13, ఫిబ్రవరి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో - 82

 బిగ్ జీరోకి బిగ్ బ్రేక్

అయాం ఎ బిగ్ జీరో రాయడం మొదలుపెట్టిన తర్వాత కిందటి నెల చివర్లో బిగ్ బ్రేక్ పడింది. అప్పటికి 81 ఎపిసోడ్స్ అయ్యాయి. జనవరి 27  నుంచి ఈ రోజు వరకు అంటే పదిహేడు రోజుల పాటు దాని జోలికి పోలేదు అంటే నాకే విడ్డూరంగా వుంది.

నిరుడు 2024 నవంబరు పదకొండో తేదీన  ప్రారంభించిన ఈ సీరియల్ ‘రచనోద్ఘాతం’  తోకటపాలో ముందే చెప్పినట్టు, శారీరకంగామానసికంగా పటుత్వం తగ్గుతున్న దశలో మొదలు పెడుతున్న ప్రయత్నం ఇది. కొన్ని విషయాలు గుర్తు చేయడానికి ఇన్నేళ్ళు ఈ జీరో కుడిపక్కన ఓ పెద్ద అంకెలా నిలబడ్డ మా ఆవిడ నిర్మల తోడు  ఇప్పుడు లేకపోవడం పెద్ద కొరత.  అయినా సరే, అన్నీ గుర్తు తెచ్చుకుని, నాకుగా నేను తలకెత్తుకున్న  ఈ బాధ్యతను పూర్తిచేయాలనేది నా సంకల్పం.  

 నాకున్నది ఒక్కటే రోగం. మతిమరపు. మెదడు మొత్తం ఖాళీ కాకముందే ఇది పూర్తిచేసి తీరాలి. దానికి నా ఆరోగ్యం సహకరించాలి.

గత మూడువారాలుగా అనేక మానసిక ఒత్తిళ్ళు. మా రెండోవాడి ఏడూడి మాసికాలు, అమెరికా నుంచి, కటక్ నుంచి పిల్లల రాకలు, వాళ్ళు వెళ్లి ఇల్లు ఖాళీ కాగానే మనసు ఖాళీ కావడం, జలుబు వెలగని బలుబులా  పట్టుకుని ఓ పది రోజులు వదలని రొంప, దగ్గు  నన్ను జీరో రచనకు దూరం చేసాయి.

ఈరోజు, ఫిబ్రవరి పదమూడు ప్రపంచ రేడియో దినోత్సవం. ఈ రోజున, అయాం ఎ బిగ్ జీరో పునః ప్రారంభించాలని సంకల్పం. ఎనభయ్ రెండో ఎపిసోడ్ కి సమాయత్తం. అదే ఇది.

నిజానికి రేడియో అంటే వార్తలు కాదు, సంగీతం. సంగీతం అంటే  ఢమఢమల సంగీతం కాదు. ఎందరో విద్వద్మణులు సమకూర్చిన సంగీతం. ఈ రోజు, ఫిబ్రవరి పదమూడు,  ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక ప్రముఖ దినపత్రిక ఏడుగురు ఆర్జే (రేడియో జాకీ) లతో ఇంటర్వ్యూలు చేసి ఒక పెద్ద ఆర్టికిల్ ప్రచురించింది. సంతోషపడుతూ చదివాను. ఈనాటి తరానికి రేడియో సంగీతం అంటే అదే! మరి  వాళ్ళని ఎలా తప్పుపట్టగలం?  

ఒకప్పుడు రేడియో అంటే అనేక సంగీత దిగ్గజాల పేర్లు వినిపించేవి.                                   

మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి (గాత్రం),  బాలాంత్రపు రజనీకాంతారావు (వాగ్గేయకారుడు), అన్నవరపు రామస్వామి, మారెళ్ళ కేశవరావు, నేతి శ్రీరామ శర్మ (వయొలిన్) దండమూడి రామ్మోహనరావు, ఎల్లా వెంకటేశ్వరరావు  (మృదంగం) ప్రపంచం సీతారాం,  ఎన్ ఎస్ శ్రీనివాసన్ (వేణువు), మంచాల జగన్నాధరావు( వీణ).   మామూలుగా అయితే ఇవి కొన్ని పేర్లు మాత్రమే. కానీ ఆ పేర్లకు వున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు ఇలాటి మహనీయులు నడయాడిన నట్టిళ్లు ఆకాశవాణి కేంద్రాలు. వారు బయట ప్రదేశాలకు వెళ్ళి సంగీత కచ్చేరీలు ఇచ్చినప్పుడు పలానా వారు, బెజవాడ రేడియో కేంద్రం,  హైదరాబాదు కేంద్రం  నిలయ విద్వాంసులు అని కరపత్రాలు ముద్రిస్తే,  అది వారు పనిచేసే కార్యాలయానికి ఒక అదనపు గుర్తింపు తెచ్చిపెట్టేదిగా భావించేవారు. గతంలో రేడియో కేంద్రాలకు అధిపతులుగా పనిచేసిన అధికారులు కూడా వారికి తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. చక్కటి సంగీత కళాకారులు తమ వద్ద పనిచేయడం అనేది గొప్ప విషయంగా పరిగణించేవారు. ఆ కారణంగానే పాత కాలంలో సంగీతానికి రేడియో, రేడియోకు సంగీతం పరస్పర సహకారం ఇచ్చుకున్నందువల్లే కచ్చేరీల ద్వారా కొందరికే అందుబాటులో వున్న సంగీతం రేడియో ద్వారా ఎల్లెడలా వున్న జనాలకు చేరువకాగలిగింది.  కానీ కాలం గడుస్తున్న కొద్దీ అన్ని వ్యవస్థల్లో మార్పులు వచ్చినట్టే రేడియోలో కూడా పరిస్థితులు మారుతూ వచ్చాయి. తమ సంగీతపాటవాన్ని పదిమందికీ తెలియచేయాలన్న తపనతో ఓ పక్క రేడియోలో పనిచేస్తూనే కొందరు కళాకారులు మరోపక్క తగిన అనుమతులు తీసుకోకుండా బయట సంగీత కచ్చేరీలలో పాల్గొంటూ వుండేవారు. ముందే చెప్పినట్టు వెనుకటి రోజుల్లో ఈ తరహా వ్యవహారాలను అధికారులు ఓ దృష్టితో చూసి, చూసీ చూడనట్టు వొదిలేస్తే, తదనంతరం వచ్చిన అధికారుల్లో కొందరు దీన్ని నిబంధనలకు వ్యతిరేకం అన్న కోణంలో చూడసాగారు. అదిగో అక్కడే రేడియో ఆర్టిస్టులకు, అధికారులకు మధ్య సంఘర్షణలకు దారితీసింది. అయితే సహజంగా ఈ విషయంలో అధికారులదే  పైచేయి కావడంతో ఆర్టిస్టులు మానసికంగా కుంగిపోయేవారు. రేడియోలో తమది ఉద్యోగం కాదు, ఉపాధి అనుకుని వచ్చి చేరినవారిలో కొందరు,  మారిన పరిస్తితులతో రాజీపడలేక రేడియోనే వొదిలేసారు. అలాటివారిలో  ప్రపంచం సీతారాం ఒకరు. దక్షిణ భారతంలో పేరెన్నికగన్న టీ ఆర్ మహాలింగం శిష్యులు. ప్రపంచం అన్నది సీతారాం ఇంటిపెరుకాదనీ, ఎప్పుడో దశాబ్దాల క్రితం తెలుగులో తీసిన 'ప్రపంచం' అనే చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించిన కారణంగా ఆయనకు ప్రపంచం అన్నది ఇంటి పేరుగా మారిపోయిందని చెబుతారు.  

 నిబంధనల  పేరుతొ నిరంకుశంగా వ్యవహరించే అధికారుల చేతుల్లో కళాకారులు యెలా కుంగిపోతారన్నదానికి సీతారాం గారే ఒక ఉదాహరణ.

లోకాన్ని ఒదిలి వెళ్ళిన ప్రపంచం

ప్రసిద్ధ సంగీత విద్వాంసుడుఫ్లూట్ కళాకారుడు ప్రపంచం సీతారాం, 2014లో మరణించినప్పుడు ఆయన సంస్మరణ వ్యాసానికి నేను ఎంచుకున్న శీర్షిక ఇది. 

సంగీతానికి చావు లేదు. అయితేఅజరామరమైన సంగీతాన్ని జనాలకు వొదిలి పెట్టి వెళ్లి, సంగీత కారులు మాత్రం  అమరులుగా మిగిలిపోతుంటారు. అలాంటి సంగీత నక్షత్రమే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఫ్లూట్ వాయిద్యకారుడు ప్రపంచం సీతారాం. అంతటి సంగీతకారుడు పనిచేసిన రేడియోలోనే నేనూ పనిచేశాను అనే ఒకే ఒక్క  కారణం తప్ప ఆయన్ని గురించి రాయగల  ఏ యోగ్యతా నాకు లేదనిఆ ఒక్కటే  ఈ వ్యాసానికి ప్రేరణ అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆత్మగౌరవం కలిగిన కళాకారులు సర్కారీ నౌకరీ చేయడంలో ఎదుర్కునే మానసిక సంఘర్షణలు గురించి ప్రస్తావించాలని అనుకోవడం కూడా ఇందుకు దోహదం చేసింది.

 

ఇది జరిగి కూడా పాతిక ముప్పయ్యేళ్ళు అవుతుందేమో. ఇంకా ఎక్కువో.

మంగళగిరి,  నంబూరు నడుమ ఒక జైన దేవాలయం వుంది. ఆ ఆలయం అధికారుల ఆహ్వానం మేరకు ఒకరోజు బెజవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ అయూబీ, న్యూస్ ఎడిటర్ ఆర్వీవీ కృష్ణారావు గారిని వెంటబెట్టుకుని అక్కడకు వెళ్లారు. అదే సమయంలో అక్కడ వారికి ప్రపంచం సీతారాం తన బృందంతో తారసపడ్డారు. అప్పటికే ఆయన రేడియో కళాకారుడే కాకుండా తదనంతరం సంపాదించుకున్న డిగ్రీల సాయంతో రేడియోలో ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా ఎంపికై. ప్రమోషన్ మీద  బెజవాడ రేడియో స్టేషన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఉద్యోగం ఏదైనప్పటికీ, స్వతహాగా ఆయన సంగీతకారుడు.  కచ్చేరీలు చేయాల్సిందిగా ఆహ్వానాలు అందుతూ వుండేవి. అయితే రేడియో ఉద్యోగులు ఇలా కచ్చేరీలు చేయడం అప్పటి స్టేషన్ డైరెక్టర్ కు సుతరామూ ఇష్టం వుండేదికాదు. పైగా అలాటి వారికి  మెమోలు ఇవ్వడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఆయనకు అలవాటు. ఆయన హయాములో రేడియో కళాకారులు బిక్కచచ్చినట్టు వుండేవారు.

జైన దేవాలయంలో పై అధికారి కనబడగానే కచ్చేరీ నిమిత్తం అక్కడికి వచ్చిన ప్రపంచం సీతారాం కూడా కంగారు పడిపోయారు. మరునాడు స్టాఫ్ మీటింగులో కూడా స్టేషన్ డైరెక్టర్ అదే విషయాన్ని ప్రస్తావించి హెచ్చరిక చేయడంతో,  ఆయన కృష్ణారావు గారితో చెప్పుకుని తెగ మధన పడిపోయారు. ఇలాటి అనేకానేక అనుభవాల దరిమిలా, రేడియోలో స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన తరువాత కూడా సీతారాం, తన మనస్సుని సమాధాన పరచుకోలేక, తన మనస్సుకు నచ్చని రేడియో ఉద్యోగాన్ని వొదిలి పెట్టి, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడే విభాగాధిపతిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.

ఫ్లూటు వాయిద్యంలో తనకు తానే సాటి అనిపించుకున్న ప్రపంచం సీతారాం గారు, అమెరికాలోని శాండియాగోలో వుంటున్న తన కుమారుడు ప్రసన్నను చూడడానికి  వెళ్ళి, అక్కడే ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా విడిచివెళ్ళారు.

తన సంగీత జ్ఞానంతో తెలుగు  సంగీత ప్రాభవాన్ని ఏనాడో ఎల్లలు దాటించిన ప్రపంచం సీతారాం, దేశం ఎల్లలు  దాటివెళ్ళి అక్కడెక్కడో పరాయి దేశంలో మరణించడం విధి విచిత్రం.

(ఇంకా వుంది)


కింది చిత్రం ప్రపంచం సీతారాం




 

కామెంట్‌లు లేవు: