“మీ ఇంటికి ఎలా రావాలి”
నిన్న ఉదయం తొమ్మిది గంటల నుంచీ ఎదురు చూస్తున్న కాల్ మధ్యాన్నం పన్నెండు గంటలకు వచ్చింది.
“మీరు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర వున్నాను అని చెప్పారు కదా! ఎన్టీఆర్ విగ్రహం చేయి ఎటు చూపెడుతున్నదో అటు చూడండి. ఆర్బీఐ క్వార్టర్స్ కనబడతాయి. నడిచి వస్తే నాలుగు నిమిషాలు. మోటార్ సైకిల్ అయితే నిమిషం కూడా పట్టదు. మా ఇంటిని ఆనుకుని హనుమాన్ మందిర్. అదే కొండ గుర్తు”
ఇంత చెప్పినా అరగంట తర్వాత వచ్చాడు, రెండు చేతుల్లో రెండు సంచులు మోసుకుంటూ.
ఎండనపడి వచ్చాడు, కూల్ డ్రింక్ తీసుకోండని కోక్ క్యాన్ ముందు పెడితే, గొంతు నొప్పి వద్దని మర్యాదగానే తిరస్కరించాడు.
నా ఎపిక్ నెంబరు చెప్పగానే, అతడు తన మొబైల్ ఆన్ చేసి చెక్ చేయబోతుండగానే ఏదో కాల్ వచ్చింది. అది ఎటెండ్ అవగానే మరో కాల్. ఇలా పదిహేను నిమిషాలు వస్తున్న కాల్స్ మాట్లాడడంతోనే అతడికి సరిపోయింది.
“చూశారు కదా! ఈ కాల్స్ అన్నీ మీలాంటి ఓటర్ల నుంచే. ఎక్కే గడప. దిగే గడప. పొద్దున్న అనగా బయలుదేరాను. ఇప్పటికి మూడిళ్లు కూడా కవర్ చేయలేదు” చెబుతుండగానే సెల్ మోగింది.
“దగ్గరలోనే పలానా చోట వున్నాను” అంటూ మా అపార్ట్ మెంటు పేరు చెప్పాడు. “మా పై అధికారి. నేను పని చేస్తున్నానో లేదో అని చెక్”
అసలు నా ఓటు సంగతి ఏమిటో తేలక ముందే, ఆ పైఅధికారి మరో వ్యక్తిని వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చాడు. వెంట వచ్చిన వ్యక్తి కెమేరాతో మా అందర్నీ ఫోటోలు తీశాడు. బహుశా అప్ లోడ్ కూడా చేసి వుంటాడు, పని చేస్తున్నట్టు గుర్తుగా,
పై అధికారి, కింది అధికారి చేతికి ఒక జాబితా ఇచ్చి, “ఇంకా ఇన్ని పెండింగు వున్నాయి, ఎప్పటికి తెమలాలి ఇవన్నీ” గదమాయింపుగా అన్నాడు. ఈ లోగా ఆ పై అధికారికి ఆయన పై అధికారి ఫోన్ చేసి రివ్యూ మీటింగ్ వుంది వెంటనే రమ్మన్నాడు.
వాళ్ళు పోగానే, ముందు వచ్చిన చిన్న అధికారి కూడా, నా చేతిలో రెండు కాగితాలు పెట్టి “ఇవి పూర్తి చేసి వుంచండి, మూడు రోజుల తర్వాత వచ్చి తీసుకుంటాను” అన్నాడు తన సంచులు సర్దుకుంటూ.
“మరి ఫోటో సంగతి” అంటే, “బ్లాక్ అండ్ వైట్ ఫోటో బాగానే వుంది కదా! ఫోటో సరిగ్గా లేకపోతేనే కొత్త ఫోటో” అంటూ హడావిడిగా సంచులు చేతిలో పట్టుకున్నాడు, ‘మరి, మా కోడలు సంగతి’ అంటే, ‘మరోసారి’, అంటూ బయట పడ్డాడు.
అతడు మునిసిపల్ పారిశుధ్య సిబ్బందిపై అజమాయిషీ చేసే సూపర్ వైజర్. అమీర్ పేట నుంచి కృష్ణా నగర్ వరకు తిరగాలి.
దాదాపు నలభయ్ నిమిషాలకు పైగా వున్నారు. ఫోన్లకు జవాబు చెప్పడమే వాళ్లకు సరిపోయింది. ఈ లెక్కన ఈ యజ్ఞం ఎప్పుడు తెల్లారేనో! వాళ్ళ కోసం మా వాచ్ మన్ తో తెప్పించి తయారు చేయించిన గ్రీన్ టీ కప్పులు టేబుల్ మీద అలాగే చల్లారి పోయి కనిపించాయి.
వాళ్ళు వెళ్ళిన తర్వాత, ఆ కాగితాలు తీరిగ్గా తీసి చూసాను.
రెండూ నావే. పై భాగంలో నా నలుపు తెలుపు ఫోటో( నా వోటరు కార్డు మీద వున్నదే) కొన్ని వివరాలు, నా చిరునామా, నియోజకవర్గం పేరు, పార్ట్ నెంబరు మొదలైనవి వున్నాయి.
ఒకసారితో అయిపోతుంది, అనుకుంటే మరోసారి అన్నమాట.
కానీ వాళ్ళు పడుతున్న పాట్లు చూస్తుంటే జాలి వేసింది. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాలు వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది? ఇది మా పని కాదు అని మొరాయించకుండా పని చేస్తున్నారు. సంతోషించాలి.
కాసేపు వాళ్ళతో తీరిగ్గా మాట్లాడి, విషయాలు రాబట్టి, నలుగురికి పనికొచ్చే సంగతులు ఏమైనా రాద్దామని అనుకున్నా. మా ఇంటికి వచ్చిన వాళ్ళతో ఫోటోలు కూడా దిగాను, నాలుగు మంచి ముక్కలు రాద్దామని. అసలు నా పనే పూర్తిగా పూర్తయిందో లేదో తెలియదు.
కానీ వాళ్ళ పేర్లు, ఫోటోలు గోప్యంగా ఉంచడమే మంచిది అని ఇప్పుడు అనిపిస్తోంది.
మూడు రోజుల్లో మళ్ళీ వచ్చి పూర్తి చేసిన ఫారం తీసుకుపోతానని చెప్పాడు. పని ఒత్తిడి చూస్తుంటే, ఈ కాగితాలు మా ఇంట్లో ఎన్నాళ్ళు నిద్ర చేయాలో ఏమిటో!
(30-06-2026)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి