బెయిల్ మీద ఒక రోజు
2021 . కరోనా కాస్త
తగ్గుముఖం పడుతున్న రోజులు. రెండో వేవ్ సృష్టించిన భయానక పరిస్థితులు
కొద్దికొద్దిగా సాధారణ స్థితికి చేరుకుంటున్న కాలం. పగటి వేళ లాక్ డౌన్
ఎత్తివేశారు.
చాలా ఏళ్ళుగా ఉంటున్న ఇల్లే. అలవాటయిన ఇల్లే.
కానీ ఒక ఏడాదిగా ఎటూ కదలకుండా ఇంటిపట్టునే
ఉంటున్నాం. సమస్త మానవ జాతిని కదలకుండా కట్టిపడేసిన, ప్రపంచ
వ్యాప్తంగా పౌర జీవనాన్ని స్తంభింపజేసిన ఏకైన సందర్భం అదొక్కటే, కరోనా
కాలం.
చూసి, చూసి, ‘ఎక్కడికి బయటకి పోకుండా ఇంట్లోనే వుండి, వుండి బోర్ కొట్టడం లేదా’ అని మా
అబ్బాయి సంతోష్
అడిగాడు.
మళ్ళీ వాడే అన్నాడు, ‘రేపు
శనివారం ఊరి బయట మా ఫ్రెండ్ వాళ్ళ ఫార్మ్ హౌస్ కి వెళ్లి మళ్ళీ
ఆదివారం ఉదయానికి వచ్చేద్దాము’ అని.
‘రిస్కేమో!’ అనబోయి మానేసి ‘సరే’ అన్నాను.
ఈ కాలపు పిల్లలకు నచ్చని ఒకే మాట ‘రిస్కేమో’
అనేది. నేనూ నా కాలంలో రిస్క్ అంటే ఏమాత్రం భయం భక్తీ లేని వాడినే. ఇక పిల్లలకు ఏం
చెబుతాను.
అనుకున్నట్టే, మే ఇరవై తొమ్మిదో తేదీ శనివారం ఉదయం ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేసి లాక్ డౌన్
ముగిసే సమయానికల్లా అక్కడికి చేరుకున్నాము. గేటు బయట ఓ పాత సీలింగ్ ఫ్యాన్ విరిగిన
రెక్కమీద వింటేజ్ వనం అని ఇంగ్లీష్, తెలుగు అక్షరాల్లో రాసి గోడకు కొట్టి వుంది.
విలేకరి చూపు కదా ఏమిటో మాసిపోయినట్టు, చాలా పాతదిగా కనిపించింది ఆ బోర్డు.
పరికించి చూస్తే అది ఓ సీలింగు ఫ్యాన్ రెక్క. (1960 ల నాటి ఓ పాత సీలింగ్ ఫ్యాన్ విరిగిన
రెక్క అదని తరువాత తెలిసింది) ఇలాంటి ప్రదేశంలో
ఒక పగలూ, ఓ
రాత్రీ గడపడం ఎల్లా అనే అనుమానం మనసు మూలల్లో తొంగి చూసిన మాట వాస్తవం. కానీ పైకి
అనలేదు. ఆ గేటు దగ్గర కాపలావాడు, మావాడు తన ఫ్రెండ్ పేరు అనిరుద్ అని చెప్పగానే
గేటు బార్లా తెరిచి పొమ్మన్నాడు. బాటకు రెండు వైపులా వ్యవసాయ క్షేత్రాలు. పెద్ద
పెద్ద చెట్లు. కొంత దూరం పోయిన తర్వాత మరో గేటు. అక్కడ ఎప్పుడో మాంధాతల కాలంనాటి, శిధిలావస్థలోవున్న పాత
కారు. వెనక పెళ్లి ఊరేగింపుల్లో కనబడేవి ఈ ఓపెన్ టాప్ ప్లిమత్ కార్లు.
ఇచ్చిన రెండు కాటేజీలు బాగున్నాయి. అక్కడ పనిచేసే
ఆశారాం వచ్చి తాళం తీశాడు. శుద్ధ హిందీ మనిషి.
ఆ కాటేజీ యావత్తు చెక్కతో చేసినట్టు పైకి
కనబడింది. ముందు చిన్న
వసారా నాలుగు
కుర్చీలు, ఓ మేజా
బల్ల. తలుపు తెరిస్తే, ఉడెన్
ఫ్లోర్, ఒకటే
డబల్ కాట్ బెడ్ రూమ్, ఓ వ్రాత బల్ల, రెండు
కుర్చీలు. స్ప్లిట్ ఏసీ, అటాచ్డ్
బాత్ రూమ్. మెయింటెనెన్స్ బాగుంది. లోలోపల ఉడుక్కుంటున్న ఆత్మారాముడు ఆ ఏర్పాట్లు
చూసి చల్లబడ్డాడు. మా కోడలు నిషా వచ్చి,
ముందు ఆ పరుపు మీద వేసి వున్న చద్దరు తీసేసి ఇంటి నుంచి తెచ్చిన బెడ్ షీట్
వేసింది. అలాగే దిండ్లు కూడా. గది, బాత్ రూమ్ సానిటైజ్ చేశారు.
కాసేపు విశ్రాంతి తీసుకుని బయటకు వచ్చాము. కారులో
వస్తున్నప్పుడు పూర్తిగా కనబడలేదు. చుట్టూ పచ్చటి చెట్లు, పచ్చిక
బయళ్ళు.
ఒక చోట ఓ పాత కాలపు సింహ ద్వారం. దానికి
ఇరువైపులా ‘అనగనగా’ అని తెలుగులో, ఇంగ్లీష్ లో రాసిన బోర్డులు వున్నాయి.
చిన్నప్పుడు కధలన్నీ అనగనగా అనే వాక్యంతో, ఇంగ్లీష్ లో Once upon a time అని మొదలు పెట్టే వాళ్లు. గడప దాటి
లోపలకు వెడితే, అదేదో
ఇంగ్లీష్ సినిమా Back to
the future మాదిరిగా మళ్ళీ నా చిన్నప్పటి రోజులకు
వెళ్లినట్టు ఎక్కడ చూసినా పాత సామగ్రి. బాయిలర్లు, జాడీలు, ఇత్తడి
గుండీలు, పాత
కాలపు మేనాలు, గుర్రపు
బగ్గీలు, ఈ
కాలపు తరానికి ఆ మాటకు వస్తే నాకే తెలియని అనేక పాత కాలపు వస్తువులు. లాంతర్లు, చిమ్నీలు, రేడియోలు, టేప్
రికార్డర్లు, చేటలు, విసన
కర్రలు, కెమెరాలు, ఎప్పుడో
అరవై ఏళ్లనాటి బాంబే
హల్వా స్వీట్ డబ్బాలు, బీహైవ్
బ్రాండీ ట్రేలు, సన్
లైట్ సోప్ కేలండర్లు, పిఠాపురం
రాణి వాసం వారు వాడిన టేకు మేనా, చాలా పాత కాలం నాటి ఇంగ్లీష్ పుస్తకాలతో నింపిన
బీరువాలు ఇలా అనేక వస్తువులు.
చిత్రలేఖనం, సంగీతం మీద ఆసక్తి కలిగిన వారు ప్రశాంతంగా తమ
కళలకు మెరుగు పెట్టుకోవడానికి ఏర్పాట్లు.
ఇవన్నీ చూసిన తర్వాత పర్వాలేదు, రిస్క్
తీసుకుని అయినా మంచి చోటుకే వచ్చాను అనిపించింది.
అందరం కలిసి ఫాం హౌస్ యజమాని అనిరుద్ ని కలిశాము.
మా అబ్బాయి ఈడువాడే.
పరిచయం చేయగానే ‘నా పేరు అనిరుద్ విజయ కుమార్’ అన్నాడు,
బాండ్! జేమ్స్ బాండ్ లాగా.
తండ్రి పేరు అసలు పేరుకు తగిలించుకునే సాంప్రదాయం
కొన్ని ప్రాంతాలలో వుంది. తమిళనాడు దీనికి మంచి ఉదాహరణ. కానీ ఈ అనిరుద్ పదహారు
అణాల తెలుగువాడు. ‘నాకు నా తండ్రి అంటే గౌరవం. పలానా వారి అబ్బాయిని అని
చెప్పుకోవడం నాకు ఇష్టం” అంటాడు అనిరుద్.
మిలిటరీ వారసత్వం. రూపంలో ఆ గంభీరత కనబడుతుంది.
‘నేను
నాలా జీవిస్తాను, ఒకరిలా, లేదా
మరొకరికి ఇష్టం అయ్యే రీతిలో జీవించడం నాకు అస్సలు ఇష్టం వుండదు అనేది అనిరుద్
ఫిలాసఫీ. అప్పటికి నేను జెన్ జెడ్ అనే మాటే వినలేదు. ఇప్పుడు ఆలోచిస్తే, అతడు
ఇప్పుడు చెప్పుకుంటున్న ఆ నవ తరానికి చెందిన వాడన్నమాట.
నవ తరమే కానీ, పాత వస్తువులు ఇష్టం. పాత సామాగ్రి ఇష్టం. పాత
సినిమాలు ఇష్టం. పాత పాటలు ఇష్టం. ఇలా పాతలో కొత్తని వెతుక్కోవడం ఇష్టం. ఆ
వెతుకులాటలో బోలెడు పాత వస్తువులు పోగేసాడు. ఒకటి కాదు, రెండు
కాదు, ఆయన
వింటేజ్ వనం అని పేరు పెట్టుకున్న తన ఫాం హౌస్ లో ఎక్కడ చూసినా ఇవే. ఒక ఊరు కాదు, ఒక
రాష్ట్రం కాదు, ఒక
దేశం కాదు పాత
వస్తువు దొరుకుతుందని తెలిస్తే చాలు అక్కడ వాలిపోయి దానిని దొరికించుకునే దాకా
నిద్రపట్టదు.
హైదరాబాదు పొలిమేరల్లో చిలుకూరు బాలాజీ
దేవాలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ వింటేజ్ వనం వుంది. ఒకటిన్నర ఎకరాల
విస్తీర్ణంలో విస్తరించి వుంది.
“ There are
no strangers here, only friends you have not met” అని
రాసి వుంటుంది.
అలాగే అక్కడ ఇంతకు ముందు
పరిచయం లేని ఇద్దరు కళాకారులు కనిపించారు. ఎన్నాళ్ళ బట్టో నాకు స్నేహితులు
అన్నంతగా వాళ్ళు చాలా కలుపుగోలుగా మాతో కలిసిపోయారు.
ఒకరు Aqeel. ప్రసిద్ధ తెలంగాణా చిత్రకారుడు అజీజ్
గారి కుమారుడు. ఆయన దగ్గర చిత్రకళ అభ్యసిస్తున్న దివ్య అనే అమ్మాయి. మరొకరు
కన్నన్. వంటల్లో ప్రవీణుడు.
అక్కడ క్యాంటీన్ వంటివి లేవు. ఎవరికి వాళ్ళే
వాళ్లకి కావాల్సినవి వండుకుని తింటారు. వాళ్ళ ప్రాధాన్యత వేరే. అడవిలా ప్రశాంతంగా
వున్న ఆ ప్రదేశంలో చిత్రాలు గీసుకుంటూ, కవిత్వాలు రాసుకుంటూ, పాటలు పాడుకుంటూ సమయాన్ని గడిపేస్తారు. అక్కడ ఉండగానే వాళ్ళు ఒక
గోడ చిత్రం మొదలు పెట్టారు. ఎర్రటి ఎండలో నిలబడి దాదాపు నాలుగు గంటలు కష్టపడ్డారు.
ముందు ఓ కోడి పుంజు బొమ్మ గీస్తున్నారేమో అనిపించింది అవుట్ లైన్ చూసినప్పుడు.
పూర్తయిన తర్వాత చూస్తే అది ఓ అమ్మాయి చిత్రం.
చుట్టూ చెట్లు, మధ్యలో ఆధునిక వసతులు వున్న అతిథి
గృహాలు. అవి కూడా ప్రి ఫాబ్రికేటెడ్.
శని ఆదివారాలు అక్కడే గడిపి, హాయిగా
గుండెల నిండుగా ఆక్సిజన్ దట్టించుకుని మళ్ళీ ఇంటికి చేరాము.
ఇప్పుడు నిరుద్ అనిరుద్ వున్నాడు, అతడి
ఫాం హౌస్ వుంది, ఆ
జ్ఞాపకాలు వున్నాయి. అక్కడికి తీసుకు వెళ్ళిన
మా అబ్బాయి సంతోష్ లేడు.
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి