telangana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
telangana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఆగస్టు 2013, శనివారం

సంయమనం నేటి అవసరం


ఈరోజు (03-08-2013) శనివారం సాయంత్రం హైదరాబాదు శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో  రాష్ట్ర విభజన అంశంపై హెచ్.ఎం.టీ.వీ. నిర్వహించిన ప్రత్యేక చర్చాకార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నేను చేసిన సూచనలు:



“రెండు నిమిషాల్లో ముగిస్తానన్న హామీతో మొదలు పెడుతున్నాను. ఆ హామీ నిలబెట్టుకుంటానన్న హామీ కూడా ఇస్తున్నాను.   
“హెచ్.ఎం.టీ.వీ. బాధ్యతాయుతమైన మీడియా పాత్ర నిర్వహిస్తోంది. సంతోషం. నిజానికి ఇది నేటి అవసరం కూడా. Need of the Day.
“చాలామంది మాట్లాడారు. చక్కని సూచనలు చేసారు. విలువైన సలహాలు ఇచ్చారు.
“నేను సలహాలు చెప్పదలచుకోలేదు. మరో నాలుగురోజుల్లో – ఏడో  తేదీకి  నాకు 68 ఏళ్ళు నిండుతాయి కనుక సలహాలు ఇచ్చే వయస్సు వున్నా, అనుభవం లేదు కాబట్టి కొన్ని సూచనలు మాత్రమే చేస్తాను.
“గతం గురించీ, వీలయితే వర్తమానం గురించి మరచిపోదాం. గతంలో ఏం జరిగిందన్న దాన్ని గురించి వర్తమానంలో చర్చించుకోవడం వల్ల భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుంది. కాబట్టి, గతాన్ని, వర్తమానాన్ని కొన్నాళ్ళు పక్కన బెట్టి భవిష్యత్తు గురించే ఆలోచిద్దాం.
“జరిగిన ‘నిర్ణయం’ గురించి తవ్వుకోవడం వల్ల వొరిగేదేమీ వుండదు. కాకపోతే నిర్ణయం తీసుకోవడం బాగా ఆలస్యంగా, చాలా అనూహ్యంగా జరగడం వల్లనే ఈ పరిస్తితి ఉత్పన్నమైంది. సరైన సమయంలో సరయిన నిర్ణయం అంటూ  ఏండ్లూ పూండ్లు నానుస్తూ వచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం ఇకనుంచి అయినా బాధ్యత తీసుకోవాలి. ఢిల్లీ లో కూర్చుని వూరికే ప్రకటనలు చేస్తూ కూర్చుంటే కుదరదు. కేంద్ర హోమ్  మంత్రి గారు త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తామన్నారు. అసలు ఈసరికే ఆయన రాష్ట్రంలో మకాం పెట్టి వుంటే బాగుండేది.
“నిర్ణయం అమలు జరిగే తీరు పట్ల కొందరిలో అనుమానాలు, భయ సందేహాలు వున్నాయి. సహజం కూడా. వీలైనంతవరకు వాటన్నిటిని వీలైనంత త్వరగా – పరిస్తితులు పూర్తిగా చేయిదాటక ముందే నివృత్తి చేయాలి. మీన  మేషాలు లెక్కిస్తూ కూర్చునే వ్యవధానం లేదు.
“చివరిగా ఒక మాట.
“మాట పెదవి దాటితే పృధివి దాటుతుంది. అంచేత, రానున్న కొద్ది మాసాలు అందరూ సంయమనం పాటించాలి. ఇతరులు పాటించాలని డిమాండ్ చేయడం కాదు. అది ఎవరికి వారు బాధ్యతగా తమ నుంచే ప్రారంభించాలి.
“రాజకీయ నాయకులు టీవీ ఛానళ్లతో మాట్లాడేటప్పుడు సాధ్యమైనంతవరకు రాసుకొచ్చిన ప్రకటనలనే చదివి వినిపించాలి. ఇందులో భేషజాలకు తావుండకూడదు. ఏదైనా అనేసి – ఆ తరువాత తీరిగ్గా – అల్లా మాట్లాడ్డం మా ప్రాంతంలో మామూలు  అంటే సరిపోదు. అలాటివాటిని సాధారణ సందర్భాలలో ఎవరూ పట్టించుకోరు. కాని ఇప్పుడు అలా కాదు. మాటలు తూటాలవుతాయి. అందుకే ప్రతి మాటా బంగారం తూచినట్టు బేరీజు వేసుకుని, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి.
“రెండు నిమిషాలు అయిపోయాయి. ఇక  ముగిస్తున్నాను.”

-భండారు శ్రీనివాసరావు (03-08-2013)                      

Confidence is the need of the hour

The Congress decision to finally create a separate Telangana state is welcome.
But it seems to have been taken in a hurry.
The Congress High Command has not prepared the Seemandhra leaders in this regard. Even the Congress MPs and Ministers of either region have no clue.
Now the Seemandhra region is on the boil and the leaders are not in a position to face it.
Nevertheless, it is necessary for the people in that part of the State to restrain themselves in registering their protests which should be done in a democratic way.
The Centre should also take special responsibility immediately to create confidence among the people of both the regions.
They just can't make some announcements on the division of the State and keep quiet.
Immediate efforts should be made at the highest authoritative level to dispel genuine doubts of the affected people regarding location of the capital, funds allotment, water distribution, etc. A government-level mechanism has to be set up for this pur pose. Let the MPs, MLAs, Ministers and leaders of all parties come out and tell the people about their plan of action. Mere resignations will not serve the purpose. At the same time, let there be clarity on Hyderabad as joint capital and its operation.
Our State leaders, irrespective of their party affiliations, need to learn, at least now, from the leaders of neighbouring States like Tamil Nadu, Karnataka and Maharashtra. In spite of their political differences, they get united when they have to fight with the Central Government on issues that benefit the people in their respective States. They show immense solidarity and strength for effective bargain. It is a pity that similar unity is lacking among our leaders.

Bhandaru Srinivas Rao,  Yellareddyguda,Hyderabad (03-08-2013)


25, జులై 2013, గురువారం

1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు? ఐతరేయ బ్రాహ్మణమా?


ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినప్పుడు – నా పుట్టిన తేదీ ప్రకారం అప్పటికి నా వయస్సు కొంచెం అటూ ఇటుగా పదకొండేళ్లు. అప్పటి విశేషాలు  గుర్తుండే వీలు లేదు కాబట్టి నాటి పరిస్తితులను సింహావలోకనం చేయడానికి వీలుగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ఆరు మాసాలముందు ఆంధ్ర పత్రిక దినపత్రిక ఏప్రిల్ నాలుగో తేదీన మొదటి పుటలో ప్రధాన శీర్షికతో ప్రచురించిన వార్తను యధాతధంగా అక్షరం పొల్లు పోకుండా కింద ఇవ్వడం జరిగింది. రాష్ట్ర విభజన గురించి ఆందోళనలు, చర్చోపచర్చలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఆ నాటి స్తితిగతులను ఓమారు స్పురణకు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో మరో రకం ఆలోచనకు తావివ్వరాదని నా అభ్యర్ధన.
సంపుటం - 43  సంచిక - 4  బుధవారం   4-4-1956   6 పేజీలు  1 అణా
‘ఆంధ్ర ప్రదేశ్’ అనే పేరుకు తెలంగాణా నాయకుల సమ్మతి   
కోస్తా జిల్లాలకోసం గుంటూరు లో హైకోర్టు బెంచి నెలకొల్పే నిర్ణయం
అక్టోబర్ లోగా విలీనం మినహా కార్యాలయాల తరలింపు అసాధ్యం అని డాక్టర్ బూర్గుల ప్రకటన
(ఆంధ్ర పత్రిక ప్రతినిధి)
కర్నూలు, ఏప్రిల్ 3
‘ఆంధ్ర ప్రదేశ్’ అని నూతన రాష్ట్రానికి పేరు పెట్టడానికే చివరికి ఆంధ్ర – తెలంగాణా నాయకులు తీర్మానించారు.
ఆంధ్ర ప్రాంత న్యాయవాదుల ప్రాబల్యానికి హైదరాబాద్ న్యాయవాదులు భయపడుతున్న కారణం వల్ల- రాయలసీమపై న్యాయ విచారణాధికారాన్ని హైదరాబాదు కోర్టుకు ఒప్పగించి, కోస్తా జిల్లాలకోసం గుంటూరులో హై కోర్టు బెంచి నెలకొల్పాలని కూడా ఉభయ ప్రాంతాల నాయకులు నిర్ణయించారు.
ఆంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో –ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్ రెవిన్యూ మంత్రి శ్రీ కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జె.వి. నరసింగరావు, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, పూర్వ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం, విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పాల్గొన్నారు.
నూతన రాష్ట్ర నామకరణం విషయమై కొంత దీర్ఘ చర్చ జరిగింది.
హైదరాబాద్ నాయకుల్లో శ్రీ రంగారెడ్డి, శ్రీ చెన్నారెడ్డి, శ్రీ నరసింగరావు – ‘తెలుగు ప్రదేశ్’ అని కానీ, ‘తెలంగాణా’ అని కానీ కొత్త రాష్ట్రానికి పేరు వుంచాలని దీర్ఘవాదం చేశారు.
ఆంధ్ర లో దోషం లేదు
తదితరులు, హైదరాబాద్ ముఖ్యమంత్రి తో సహా – ఆంధ్ర అనే పదంలో దోషం ఏమీ లేదని వాదించారు.
‘ఆ పేరు ఉపనిషత్తుల కాలం నుంచి వ్యవహారంలో వుంది. ఆ పేరు ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. ఆంధ్ర పితామహ, శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషానిలయం – ఈ మొదలయిన ప్రఖ్యాత వ్యవహార నామములు బట్టి చూచినట్టయితే – ఆంధ్ర ప్రజలకు, తెలంగాణా ప్రజలకు భేదం కనబడదు. అందరినీ ఆంధ్ర అనే పదం తోనే వ్యవహరించారు’
చివరికి ‘ఆంధ్ర ప్రదేశ్’ అనే నూతన రాష్ట్రానికి పేరు వుంచాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
ముస్లిం అవసరాలు
సమావేశానికి ముందు హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు ‘ఆంధ్ర పత్రిక’ ప్రతినిధితో ప్రసంగిస్తూ – ‘తెలంగాణా’ అనే పేరు రెవిన్యూ అవసరాలకోసం ముస్లిం పరిపాలకులు వ్యవహారం లోనికి తెచ్చినదన్నారు. ‘ఆంధ్ర ప్రదేశ్’ అనే పేరే అందరికీ సమ్మతం కాగలదన్నారు.
(విషయసేకరణకు తోడ్పడిన అనేకమందికి ధన్యవాదాలు – భండారు శ్రీనివాసరావు,

30, జూన్ 2013, ఆదివారం

జనహితమే సర్వజన సమ్మతం - భండారు శ్రీనివాసరావు



(గమనిక ఇది 2008 మే నెలలో రాసిన వ్యాసం) 


రాష్ట్ర విభజనని ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటే ఏ రాజకీయ శక్తీ దాన్ని ఆడ్డుకోలేదు. ఈ ఆకాంక్ష జనానిదయితే మన్నించాల్సిందే. రాజకీయమైనదయితే ఆలోచించాల్సిందే'. ఇటీవలికాలంలో - దాదాపు అన్ని పార్టీలు - ఏదో ఒక రూపంలో - ఏదో ఒక స్థాయిలో తెలంగాణా సెంటిమేంట్‌ని కొద్దో గొప్పో పులుముకోవాలని ప్రయత్నిస్తూనే  ఉన్నాయి. ఒక్క సీపీఎం ను మినహాయిస్తే,  ఒకప్పుడు ససేమిరా అన్న పార్టీలు కూడా ఇప్పుడు సరే అంటున్నాయి.  ఈ పార్టీల్లోని కొందరు పెద్దలకి ఇది తక్షణ రాజకీయ అవసరం.  అదే ఇందులోని విషాదం.
దేశం స్వాతంత్ర్యం పొందిన దరిమిలా - అనేక కొత్త రాష్ట్రాలు పురుడు పోసుకున్నాయి. పొరుగున ఉన్న అనాటి మద్రాసు(తమిళనాడు) రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం - తరువాత కొద్ది కాలానికే - భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్దాంత ప్రాతిపదిక పై - తెలంగాణా ప్రాంతాన్ని(హైదరాబాదు స్టేట్ లోని ప్రధాన భాగాలు) కలుపుకుని - ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించింది. ఒకే భాష మాట్లాడే వారికి కూడా, విడివిడిగా రాస్ట్రాలు వున్నప్పుడు - ఆంధ్ర ప్రదేశ్ ని కూడా ప్రజాభిష్టం మేరకు విభజించడంలో తప్పేమి లేదు. అయితే తప్పల్లా - ప్రజల ఆకాంక్షని అంచనా వేయడంలో చేస్తున్న తప్పులే. రాష్ట్ర విభజన అన్నది ఎవరో కొందరి రాజకీయావసరాల కోసం కాకుండా మెజారిటీ ప్రజల అబీష్టం మేరకు జరగాలి.

ఏ వేర్పాటు ఉద్యమానికయినా, వెనుకబడినతనమే ప్రాతిపదిక. దీని ఆధారంగా పెచ్చరిల్లే భావోద్వేగాలే విభజన ఉద్యమాలకు ఊపిరిపోస్తాయి. ఈ విధంగా ప్రజ్వరిల్లే శక్తిని అడ్డుకోవడం అతికష్టం అని గతంలో తెలంగాణా ప్రజా సమితి నిరూపించింది కూడా. అయితే, అప్పటికి అంటే 1969 నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఇసుమంత కూడా మార్పు రాలేదంటే నమ్మడం కష్టం. తెలంగాణాలో ఇంకా కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదంటే నమ్మచ్చుకాని తెలంగాణాలో అసలు అభివృద్ధి  జరగలేదని వాదించడం కేవలం రాజకీయమే అవుతుంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. 1969 నాటికి వూహకు సయితం అందని ఉదార ఆర్ధిక విధానాలు ఈనాడు శరవేగంగా అమలవుతున్నాయి. ప్రపంచీకరణ సిద్దాంతం నేల నాలుగు చెరగులా బలంగా వేళ్ళూనుకుంటున్న నేపధ్యంలో - అసలు దేశాల  మధ్యనే హద్దులు చెరిగిపోతున్నాయి. 

పొట్ట గడవక కొందరూ - డాలర్ల వేటలో మరికొందరూ - ఉపాథి కోసం ఇంకొందరూ ఉన్నవూరు, కన్న దేశం  వదిలిపెట్టి వెళ్ళడం అన్నది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావడంలేదు. అవకాశాలు వెతుక్కుంటూ అన్ని ప్రాంతాలవారు అన్ని చోట్లకీ వలస వెడుతున్నారు.
ఏదో ఒకనాడు - తెలుగువాడే అమెరికాకి అధ్యక్షుడు కాగలడని ఆ దేశంలో ఉంటున్న తెలుగువారే భరోసాగా చెబుతున్నారంటే ఇక భౌగోళిక రేఖలకి, దేశాల సరిహద్దులకీ - అర్థమేముంటుంది? పోతే - ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని - భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఏపాటి మిగులుతాయో అర్ధం చేసుకోలేని విషయమేమి కాదు. 
ఆ మాటకి వస్తే - దేశాలయినా, రాష్ట్రాలైనా, ప్రజలైనా విడిపోవడం - కలిసిపోవడం పెద్ద విషయమేమి కాదు. విభజన కుడ్యాన్ని కూలగొట్టుకుని - రెండు జర్మనీలు కలిసిపోయాయి. అమెరికాని సయితం శాసించగలిగిన స్థాయికి ఎదిగిన సోవియెట్ యూనియన్ - అంగ, వంగ, కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమయింది. 

కాబట్టి - చరిత్ర నుంచి నేర్చుకున్నవారు - చరిత్ర హీనులు కాలేరు. మనసులూ - మనుషులూ కలుషితం కావడం ఏ సమాజానికి క్షేమకరం కాదు. విడీపోయినా చేతులు కలిసే వుండాలి. మనసులు మసి బారకుండా ఉండాలి .
సర్వేజనాః సుఖినోభవంతు! 
(మే - 2008 )

7, జూన్ 2013, శుక్రవారం

పార్టీలకు క్రీడామైదానం తెలంగాణా


సూర్యుని కాంతి చంద్రుడిపై పడి ప్రతిఫలించినట్టు ఈనాడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఎంతో కొంత తెలంగాణా అంశంతో ప్రభావితమవుతున్నాయి. పుష్కర కాలం పైచిలుకు  ప్రత్యేక రాష్ట్రం పేరుతొ మడమ తిప్పని పోరాటం చేస్తున్న తెలంగాణా రాష్ట్ర సమితి, టీ.ఆర్.ఎస్.,  తన ప్రధాన లక్ష్య సాధనలో కొంత వెనుకబడ్డప్పటికీ, రాష్ట్రంలోని అన్ని పార్టీల మెడలు వంచి తెలంగాణా పట్ల దృష్టి  సారించేలా చేయడంలో ఒక మేరకు విజయం సాధించిందనే చెప్పాలి. రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలన్న టీ.ఆర్.ఎస్. ధ్యేయం ఎప్పుడు నెరవేరుతుందో కాని, తెలంగాణాకు అనుకూలంగానో, ప్రతికూలంగానో - అన్ని రాజకీయ పార్టీలు నిట్టనిలువుగా చీలిపోవడానికి మాత్రం ఆ పార్టీ ఎత్తుగడలు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు పాలక పక్షం కాంగ్రెస్ లోను  ప్రాంతీయ పార్టీ ‘తెలుగుదేశం’లోను,   తాజాగా మొదలయిన ‘ప్రాంతీయ కలకలం’ ఇందుకు ఉదాహరణ.
తనపై పడ్డ ‘రెండు కళ్ళ సిద్ధాంతం’ అపవాదును చెరిపేసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నానా హైరానా పడాల్సివస్తోంది.. ఒకప్పుడు తెలంగాణా ప్రాంతంలో గట్టి క్యాడర్ పట్టున్న పార్టీగా పేరున్న టీడీపీ, జారిన కాలును  మళ్ళీ కూడగట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో అత్యంత క్లిష్టమయిన పరిస్తితి ఎదుర్కుంటున్న పార్టీ ఏదయినా వుందంటే ముందు చెప్పుకోవాల్సింది టీడీపీ పేరే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా వుంటూ వరసగా మూడో పర్యాయం కూడా అధికారపీఠానికి దూరంగా వుండడం అన్నది ఆత్మహత్యాసదృశ్యం. అందువల్ల ఆ పార్టీ నాయకుడుగా, సారధిగా చంద్రబాబుకు వున్న వొత్తిళ్లు అనేకం. ఏంచేసయినా సరే రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో పార్టీ నావని విజయ తీరానికి చేర్చాల్సిన బాధ్యత ఆయన భుజస్కంధాలపై వుంది.  కాబట్టే ఆయన వరస  ‘డిక్లరేషన్ల’కు  తెర తీసారు. అరవై ఏళ్ళ వయస్సులో కష్టసాధ్యమయిన పాదయాత్రకు నడుంకట్టారు. తెలంగాణా విషయంలో స్పష్టతతోనో, అస్పష్టతతోనో – అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ  ప్రధానికి ఒక లేఖ రాశారు. ఇన్ని చేసినా ఇన్ని  తలనొప్పులేమిటన్నది ఆయన అభిమానుల బాధ. అందుకే అంటారు, కాలం కలసిరానప్పుడు తాడే పామై కరుస్తుందని.
పోతే, రాష్ట్రంలో అత్యంత క్లిష్టమయిన రాజకీయ  భవితవ్యాన్ని ఎదుర్కుంటున్న పార్టీల్లో కాంగ్రెస్  రెండో స్థానంలో వుంది. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో మరో ఏడాది పైచిలుకు అధికారంలో వుంటామన్న  ధీమా తప్ప భవిష్యత్తు గురించిన భరోసా ఏమాత్రం లేని పార్టీగా అనేక సర్వేల్లో ఇప్పటికే వెల్లడయింది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ బలహీనతే ఈ పార్టీకి ప్రస్తుతం వున్న బలం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి పూర్తిగా అగమ్య గోచరం. ఎంతో అద్భుతం జరిగితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసాధ్యం అన్నది ఆ పార్టీ నాయకులే అంగీకరించే వాస్తవం. ఏదయినా అద్భుతం  జరిగినా మూడోమాటు ప్రజలు అధికారం కట్టబెట్టడం కల్ల అనే నిజం జీర్ణించుకున్నవాళ్లు కాబట్టి,  అధికారానికి కొన్నాళ్ళు దూరంగా వున్నా జాతీయ పార్టీగా తమ మనుగడకు ఎలాటి ధోకా వుండదన్న నమ్మకం వున్నవాళ్ళు కనుక కాంగ్రెస్ వారికి పార్టీ జయాపజయాలతో నిమిత్తం వుండదు. ‘వూహించనిదేదో జరిగి అధికారంలోకి వస్తే సంతోషం, రాకపోతే పోయేదేమీ లేదు పదవి తప్ప’ అనే సిద్ధాంతం వారిది. అందుకే, రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కుంటున్న  సమస్యలని పేరబెట్టి, తెలంగాణా వంటి కీలక అంశాల  పరిష్కారాన్ని నానబెట్టి, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ  ప్రజలిచ్చిన అధికారంతో కాలక్షేపం చేస్తున్నారు.
ఇక టీ.ఆర్.ఎస్. విషయం తీసుకుంటే,  ఆట మొదలు పెట్టడం తప్ప  ముగించడం ఎలాగో తెలియని పరిస్తితి ఈ పార్టీది. తెలంగాణా పట్ల చులకన భావంతో ఒకప్పుడు మొరాయించిన పార్టీలను సైతం  ముగ్గులోకి లాగేలా వాటిపై  వొత్తిడి పెంచడం మినహా ఈ పార్టీ తన ప్రాధమిక లక్ష్యం దిశగా సాధించింది పూజ్యం. పైగా వేర్పాటువాదాన్ని బలంగా కోరుకునే వారినందరినీ ఒక్క తాటిపైకి  చేర్చడంలో పూర్తిగా విఫలం అయిందనే చెప్పాలి. సొంతబలం పెంచుకోవడానికి బదులు ప్రత్యర్ధులను బలహీనపరచడం అన్న ఆ పార్టీ ఎత్తుగడ ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. ఉద్యమం  సుదీర్ఘకాలం కొనసాగడంవల్ల వొనగూడే అనర్ధాలు ఆ పార్టీని పట్టి పీడిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా మంధనిలో జరిగిన  టీఆర్ఎస్ శిక్షణా తరగతుల శిబిరం సందర్భంగా, తగిన గుర్తింపు లభించడం లేదంటూ మధన పడిన ఓ కార్యకర్త  అధినాయకుడి సమక్షంలోనే  పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం ఇందుకు తాజా ఉదాహరణ.         
వై.ఎస్.ఆర్. పార్టీ కూడా తెలంగాణా విషయంలో ఒక స్పష్టమయిన వైఖరితో ముందుకు వచ్చిన దాఖలా లేదు. అందుకే, వై ఎస్ ఆర్ సంక్షేమ పధకాల స్పూర్తితో ముందుకు పోతున్నామని చెప్పుకునే ఈ పార్టీ, అ ప్రాతిపదికపై తెలంగాణలో కుదురుకునే ప్రయత్నాలు చేయడం లేదు. పరకాల ఎన్నిక తరువాత మరింత ఉత్సాహంతో సాగాల్సిన ఈ పార్టీ మందకొడిగా వ్యవహరిస్తోందనే చెప్పాలి. రెండు కళ్ళు అని పైకి చెప్పకపోయినా, ఒక ప్రాంతానికి, ఒక సామాజిక వర్గానికి ప్రధానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నదన్న పేరు పడడం వల్ల తెలంగాణా పట్ల ఒక నిశ్చితమయిన వైఖరిని తొందరపడి  వెల్లడించాల్సిన అగత్యం  లేదన్నది ఆ పార్టీ అభిప్రాయంగా తోస్తోంది.
ఇక మిగిలిన పార్టీలన్నీ తెలంగాణాపై ఆటో ఇటో చెప్పగలిగినా వాటి  ప్రభావం శూన్యం.
అయితే, ఒక్కటి మాత్రం స్పష్టం.
తెలంగాణా పట్ల విస్పష్టమయిన  వైఖరి వెల్లడించడం వల్ల రానున్న సార్వత్రిక  ఎన్నికల్లో తమకు ఏమేరకు రాజకీయ లబ్ది చేకూరుతుంది అనే  లెక్కల విషయంలో ఆయా పార్టీలకు ఇంకా స్పష్టత రాకపోవడంవల్లనే ఆ పార్టీలకు తెలంగాణా అంశం  ఒక క్రీడామైదానంగా తయారవుతోంది. (07-06-2013)

18, మే 2013, శనివారం

హూష్ కాకి



వార్త : తెలంగాణా అంశం యూపీయే ఎజెండాలో లేదు – ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో
వ్యాఖ్య : శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చినప్పుడు నేను రాసిన ఈ వ్యాసం      
“మాయాబజార్ సినిమాలో శ్రీ కృష్ణుడు బలరామాదులకు ప్రియదర్శిని పేటికను ప్రదర్శిస్తాడు. ఆ పెట్టె తెరచి చూసినవారికి వారి మనసులో ఏమి కోరుకుంటున్నారో అదే  అందులో  కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీ కృష్ణ  కమిటీ కూడా సరిగ్గా  అదే చేసింది. వివాదంతో సంబంధం వున్న వారందరికీ తాము కోరుకున్నవిధంగానే కమిటీ సిఫారసులు వున్నాయనే భ్రాంతి కలిగేలా  వేర్వేరు సూచనలకు రూపకల్పన చేసి జస్టిస్ శ్రీ కృష్ణ తన పేరుకు తగినట్టు కృష్ణలీలను ప్రదర్శించారు. ఆంద్రప్రదేశ్ లో ఏర్పడిన సంక్షుభిత పరిస్తితికి పరిష్కారంగా ఆరు ప్రత్యామ్నాయాలు సూచించి మరో సరికొత్త చర్చకు తెర తీసారు.
పది నెలల నిర్విరామ కృషి, ఆరువందల పైచిలుకు పేజీలు, రెండు సంపుటాలు, ఆరు సిఫారసులు స్తూలంగా ఇదీ శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్.  పైగా తాను చేసిన ఆరు సిఫార్సుల్లో  మొదటి మూడు   ఆచరణ సాధ్యం కావనీ, నాలుగోదానికి సర్వజనామోదం  కష్ట సాధ్యం అనీ  కమిటీ నివేదికలోనే  సన్నాయి  నొక్కులు నొక్కారు.
రాష్ట్రాన్ని ఇప్పుడున్న రూపంలోనే కొనసాగించాలని మొదటి సిఫారసులో పేర్కొంటూనే  దీనివల్ల తెలంగాణాలో భావోద్వేగాలు పెచ్చరిల్లగలవని, తద్వారా ఏర్పడగల అనిశ్చితిని  మావోయిస్టు ఉద్యమం తనకు అనుకూలంగా మార్చుకునే వీలుందని భాష్యం చెప్పి తాను చేసిన తొలి సూచనకు తానే ఇంటూ మార్క్ పెట్టింది.
రెండో సిఫారసు రాష్ట్రాన్ని రెండుగా విభజించడం హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణా వాదులు ససేమిరా వొప్పుకోరన్నది కూడా కమిటీ తన అభిప్రాయంగా పేర్కొన్నది.
పోతే, రాయల తెలంగాణా, కోస్తాంధ్ర లుగా రాష్ట్రాన్ని విభజించాలన్నది  మూడో సూచన. అయితే దీన్ని రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారు అంగీకరించే  అవకాశం వుండదని కూడా కమిటీయే చెప్పింది.
హైదరాబాదు నగర పరిధిని బాగా విస్తరించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించి, రాష్ట్రాన్ని రెండుగా విభ జించాలనేది నాలుగో ప్రతిపాదన. కానీ, ఉభయ ప్రాంతాలలో ఏఒక్కరికీ ఇది ఆమోద యోగ్యం కాకపోవచ్చని కమిటీ సిఫారసుల సంఖ్యను రెండుకు కుదించే ప్రయత్నం చేసింది.
ఇక అయిదో సిఫారసు రాష్ట్రాన్ని విభజించి తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా చేయడం. ఆంద్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచీ తెలంగాణా ప్రాంతంలో పాతుకుపోయివున్న కొన్ని సహేతుక అసంతృప్తులను పరిగణనలోకి తీసుకుంటే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అసంబద్ధం కాదని ఓ పక్క  చెబుతూనే, దీనివల్ల  దేశవ్యాప్తంగా కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాలకు ఊతం ఇచ్చినట్లయి, అంతర్గత భద్రతపై  ప్రతికూల ప్రభావం పడగల  ప్రమాదాన్ని ఎత్తిచూపింది. తప్పనిసరి అయితేనే విభజనకు శ్రీకారం చుట్టాలన్నది కూడా ఈ ప్రతిపాదనలోని కొస మెరుపు.
పోతే, క్రమంలో చివరిదేకానీ ప్రాధాన్యతా క్రమంలో చిన్నది కాదన్నట్టుగా ఆఖరి ఆరో ప్రతిపాదన చేస్తూ ఇదే తమ ప్రతిపాదనలు అన్నింటిలో అత్యుత్తమమైనదని కమిటీ తనకు తానుగానే ఒక  కితాబును దానికి  జత చేసింది. రాష్ట్రాన్నిఇప్పటి మాదిరిగా  సమైక్యంగానే వుంచి తెలంగాణా అభివృద్ధికి రాజ్యాంగ బద్ధమయిన చర్యలు తీసుకోవాలన్నది ఆరో ప్రతిపాదన సారాంశం.
రాగల పరిణామాలను గురించి రాయబారం సీనులో అలనాటి  శ్రీ కృష్ణుడు కౌరవాదులను హెచ్చరించినట్టు ఇలనాటి కృష్ణుడు తన కమిటీ చేసిన ఆరు సిఫారసులను అమలు చేయడం వల్ల వొనగూరే ఫలితాలను, పరిణామాలను అంశాలవారీగా నివేదికలోనే తేటతెల్లం చేయడం జరిగింది. ఇంతకీ కృష్ణ కమిటీ ఏమి చెప్పినట్టు, ఏమి తేల్చినట్టు అనే ప్రశ్నలను అందరికీ వొదిలిపెట్టి – ‘సమైక్యమా? విభజనా?’ అన్న అంశం దగ్గరికే సమస్యను  తీసుకువచ్చి భూమి గుండ్రం గా వుందిఅన్న సామెతను నిజం చేసింది.
నివేదికను స్వీకరించిన కేంద్ర హోం మంత్రి చిదంబరం ఆరో తేదీ సమావేశానికి వచ్చిన పార్టీలకు నివేదిక ప్రతులను పంచిపెట్టి, బహిష్కరించిన పార్టీలకు స్పీడ్ పోస్ట్ లో పంపించి, ప్రభుత్వ వెబ్ సైట్ లో సయితం దాన్ని పెట్టి చేతులు కడిగేసుకున్నారు. నివేదికను ఆషామాషీగా కాకుండా క్షుణ్ణంగా చదవండి అని ఒక సలహా కూడా ఇచ్చారు. బాగా అధ్యయనం చేసాక మరోసారి కలుసుకుని మాట్లాడుకుందామని అందర్నీ ఆహ్వానించారు. ఈ మొత్తం ప్రక్రియను గమనించిన వారికి కేంద్ర ఆచి తూచి వ్యవహరిస్తున్నది అన్న భావన కలగడానికి బదులు ఏదో విధంగా వాయిదా మంత్రం పఠించడం మొదలు పెట్టిందన్న అనుమానమే ఎక్కువ కలుగుతోంది.   
ఇక రాష్ట్రంలో ఈ అంశంపై తలలు పట్టుకుంటున్న పార్టీలలో మెజారిటీ పార్టీలు, కృష్ణ కమిటీ రిపోర్ట్ రాగానే దానికి కట్టుబడి వుంటామని ఇంతవరకు చెబుతూ వచ్చాయి. కానీ నివేదికలో ఏదో ఒకటి తేల్చకుండా, ఇదమిద్ధంగా ఒకే ఒక  సిఫారసు  చేయకుండా వెసులుబాటు కల్పించడంతో తిరిగి అందరు పాత పల్లవినే అందుకుంటున్నారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల్లో రెండు  ప్రాంతాలకు చెందినవాళ్ళు అధిష్టానందే అంతిమ నిర్ణయం అంటూనే తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. విషయాన్ని ఇంకా నానుస్తూ పోవడం వల్ల ఇరు ప్రాంతాల్లో ఈ రెండు పార్టీలు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని  బాహాటంగా ప్రకటిస్తున్నారు.
కాంగ్రెస్, టీడీపీ లు ఎదుర్కుంటున్న ఇరకాట పరిస్తితిని వేర్పాటువాదులు వాటిపై వొత్తిడి పెంచడానికి వుపయోగించుకునే ప్రయత్నం మొదలయింది. ప్రత్యేక తెలంగాణా  అన్నది సాకారం కావడానికి ఉద్యమం యెంత వూపు తేగలిగినా అంతిమంగా రాజకీయ నిర్ణయం ద్వారానే అది  సాధ్యం అన్న ఎరుక వారికి లేకపోలేదు. అందుకే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన దరిమిలా ఉత్పన్నమయిన పరిస్తితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వారు మళ్ళీ నడుం బిగిస్తున్నారనేది తేటతెల్లం. ప్రస్తుత అసందిగ్ధ స్తితికి కాంగ్రెస్, టీడీపీ లను ప్రధాన బాధ్యులుగా చేసి ఆ పార్టీల లోని తెలంగాణా అనుకూలుర చేత  వారి అధినాయకత్వంపైనే  వొత్తిడి తీసుకు వచ్చేలా చేయడం ఇప్పుడు వారి వ్యూహంగా కానవస్తోంది. అనివార్యం అయితేనే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన సిఫారసు చేయాలని, అన్ని ప్రాంతాల నడుమ సయోధ్య సాధ్యమయితేనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాలని కమిటీ చేసిన సూచనను తెలంగాణావాదులు ఎంతమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నివేదిక ఈ రూపంలో రావడానికి సీమాంధ్ర వ్యాపార రాజకీయుల హస్తం వుందని  వారు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టడం మినహా తెలంగాణా కోరుకుంటున్నవారిని మరేదీ సంతృప్తి పరచలేదన్నది వారి నిశ్చితాభిప్రాయంగా కానవస్తోంది.
శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ వల్ల అసలు సమస్య ఏమేరకు పరిష్కారం అవుతుందన్నది అనుమానాస్పదమే. కాకపొతే, అగ్రహారం పోయినా యాక్ట్ మొత్తం తెలిసివచ్చిందన్న సామెత చందాన రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలతో పాటు విద్య, వైద్యం, సేద్యం మొదలయిన అన్ని రంగాలలో ఆంద్ర ప్రదేశ్ ఏర్పడిననాటినుంచి ఇంతవరకు  రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించిన వివరాలు ప్రాంతాల వారీగా ఈ నివేదికలో పొందుపరచి సమగ్రమయిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. పదినెలల కాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి, సమాజంలో విభిన్న వర్గాలవారిని కలుసుకుని సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలోని గణాంకాలు వాస్తవపరిస్తితులకు పూర్తిగా అద్దం పట్టేవిగా వుండక పోవచ్చుకానీ, మొత్తం మీద ఒక స్తూలమయిన అవగాహనకు చదువరులు రావడానికి వీలుగా ఈ నివేదిక ఉపకరించగలదని భావించవచ్చు. వివిధ ప్రాంతాలలో ప్రగతి గురించి, వెనుకబాటుతనం గురించి ప్రస్తుతం వున్న అపోహలు, అనుమానాలు కొంత మేరకయినా తొలగించుకోవడానికి ఈ నివేదిక దోహదం చేస్తుంది.
చివరిగా ఒక మాట. సమస్యకు స్పష్టమయిన  పరిష్కార మార్గం చూపకపోయినా, కమిటీ ఒక నిర్దిష్టమయిన సూచన మాత్రం  చేసింది. ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. తనకు ఇచ్చిన గడువును  ఏదో ఒక సాకు చూపి పొడిగించుకోకుండా, ఒక రోజు ముందుగానే  నివేదికను సమర్పించి నిబద్ధతను నిరూపించుకున్న  శ్రీ కృష్ణ కమిటీ చేసిన ఈ సూచనను  సర్కారు పరిగణనలోకి తీసుకోవాలని ఆశిద్దాం.

12, నవంబర్ 2012, సోమవారం

ఎంతెంత దూరం? ఇంకెంత దూరం? - భండారు శ్రీనివాసరావు


ఎంతెంత దూరం? ఇంకెంత దూరం?  - భండారు శ్రీనివాసరావు

టీఆర్ఎస్ అధినేత  కె.చంద్రశేఖరరావుకు మళ్ళీ కోపం వచ్చింది. ఢిల్లీ పిలిపించి, రోజుల తరబడి చర్చించి పిదప  మొండి చెయ్యి చూపించిన చేతి పార్టీ నాయకులపై  ఆయన నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ ను నమ్మి మోసపోయామని, ఇక నమ్మే ప్రసక్తి లేదనీ, ఎన్నికల్లోనే అమీతుమీ తేల్చుకుని తెలంగాణాను సాధించుకుంటామనీ పార్టీ మేధోమధనం అనంతరం ఆయన  తేల్చిచెప్పారు. ఉగ్ర నరసింహావతారం ఎత్తి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం ద్వారా తెలంగాణా తదాఖా చూపుతామని హెచ్చరించారు.  వంద అసెంబ్లీ సీట్లు, పదిహేను లోకసభ స్థానాలు టీ.ఆర్.ఎస్. తనకు తానుగా గెలుచుకుంటే ఢిల్లీ దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని తమ చేతులో పెడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇక ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని మరో విధాన ప్రకటన చేశారు. అనుభవం మీద తత్వం బోధపడడమంటే ఇదే కాబోలు.
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే  తెలంగాణా విషయంలో చేసిన ప్రకటన మరో రకంగా వుంది. అనుకూల ప్రతికూల వర్గాలు ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకోవడానికి వీలుగా కూడా  వుంది.  ఇన్నేళ్ళు ఆగిన వాళ్లు మరికొన్ని నెలలు ఆగలేరా అని ఒక ప్రశ్నాస్త్రాన్ని ఆయన విభజన వాదులపై సంధించారు. పరిష్కార  ఘడియ రోజుల్లో కాకపోయినా కొన్ని నెలల్లో వుందని ఆ మాటలకు కొందరు భాష్యం చెబుతుంటే,  పరిష్కార మార్గాన్ని చెబితే స్వాగతిస్తామని చెప్పడం ద్వారా తాము ఇంతవరకు ఎలాటి పరిష్కారాన్ని కనుగొనలేదన్న నిజాన్ని చెప్పకనే చెప్పారని మరికొందరు అన్వయాలు అద్దుతున్నారు.
కేంద్ర మంత్రి చేసిన ప్రకటన, అసలు  విషయాన్ని మరింత గందరగోళపరిచేదిగా వున్నప్పటికీ, తెలంగాణా పట్ల కేంద్రం ఇంకా ఒక స్పష్టమయిన అవగాహనకు రాలేదన్న స్పష్టమయిన సంకేతం ఇచ్చేదిగా వుండడం విశేషం.       
మరోపక్క  మాజీ జీ పీసీసీ అధ్యక్షుడు కేశవరావు ఇంకో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణా విషయంలో కాంగ్రెస్ అధినేత్రికి చివరాఖరు లేఖ రాయబోతున్నామని హెచ్చరిస్తూనే, డిసెంబర్ 9 లోగా   రాష్ట్ర విభజన విషయంలో తమ అభీష్టానికి అనుగుణంగా అధిష్టానం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తమకుందని సన్నాయి నొక్కులు నొక్కారు. ఒకటి రెండు రోజుల్లో బహిర్గతం చేసే ఆ లేఖలో తమ భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేస్తామని కూడా ముక్తాయింపు ఇచ్చారు. ఇవి పైకి విలేఖరులకు చెప్పిన మాటలు. పత్రికల్లో  వెలువడ్డ అభిజ్ఞవర్గాల కధనాలు మరింత ఘాటుగా వున్నాయి.
తెలంగాణా ఏర్పాటు విషయంలో రాజీలేని పోరాటానికి సిద్ధపడుతున్నట్టు ఆ కధనాలు వెల్లడిస్తున్నాయి. ఈ చివరి ప్రయత్నం పట్ల కూడా అధినేత్రి  సానుకూలంగా స్పందించక పోతే వేర్పాటును కోరుకునే సంఘాలు, సంస్థలతో కలసి ఒక ఫ్రంటు ఏర్పాటు చేసే అంశాన్ని సైతం ఆ ప్రాంతపు కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు ఆ వార్తలు పేర్కొంటున్నాయి.           
కేంద్ర హోం మంత్రి చెప్పిన దాని ప్రకారం తెలంగాణా  అంశానికి సంబంధించిన సమస్త  వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్ద వున్నాయి. అన్ని  వివరాలు సిద్ధంగా వున్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో జాగు చేస్తున్నారంటే ఢిల్లీ వారికి కావాల్సింది ఈ సంఖ్యలు, అంకెలు కాదని అర్ధమైపోతున్నది.  వారికి కావాల్సింది  రెండేళ్ళ లోపు  జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవసరమయిన పార్లమెంటు సభ్యులను రాష్ట్రం నుంచి తగు మోతాదులో గెలిపించుకోవడానికి ఏమి చేస్తే సాధ్యపడుతుంది అన్నది మాత్రమే. తెలంగాణా ఇవ్వడం ద్వారా అది వీలుపడుతుందని తెలిసిన మరుక్షణం ప్రత్యేక రాష్ట్రం  ఏర్పాటుకు కాంగ్రెస్ పచ్చ జండా వూపుతుంది. ఇందులో సందేహం లేదు. మరో సంగతి. తెలంగాణా ఏర్పాటు ద్వారా వొనగూడే రాజకీయ లబ్ది పూర్తిగా తన ఖాతాలోకే రావాలని  కూడా కాంగ్రెస్ కోరుకుంటే తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దృక్కోణం నుంచే పావులు కదుపుతుంది. తెలంగాణా విషయంలో ఇంత తాత్సారానికి బహుశా  ఇదే కారణం అయివుంటుంది. తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయం అయినప్పుడు ఉద్యమాల ద్వారా లక్ష్య సాధనకు పోరాడుతున్న పార్టీలను  లెక్క చేయాల్సిన అవసరం ఏమిటన్నది వారి వ్యూహ కర్తల ఆలోచన కావచ్చు.
సరే! మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందని కేంద్ర మంత్రి ఒక ఉచిత సలహా ఇచ్చారు బాగానే వుంది. కాని, తెలంగాణా అంశం కారణంగా రాష్ట్రంలో కుంటుపడ్డ పాలన సంగతి ఏమిటి? పాలన కుంటుపడడం వల్ల కలిగే విపరీత పరిణామాల ప్రభావం పరిపాలించే పాలకులు, ఉన్నతాధికారుల దినవారీ   వ్యక్తిగత జీవితాలపై  వెంటనే పడే అవకాశాలు లేని అస్తవ్యస్త  వ్యవస్థ మనది. అందుకే పాలన కుంటుపడ్డా పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు వుండడానికి కారణం ఇదే. కానీ పాలితుల పరిస్తితి మరోరకంగా వుంటుంది. నిధుల లేమి కారణంగానో, ఇతరేతర కారణాలతోనో   ప్రభుత్వం అమలు చేయాల్సిన పధకాలు జాప్యం కావడంవల్ల వాటిల్లే ఇబ్బందులకు జనం ఇప్పటికే అలవాటు పడిపోయారు. కానీ  వ్యక్తిగత సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీలు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో పడిపోతే దానివల్ల ప్రజలు  పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే,  రాజకీయ సంక్షోభ పరిష్కారం పట్ల ఎక్కువ దృష్టి పెట్టాల్సిరావడంవల్ల పాలన  కొంత మేరకు  మందగించిందనే   సర్కారు   సాకులను ప్రజలు జీర్ణించుకుని అర్ధం చేసుకోవడం కష్టం.
రాష్ట్ర విభజన అనేది సున్నితమైన, సంక్లిష్టమయిన సమస్య అని అంగీకరించే వారు కూడా ఈ సమస్యకు సత్వర పరిష్కారం కోరుకుంటున్నారని భావించడం సత్య దూరం కాదు. ఎందుకంటె, ఈ సమస్యను ఏళ్లతరబడి నానుస్తూ పోవడం వల్ల మరింత జటిలం కావడం మినహా మరే  ప్రయోజనం వుండదని అందరూ అర్ధం చేసుకునే రోజులు దగ్గరపడ్డాయి. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయాలన్న అభిలాష ఆ ప్రాంతపు ప్రజల్లో నాలుగు దశాబ్దాలకుపైగా వేళ్ళూనుకుని  పాతుకుపోయివున్న ప్రగాఢ  కోరిక. అప్పటినుంచి ఇప్పటివరకు వారి  ఆకాంక్షలో ఎటువంటి మార్పు వచ్చివుండక పోవచ్చు. కానీ, పరిణామక్రమంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న నూతన ఆర్ధిక సంస్కరణల పవనాల ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై  కూడా పడడంలో ఆశ్చర్యం లేదు. ప్రాంతాలను దాటుకుని పెట్టుబడులు ప్రవహించాయి. సంస్కరణల వల్ల సంస్కృతి బీటలు వారింది. సంపాదనే లక్ష్యంగా మారి విలువలు వెనక్కు పోయాయి. మానవ సంబంధాలు మరుగున పడి ఆర్ధిక సంబంధాలు యాంత్రిక జీవన రంగ స్తల  యవనిక పైకి వచ్చాయి. మూడు దశాబ్దాల క్రితం ఉద్యమాలు చెలరేగినప్పుడు - చదువుల విలువ తెలిసిన వారు అప్పట్లో ఉన్నతవర్గాల్లో మాత్రమే వుండేవారు. ఇప్పుడా పరిస్తితి పూర్తిగా మారి బడుగు బలహీన వర్గాలు  సైతం విద్యవల్ల లభించే సాంఘిక గౌరవంలోని రుచిని ఆస్వాదించడం మొదలయింది.
విద్యకు తగిన ఉద్యోగాలు, ఉద్యోగాలకు తగిన ఆర్జన ఇవన్నీ గౌరవప్రదమయిన జీవితాలకు పునాదులు వేయడంతో సమాజ స్వరూప స్వభావాల్లోనే సమూల మార్పులకు  బీజాలు పడ్డాయి. పిల్లలను పెద్ద చదువులు చదివించాలన్న తపన  తలితండ్రుల్లో పెరిగిపోయింది. బీదా గొప్పా తారతమ్యం లేకుండా  వానయినా వంగడయినా పిల్లలను క్రమం తప్పకుండా బడులకు పంపడం అలవాటుగా మారిపోయింది. నలభయ్ ఏళ్ళ క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ చెలరేగిన ఉద్యమంలో చాలాకాలం విద్యాసంస్తలు పనిచేయలేదు. కలిగిన వాళ్లు బయటి ప్రదేశాలకు పిల్లలను పంపి చదివించుకున్నారు. లేనివాళ్ళు బడులు నడవకపోవడమే  అవకాశంగా తీసుకుని తమ  పిల్లలను కూలీ పనుల్లో పెట్టి వారి చదువుకు స్వస్తి చెప్పారు. ఇందుకు వారిని  తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటె వారి ఆర్ధిక నేపధ్యం అలాటిది మరి.
మరి ఇప్పుడో. ఒక్క పూట కూడా  బడికి  ఎగనామం పెట్టే వీలు లేదు. పరీక్షల సీజను మొదలయిందంటే చాలు తలితండ్రులే  ఆఫీసులకు సెలవు పెట్టి తమ పిల్లలను చదివిస్తున్న రోజులివి. పెళ్ళిళ్ళు పేరంటాల జోలికి పోకుండా పిల్లల చదువులకే పెద్దపీట వేసే తలితండ్రులే ఈనాడు  లెక్కకు మిక్కిలి కానవస్తారు. అలాగే, ప్రయివేటు ఉద్యోగులు.  వాళ్లు ఆఫీసులకు రావడం  ఒక్క నిమిషం ఆలశ్యం అయినా అందువల్ల వాటిల్లే నష్టాన్ని రూపాయల్లో లెక్కలు వేసుకుని, వారిని  తమ వాహనాల్లో ఇళ్లనుంచి సకాలంలో  ఆఫీసులకు  తరలించే కొత్త యాజమాన్య వర్గాలు తయారయ్యాయి. ఉరుకులు పరుగులతో జీవితాలు పరుగులు తీస్తున్నాయి. వేగమయ జీవితాలతో కాలంతో పరిగెత్తే కొత్త సమాజం ఆవిష్కృత మవుతోంది.
ఈ వాస్తవాలను ఉదహరిస్తున్నది ఉద్యమకారుల ఉద్దేశ్యాలను  శంకించడానికో, ప్రజాస్వామ్య హక్కులను హేళన చేయడానికో కాదు. మారిన  పరిస్తితులకు అనుగుణంగా జీవన శైలిని మార్చుకోవడం అన్నది అనాదిగా వస్తోంది. స్వాతంత్రోద్యమ సమయంలో అనుసరించిన పద్దతులు  ఆనాటి స్తితిగతులకు తగినట్టుగా వుండవచ్చు. ఈ నాటి పరిస్థితులు, అవసరాలకు తగినట్టుగా ఆందోళనల స్వరూపాలు మారితీరాలనే  వాదన సర్వత్రా ప్రబలుతోంది. ఈ  వాస్తవాన్ని గమనించి నడుచుకుంటే ప్రజల మన్నన, మద్దతు మరింత ఎక్కువగా లభిస్తాయి.
తెలంగాణా రావాలని మనసా వాచా కర్మణా కోరుకునే వాళ్లు ఎందరో వున్నారు. కానీ వారిలో చాలా మందికి  నోరూ వాయీ లేదు. తెలంగాణా కోసం పార్టీలు , సంఘాలు పెట్టి పోరాడుతున్న వారూ వున్నారు. మీడియా ద్వారా మాట్లాడే అవకాశం వీరికున్నట్టుగా నోరు లేని మూగ జీవులకు  లేదు. ఆయా పార్టీలు, సంఘాలు చేసే ప్రతిదానినీ సమర్ధించని వారిని తెలంగాణా వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరికాదు. చిన్న విషయాన్ని కూడా గోరంతను కొండంత చేసి యాగీ చెయ్యడం సభ్యత అనిపించుకోదు. తెలంగాణాను ఎవరు యెంత గట్టిగా కోరుకుంటున్నారో వద్దని అనుకునేవారు కూడా అంత గట్టిగానే కోరుకుంటూ వుండవచ్చు.  అది వారికున్న ప్రజాస్వామిక హక్కు. లక్ష్య శుద్ధి వున్నంతకాలం ఫలితంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీరిని వారూ వారిని వీరూ ఆడిపోసుకుంటూ మీడియాలో మాటల యుద్ధాలు చేసుకుంటూ పోవడం వల్ల ఉద్యమ స్పూర్తి పలచబడే అవకాశం వుంటుంది. గమ్యం చేరుకునే  క్రమంలో ఎవరో అడ్డం పడుతున్నారని అనుకుంటే మాత్రం పోరాడేవారిలోనే  పోరాటపటిమ కొరవడుతోందనే అపోహలకు ఆస్కారం కలుగుతుంది. 
వెనకటికి ఇంట్లో అమ్ముమ్మలు పిల్లలకు చెప్పే కధల్లో ఓ ముసలమ్మ బావి గట్టుమీద కూర్చుని సూదిలో దారం ఎక్కిస్తుంటే సూది బావిలో పడిపోతుంది. కొడుతూ కధ వింటున్న పిల్లలు అంటారు. బావిలో పడ్డ సూది  అంటే వస్తుందా అని కధ చెప్పే అమ్ముమ్మ ప్రశ్న వేస్తుంది.  అది అర్ధం కాని పిల్లలు ఆ!అంటారు. ఆ!అంటే వస్తుందా అని మరో ప్రశ్న. ఆ కధ ఎప్పటికీ పూర్తవదు, ఈ లోగా కధ వినే పిల్లలు ఎంచక్కా నిద్రలోకి జారుకుంటారు. (12-11-2012)