తెలంగాణా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలంగాణా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జూన్ 2015, బుధవారం

హితవాక్యము


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 11-06-2015, THURSDAY)

'క్రమక్రమముగా కొలువుకూటము రణకూటమగుచున్నది, పదువురుండగనే నా మాటలాలకింపుడు' అంటాడు పాండవుల పనుపున దూతగా వచ్చిన శ్రీకృష్ణుడు కౌరవసభలో ధృతరాష్ట్రుడితో.
ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ రంగం  సమరాంగణంగా మారుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు ఉవ్వెత్తుతున్నాయి. ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. మీడియాలో చర్చలు, ఎవరివాదాన్ని వారు బలంగా వినిపించే ధోరణితో పేట్రేగిపోతూ దారితప్పుతున్నాయి. ఒకరు చెప్పేది మరొకరు వినిపించుకోరు. తమ మాటే వినాలని, తమ ప్రశ్నకే జవాబు చెప్పి తీరాలని, అ సమాధానం కూడా తమకు అనుకూలంగా వుండాలని పట్టుబట్టే పెడ ధోరణే  జడలు విప్పుకుంటోంది.  ఈ వేడిలో, వాడిలో  వివేచన వెనక్కు తప్పుకుంటోంది. తప్పు మీదంటే మీదని బురద చల్లుకునే క్రమంలో తప్పు చేయడం అసలు  తప్పేకాదన్న రీతిలో భాష్యాలు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న అధినాయకులే యుద్ధరంగంలో దిగి సమర శంఖాలు పూరిస్తూ వుండడంతో కధ క్లైమాక్స్ కు చేరుతోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు అనుచర గణాలు ఈ విషయంలో  నాయకులను మించి గొంతులు పెంచి నానా యాగీ చేస్తున్నాయి. మొన్న ఒక టీవీ ఛానల్ చర్చకు వచ్చిన ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి నిస్సిగ్గుగా చెప్పాడు, 'ఈ విషయంలో జర్నలిష్టులయినా, విశ్లేషకులయినా ఎవరయినా సరే, ఏ ఒక్కర్నీ ఉపేక్షించవద్దు, గట్టిగా తిప్పికొట్టండి, మన వాదాన్ని బలంగా వినిపించండి'  అంటూ తమ నాయకుడే తమను ఆదేశించాడని. నిజానికి ఏ నాయకుడు అలా చెప్పడు. ఆ పార్టీ ప్రతినిధి అమాయకంగా చెప్పాడో, కావాలని చెప్పాడో కాని అదే  నిజమయితే ఆ పార్టీ నాయకుడికి అది యెంత అప్రదిష్ట.
రాళ్ళు కలిసిన బియ్యం వొండితే అన్నంలో రాళ్ళు పంటికి తగులుతాయి. జల్లెడ పట్టి రాళ్ళను వేరు చేస్తే వొండిన అన్నం నోటికి హితవుగా వుంటుంది. చదువూ సంధ్యాలేని గ్రామీణ ప్రాంతాల వాళ్లకు కూడా తెలిసిన ఈ నిజం నేటి రాజకీయ నాయకులు అర్ధం చేసుకోలేక పోతున్నారు. అర్ధం అయినా అవకాశం కోసం అర్ధం కానట్టు వుండిపోతున్నారు అనుకోవాలి.
ఏవిషయం వచ్చినా, ఏ  సమస్య వచ్చినా ముందు రాజకీయం అనే రక్కసి అందులో చేరి  పడగలు విప్పుతోంది. దాంతో ప్రతిదీ రాజకీయమయం అయిపోతోంది. ఎవడో ఒకడు ఒక నేరం చేస్తాడు. లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. అతడు ఏదో ఒక పార్టీవాడు అయితే ఇక అంతే సంగతులు.  ఆ  పార్టీ అతడికి  కొమ్ము కాస్తుంది. వెంటనే ఎదుటి పక్షం  తన పల్లవి తాను అందుకుంటుంది. ఇలా రాజకీయం రంగ ప్రవేశం చేయడంతో ఆ మనిషి చేసిన నేరం కాస్తా  నేపధ్యంలోకి వెళ్ళిపోతుంది. ఇలాటి విషయాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రతి పార్టీ చేసే పని ఇదే. నేరం చేసిన వాడు పరాయి వాడు అయితే, 'చట్టం తన పని తను చేసుకు పోతుంది, చట్టానికి ఎవరూ అతీతులు కారు'  అంటూ బుడిబుడి రాగాలు తీస్తారు.  తమవాడే  అయితే 'చట్టం పాలకుల చేతిలో చుట్టం' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. తప్పుచేసిన వాడిని పోలీసులు విచారిస్తే, అది సరికాదు, సీబీ  సీ ఐ డీ దర్యాప్తు కోసం గగ్గోలు పెడతారు. సీబీ సీ ఐ డీ విచారణ చేస్తుంటే, అది ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ, సీ బీ ఐ దర్యాప్తు అంటారు. సేబీఐ పరిస్తితీ ఇంతే, అది కేంద్రం చేతిలో ఆటబొమ్మ అంటారు. ఇలా వ్యవస్థలను భ్రష్టుపట్టించే అసంబద్ధ ఆరోపణలు చేస్తూ విచారణను నీరుకారుస్తారు. నేరారోపణలు ఎదుర్కున్న వ్యక్తులు కొన్నాళ్ళ తరువాత  హాయిగా జనం మధ్యే తిరుగుతుంటారు. ఇదీ కొన్నేళ్లుగా జరుగుతున్న కధ. ఇప్పుడు నడుస్తున్న కధ కూడా దానికి పొడిగింపే.        
ముందు చెప్పినట్టు బియ్యంలో రాళ్ళు కలగలసిపోయినట్టు ఈ నాడు నేరాలు, రాజకీయాలు జమిలిగా ముడి పడిపోయాయి. వీటిని విడదీసే జల్లెడలు లేవు. వున్నా రాజకీయ పార్టీలకి వాటి అవసరం లేదు. వాళ్లకి కావాల్సిందల్లా తమ వాళ్ళను కాపాడుకోవడం, వాళ్లు నేరస్తులయినా ఒకటే, కాకపోయినా ఒకటే. ఎదుటివాడయితే చేతిలో వున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు పెట్టడం. మనవాడయితే వాటినుంచి బయటపడవేయడం. ఇదే నేటి రాజకీయ ధర్మం. 'ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంద'ని ఉవాచ. రాజకీయ పార్టీలు కూడా తాము నమ్మిన 'ఆ  ధర్మమే' తమను కాపాడుతుందని భావిస్తూ  తాము పెంచి పోషిస్తున్న  'అధర్మాన్నే' సదా కాపాడుతూ పోతుంటారు.
అందుకే, ఈనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల నడుమ తీవ్రం అవుతున్న వివాదాలు, వాటిపై అధినాయకుల సవాళ్లతో కూడిన ప్రకటనలు విన్నప్పుడు , వాటిపై టీవీల్లో  చర్చిస్తున్నప్పుడు చాలా బాధ వేస్తోంది. ఆ బాధ ఇప్పుడు భయంగా పరిణమిస్తోంది. ఏ ఒకరిద్దరికో కాదు, ఉభయ ప్రాంతాల్లో ఈ విధంగా ఆవేదన చెందుతున్న వారి సంఖ్య గణనీయంగానే వుంది. ఉభయ పక్షాలు ఇది గమనంలో పెట్టుకుని వ్యవహరించాలి.

ఏడాది గడిచింది రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి. రెండింటిలో పూర్తి సంఖ్యాబలం కలిగిన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. నాయకుల సమర్ధతను గీటు రాయిగా తీసుకుని  ఆయా రాష్ట్రాల ప్రజలు  రెండింటికీ, ఇద్దరు ముఖ్యమంత్రులకు అధికారం అప్పగించారు.  కొత్తగా పురుడు పోసుకున్న రెండు కొత్త రాష్ట్రాలను మొత్తం దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతామని రెండు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు  మొదట్లో ప్రకటించినప్పుడు 'పరవాలేదు మంచి రోజులు రాబోతున్నాయి' అన్న ఆనందం అందరి గుండెల్లో నిండింది. అది ఏడాది గడవక ముందే ఇలా ఆవిరి అయిపోతుందని అప్పుడు ఎవరూ అనుకోలేదు. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కొంపలు మునగవు. అయితే వారిని మెప్పించడానికి వారి అనుచరగణాలు అత్యుత్సాహంతో బుల్లితెర చర్చల్లో చేసే విపరీత వ్యాఖ్యానాలు  జనంలోకి చేరిపోయి వారు కూడా  రెచ్చిపోతేనే అసలు సమస్య. ఏదైనా వివాదం వచ్చినప్పుడు పూర్తిగా ఒక వాదననే సమర్ధించడం అంటే సమస్యను మరింత జటిలం చేయడమే. పడిన ముళ్లు, లేదా తగిలించుకున్న ముళ్లు  మరింత బిగిసిపోకముందే ఉభయ ప్రాంతాల నాయకులు కళ్ళు తెరవాలి.  వ్యవహారాలు చేయిదాటిపోనివ్వకూడదు. నిజానికి ఇది బాధ్యతతో కూడిన కర్తవ్యం.  రెండు ప్రాంతాలలో వాతావరణం తేలిక పడే విధంగా వారి అడుగులు పడాలి. పోరాటాలు రెండు రాజ్యాల మధ్య జరగడం చరిత్రలో చదివాము. రెండు రాష్ట్రాల మధ్య కాదు. విజ్ఞతతో కూడిన సంయమనం నేటి అవసరం.  నచ్చినా నచ్చకపోయినా రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞప్తి ఇదే. (10-06-2015)


(చెడు వినకు, కనకు, మాట్లాడకు)
మహానుభావులు, కీర్తిశేషులు 'బాపు' గారికి కృతజ్ఞతలతో 

30, మే 2015, శనివారం

తెలంగాణా, శత కోటి ఆశల ఖజానా

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 31-05-2015,SUNDAY)
http://www.suryaa.com/pdf/display.asp?edition=0&page=4
(జూన్ రెండో తేదీ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా) 
తెలంగాణా పంచాయతీ రాజ్,  ఐ.టీ. శాఖల మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు, తండ్రి కేసేఆర్  లాగే చక్కని మాటకారి.  హైదరాబాదు ప్రెస్ క్లబ్  ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఒక మాటన్నారు, కోటి  ఆశలు, కోటి  అనుమానాల నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా  ఆవిర్భవించిందని. నిజమే. తెలంగాణ కోరుకున్నవారు కోటి  ఆశలు పెట్టుకున్నారు. కోరుకోనివారు కోటి  అనుమానాలు పెంచుకున్నారు. ఆశలు, అనుమాలాల సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం జరిగిపోయింది. నీటి  మీద రాత కాకుండా  రాతి మీద గీత మాదిరిగా  తెలంగాణా అనేది ఇప్పుడు  ఒక చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న ఓ వాస్తవం.  
తెలంగాణా రాగానే కొత్త రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకు పోతుందని అనుకున్నవారు వున్నారు. కరెంటు కొరతతో కొత్త రాష్ట్రం చీకటిమయం  అవుతుందని  అంచనాలు కూడా వేసారు.  ఏడాది గడిచిపోయింది కానీ వారనుకున్నట్టు మాత్రం  జరగలేదు. పైపెచ్చు,  కనీవినీ ఎరుగని విధంగా ఈ వేసవిలో రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారయినా కూడా అధికారిక   కోతలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రత్యర్ధులు కూడా పరోక్షంలో అంగీకరిస్తున్న కేసీఆర్ సాధించిన అద్భుతం ఇది.
సమస్యలు అన్నింటికీ తెలంగాణా ఏర్పాటు ఒక్కటే సర్వరోగనివారిణి అనీ,  తెలంగాణా రాగానే ఏళ్ళతరబడి పేరుకునివున్ననీళ్ళూ, నిధులూ, ఉద్యోగాల వంటి ఈ ప్రాంతపు  సమస్యలన్నీ  మంత్రం వేసినట్టు  మాయం అయిపోతాయని  అనుకున్నవారూ వున్నారు. అప్పుడే  ఏడాది గడిచి పోయింది. అయితే,  వారనుకున్నట్టూ జరగలేదు. రాత్రికి రాత్రే  సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోలేదు.
అంటే ఏడాదిలో ఏమీ జరగలేదా  అంటే, జరుగుతుందని 'చాలామంది' భయపడ్డ ఒక విషయం మాత్రం జరగలేదు. హైదరాబాద్ ప్రత్యేకత ఏదీ చెరిగిపోలేదు, అదొక్కటే ఊరట కలిగించే విషయం. ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక  వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ  వ్యతిరేకి. కరడుగట్టిన  సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన ఏనాడూ  దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు  తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత  అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.  'డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి  అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యెక ఆకర్షణ, శోభ, సౌందర్యం  ఇవేవీ చెరిగిపోలేదు. ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ  పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో  పేర్కొన్నారు.
సంజయ్ బారు  చెప్పినట్టు భయాలు, అనుమానాలు, సందేహాలు అన్నీ కాకపోయినా కొన్నయినా తొలగిపోయాయి. అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ చెప్పిన మాటలు ఏమిటి? చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అసలు ఏడాది కాలంలో  చేసింది ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  
'అన్నీ ఆలోచనలేనా? ఆచరణలో ఏవీ?' అని అడిగే సందేహాస్పదులు కూడా వుంటారు. ఇలాటి వారందర్నీ రాజకీయ ప్రతికక్షులుగా పరిగణించి తేలిగ్గా  కొట్టిపారేయడం తగదు. ఎన్నికలకు  ముందు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ, ఏడాదిగా చేసిన పనులను మననం చేసుకుంటూ, అడగాలని అనుకుని అడగలేని బడుగులు కూడా తమను ఎన్నుకున్న జనాల్లో  ఉంటారని ఏలికలు గుర్తుపెట్టుకోవాలి. వీరికి జవాబు చెప్పనక్కరలేదు. వీరిని గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకున్నట్టు కనిపిస్తే మాత్రం  కుదరదు. ఎందుకంటే అయిదేళ్ళు కాగానే అన్నీ గుర్తు పెట్టుకునే గుణం వారిలో వుంది.
'ఏడాదిగా ఏం చేస్తున్నారు' అనే ప్రశ్నకి జవాబు సర్కారు వద్ద సిద్ధంగా వుంది. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏం చేయాలో అవన్నీ ఆలోచిస్తున్నాము' అనేది అ జవాబు. 'ఆలోచనలు ఆచరణలోకి రావడానికి ఇక ఎంతో కాలం పట్టదు' అనేది దానికి ముక్తాయింపు. కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు. 

   
ఆకాశ హర్మ్యాలు, ఆరు లేన్ల రహదారులు, హరితహారాలు, ప్రతి గడపకు  నల్లా నీళ్ళు, ప్రతి పొలానికీ సాగు నీళ్ళు, కనురెప్పపాటు కూడా పోని  కరెంటు, గొడ్డూ గోదాతో ఇంటిల్లిపాదీ హాయిగా కాపురం వుండే చక్కటి చిన్నారి లోగిళ్ళు, చదువుకునేవారికి దమ్మిడీ  ఖర్చులేని చదువు, చదువయిన వారికి కొలువు, చదువంటని వారికి తగిన ఉపాధి, ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి .......ఒకటా రెండా? ఇవన్నీ చదువుతున్నప్పుడు, వీటన్నిటి గురించి వింటున్నప్పుడు ఒక బక్కపలచటి మనిషి  మనస్సులో ఇన్నిన్ని  ఆలోచనలా! యెంత విడ్డూరం అనిపిస్తుంది. బంగరు తెలంగాణా తప్ప ఈ మనిషి కేసీఆర్ కు  వేరే ఏ ఇతర ఆలోచలు లేవా? రావా? అనికూడా అనిపిస్తుంది. ఇవన్నీ నెరవేరితే తెలంగాణా బంగారం కాకుండా ఉంటుందా! ఈ కలలు కల్లలు కాకూడదని కోరుకోనివారు తెలంగాణా గడ్డ మీద ఎవరయినా ఉంటారంటారా?
'స్వచ్చ తెలంగాణా! స్వచ్చ హైదరాబాదు' అసలు ఈ ఆలోచన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిది. అయినా  దానికి కొత్త మెరుగులు దిద్ది ఓ ఉద్యమంలా అమలు పరుస్తున్న తీరు చూస్తె, చెప్పిన ప్రతి పనీ చేసి చూపే సత్తా కేసీఆర్ కి వున్నదని ఆయన  ప్రత్యర్ధులు సయితం అంగీకరించే స్తితి. ఇది జాతీయ కార్యక్రమం. అయినా, దాన్ని ఓ వినూత్న పద్దతిలో అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మాత్రం కేసీఆర్  నేతృత్వం వహిస్తున్న తెలంగాణాయే అన్నది సుస్పష్టం.
పుష్కర కాలం పైచిలుకు తన సారధ్యంలో సాగిన వేర్పాటు ఉద్యమం పుణ్యమా అని కేసీఆర్ రాజకీయాల్లో రాటు తేలారు. సమస్యలని తనకు అనుకూలంగా మలచుకునే విద్యను పుణికిపుచ్చుకున్నారు. ఉద్యమ మూల స్వభావం మారకుండా ఎప్పటికప్పుడు పరిస్తితులను బేరీజు వేసుకుని తదనుగుణంగా విధి విధానాల్లో, వ్యూహ ప్రతివ్యూహాల్లో మార్పులు చేసుకుంటూ కడకంటా లాక్కువచ్చారు. ఎంతో ఓపిక, ఎంతో ఏకాగ్రత వుంటే కానీ ఇది సాధ్యం కాని విషయం. ఈ పట్టుదలతోనే, అందరూ  అసాధ్యం అనుకున్న తెలంగాణా స్వప్నాన్ని  సుసాధ్యం చేసి కొత్తగా ఏర్పడ్డ ఇరవై తొమ్మిదో రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తన కలను కూడా సాకారం చేసుకోగలిగారు. వాస్తవానికి తెలంగాణా ఏర్పాటుకావడంలో  సోనియా గాంధీది కీలకమైన పాత్ర  అయినప్పటికీ, ఆ మొత్తం ఖ్యాతి తన ఖాతాలో పడేలా రాజకీయ చాతుర్యం ప్రదర్శించి ప్రత్యర్ధులను ఖంగు తినిపించారు. తనదయిన బాణీలో పాలన సాగించే క్రమంలో  ఎదురయిన ఎదురు దెబ్బలను ఒడుపుగా తనకు అనుకూలంగా మలచుకుంటూ, తెలంగాణా వాదం బలహీన పడకుండా ఎప్పటికప్పుడు దాన్ని ఎగదోస్తూ మొత్తం తెలంగాణాకు ఎదురులేని నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే,  ఈ క్రమంలో, బంగారు తెలంగాణా సాధన కోసం ఆయన నిశ్శబ్దంగా, నిరవధికంగా  చేస్తున్న ప్రయత్నాలకన్నా పార్టీని, ప్రభుత్వాన్ని స్తిరంగా, బలంగా ఉంచడానికి రాజకీయంగా  ఆయన అమలుచేస్తున్న వ్యూహ ప్రతివ్యూహాలే జనాలకు, ప్రత్యేకించి మీడియాకు కొట్టవచ్చినట్టు కానవస్తున్నాయి. రాజకీయ నాయకులకి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులకి ఇవన్నీ తప్పనిసరే. కాదనము. కాకపొతే, ఇవే ప్రముఖంగా కనబడి, అసలు కనబడాల్సిన ఇతర అభివృద్ధి అంశాలు నేపధ్యంలోకి వెళ్ళిపోవడం దీర్ఘకాలంలో ఏ పార్టీకి అంత మేలు చేసే విషయం కాదు. ఇది చరిత్ర చెప్పే సత్యం.          
ఆంధ్ర ప్రదేశ్ అంటే హైదరాబాదు అని జనం నమ్మేలా చేసి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పొరబాటు చేసారు. కాకపొతే, అభివృద్ధి యావత్తూ ఒకే నగర కేంద్ర బిందువుగా  జరగడంవల్ల హైదరాబాదుకు మంచి మేలే జరిగింది. విశ్వ నగరంగా అది దేశ విదేశాల్లో కొత్త ప్రాచుర్యం పొందింది. ఎక్కడెక్కడి దేశాలవారికీ హైదరాబాదు ఒక గమ్యస్థానంగా మారింది. బయటి పెట్టుబడులకు చక్కని స్థావరంగా తయారయింది.  సంజయ్ బారు చెప్పినట్టు పాతకాలంలో కూడా  హైదరాబాదుకు మంచి పేరే వుండేది. చక్కటి వాతావరణం. భాషాబేధాలు లేకుండా  కలిసిమెలిసి వుండే  ప్రజలు.   అయితే అప్పట్లో  కొన్ని పరిధులు, మరికొన్ని పరిమితులు. ఇప్పుడలా కాదు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకదానిగా పేరు తెచ్చుకుంది. పెట్టుబడుల ఆకర్షణకు ఈ కొత్త పేరు చాలా వరకు ఉపయోగపడింది.   అయితే వికేంద్రీకరణ విషయంలో  కొన్ని జాగ్రత్తలు తీసుకోని కారణంగా అది ప్రాంతీయ భావాలు పెచ్చరిల్లడానికి, ప్రాంతీయ అసమానతలు పెరగడానికి  కూడా దోహదం చేసింది.
ఇప్పుడు మళ్ళీ టీ.ఆర్.యస్. సర్కారు సయితం అదే పొరబాటు చేయబోతున్నదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. హైదరాబాదు అంటే రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలు మాత్రమే అని చంద్రబాబు చేసిన ప్రయోగం మంచికంటే చెడు ఎక్కువ చేసింది. అభివృద్ధి యావత్తూ ఒకచోటే కేంద్రీకృతమై మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి ఫలాలకు దూరంగా వుండిపోయాయి. రాష్ట్ర విభజన అత్యంత క్లిష్టంగా మారడానికి దోహదం చేసిన అంశాలలో ఇదొకటి.  కేసీఆర్ మరో రెండు మూడు జిల్లాలు కలిపి హైదరాబాదు నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసే ఆలోచనలు చేస్తున్నారు. హెచ్.ఎం.డీ.ఏ. పరిధిని విస్తరించాలని అనుకుంటున్నారు. అయితే ఈ ప్రయత్నం  మరో 'షో కేస్' ప్రయోగం కాకూడదు. విశ్వ నగరం నమూనాను ప్రపంచానికి చూపి హైదరాబాదును మార్కెట్ చేయడానికి ఈ ఆలోచన పనికి వస్తుందేమో కాని మొత్తం వెనుకబడిన తెలంగాణాను బంగారు తెలంగాణాగా మార్చడానికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. భవిష్యత్తులో అసమానతలకు చోటిచ్చే విధంగా సాగే ఏ రకంయాన అభివృద్ధి, సమతూకంతో, సమన్యాయంతో  కూడిన పురోగతి అనిపించుకోదు. ఈ వాస్తవాన్ని టీ.ఆర్.యస్. అధినాయకత్వం గుర్తెరిగి అడుగులు వేయడం మంచిది.
ఎన్నికలకు ముందు చెప్పినవి అన్నీ చేసి చూపించడం మానవ మాత్రులకు సాధ్యం కాని పని. కానీ, అన్నీ కాకపోయినా కొన్ని అయినా చేసి చూపించడం రాజకీయ పార్టీల ధర్మం. లేని పక్షంలో రాజకీయ నాయకుల వాగ్దానాలపట్ల ప్రజల్లో విశ్వాసం కుదురుకోవడం కష్టం. ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.        
చూస్తుండగానే ఏడాది పుణ్యకాలం చరిత్ర పుటల్లోకి చేరిపోతోంది. చరిత్రలో నిలబడి పోవాలంటే చేయాల్సినవి చాలా వున్నాయి. ప్రజలు తమ తీర్పు ద్వారా అప్పగించిన సమయంలో మిగిలివున్న వ్యవధానం నాలుగేళ్లే.
పరిష్కారం కాకుండా వున్న తెలంగాణా సమస్యలు అన్నింటికీ పాత పాలకుల పాపమే కారణం అన్న వాదన ఇన్నేళ్ళు జనంలో చాలామంది నమ్మారు. ఇంకా కొన్నాళ్ళు నమ్ముతారు. మరి కొన్నాళ్ళ తరువాత నమ్మేవాళ్ళు తగ్గిపోవచ్చు. అసలు మిగలకపోవచ్చు.
ఏ రంగంలో అయినా   శాశ్వతంగా నిలదొక్కుకోవాలి అంటే నిజాయితీ, నిబద్దత, విశ్వసనీయత చాలా ముఖ్యం. రాజకీయాలకి ఈ సూత్రం మరింత బాగా అన్వయిస్తుంది.
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, విమానాశ్రయాలు కాదు, మొత్తం ప్రజానీకం అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి అని కేసీఆర్ చెబుతుంటారు. ఆయన అదృష్టం ఏమిటంటే చెప్పింది చేసి చూపెట్టగల అధికారం, అవకాశం  ఆయన చేతుల్లోనే వున్నాయి. చూడాలి ఏం చేస్తారో! (30 - 05 - 2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
NOTE: COURTESY IMAGE OWNER

23, జూన్ 2014, సోమవారం

మొదలయిన కొత్త కాపురాలు


ఏడాది క్రితం వరకు ఇలా జరగొచ్చేమో అని అనుకున్నవారు వున్నారు కానీ ఇలానే  జరుగుతుందని ఇదమిద్ధంగా వూహించిన వారు లేరు. ఏదయితేనేం, ఎవ్వరు కారణం అయితేనేం  రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా అనే రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి.  కొత్త ప్రభుత్వాలు కూడా కొలువు తీరాయి. వాటితోపాటే కొత్త సమస్యలు,  సరికొత్త వివాదాలు పురుడు పోసుకుంటున్నాయి. ఒకరిది వడ్డించిన విస్తరి అని మరొకరు అంటుంటే, పీత  కస్టాలు పీతవి అన్న ధోరణిలో మరోపక్కనుంచి వేరే మాట వినబడుతోంది.  ఒకటి మాత్రం నిజం. కొత్త రాష్ట్రం అన్నాక సమస్యలు తప్పనిసరి. రెండు రాస్త్రాలవి ఒకే మోస్తరు సమస్యలు కాకపోవచ్చు కానీ రెండింటికీ ఎవరి సమస్యలు వారికి వున్నాయి. ఎవరికి వారు తీర్చుకునేవి కొన్ని. పొరుగువారి సాయంతోనో సహకారంతోనో పరిష్కరించుకోగలిగినవి మరికొన్ని. ఇవికాక సొంతంగా సృష్టించుకుని హైరానపడేవి ఇంకొన్ని.  ప్రస్తుతం ఈ మూడో తరగతి సమస్యలే ప్రముఖంగా వెలుగు చూస్తున్నాయి. మీడియాలో ప్రాచుర్యం  పొందుతున్నాయి. వాటిపై ఎడతెగని చర్చలు సాగుతున్నాయి.  అనవసర ఘర్షణలకు, ప్రజల నడుమ అనుమానాలకు కారణం అవుతున్నాయి. అంతటితో ఆగకుండా అసలు ప్రభుత్వాల చిత్తశుద్ధి పట్లనే  లేనిపోని సందేహాలు తలెత్తేలా చేస్తున్నాయి. ఈ కొత్త సమస్యలను అద్దంలో చూపిస్తూ తాము చేసిన  ఎన్నికల వాగ్దానాలను అటక ఎక్కిస్తారేమో అనే సందేహం కలగకుండా చూసుకోవడం ఇద్దరు ముఖ్యమంత్రులకు ఎదురవుతున్నమొదటి  సవాలు.


ఒక్క రాజధాని, కొద్దో గొప్పో మిగులు బడ్జెట్ అనే రెండు మినహాయిస్తే కొత్త  తెలంగాణా రాష్ట్రంలో  చెప్పుకోదగిన లేదా సంతోషపడతగ్గ  విషయం ఏవీ లేదు.  ఆంధ్రప్రదేశ్ అనే పాత పేరుతొ ఏర్పడ్డ కొత్త రాష్ట్రం సంగతి సరే సరి. దానికి  ఆ రాజధాని కూడా లేదు. చెట్లకింద నిలబడి పాలించాల్సిన పరిస్తితి  అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడే  పదేపదే  చెబుతున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి ఇతర మంత్రులు హైదరాబాదు రాజభవన్ లో పదవీ స్వీకార ప్రమాణాలు చేసిన తరువాత  కొత్త మంత్రులకు ప్రభుత్వ వాహనాలను వెంటనే సమకూర్చడం ఆనవాయితీ. కానీ ఈసారి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని గుంటూరు సమీపంలో పెట్టడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తరువాత వాహనాలకోసం కొత్త మంత్రులు నానా హైరానా పడ్డట్టు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్లు చెబుతున్నారు. సచివాలయంలో కార్యాలయాల కేటాయింపు మొదలుకుని ప్రతి విషయంలో ఈ విభజన అనేది ఒక అడ్డంకిగా తయారయింది. కాకపొతే ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. కాలక్రమంలో సర్దుకునే సమస్యలు. కానీ, నీళ్ళూ, నిప్పూ వంటి అసలు సమస్యలు పొంచుకుని చూస్తున్నాయి. సేద్యపు నీటి పంపిణీ, విద్యుత్ పంపిణీ అంత తేలిగ్గా ముడిపడేలా కానరావడం లేదు. వీటిపై, ప్రధానంగా విద్యుత్ పంపిణీ విషయంలో  మంత్రుల స్థాయిలోనే రగడ మొదలయింది. ఇది చిలికి చిలికి గాలివాన కాకుండా చూసుకోవాలి. అలాగే, పేద విద్యార్ధులకు ఫీజు రీఇంబర్స్ మెంటు విషయం.  నిజానికి ఎన్నికల్లో ఇంకా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసినప్పుడు రాష్ట్రం విడిపోతుందని తెలుసుకాని, ఇలాటి సమస్యలు ముందుగా  ఎదురవుతాయని బహుశా వూహించి వుండరు.  ఎందుకంటే కొత్త కాపురం అంటేనే అన్నీ కొత్తగా సమకూర్చుకోవడం. అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆస్తులు పంచుకున్నా వారి అవసరాల్లో  సింహభాగం స్వశక్తితో ఏర్పాటు చేసుకోవాల్సిందే. అది కాపురం పెట్టేవారి శక్తి సామర్ధ్యాలు, దక్షత మీద ఆధారపడివుంటుంది. ఈ విషయంలో రెండు కొత్త ప్రభుత్వాలకి ఓ సారూప్యం వుంది. అదేమిటంటే వాటికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు, ఈ ఇద్దరికీ పరిపాలనలో పూర్వ అనుభవం వుంది.  సామర్ధ్యం విషయంలో ప్రజల్లో కొంత నమ్మకం  వుంది. రెండు రాష్ట్రాలలో వారి పార్టీల విజయావకాశాలను మెరుగు పడేలా చేయడంలో ఈ రెండు అంశాలు కూడా సాయపడ్డాయన్నది సత్య దూరమేమీ కాదు.

కాబట్టి, ఇప్పుడు ప్రజలు వారి నుంచి కోరుకుంటున్నది ఒక్కటే. పరస్పర సంఘర్షణలకు తావివ్వకుండా సహకారానికి పెద్ద పీట వేస్తూ సమస్యల ముళ్ళను ఒకదానివెంట మరొకటి జాగ్రత్తగా ఓపికగా  విప్పుకుంటూ పోవాలి. వారి సమర్ధత, దక్షతల  పట్ల ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. అవసరం అయితే కలిసి కూర్చుని పరిష్కార మార్గాలను అన్వేషించాలి. రాజకీయాలు చేయడానికి ఇంకా చాలా వ్యవధానం వుంది. ఈ లోగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉభయ రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగించాలి. వారి సామర్ధ్యం ఈ దిశగా ఉపయోగపడాలి. అంతే  కాని ఒకరిపై మరొకరు నెపాలు మోపుకుంటూ కాలహరణం చేయడం మంచిది కాదు. (23-06-2014)        

20, ఆగస్టు 2013, మంగళవారం

నిర్ణయానికి ముందు ఆ తరువాత (ఆధారం ఈనాటి టీవీ స్క్రోలింగులు)



"తెలంగాణా విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మాకు శిరోధార్యం" – అన్ని ప్రాంతాల కాంగ్రెస్ నేతలు
"హైదరాబాదును వొదిలేదంటున్న టీ కాంగ్రెస్ నేతలు"  
"హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రం చేయాలి" – మంత్రులు దానం నాగేందర్,  ముఖేష్ గౌడ్  
"ఉత్తరాంధ్రతో  గ్రేటర్ తెలంగాణా ఏర్పాటు చేయాలని రేణుకాచౌదరి విజ్ఞప్తి"    
"హైదరాబాదును యూటీ  లేదా ప్రత్యేకరాష్ట్రం చేయాలి" – కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు
ఏవిటో ఒక్క ముక్క అర్ధం అయిచావదు.
అయినా ఒక్క తల పగలగొట్టుకోవడానికి ఇన్ని ‘రాళ్ళు’ కావాలా?

(20-08-2013)

18, మే 2013, శనివారం

హూష్ కాకి



వార్త : తెలంగాణా అంశం యూపీయే ఎజెండాలో లేదు – ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో
వ్యాఖ్య : శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చినప్పుడు నేను రాసిన ఈ వ్యాసం      
“మాయాబజార్ సినిమాలో శ్రీ కృష్ణుడు బలరామాదులకు ప్రియదర్శిని పేటికను ప్రదర్శిస్తాడు. ఆ పెట్టె తెరచి చూసినవారికి వారి మనసులో ఏమి కోరుకుంటున్నారో అదే  అందులో  కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీ కృష్ణ  కమిటీ కూడా సరిగ్గా  అదే చేసింది. వివాదంతో సంబంధం వున్న వారందరికీ తాము కోరుకున్నవిధంగానే కమిటీ సిఫారసులు వున్నాయనే భ్రాంతి కలిగేలా  వేర్వేరు సూచనలకు రూపకల్పన చేసి జస్టిస్ శ్రీ కృష్ణ తన పేరుకు తగినట్టు కృష్ణలీలను ప్రదర్శించారు. ఆంద్రప్రదేశ్ లో ఏర్పడిన సంక్షుభిత పరిస్తితికి పరిష్కారంగా ఆరు ప్రత్యామ్నాయాలు సూచించి మరో సరికొత్త చర్చకు తెర తీసారు.
పది నెలల నిర్విరామ కృషి, ఆరువందల పైచిలుకు పేజీలు, రెండు సంపుటాలు, ఆరు సిఫారసులు స్తూలంగా ఇదీ శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్.  పైగా తాను చేసిన ఆరు సిఫార్సుల్లో  మొదటి మూడు   ఆచరణ సాధ్యం కావనీ, నాలుగోదానికి సర్వజనామోదం  కష్ట సాధ్యం అనీ  కమిటీ నివేదికలోనే  సన్నాయి  నొక్కులు నొక్కారు.
రాష్ట్రాన్ని ఇప్పుడున్న రూపంలోనే కొనసాగించాలని మొదటి సిఫారసులో పేర్కొంటూనే  దీనివల్ల తెలంగాణాలో భావోద్వేగాలు పెచ్చరిల్లగలవని, తద్వారా ఏర్పడగల అనిశ్చితిని  మావోయిస్టు ఉద్యమం తనకు అనుకూలంగా మార్చుకునే వీలుందని భాష్యం చెప్పి తాను చేసిన తొలి సూచనకు తానే ఇంటూ మార్క్ పెట్టింది.
రెండో సిఫారసు రాష్ట్రాన్ని రెండుగా విభజించడం హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణా వాదులు ససేమిరా వొప్పుకోరన్నది కూడా కమిటీ తన అభిప్రాయంగా పేర్కొన్నది.
పోతే, రాయల తెలంగాణా, కోస్తాంధ్ర లుగా రాష్ట్రాన్ని విభజించాలన్నది  మూడో సూచన. అయితే దీన్ని రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారు అంగీకరించే  అవకాశం వుండదని కూడా కమిటీయే చెప్పింది.
హైదరాబాదు నగర పరిధిని బాగా విస్తరించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించి, రాష్ట్రాన్ని రెండుగా విభ జించాలనేది నాలుగో ప్రతిపాదన. కానీ, ఉభయ ప్రాంతాలలో ఏఒక్కరికీ ఇది ఆమోద యోగ్యం కాకపోవచ్చని కమిటీ సిఫారసుల సంఖ్యను రెండుకు కుదించే ప్రయత్నం చేసింది.
ఇక అయిదో సిఫారసు రాష్ట్రాన్ని విభజించి తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా చేయడం. ఆంద్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచీ తెలంగాణా ప్రాంతంలో పాతుకుపోయివున్న కొన్ని సహేతుక అసంతృప్తులను పరిగణనలోకి తీసుకుంటే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అసంబద్ధం కాదని ఓ పక్క  చెబుతూనే, దీనివల్ల  దేశవ్యాప్తంగా కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాలకు ఊతం ఇచ్చినట్లయి, అంతర్గత భద్రతపై  ప్రతికూల ప్రభావం పడగల  ప్రమాదాన్ని ఎత్తిచూపింది. తప్పనిసరి అయితేనే విభజనకు శ్రీకారం చుట్టాలన్నది కూడా ఈ ప్రతిపాదనలోని కొస మెరుపు.
పోతే, క్రమంలో చివరిదేకానీ ప్రాధాన్యతా క్రమంలో చిన్నది కాదన్నట్టుగా ఆఖరి ఆరో ప్రతిపాదన చేస్తూ ఇదే తమ ప్రతిపాదనలు అన్నింటిలో అత్యుత్తమమైనదని కమిటీ తనకు తానుగానే ఒక  కితాబును దానికి  జత చేసింది. రాష్ట్రాన్నిఇప్పటి మాదిరిగా  సమైక్యంగానే వుంచి తెలంగాణా అభివృద్ధికి రాజ్యాంగ బద్ధమయిన చర్యలు తీసుకోవాలన్నది ఆరో ప్రతిపాదన సారాంశం.
రాగల పరిణామాలను గురించి రాయబారం సీనులో అలనాటి  శ్రీ కృష్ణుడు కౌరవాదులను హెచ్చరించినట్టు ఇలనాటి కృష్ణుడు తన కమిటీ చేసిన ఆరు సిఫారసులను అమలు చేయడం వల్ల వొనగూరే ఫలితాలను, పరిణామాలను అంశాలవారీగా నివేదికలోనే తేటతెల్లం చేయడం జరిగింది. ఇంతకీ కృష్ణ కమిటీ ఏమి చెప్పినట్టు, ఏమి తేల్చినట్టు అనే ప్రశ్నలను అందరికీ వొదిలిపెట్టి – ‘సమైక్యమా? విభజనా?’ అన్న అంశం దగ్గరికే సమస్యను  తీసుకువచ్చి భూమి గుండ్రం గా వుందిఅన్న సామెతను నిజం చేసింది.
నివేదికను స్వీకరించిన కేంద్ర హోం మంత్రి చిదంబరం ఆరో తేదీ సమావేశానికి వచ్చిన పార్టీలకు నివేదిక ప్రతులను పంచిపెట్టి, బహిష్కరించిన పార్టీలకు స్పీడ్ పోస్ట్ లో పంపించి, ప్రభుత్వ వెబ్ సైట్ లో సయితం దాన్ని పెట్టి చేతులు కడిగేసుకున్నారు. నివేదికను ఆషామాషీగా కాకుండా క్షుణ్ణంగా చదవండి అని ఒక సలహా కూడా ఇచ్చారు. బాగా అధ్యయనం చేసాక మరోసారి కలుసుకుని మాట్లాడుకుందామని అందర్నీ ఆహ్వానించారు. ఈ మొత్తం ప్రక్రియను గమనించిన వారికి కేంద్ర ఆచి తూచి వ్యవహరిస్తున్నది అన్న భావన కలగడానికి బదులు ఏదో విధంగా వాయిదా మంత్రం పఠించడం మొదలు పెట్టిందన్న అనుమానమే ఎక్కువ కలుగుతోంది.   
ఇక రాష్ట్రంలో ఈ అంశంపై తలలు పట్టుకుంటున్న పార్టీలలో మెజారిటీ పార్టీలు, కృష్ణ కమిటీ రిపోర్ట్ రాగానే దానికి కట్టుబడి వుంటామని ఇంతవరకు చెబుతూ వచ్చాయి. కానీ నివేదికలో ఏదో ఒకటి తేల్చకుండా, ఇదమిద్ధంగా ఒకే ఒక  సిఫారసు  చేయకుండా వెసులుబాటు కల్పించడంతో తిరిగి అందరు పాత పల్లవినే అందుకుంటున్నారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల్లో రెండు  ప్రాంతాలకు చెందినవాళ్ళు అధిష్టానందే అంతిమ నిర్ణయం అంటూనే తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. విషయాన్ని ఇంకా నానుస్తూ పోవడం వల్ల ఇరు ప్రాంతాల్లో ఈ రెండు పార్టీలు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని  బాహాటంగా ప్రకటిస్తున్నారు.
కాంగ్రెస్, టీడీపీ లు ఎదుర్కుంటున్న ఇరకాట పరిస్తితిని వేర్పాటువాదులు వాటిపై వొత్తిడి పెంచడానికి వుపయోగించుకునే ప్రయత్నం మొదలయింది. ప్రత్యేక తెలంగాణా  అన్నది సాకారం కావడానికి ఉద్యమం యెంత వూపు తేగలిగినా అంతిమంగా రాజకీయ నిర్ణయం ద్వారానే అది  సాధ్యం అన్న ఎరుక వారికి లేకపోలేదు. అందుకే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన దరిమిలా ఉత్పన్నమయిన పరిస్తితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వారు మళ్ళీ నడుం బిగిస్తున్నారనేది తేటతెల్లం. ప్రస్తుత అసందిగ్ధ స్తితికి కాంగ్రెస్, టీడీపీ లను ప్రధాన బాధ్యులుగా చేసి ఆ పార్టీల లోని తెలంగాణా అనుకూలుర చేత  వారి అధినాయకత్వంపైనే  వొత్తిడి తీసుకు వచ్చేలా చేయడం ఇప్పుడు వారి వ్యూహంగా కానవస్తోంది. అనివార్యం అయితేనే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన సిఫారసు చేయాలని, అన్ని ప్రాంతాల నడుమ సయోధ్య సాధ్యమయితేనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాలని కమిటీ చేసిన సూచనను తెలంగాణావాదులు ఎంతమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నివేదిక ఈ రూపంలో రావడానికి సీమాంధ్ర వ్యాపార రాజకీయుల హస్తం వుందని  వారు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టడం మినహా తెలంగాణా కోరుకుంటున్నవారిని మరేదీ సంతృప్తి పరచలేదన్నది వారి నిశ్చితాభిప్రాయంగా కానవస్తోంది.
శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ వల్ల అసలు సమస్య ఏమేరకు పరిష్కారం అవుతుందన్నది అనుమానాస్పదమే. కాకపొతే, అగ్రహారం పోయినా యాక్ట్ మొత్తం తెలిసివచ్చిందన్న సామెత చందాన రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలతో పాటు విద్య, వైద్యం, సేద్యం మొదలయిన అన్ని రంగాలలో ఆంద్ర ప్రదేశ్ ఏర్పడిననాటినుంచి ఇంతవరకు  రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించిన వివరాలు ప్రాంతాల వారీగా ఈ నివేదికలో పొందుపరచి సమగ్రమయిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. పదినెలల కాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి, సమాజంలో విభిన్న వర్గాలవారిని కలుసుకుని సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలోని గణాంకాలు వాస్తవపరిస్తితులకు పూర్తిగా అద్దం పట్టేవిగా వుండక పోవచ్చుకానీ, మొత్తం మీద ఒక స్తూలమయిన అవగాహనకు చదువరులు రావడానికి వీలుగా ఈ నివేదిక ఉపకరించగలదని భావించవచ్చు. వివిధ ప్రాంతాలలో ప్రగతి గురించి, వెనుకబాటుతనం గురించి ప్రస్తుతం వున్న అపోహలు, అనుమానాలు కొంత మేరకయినా తొలగించుకోవడానికి ఈ నివేదిక దోహదం చేస్తుంది.
చివరిగా ఒక మాట. సమస్యకు స్పష్టమయిన  పరిష్కార మార్గం చూపకపోయినా, కమిటీ ఒక నిర్దిష్టమయిన సూచన మాత్రం  చేసింది. ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. తనకు ఇచ్చిన గడువును  ఏదో ఒక సాకు చూపి పొడిగించుకోకుండా, ఒక రోజు ముందుగానే  నివేదికను సమర్పించి నిబద్ధతను నిరూపించుకున్న  శ్రీ కృష్ణ కమిటీ చేసిన ఈ సూచనను  సర్కారు పరిగణనలోకి తీసుకోవాలని ఆశిద్దాం.

7, అక్టోబర్ 2012, ఆదివారం

అద్దంలో చందమామ ‘తెలంగాణ’



అద్దంలో చందమామ ‘తెలంగాణ’ భండారు శ్రీనివాసరావు 

“నెలాఖరులోగా తెలంగాణా వస్తుందనే మాటల్ని ఎనిమిదేళ్ళుగా వింటున్నా”  ఈ మాటలు అన్నది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సమైక్యవాద నాయకుడు కాదు. పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెడితే మరో మాట లేకుండా సమర్దిస్తామని మాట ఇచ్చిన భారతీయ జనతా పార్టీ పూర్వాధ్యక్షుడు శ్రీ వెంకయ్య నాయుడు.
‘దసరా పండుగ లోపే తెలంగాణా ఏర్పాటుపై ఖచ్చితమయిన ప్రకటన వస్తుంద’ని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు శ్రీ కె.చంద్రశేఖరరావు తనను కలుసుకున్న ఆ ప్రాంతపు ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులతో చెప్పారని భోగట్టా. విజయదశమి నాటికి విజయోత్సవాలకు అంతా సిద్ధంగా వుండాలని ఆయన పిలుపు ఇచ్చినట్టుకూడా సమాచారం. ‘ఈ నెల ముప్పయ్యో తేదీలోగా ప్రకటన రాకపోతే యుద్ధం ప్రకటిద్దామని, ఇందుకోసం అన్ని రకాలుగా సంసిద్ధమవుదామని కూడా ఆయనే అన్నట్టు  ఆ నాయకులే చెబుతున్నారు. ఇంత సందిగ్ధత వున్నప్పుడు దాన్ని మరింత పెంచేవిధంగా గులాబీ పార్టీ అధినేత ఇలాటి పరస్పర విరుద్ధ ప్రకటనలు యెందుకు చేస్తున్నట్టో తెలియక పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.
‘అనైక్యతతోనే తెలంగాణా ఆలశ్యం అవుతోంద’ని ప్రజాసంఘాలాల జేయేసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. ఈనెల పదహారున హైదరాబాదు వస్తున్న ప్రధాని మన్మోహన్  సింగుకు ‘తెలంగాణా రుచి’ చూపిస్తామని, తెలంగాణా మార్చ్ జోషులో వున్న  జేయేసీ చైర్మన్ కోదండరాం హెచ్చరించారు. తనకూ కేసీఆర్ కూ నడుమ విభేదాలు ఏమీ లేవని  ఆయన స్పష్టం చేస్తూనే,  గోరంతను కొండంత చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. అంటే ఎంతో కొంత వున్నట్టే కదా అని విమర్శకులు భాష్యం చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే తాము తెలంగాణాపై అధ్యయనం జరిపి నివేదిక ఇచ్చామని జస్టిస్ శ్రీకృష్ణ హఠాత్తుగా తెరపైకి వచ్చి చెప్పారు. రాజకీయ కారణాలవల్లే తెలంగాణా ఏర్పాటు సాధ్యం కావడం లేదని ఆయన చెప్పడాన్నిబట్టి చూస్తే సీమాంధ్ర నేతల లాబీయింగ్ వల్లే ‘వేర్పాటు’ ప్రతిపాదన  వెనక్కుపోతోందన్న అభిప్రాయం కలుగుతోంది. కుండబద్దలు కొట్టినట్టున్న జస్టిస్  శ్రీకృష్ణ  అభిప్రాయం తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడడం లేదు.
హైదరాబాదు లేని తెలంగాణాకయినా ‘సరే’  అని కేసీఆర్ అన్నట్టు వచ్చిన వార్త  టీఆర్ఎస్ శ్రేణులకు, ముఖ్యంగా  రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణాను మనసారా కోరుకుంటున్నవారికి ఆందోళన కలిగిస్తోంది. ఇదంతా సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం అని కేసీఆర్ మద్దతుదారులు అంటున్నారు.
ముఖ్యమంత్రిపై, అదీ తమ  సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రిపై ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు  లోకసభ స్పీకర్ కు హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం ఈ మొత్తం వ్యవహారంలో కీలక మలుపు. ఇలాటి పరిణామాలు  ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. తెలంగాణా మార్చ్ సందర్భంగా ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు తమను అడ్డుకుని తమ హక్కులకు భంగం కలిగించారన్నది వారి అభియోగం.        
ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంలో తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా ఎంపీల చిత్తశుద్ధి పట్ల తమకు నమ్మకం వుందని టీజేయేసీ, ప్రజాసంఘాల  నేతలు అనడం వారికి కొంత వూరట కలిగించే విషయం.  అయితే ప్రజల్లోనే  విశ్వాసం కలిగించలేకపోతున్నామని ఆ నేతలు పేర్కొనడం వింత కొస మెరుపు.
కాగా, పులి మీది పుట్ర మాదిరిగా, కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ అధినాయకుడు హైదరాబాదు వచ్చి చేసిన ప్రకటన తెలంగాణా వాదులను మరింత ఆందోళనకు గురిచేసింది. రాష్ట్ర విభజనకు ఓ పక్క మద్దతు ఇస్తూనే తెలంగాణాపై నిర్ణీత సమయంలో ప్రకటన వస్తుందని చెప్పడం కష్టమని టీ కాంగ్రెస్ నేతలతో అల్పాహార విందులో పాల్గొన్న అనంతరం విలేకరులతో చెప్పారు. పనిలో పనిగా తెలంగాణా రాష్ట్రీయ లోక్ దళ్ శాఖను ప్రారంభించారు. టీ.ఆర్.ఎస్. నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టుకున్న  ఎమ్మెల్సీ దిలీప్ పూనికపై ఈ శాఖ ఏర్పాటయింది. సాధారణంగా ఇలాటి రాష్ట్ర విభాగాలను ఏర్పాటుచేసినప్పుడు వాటిని పలానా పార్టీ రాష్ట్ర శాఖ అని వ్యవహరించడం కద్దు. కానీ ఆర్.ఎల్.డీ. రాష్ట్ర శాఖకు ముందు ‘తెలంగాణా’ పదాన్ని జత చేశారు. జాతీయ పార్టీల రాష్ట్ర శాఖలకు ఆయా రాష్ట్రాల లేదా ప్రాంతాల పేర్లను జోడించడం జరగదు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ యూపీలో అయినా ఏపీలో అయినా కాంగ్రెస్ పార్టీ అనే పిలుస్తారు. యూపీ కాంగ్రెస్, ఏపీ కాంగ్రెస్ అని వ్యవహరించరు.  మరిలా యెందుకు చేసారన్న దానికి స్పష్టత లేదు. ఒకవేళ ఆర్.ఎల్.డీ. కి టీ.ఆర్.ఎల్.డీ. రాష్ట్ర శాఖ అయిన పక్షంలో, జాతీయ పార్టీ గుర్తింపుకోసం అవసరమయ్యే వోట్లను రాబట్టుకోవడం మినహా ఆర్.ఎల్.డీ. కి తక్షణం రాజకీయంగా వొనగూడే ప్రయోజనం శూన్యం. ఈ పార్టీ వల్ల   తెలంగాణా వాదానికి అదనపు బలం చేకూరదు. పైగా కొత్త పార్టీ ఆవిర్భావం వల్ల వాదం కొంత బలహీనమయ్యే ప్రమాదం వుంటుంది. ఇప్పటికీ తెలంగాణా ఏర్పాటును బలంగా కోరుకుంటున్న పార్టీలకు కొదవ లేదు. తెలంగాణా వాదుల ఐక్యతకు భంగకరంగా పలురకాల వ్యాఖ్యానాలతో ఈ పార్టీల నాయకులు అయోమయాన్ని సృష్టిస్తూ వుండడం మినహా వీళ్ళు వాదానికి అనుకూలంగా వొరగబెడుతున్నది ఏమీ లేదు.        
తెలంగాణా విషయంలో  కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన ఏ తీరున వుందో టీఆర్ఎస్ నాయకులకు  పూర్తిగా తెలియకపోయినా అది ఏ తీరున సాగుతున్నదో ఒక అవగాహనకు వచ్చినట్టు కేసీఆర్  కొన్నిసార్లు ప్రత్యక్షంగా కొన్ని సందర్భాలలో పరోక్షంగా బయటకు వొదులుతున్న సంకేతాలను బట్టి ఓ మేరకు అర్ధం చేసుకోవచ్చు.
నిజానికి ఢిల్లీ పెద్దలకు రాష్ట్రంలో వున్న పరిస్థితుల పట్ల అవగాహన లేదని అనుకోలేము. తెలంగాణాకు సంబంధించి సమస్త వివరాలతో శ్రీ కృష్ణ కమిటీ నివేదికే వారివద్ద  సిద్ధంగా వుంది. రాష్ట్ర గవర్నర్ కూడా తన నివేదికలు ఎప్పటికప్పుడు పంపుతూనే వుండి వుంటారు. రాష్ట్రంలో పరిస్తితులను  గురించి తాజా నివేదికలను కేంద్రానికి పంపుతుండడం గవర్నర్ల బాధ్యత కూడా.తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులతోనూ,  సీమాంధ్ర నాయకులతోను  ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకులు  అనేకమార్లు సమావేశాలు జరిపారు. వారి అభిప్రాయాలు విన్నారు. అలాగే కేసీఆర్ తన లాబీయింగులో భాగంగా ఇటీవల ఢిల్లీలో అనేకరోజులపాటు మకాం వేసి అనేకమంది కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపినట్టు ఆయనే చెప్పారు. ఇన్ని వివరాలు సిద్ధంగా వున్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో జాగు చేస్తున్నారంటే ఢిల్లీ వారికి కావాల్సింది  సంఖ్యలు, అంకెలు కాదని అర్ధమైపోతున్నది. వారి లెక్కలు,డొక్కలు వేరే.  వారికి కావాల్సింది మరో రెండేళ్ళ తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవసరమయిన పార్లమెంటు సభ్యులను రాష్ట్రం నుంచి తగు మోతాదులో గెలిపించుకోవడానికి ఏమి చేస్తే సాధ్యపడుతుంది అన్నది మాత్రమే. తెలంగాణా ఇవ్వడం ద్వారా అది వీలుపడుతుందని తెలిసిన మరుక్షణం ప్రత్యేక రాష్ట్రం  ఏర్పాటుకు కాంగ్రెస్ పచ్చ జండా వూపుతుంది. ఇందులో సందేహం లేదు.
ఢిల్లీలో అధినాయక ప్రతినిధులతో జరిగిన మంతనాల్లో చురుగ్గా పాల్గొన్న ఓ కాంగ్రెస్ నాయకుడు చెబుతున్న విషయాలు వినడానికి ఇంపుగా లేకపోయినా అక్కడ ఏం జరుగుతున్నదో ఓ అంచనాకు రావడానికి వీలుగావున్నాయి. తెలంగాణా నాయకులను వారు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. ఇప్పటికిప్పుడు తెలంగాణా ప్రకటిస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు లభించే అవకాశం వుందా? టీ.ఆర్.ఎస్. ని కాంగ్రెస్ లో  విలీనం చేసుకుని తెలంగాణా ప్రకటన చేస్తే  ఆ లబ్దితో బలపడే కేసీఆర్ మరో మమతా బెనర్జీగా మాదిరిగా మారి అధిష్టానానికి కంటిలో నలుసుగా తయారయ్యే అవకాశం యెంత అన్నది వారి మదిలో మెదులుతున్న మరో సందేహం.
నిజమే.  తెలంగాణా ఏర్పాటు ద్వారా వొనగూడే రాజకీయ లబ్ది పూర్తిగా తన ఖాతాలోకే రావాలని  కూడా కాంగ్రెస్ కోరుకుంటే తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దృక్కోణం నుంచే పావులు కదుపుతుంది. తెలంగాణా విషయంలో ఇంత తాత్సారానికి బహుశా  ఇదే కారణం అయివుంటుంది. తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయం అయినప్పుడు ఉద్యమాల ద్వారా లక్ష్య సాధనకు పోరాడుతున్న పార్టీలను  లెక్క చేయాల్సిన అవసరం ఏమిటన్నది వారి వ్యూహకర్తల ఆలోచన కావచ్చు.
(07-10-2012)



28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

తిలాపాపం తలా పిడికెడు – భండారు శ్రీనివాసరావు



తిలాపాపం తలా పిడికెడు

(29-09-2012 తేదీ 'సూర్య' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

అన్ని పార్టీలనూ ప్రభావితం చేసిన తెలంగాణ
నిట్టనిలువుగా చీలిన రాజకీయ పార్టీలు 
ఆచి తూచి రాసినప్పటికీ,  
కొత్త ఇక్కట్లు తెచ్చిన చంద్రబాబు  లేఖ
భవిష్యత్తుపై  భరోసా లేని కాంగ్రెస్‌
ఆట ముగించడం తెలియని టీఆర్‌ఎస్‌



సూర్యుని కాంతి చంద్రుడిపై పడి ప్రతిఫలించినట్టు ఈనాడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఎంతో కొంత తెలంగాణా అంశంతో ప్రభావితమవుతున్నాయి. పుష్కర కాలం పైచిలుకు  ప్రత్యేక రాష్ట్రం పేరుతొ మడమ తిప్పని పోరాటం చేస్తున్న తెలంగాణా రాష్ట్ర సమితి, టీ.ఆర్.ఎస్.,  తన ప్రధాన లక్ష్య సాధనలో కొంత వెనుకబడ్డప్పటికీ, రాష్ట్రంలోని అన్ని పార్టీల మెడలు వంచి తెలంగాణా పట్ల దృష్టి  సారించేలా చేయడంలో ఒక మేరకు విజయం సాధించిందనే చెప్పాలి. రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలన్న టీ.ఆర్.ఎస్. ధ్యేయం ఎప్పుడు నెరవేరుతుందో కాని, తెలంగాణాకు అనుకూలంగానో, ప్రతికూలంగానో - అన్ని రాజకీయ పార్టీలు నిట్టనిలువుగా చీలిపోవడానికి మాత్రం ఆ పార్టీ ఎత్తుగడలు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ‘తెలుగుదేశం’లో  తాజాగా మొదలయిన ‘ప్రాంతీయ కలకలం’ ఇందుకు ఉదాహరణ.
తనపై పడ్డ ‘రెండు కళ్ళ సిద్ధాంతం’ అపవాదును చెరిపేసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నానా హైరానా పడాల్సివస్తోంది.. ఒకప్పుడు తెలంగాణా ప్రాంతంలో గట్టి క్యాడర్ పట్టున్న పార్టీగా పేరున్న టీడీపీ, జారిన కాలును  మళ్ళీ కూడగట్టుకోవడానికి ప్రారంభించిన ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ప్రధాన మంత్రికి తాజాగా రాసిన లేఖ సానుకూల ఫలితాలు ఇస్తున్న  దాఖలా కానరావడం లేదు. నిజానికి చంద్రబాబు ఆ లేఖను ఎంతో జాగ్రత్తగా ఆలోచించి మరీ రాసినట్టు చదవగానే ఎవరికయినా బోధపడుతుంది.  తెలంగాణాను కోరుకునేవారు, వేర్పాటును వ్యతిరేకించేవారు ఎవరికివారు సంతృప్తి పడేలా ఆ లేఖలోని అంశాలను  ఆచితూచి కూర్చి పేర్చారు. అయినా కానీ, కొండ నాలుకకు మందేస్తే వున్న నాలుక వూడిందన్న చందంగా తెలంగాణాపై చంద్రబాబు లేఖ పార్టీకి కొత్త ఇక్కట్లను తెచ్చిపెట్టింది. తెలంగాణాపై తమ నాయకుడు త్వరలో  స్పష్టత ఇస్తారంటూ  కొద్దిరోజులుగా చెబుతూవచ్చిన ఆ ప్రాంతపు  టీడీపీ నాయకులకు,  చంద్రబాబు నాయుడు   ప్రధానమంత్రికి రాసిన లేఖలో కొత్తగా ఇచ్చిన ‘అస్పష్టతతో కూడిన స్పష్టత’ కొరుకుడు పడడం లేదు. పైగా, సీమాంధ్రకు చెందిన కొందరు టీడీపీ నాయకులకు ఆ లేఖలోని అంశాలు అసలు మింగుడు  పడడం లేదు. ‘వ్యక్తులకంటే పార్టీ  ముఖ్యం’ అని తరచూ నీతి వాక్యాలు వల్లె వేసేవారు   వున్నట్టుండి బాణీ మార్చి ‘పార్టీ కంటే  రాష్ట్ర ప్రయోజనాలు  ప్రధానం’ అంటూ రాత్రికి రాత్రే  సరికొత్త పల్లవి ఎత్తుకోవడం ఆ పార్టీలోని అగ్రనాయకులను నివ్వెరపరుస్తోంది.
 ‘వస్తున్నా, మీకోసం’ అంటూ గాంధీ  జయంతి నుంచి తెలుగుదేశం అధినేత మొదలుపెట్టే రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు తెలంగాణా ప్రాంతంలో అవాంతరాలు ఎదురుకాకుండా చూసే లక్ష్యంతో రాసిన లేఖ, మరోపక్క  సీమాంధ్ర పార్టీ నాయకులలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘రాష్ట్ర  విభజనకు టీడీపీ  అనుకూలం’ అని ఆ లేఖలో ఎక్కడా స్పష్టంగా పేర్కొనకపోయినా కొందరు సీమాంధ్ర పార్టీ  నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటే, దానికి కారణం వారి సొంత ప్రయోజనాలే అయి  వుండవచ్చని పార్టీలో కొందరు గుసగుసలాడుతున్నారు. ఏదో ఒక సాకు  చూపి పార్టీ నుంచి  బయటపడాలని చూసేవారు  ఈ లేఖను ఒక అవకాశంగా వాడుకోవడంలో వింతేమీ లేదన్నది వారి వాదన.
ఇంతాచేసి,   ఈ లేఖ వల్ల తెలంగాణాలో అన్నా కొంత పార్టీకి మేలు జరుగుతుందా అన్నది అనుమానమే. చంద్రబాబు లేఖ ఇస్తే తెలంగాణాకు వున్న ప్రధాన అడ్డంకి తొలగిపోగలదని ఇన్నాళ్లబట్టీ వాదిస్తూ వస్తున్న టీ.ఆర్. ఎస్.  కూడా ఈ లేఖను స్వాగతించలేదు. పైగా,   ‘టీడీపీ మొదలుపెట్టిన మరో నాటకం’ అంటూ ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు ఘాటుగా విమర్శించారు. దానికితోడు, రెంటికీ చెడ్డ రేవడి చందంగా ఈ తలనొప్పిని యెందుకు కోరి తెచ్చుకున్నట్టని పార్టీ వర్గాల్లో కొందరు ప్రశ్నిస్తున్నారు.      
నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో అత్యంత క్లిష్టమయిన పరిస్తితి ఎదుర్కుంటున్న పార్టీ ఏదయినా వుందంటే ముందు చెప్పుకోవాల్సింది టీడీపీ పేరే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా వుంటూ వరసగా మూడో పర్యాయం కూడా అధికారపీఠానికి దూరంగా వుండడం అన్నది ఆత్మహత్యాసదృశ్యం. అందువల్ల ఆ పార్టీ నాయకుడుగా, సారధిగా చంద్రబాబుకు వున్న వొత్తిళ్లు అనేకం. ఏంచేసయినా సరే రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో పార్టీ నావని విజయ తీరానికి చేర్చాల్సిన బాధ్యత ఆయన భుజస్కంధాలపై వుంది.  కాబట్టే ఆయన వరస  ‘డిక్లరేషన్ల’కు  తెర తీసారు. అరవై ఏళ్ళ వయస్సులో కష్టసాధ్యమయిన పాదయాత్రకు నడుంకట్టారు. తెలంగాణా విషయంలో స్పష్టతతోనో, అస్పష్టతతోనో – అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ  ప్రధానికి ఒక లేఖ రాశారు. ఇన్ని చేసినా ఇన్ని  తలనొప్పులేమిటన్నది ఆయన అభిమానుల బాధ. అందుకే అంటారు, కాలం కలసిరానప్పుడు తాడే పామై కరుస్తుందని.
పోతే, రాష్ట్రంలో అత్యంత క్లిష్టమయిన రాజకీయ  భవితవ్యాన్ని ఎదుర్కుంటున్న పార్టీల్లో కాంగ్రెస్  రెండో స్థానంలో వుంది. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో మరో రెండేళ్లు అధికారంలో వుంటామన్న  ధీమా తప్ప భవిష్యత్తు గురించిన భరోసా ఏమాత్రం లేని పార్టీగా అనేక సర్వేల్లో ఇప్పటికే వెల్లడయింది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ బలహీనతే ఈ పార్టీకి ప్రస్తుతం వున్న బలం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి పూర్తిగా అగమ్య గోచరం. ఎంతో అద్భుతం జరిగితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసాధ్యం అన్నది ఆ పార్టీ నాయకులే అంగీకరించే వాస్తవం. ఏదయినా అద్భుతం  జరిగినా మూడోమాటు ప్రజలు అధికారం కట్టబెట్టడం కల్ల అనే నిజం జీర్ణించుకున్నవాళ్లు కాబట్టి,  అధికారానికి కొన్నాళ్ళు దూరంగా వున్నా జాతీయ పార్టీగా తమ మనుగడకు ఎలాటి ధోకా వుండదన్న నమ్మకం వున్నవాళ్ళు కనుక కాంగ్రెస్ వారికి పార్టీ జయాపజయాలతో నిమిత్తం వుండదు. ‘వూహించనిదేదో జరిగి అధికారంలోకి వస్తే సంతోషం, రాకపోతే పోయేదేమీ లేదు పదవి తప్ప’ అనే సిద్ధాంతం వారిది. అందుకే, రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కుంటున్న  సమస్యలని పేరబెట్టి, తెలంగాణా వంటి కీలక అంశాల  పరిష్కారాన్ని నానబెట్టి ప్రజలిచ్చిన అధికారంతో కాలక్షేపం చేస్తున్నారు.
ఇక టీ.ఆర్.ఎస్. విషయం తీసుకుంటే,  ఆట మొదలు పెట్టడం తప్ప  ముగించడం ఎలాగో తెలియని పరిస్తితి ఈ పార్టీది. తెలంగాణా పట్ల చులకన భావంతో ఒకప్పుడు మొరాయించిన పార్టీలను సైతం  ముగ్గులోకి లాగేలా వాటిపై  వొత్తిడి పెంచడం మినహా ఈ పార్టీ తన ప్రాధమిక లక్ష్యం దిశగా సాధించింది పూజ్యం. పైగా వేర్పాటువాదాన్ని బలంగా కోరుకునే వారినందరినీ ఒక్క తాటిపైకి  చేర్చడంలో పూర్తిగా విఫలం అయిందనే చెప్పాలి.
వై.ఎస్.ఆర్. పార్టీ కూడా తెలంగాణా విషయంలో ఒక స్పష్టమయిన వైఖరితో ముందుకు వచ్చిన దాఖలా లేదు. అందుకే, వై ఎస్ ఆర్ సంక్షేమ పధకాల స్పూర్తితో ముందుకు పోతున్నామని చెప్పుకునే ఈ పార్టీ, అ ప్రాతిపదికపై తెలంగాణలో కుదురుకునే ప్రయత్నాలు చేయడం లేదు. పరకాల ఎన్నిక తరువాత మరింత ఉత్సాహంతో సాగాల్సిన ఈ పార్టీ మందకొడిగా వ్యవహరిస్తోందనే చెప్పాలి. రెండు కళ్ళు అని పైకి చెప్పకపోయినా, ఒక ప్రాంతానికి, ఒక సామాజిక వర్గానికి ప్రధానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నదన్న పేరు పడడం వల్ల తెలంగాణా పట్ల ఒక నిశ్చితమయిన వైఖరిని తొందరపడి  వెల్లడించాల్సిన అగత్యం  లేదన్నది ఆ పార్టీ అభిప్రాయంగా తోస్తోంది.
ఇక మిగిలిన పార్టీలన్నీ తెలంగాణాపై ఆటో ఇటో చెప్పగలిగినా వాటి  ప్రభావం శూన్యం.
అయితే, ఒక్కటి మాత్రం స్పష్టం.
తెలంగాణా పట్ల విస్పష్టమయిన  వైఖరి వెల్లడించడం వల్ల రానున్న సార్వత్రిక  ఎన్నికల్లో తమకు ఏమేరకు రాజకీయ లబ్ది చేకూరుతుంది అనే  లెక్కల విషయంలో ఆయా పార్టీలకు ఇంకా స్పష్టత రాకపోవడంవల్లనే ఆ పార్టీలకు తెలంగాణా అంశం  ఒక క్రీడామైదానంగా తయారవుతోంది. (28-09-2012)