30, జూన్ 2013, ఆదివారం

జనహితమే సర్వజన సమ్మతం - భండారు శ్రీనివాసరావు(గమనిక ఇది 2008 మే నెలలో రాసిన వ్యాసం) 


రాష్ట్ర విభజనని ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటే ఏ రాజకీయ శక్తీ దాన్ని ఆడ్డుకోలేదు. ఈ ఆకాంక్ష జనానిదయితే మన్నించాల్సిందే. రాజకీయమైనదయితే ఆలోచించాల్సిందే'. ఇటీవలికాలంలో - దాదాపు అన్ని పార్టీలు - ఏదో ఒక రూపంలో - ఏదో ఒక స్థాయిలో తెలంగాణా సెంటిమేంట్‌ని కొద్దో గొప్పో పులుముకోవాలని ప్రయత్నిస్తూనే  ఉన్నాయి. ఒక్క సీపీఎం ను మినహాయిస్తే,  ఒకప్పుడు ససేమిరా అన్న పార్టీలు కూడా ఇప్పుడు సరే అంటున్నాయి.  ఈ పార్టీల్లోని కొందరు పెద్దలకి ఇది తక్షణ రాజకీయ అవసరం.  అదే ఇందులోని విషాదం.
దేశం స్వాతంత్ర్యం పొందిన దరిమిలా - అనేక కొత్త రాష్ట్రాలు పురుడు పోసుకున్నాయి. పొరుగున ఉన్న అనాటి మద్రాసు(తమిళనాడు) రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం - తరువాత కొద్ది కాలానికే - భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్దాంత ప్రాతిపదిక పై - తెలంగాణా ప్రాంతాన్ని(హైదరాబాదు స్టేట్ లోని ప్రధాన భాగాలు) కలుపుకుని - ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించింది. ఒకే భాష మాట్లాడే వారికి కూడా, విడివిడిగా రాస్ట్రాలు వున్నప్పుడు - ఆంధ్ర ప్రదేశ్ ని కూడా ప్రజాభిష్టం మేరకు విభజించడంలో తప్పేమి లేదు. అయితే తప్పల్లా - ప్రజల ఆకాంక్షని అంచనా వేయడంలో చేస్తున్న తప్పులే. రాష్ట్ర విభజన అన్నది ఎవరో కొందరి రాజకీయావసరాల కోసం కాకుండా మెజారిటీ ప్రజల అబీష్టం మేరకు జరగాలి.

ఏ వేర్పాటు ఉద్యమానికయినా, వెనుకబడినతనమే ప్రాతిపదిక. దీని ఆధారంగా పెచ్చరిల్లే భావోద్వేగాలే విభజన ఉద్యమాలకు ఊపిరిపోస్తాయి. ఈ విధంగా ప్రజ్వరిల్లే శక్తిని అడ్డుకోవడం అతికష్టం అని గతంలో తెలంగాణా ప్రజా సమితి నిరూపించింది కూడా. అయితే, అప్పటికి అంటే 1969 నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఇసుమంత కూడా మార్పు రాలేదంటే నమ్మడం కష్టం. తెలంగాణాలో ఇంకా కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదంటే నమ్మచ్చుకాని తెలంగాణాలో అసలు అభివృద్ధి  జరగలేదని వాదించడం కేవలం రాజకీయమే అవుతుంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. 1969 నాటికి వూహకు సయితం అందని ఉదార ఆర్ధిక విధానాలు ఈనాడు శరవేగంగా అమలవుతున్నాయి. ప్రపంచీకరణ సిద్దాంతం నేల నాలుగు చెరగులా బలంగా వేళ్ళూనుకుంటున్న నేపధ్యంలో - అసలు దేశాల  మధ్యనే హద్దులు చెరిగిపోతున్నాయి. 

పొట్ట గడవక కొందరూ - డాలర్ల వేటలో మరికొందరూ - ఉపాథి కోసం ఇంకొందరూ ఉన్నవూరు, కన్న దేశం  వదిలిపెట్టి వెళ్ళడం అన్నది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావడంలేదు. అవకాశాలు వెతుక్కుంటూ అన్ని ప్రాంతాలవారు అన్ని చోట్లకీ వలస వెడుతున్నారు.
ఏదో ఒకనాడు - తెలుగువాడే అమెరికాకి అధ్యక్షుడు కాగలడని ఆ దేశంలో ఉంటున్న తెలుగువారే భరోసాగా చెబుతున్నారంటే ఇక భౌగోళిక రేఖలకి, దేశాల సరిహద్దులకీ - అర్థమేముంటుంది? పోతే - ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని - భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఏపాటి మిగులుతాయో అర్ధం చేసుకోలేని విషయమేమి కాదు. 
ఆ మాటకి వస్తే - దేశాలయినా, రాష్ట్రాలైనా, ప్రజలైనా విడిపోవడం - కలిసిపోవడం పెద్ద విషయమేమి కాదు. విభజన కుడ్యాన్ని కూలగొట్టుకుని - రెండు జర్మనీలు కలిసిపోయాయి. అమెరికాని సయితం శాసించగలిగిన స్థాయికి ఎదిగిన సోవియెట్ యూనియన్ - అంగ, వంగ, కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమయింది. 

కాబట్టి - చరిత్ర నుంచి నేర్చుకున్నవారు - చరిత్ర హీనులు కాలేరు. మనసులూ - మనుషులూ కలుషితం కావడం ఏ సమాజానికి క్షేమకరం కాదు. విడీపోయినా చేతులు కలిసే వుండాలి. మనసులు మసి బారకుండా ఉండాలి .
సర్వేజనాః సుఖినోభవంతు! 
(మే - 2008 )

2 వ్యాఖ్యలు:

Saahitya Abhimaani చెప్పారు...

"...ఏదో ఒకనాడు - తెలుగువాడే అమెరికాకి అధ్యక్షుడు కాగలడని..."

అమెరికా ఏమన్నా భారత దేశమా ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళను అక్కడ రాష్ట్రపతి చేశేయ్యటానికి!! అమెరికాలో పుట్టి పెరిగిన వ్యక్తి మాత్రమే రాష్ట్రపతి పదవికి అర్హుడు. లేదంటే హెన్రి కిస్సింజర్ అవ్వలేకపొయ్యాడా పాపం! అయితే గియితే భారత/తెలుగు సంతతి చెందిన(మూడో నాలుగో తరమో) వారెవ్వరైనా అయ్యే అవకాశం ఉన్నది. అలా మూడో నాలుగో తరం వాళ్ళు అయ్యి ఉండి, వారి పూర్వులు తెలుగు వాళ్ళయినా వారు ఎంతటి భారతీయులుగా/తెలుగువారిగా ఉంటారో ఊహించటం పెద్ద కష్టమెమీ కాదు. మన భాష కూడా రాదు. మనం పేపర్లల్లో పెద్ద హెడ్డింగులు పెట్టుకుని మురిసిపోవటానికి తప్ప మరెందుకూ పనికి రాదు.

అజ్ఞాత చెప్పారు...

obama's father is kenyan. Every african is saying they have blood connection with Obama.

Onething is correct from ur view.
Okavela telugu vadu ayite giyite. adi paper lo murisi poadaniki tappa yenduku paniki raadu.