాయేమో అన్న అనుమానాలన్నీ రేడియో గురించి రాసిన వ్యాసంపై వచ్చిన అనూహ్య స్పందన చూసి పటాపంచలయిపోయాయి. గుర్తున్నంతవరకే కాకుండా, గుర్తు తెచ్చుకుని మరీరాయాలనీ, అవసరమయితే రేడియో గురించి తెలిసిన ప్రతి ఒక్కర్నీ తట్టిలేపయినాసరే ఇంకా ఇంకా రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం లో అందరి సహకారాన్నీ మనస్పూర్తిగా కోరుతున్నాను. తప్పులు దిద్దుకోవడంలో, రాసిన విషయాలను మరింత సమగ్రం చేసుకోవడంలో, ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్రోడీకరించు కోవడంలో ఈ సహకారం ప్రయోజనకారిగా వుండగలదని నమ్ముతున్నాను.

ఆకాశవాణి న్యూస్ రీడర్లను పరిచయం చేసే క్రమంలో శ్రీ శ్రీ ప్రసక్తి వచ్చిన సందర్భంలో సుజాత గారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి ప్రస్తావన తీసుకువచ్చారు. 90 దశకం పూర్వార్ధంలో కన్నుమూసిన సుబ్రహ్మణ్యం గారు నయాగరా కవిత్రయం లో ఒకరు. మిగిలిన ఇద్దర్లో ఒకరు బెల్లంకొండ రామదాసు గారు కాగా మరొకరు వచన కవి కుందుర్తి ఆంజనేయులు గారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి తమ్ముడు ఏల్చూరి విజయ రాఘవ రావు గారు ప్రముఖ వేణుగాన విద్వాంసులు. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ లోని ఫిలిమ్స్ డివిజన్ లో చాలాకాలం మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సుబ్రహ్మణ్యం గారి కుమారుడు  మురళీధరరావు గారు  న్యూఢిల్లీ లో ప్రొఫెసర్ గా వున్నారు. తెలుగులో నడిచే నిఘంటువుగా పేరుతెచ్చుకున్నారు. సుబ్రహ్మణ్యం గారు చాలాకాలం మద్రాసులో సోవియట్ భూమి తెలుగు విభాగం లో పనిచేశారు. బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారు, శెట్టి ఈశ్వర రావు గారు, తాపీ మోహన రావు గారు (తాపీ ధర్మారావు గారి తనయుడు) ఆయనకు సహచరులు. శ్రీ శ్రీ, ఝరుఖ్ శాస్త్రి గార్లకు సుబ్రహ్మణ్యం గారు సన్నిహిత మిత్రులు. వారి నడుమ సంభాషణలు కవితాత్మకంగా, కొండొకచో రసాత్మకంగా వుండేవని చెప్పుకునేవారు. ఒకసారి శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యం గారి గురించి చెబుతూ ప్రాసక్రీడల్లో అనుకుంటాను –

“ఏ సోడా! ఏ నీళ్ళూ
వీసం కూడా కలపక
సౌనాయాసంగా విస్కీ సేవించే ఏసుకు ...” అని ఆశువుగా ఆలపించారు. ఇక్కడ సౌనాయాసంగా అంటే సునాయాసంగా – ఏసు అంటే ఏల్చూరి సుబ్రహ్మణ్యం. అలా వుండేదన్న మాట మహాకవితో ఆయనగారికున్న సాన్నిహిత్యం.

సుబ్రహ్మణ్యం గారు మద్రాసులో వున్నప్పుడు రాళ్ళభండి వెంకటేశ్వరరావు (ఆర్వీయార్) గారు పాస్ పోర్ట్ పనిమీద అనుకుంటాను అక్కడికి వెళ్లారు. తదనంతర కాలంలో రచయిత, గ్రంధకర్త, విమర్శకుడు అయిన ఆర్వీయార్ గారు మాస్కోలోని రాదుగ ప్రచురణాలయంలో చాలాకాలం పనిచేశారు. మాస్కోలో చదువు కోవడానికి వచ్చే పిల్లలందరికీ ఆయనే అక్కడ పెద్దదిక్కు. మా కుటుంబం మాస్కోలో వున్నప్పుడు కూడా వారి ఇంటికి రాకపోకలు ఎక్కువ. సరే, ఆయన మద్రాసు వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం గారిని కలిసారు. పక్కన వున్న శెట్టి ఈశ్వర రావుగారు ‘జగమెరిగిన బ్రాహ్మణుడు’ అంటూ సుబ్రహ్మణ్యం గారిని ఆర్వీయార్ గారికి పరిచయం చేయబోయారు. “అదేమిటండీ అలా అంటారు చొక్కా లోపలనుంచి జంధ్యం అలా కనబడుతుంటేనూ” అని ఆర్వీయార్ గారు తన సహజ శైలిలో అనేసారుట - “జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేలా?” అన్న నానుడిని గుర్తు చేస్తూ.

సుబ్రహ్మణ్యం గారి వియ్యంకులు ధనికొండ హనుమంతరావు గారికి మద్రాసులో తెలుగు ముద్రణాలయం వుండేది. ఎవరయినా రచయిత పుస్తకం అచ్చుపని ఎప్పుడు పూర్తవుతుందని అడిగితె ఆయనకు చర్రున మండుకొచ్చేదిట. “ఏమిటయ్యా హడావిడి. బట్టలు ఇస్త్రీకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే కట్టుకోవాలి కాని ఇలా వెంటపడితే ఎలా” అనేవారని ఆర్వీయార్ గారు చెప్పారు.

అన్నట్టు, ఆర్వీయార్ గారు కూడా మాస్కో రేడియోలో ఆపద్ధర్మంగా వార్తలు చదివేవారు. రష్యన్-తెలుగు డిక్షనరీ కూడా తయారు చేసారు. పనులమీదా, ఇస్కస్ (ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ ) ఆహ్వానం మీదా సోవియట్ యూనియన్ సందర్శించే తెలుగువారికి ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా వుండేది.