15, జూన్ 2015, సోమవారం

బామ్మగారి సాక్ష్యం


కోర్టులో కేసు విచారణ జరుగుతోంది.
సాక్షిగా ఓ వయస్సుమళ్ళిన సూరేకాంతం గారిని బోనులో నిలబెట్టారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొంతు సవరించుకుని బామ్మగారిని మర్యాదగా పలకరించాడు.
'చూడండి బామ్మగారు. నేను ఏకాంబరాన్ని. ఇక్కడ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. తెలుసనుకుంటాను'
'నువ్వు తెలియకపోవడం ఏమిట్రా సన్నాసి. చిన్నప్పుడు మా పక్కింట్లోనే వుండేవాళ్లు కదా మీరు మీ నాన్న. వొంట్లో ప్రాణం లేనట్టు పీలగా ఏబ్రాసి మొహం వేసుకుని వుండేవాడివి. పైకి నోట్లో వేలు పెడితే కొరకలేనట్టు, బోడి అమాయకం ఒకటి. కాని వున్నాడు కదా మీ నాన్న. వాడి పిదప బుద్ధులే నీకూ వచ్చాయి. ఆయనా అంతే. పందిరి గుంజకు చీరె చుడితే చాలు  దాని  కొంగు పట్టుకునే రకం. నీ వొంట్లో వాడి రక్తమేకదా! అందుకే బంగారం లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని, ఏం పోయేకాలం వచ్చిందని  పక్కింటి ఆడదాన్ని లేపుకుపోయి పక్క వీధిలో కాపురం పెట్టావు.  కట్టుకున్న ఇల్లాలి కన్నీళ్ళు  పట్టించుకోకుండా ఇరుగింటి పొరుగింటి ఆడవాళ్ళ వెంట తిరగడానికి సిగ్గు లేదట్రా. అడిగేవాడు లేక ఈ పోరంబోకు వేషాలు వేస్తున్నావు.ఈ పాపం కట్టికుడుపుతుంది ఏమనుకుంటున్నావో, యేమో!  ' సూరేకాంతం మాటలు ఆగడం లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోట మాట లేదు. నిలువు  గుడ్లేసుకుని నిలబడిపోయాడు.
ఇదంతా చూస్తూ వింటూ డిఫెన్స్ లాయర్ ముసిముసి నవ్వులు నవ్వాడు. బోను దగ్గర నిలబడి చిరునవ్వు చిందిస్తూ అన్నాడు. 'ఆయన సరేనండీ బామ్మగారు, నేనిక్కడ డిఫెన్స్ లాయర్ని. పేరు చిదంబరం. మీరుండేది అరండల్ పేటలోనే కదా! మూడో లేను నాలుగో ఇల్లు'
'హోర్నీ నువ్వట్రా చిదంబరం. యెంత ఎదిగి  పోయావు. సూటూ బూటూ వేసావు సరే బుద్దులు నిక్కర్ల నాటివేనా. పక్క దొడ్లో జామకాయలు కోసుకొచ్చి నువ్వూ మీ అమ్మా ఉప్పూ కారం రాసుకుని లొట్టలేసుకుంటూ తినేవారు. నాకు గుర్తు లేకపోవడం ఏమిటి.  పక్కింట్లో ఎత్తుకెళ్ళిన సైకిల్ వాళ్లకు ఇచ్చావా లేక పదో పరక్కో అమ్మి జీడీలు కొనుక్కు తిన్నావా?  అన్నట్టు మీ రెండో అమ్మాయినే కదా ఆ నల్లకోటు ఏకాంబరం తీసుకుపోయి భార్యకు తెలియకుండా వేరు కాపురం పెట్టింది. యెలా వుందా పిల్ల, ఇంకా వీడి మాయలోనే వుందా! నువ్వన్నా సరిగ్గా కాపురం ఏడుస్తున్నావా? వాడిలాగే పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావా? ఈ విషయాల్లో నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏమిటి? వాడిలాగా పైకి తేలవు కానీ నువ్వూ గోపాలకృష్ణుడివే, నాకు తెలవదా నీ సంగతి' బామ్మగారి మాటల ధాటికి చిదంబరం మరో మాట లేకుండా మ్రాన్పడిపోయాడు.
జడ్జీ గారు ఇదంతా చూస్తున్నాడు. పొరబాటున వీళ్ళిద్దర్లో ఎవరయినా తొందరపడి 'ఆయనెవరో తెలుసా' అని తనని చూపిస్తూ బోనులో  బామ్మగారిని అడిగారంటే కోర్టు కొల్లేరయి పోతుందని గ్రహించాడు. ఇక  ఒక్క క్షణం కూడా ఆలశ్యం చెయ్యకుండా కేసును మూడు నెలలకు వాయిదావేసాడు.

(Based on english version posted by Shree PVVG Swamy)
NOTE ; Courtesy Image Owner

కామెంట్‌లు లేవు: