16, జూన్ 2013, ఆదివారం

Today Fathers’Day వన్ బై టు కాఫీ


నలభై ఏళ్ళ కిందటి మాట.

ఆ రోజుల్లో విజయవాడ గాంధీ నగరంలోని వెల్ కం హోటలుకు కాఫీ తాగడానికి ఓ రోజు వెళ్లాను. నా పక్క టేబుల్ దగ్గర కూర్చున్న ఓ పెద్ద మనిషి ప్రవర్తన నన్ను ఆకర్షించింది. సర్వర్ ను పిలిచి వన్ బై టు కాఫీ తెమ్మన్నాడు. ఆయన వెంట మరెవరయినా వున్నారా అని చూసాను. ఎవరూ లేరు. ఆయన ఒక్కడే రెండు కప్పుల్లో తెచ్చిన ఒక్క కాఫీని కాసేపు అటూ ఇటూ మార్చుకుంటూ తాగి వెళ్ళిపోయాడు.

మరో సారి కూడా ఆ హోటల్లో అదే పెద్దమనిషి తారస పడ్డాడు. మళ్ళీ అదే సీను. ఒక్కడే మనిషి. వన్ బై టు కాఫీ. ఇక మనసు ఉగ్గపట్టుకోలేకపోయాను. కలిసి కదిలిస్తే కదిలిన కధ ఇది.

ఆయనో ఎలిమెంటరీ స్కూలు మాస్టారు. ఒక్కడే కొడుకు. లక్ష్మీ కటాక్షం లేకపోయినా సరస్వతీ దేవి కరుణ అపారం. క్లాసులో ఫస్ట్. స్కూల్లో ఫస్ట్. హోల్ మొత్తం ఆ ఏరియాలోనే చదువులో ఫస్ట్. ఇరుగు పొరుగు పిల్లాడిని మెచ్చుకుంటూ మాట్లాడే మాటలే వాళ్లకు కొండంత బలం ఇచ్చేవి.పిల్లాడంటే మీ వాడు మాస్టారు. మా పిల్లలూ వున్నారు ఎందుకు తిండి దండగఅంటుంటే ఆ తలిదండ్రులు మురిసి ముక్కచెక్కలయ్యేవారు.

కొడుకు చదువుపై మాస్టారికి కాణీ ఖర్చు లేదు. అంతా స్కాలర్ షిప్పుల మీదనే నడిచిపోయింది. అతగాడు కూడా - చిన్న చదువులప్పుడు మాత్రమే కనిపెంచిన వారితో కలసి వున్నాడు. ఆ తరువాత పొరుగూర్లలోని పెద్ద కాలేజీల్లో పెద్ద చదువులు చదివాడు. కొన్నాళ్ళకు అవీ అయిపోయాయి. పై చదువులు చదవడానికి ఈ చిన్న దేశం సరిపోలేదు. అమెరికా వెళ్లాడు. అక్కడా చదువులో మెరిక అనిపించుకున్నాడు. ఆ చదువులకు తగ్గ పెద్ద ఉద్యోగం అక్కడే దొరికింది. కానీ, ఇండియాకు వచ్చి తలిదండ్రులను చూసే తీరిక దొరకలేదు. అది దొరికే లోపలే అక్కడే ఓ దొరసానిని పెళ్ళిచేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ల ఫోటోలు చూపిస్తూ మా మనవళ్ళుఅని వూళ్ళో వాళ్లకు చెప్పుకుని మురవడమే ఆ ముసలి తలిదండ్రులకు మిగిలింది. డబ్బుకు కొదవలేదు. అమెరికా నుంచి వచ్చిన డాలర్లు ఇండియా బ్యాంకులో రూపాయల పిల్లలు పెడుతున్నాయి. కానీ ఒక్కగానొక్క పిల్లాడు కళ్ళెదుట లేకుండా, ఎక్కడో దూరంగా వుంటూ పంపే ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియని పరిస్తితి. ఇది వాళ్లకు కొత్తేమీ కాదు. చిన్నప్పటినుంచి చదువుల పేరుతొ పరాయి చోట్లనే పెరిగాడు. పట్టుమని పది రోజులు కలసివున్నది లేదు.

ఇంకా వస్తారు వస్తారుఅనుకుంటూ వుండగానే, పిల్లాడిని, వాడి పిల్లల్ని కళ్ళారా చూడకుండానే ఆ కన్న తల్లి కన్ను మూసింది.

కబురు తెలిసి పెళ్ళాం పిల్లల్ని తీసుకుని అమెరికానుంచి ఆర్చుకుని, తీర్చుకుని వచ్చేసరికే కర్మకాండ అంతా ముగిసిపోయింది.

వచ్చిన వాళ్లకు ఇంట్లో సౌకర్యంగా వుండదని వున్న నాలుగు రోజులు పెద్ద హోటల్లో గదులు అద్దెకు తీసుకుని వున్నారు. మనుమళ్లని దగ్గరకు తీసుకోవాలని వున్నా ఏదో జంకు. తిస్ యువర్ గ్రాండ్ పాఅని తండ్రి పరిచయం చేస్తే య్యా! హౌ డూఅని పలకరించారు. వాళ్లు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే జవాబు చెప్పలేని అశక్తత. రెండో తరగతి టిక్కెట్టు కొనుక్కుని ఫస్ట్ క్లాసులో ప్రయాణిస్తున్న అనుభూతి.

అమెరికా తమతో రమ్మన్నారు. తాను రానన్నాడు. భార్య కలిసిన మట్టిలోనే కలసిపోవాలన్నది తన కోరిక.

వొంటరి జీవితంతో వొంటరి పోరాటం మళ్ళీ మొదలు.

కానీ, ఈసారి మొదలుపెట్టే జీవన యానంలో తాను వొంటరి కాదు. తనతో పాటు మరొకరు వున్నారు. ఆ వ్యక్తి మరో లోకానికి వెళ్ళిన భార్యా? మరో దేశానికి వెళ్ళిన కొడుకా? యేమో.


అందుకే ఈ వన్ బై టు కాఫీముగించాడు ముసలాయన.

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

మీ బ్లాగ్ను బ్లాగ్ వరల్డ్ కి అనుసంధానం చేయడం జరిగింది.బ్లాగ్ వరల్డ్ ను ఫాలో అవుతూ ఉండండి.మరిన్ని ఉపయోగాలు మీకు తెలుస్తాయి.ప్రతి సంవత్సరము బెస్ట్ బ్లాగ్ వరల్డ్ అవార్డ్ కూడా పెట్టి తెలుగు బ్లాగులను ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తున్నాము.వివరాలు త్వరలో....వీలును బట్టి మీ బ్లాగ్ను సంబంధిత శీర్షికకు చేరుస్తాము. http://blogworld-ac.blogspot.in/