28, జూన్ 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (334) : భండారు శ్రీనివాసరావు


పీవీ గారి రెండు కోర్కెలు
మరణించడానికి కొన్ని నెలల ముందు, శ్రీ పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో ఒక విలేకరిగా నాకు తెలుసు. ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు, ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు గారు, గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత, రాజ్ భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భద్రతాదికారిని అడిగాము. అతడు తాపీగా 'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.
పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్ మాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ, 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయ్యా !' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది.
ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం.
ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల, కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము.
అంతకుముందు పీవీ గారిని మరోసారి ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో వున్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే, 'పీవీ గారిని కలవడానికి వీలుంటుందా' అని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు.
'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా.
'మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు, నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.
పీవీ గారు మాజీ ప్రధానమంత్రిగా పాల్గొన్న ఒక సదస్సు హైదరాబాదులోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగింది.
మధ్యాన్నం భోజన విరామ సమయంలో విలేకరులు ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. ఆలిండియా రేడియో ప్రాంతీయ విభాగంలో పనిచేసే ఆర్వీవీ కృష్ణారావు గారు నేనూ కాస్త వెనగ్గా నిలబడివున్నాం.
చివరికి ఆయనే మమ్మల్ని దగ్గరకు పిలిచారు.
‘ఏమయ్యా కృష్ణారావూ. ఢిల్లీలో పద్మనాభరావుకి కూడా చెప్పాను. ఏవయ్యా నా టేపులు?”
పీవీ గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తెలుగులో అనేక రేడియో ప్రసంగాలు చేశారు. వాటిని గురించి చేసిన వాకబు ఇది.
కృష్ణారావు గారు ఏదో చెప్పారు.
ఆయన నా వైపు తిరిగారు.
‘మీ అన్నయ్య (కీర్తిశేషులు పర్వతాలరావు గారు) పుట్టపర్తిలో ఉంటున్నాడట కదా! ఏం చేస్తున్నాడు?”
‘నరసింహావతారం గురించి పుస్తకాలు రాస్తున్నాడు’
‘అలా అయితే నేనడిగానని చెప్పు. మనిషి శారీరకంగా సింహం కంటే బలహీనుడు. ఆ అవతారంలో సింహం తలా, మనిషి శరీరం ఏమిటో రాయమని చెప్పు’
నమస్కారం పెట్టి మేము వచ్చేశాము.
పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో ఓ ఏడాది ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు గారిని పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించాలని అనుకున్నారు. ప్రధానే స్వయంగా నిర్ణయిస్తే అడ్డేముంటుంది? కానీ ఆ ఆటంకం ఏమిటో పీవీ గారికే బాగా తెలుసు. తీరా ప్రకటించిన తర్వాత కాళన్న కాదంటే.
వరంగల్ జిల్లా ఎస్పీకి వర్తమానం వెళ్ళింది. వాళ్ళు విచారిస్తే కాళోజీ ఆ సమయానికి కమ్యూనికేషన్ సౌకర్యం లేని వూళ్ళో తిరుగుతున్నారు. ఓ పోలీసు అధికారి వెళ్లి ఆయన్ని పోలీసు స్టేషన్ కు రమ్మన్నారు.
కాళోజీకి పోలీసులు, పోలీసు పిలుపులు కొత్తేమీ కాదు. పదమంటూ పోలీసు వెంట బయలుదేరి వెళ్ళారు.
‘వచ్చారా! పీఎం గారు మీతో మాట్లాడతారట వుండండి’ అంటూ ఢిల్లీకి ఫోన్ లైన్ కలిపారు. పీవీ లైన్లోకి వచ్చారు. కాళోజీ గారితో కాసేపు పిచ్చాపాటీ మాట్లాడారు.
చివర్లో పీవీ ఇలా అన్నారు.
“కాళన్నా! నేనొకటి అడుగుతాను, నువ్వు కాదనుకుండా ఒప్పుకోవాలి”
‘అదేమిటో చెప్పు’ అన్నారు కాళోజీ.
‘అందుకే ముందే మాట ఇమ్మంటున్నాను. నువ్వు ఒప్పుకోవాలి అంతే!’ అన్నారు పీవీ.
‘...........’
‘నీకు ఈసారి పద్మ విభూషణ్ ఇవ్వాలని నా కోరిక. నువ్వు కాదు అనరాదు’ అన్నారు పీవీ.
‘..........’
‘కాళన్నా! నువ్వు సమ్మతి సమ్మతి సమ్మతి అని మూడు సార్లు చెబితేనే కానీ నేను ఒప్పుకోను’
‘అయితే. నేను చెప్పేది కూడా విను. నాకేదో బిరుదు ఇచ్చారని సర్కారుపై నా విమర్శలు ఆపేది లేదు. ఇది గుర్తుంచుకో’ అన్నారు కాళోజి విస్పష్టంగా.
తర్వాత ఎప్పుడో హైదరాబాదులో జరిగిన కాళోజి సత్కారసభకు నేనూ, జ్వాలా వెళ్ళాము. ఆ సభలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ పీవీ నరసింహారావు ఈ విషయాలు స్వయంగా గుర్తు చేసుకున్నారు.

https://epaper.sakshi.com/article/Hyderabad_Main?OrgId=286891f7fa8&eid=123&imageview=1&standalone=1&device=desktop&fbclid=IwY2xjawStpmRleHRuA2FlbQIxMQBzcnRjBmFwcF9pZBAyMjIwMzkxNzg4MjAwODkyAAEeuKtCPCPIE7_QoD5_cZPZPFFJqCxujdXlSDx0c5qXgmXtSXmR632vWfPmUK8_aem_uqdquF0r9hzTLwLy3E0LPw

(జూన్, 28, పీవీ గారి జయంతి సందర్బంగా ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రచురితం)
(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: