“ఆకాశవాణి
వార్తలు చదువుతున్నది తిరుమలశెట్టి శ్రీరాములు
ఢిల్లీ
నుంచి ప్రసారం అవుతున్న ఈ వార్తల్ని మద్రాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలు రిలే
చేస్తున్నాయి”
ఉదయం ఏడుగంటల సమయంలోనో, లేదా రాత్రి ఏడు కొడుతున్నప్పుడో ఈ
కంఠస్వరం తెలుగు లోగిళ్లను పలకరిస్తూ వుండేది. వార్తల్లో విషయం కన్నా ఆయన వార్తలు
చదివే పధ్ధతి, వాక్యాలను
విరుస్తూ, అక్కడక్కడ
నొక్కుతూ ఉచ్చరించే తీరుకోసమే వింటున్నామనే వాళ్లు నాకు చిన్నతనంనుంచీ తెలుసు. అయితే, రేడియోలో వినబడే ఆ స్వరం తప్ప
శ్రీరాములు గారు యెలా వుంటారో తెలియని వాళ్ళే కాని ఆయన్ని తెలియని తెలుగు వాళ్లు అంటూ
ఎవ్వరు వుండరు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, ఆసేతుహిమాచలం హై పవర్ రేడియో ట్రాన్స్ మీటర్లు వున్న ప్రతిచోటా
ఆయన గొంతు వినబడేది.
స్క్రిప్ట్
ఒకటే. చదివేది అదే మైకు ముందు. మరి రేడియో వార్తలు చదివే వాళ్ళలో ప్రత్యేకత ఏమిటి?
ఢిల్లీ నుంచి
గతంలో తెలుగు వార్తలు చదివిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో బాణీ.
నిజమే. ఎవరు
చదివినా అవే వార్తలు. కానీ చదవడంలో ఓ విరుపు. చదువుతూ చదువుతూ ఎక్కడో ఓ మెలిక.
వార్తకు తగ్గట్టు స్వరంలో హెచ్చుతగ్గులు. వీటిని బట్టే ఆ రోజుల్లో శ్రోతలు వార్తలు
మొదలయిన తర్వాత కూడా చదివే వ్యక్తి ఎవరన్నది సులువుగా గుర్తు పట్టేవాళ్ళు.
అద్దంకి
మన్నార్ వార్తలు చదువుతుంటే జెట్
విమానంలా ఉరుకులు పరుగులు పెట్టినట్టు సాగిపోయేవి. దుగ్గిరాల పూర్ణయ్య గారు కంచు
కంఠంతో నింపాదిగా చదివేవారు. కందుకూరి సూర్య నారాయణ గారు ప్రతి వాక్యాన్ని తనదైన
శైలిలో ముగించేవారు. మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి గారిది మరో తరహా. నిండుగా సాగిపోతున్న గంగా ప్రవాహం
మాదిరిగా వుండేది. జోళిపాల్యం మంగమ్మ గారు వార్తలు చదువుతుంటే మరి కాసేపు అలా అలా
వినాలి అనిపించేలా వుండేది. ఏడిద గోపాల రావు గారు వార్తల్ని చదువుతుంటే ముచ్చట్లు
చెబుతున్నట్టు ముచ్చటగా ఉండేవి. చొప్పదంటు లాంటి వార్తలకు కూడా ఆ మహానుభావులు జీవం పోసేవారు. అందుకే
శ్రోతలను అంతగా ఆకట్టుకోగలిగారు. (దురదృష్టం ఏమిటంటే రేడియో అభిమాని అనే బ్లాగులో, మాగంటి వారు నిర్వహించే బ్లాగులో
తప్ప వీరిలో కొందరి ఫోటోలు సంపాదించడం అనేది గగన కుసుమంగా మారింది)
ఢిల్లీలో
ఆకాశవాణికి చాలా
పెద్ద వార్తా విభాగం వుంది. అనేక జాతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో సైతం
ఢిల్లీ నుంచి వార్తలు ప్రసారం చేస్తుంటారు. ప్రసార భారతి ఏర్పాటు అయిన తరువాత ఆయా
దేశీయ భాషల్లో బులెటిన్లు రూపొందించే విభాగాలను ఆయా ప్రాంతాలకు తరలించారు. ఆ
క్రమంలోనే ఢిల్లీ నుంచి తెలుగు వార్తా విభాగాన్ని యావత్తూ, సిబ్బందితో సహా హైదరాబాదుకు
మార్చారు. ఢిల్లీలోని ఆకాశవాణి జనరల్ న్యూస్ రూమ్ లో ఇంగ్లీషులో జాతీయ వార్తలతో
కూర్పు చేసిన బులెటిన్
కాపీని హైదరాబాదుకు పంపితే, ఆ
వార్తల్ని న్యూస్
రీడర్లు తెలుగులోకి తర్జూమా చేసుకుని చదువుతున్నారు. కాకపొతే, ప్రాధాన్యతను బట్టి కొన్ని స్థానిక
వార్తలను కూడా ఆ బులెటిన్ లో చేరుస్తారు.
శ్రీరాములు
గారి గురించి చెప్పుకుంటున్నాం కదా! ఆయన ఢిల్లీ నుంచి కొన్నాళ్ళు,
మాస్కో వెళ్ళి అక్కడ ఆ రేడియో వార్తలు చదివి ఆ తరువాత తిరిగి ఢిల్లీ
వెళ్ళకుండా హైదరాబాదు బదిలీపై వచ్చారు. వార్తలు చదివే పద్దతే కాదు ఆయన ఆహార్యం
కూడా ప్రత్యేకమే. ఎప్పుడు ఫుల్ సూటులో కనబడేవారు. అదేమిటో ఢిల్లీలో పనిచేసి వచ్చిన
వాళ్ళలో చాలామంది ఫుల్ సూటు ధరించి, చేతిలో బ్రీఫ్ కేసుతో
కనపడేవాళ్ళు. న్యూస్ కరస్పాండెంట్ గా పనిచేసిన ఎం.ఎస్.ఆర్. కృష్ణారావు గారు
కూడా అదే తీరు. ఫుల్ సూటు, టై, తలపైన ఫెల్ట్ హ్యాట్. ఢిల్లీ
అలవాటేమే తెలియదు. ఇదే ఆహార్యంతో సిటీ బస్సులో నిలబడి ప్రయాణం చేస్తుంటే చాలా
చిత్రం అనిపించేది. అలాగే అప్పుడప్పుడు సెలవు మీద హైదరాబాదు వచ్చి, రేడియో స్టేషన్ కు వచ్చి అందర్నీ
పలకరించే ఏడిద గోపాల రావు గారు కూడా ఫుల్ సూటు, చేతిలో బ్రీఫ్ కేసు. మరి అదే ఢిల్లీలో, అండమాన్ లో పనిచేసి వచ్చిన గోవాడ
సత్యారావు గారికి ఈ సూట్ల గోల అంటలేదు. ఆయన మామూలు ప్యాంటు
చొక్కాతోనే ఆఫీసుకు వచ్చేవారు. న్యూస్ ఎడిటర్ నర్రావుల సుబ్బారావు గారి తరహా
పూర్తి విభిన్నం. పంచె,
మోచేతులవరకు వున్న చొక్కా. చేతిలో చుట్ట.
పరిచయం లేనివాళ్లు ఆయన్ని ఒక రాజకీయ నాయకుడు కాబోలు అనుకునే వాళ్ళు. ఉర్దూ
న్యూస్ రీడర్ వసీమక్తర్ మాత్రం సూట్ల దగ్గర నుంచి, లాల్చీ పైజామా వరకు అనేక రకాల
దుస్తులు ధరించేవాడు. కాకపోతే చేతిలో వెలిగే సిగరెట్ అదనం.
ఆ
రోజుల్లో నేను పనిచేసిన ప్రాంతీయ వార్తా
విభాగం ప్రస్తుతం క్యాంటీన్ వున్న షెడ్లలో వుండేది. అందులో రెండు విశాలమైన గదులు, ఒకదానిలో న్యూస్ బులెటిన్లు
తయారుచేసే సిబ్బంది, అంటే
న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు, బులెటిన్ టైప్ చేసే వాళ్లు, రెండో గదిలో తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్లు ఆఫీసు
అసిస్టెంట్లు కూర్చునే వారు.
నేను
చేరినప్పుడు న్యూస్ ఎడిటర్ పన్యాల రంగనాధ రావు గారు, కరస్పాండెంట్ ఎం ఎస్ ఆర్ కృష్ణారావు
గారు అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ మాడపాటి సత్యవతి గారు, న్యూస్ రీడర్ గా వుంటూనే బులెటిన్లు
తయారు చేసే బాధ్యతను ఐచ్చికంగా భుజాలకు ఎత్తుకున్న డి. వెంకట్రామయ్యగారు, సరే, ఆ వరసలో అసిస్టెంట్ ఎడిటర్
రిపోర్టింగ్ హోదాలో నేనూ. చివర్లో ‘ఈ నేను’ ఎందుకంటే అసలు నేను ఆఫీసుకు వచ్చి
పోయేదే చాలా తక్కువ. రిపోర్టింగ్ పని మీద రోజులో ఎక్కువ భాగం బయటే తిరిగేవాడిని.
వీరిలో ఎం ఎస్ ఆర్ కృష్ణారావు గారు,
ఆహార్యం ఆంగ్ల పద్దతిలో సూటూ బూటయినా, స్వచ్చమైన తెలుగులో మాట్లాడేవారు. మమ్మల్ని కూడా అలాగే మాట్లాడమని కోరేవారు. ఏదయినా చెప్పబోతూ మా
మిసెస్ అంటే వెంటనే అభ్యంతరం చెప్పేవారు. మిసెస్ అంటే మిస్ట్రెస్, అలా అనడం తప్పు, నా భార్య అని చెప్పమని
పట్టుబట్టేవారు. సరే! ఇది కొంత వినోదంగా కూడా వుండేది. ఆఫీసులో సీరియస్
వాతావరణాన్ని కొంత చల్లబరిచేది.
మరో
గదిలో తిరుమలశెట్టి శ్రీరాములు
గారు, ఉర్దూ
న్యూస్ రీడర్ వసీం అక్తర్ కూర్చునే వారు. శ్రీరాములు గారు వార్తల టైము కాగానే ఒక చేతిలో వెలిగించిన సిగరెట్, మరో చేతిలో న్యూస్ బులెటిన్ పేపర్లు పట్టుకుని స్టూడియోకు బయలుదేరేవారు.
మేము పనిచేసే చోటునుంచి స్టూడియోకి
కొంతదూరం నడిచి వెళ్ళాలి. శ్రీరాములు గారు అడుగులో అడుగు వేసుకుంటూ, నింపాదిగా స్టుడియో దగ్గరికి వెళ్లేసరికి సిగరెట్
అయిపోయేది. వార్తలు చదవడానికి స్టూడియోకి వెళ్లేటప్పుడు యెంత టైం పట్టేదో
తిరిగివచ్చేటప్పుడు కూడా సరిగ్గా అంతే సమయం పట్టేదని చెప్పుకునేవారు. వచ్చేటప్పుడు
మళ్ళీ సిగరెట్ అంటిస్తే న్యూస్ యూనిట్ దగ్గరికి వచ్చేసరికి అయిపోయేది. వేసే
అడుగులు కూడా లెక్కబెట్టినట్టు వుండేవి. ఒక్కోసారి ఏదయినా తాజా సమాచారం
అందివ్వడానికి నేను స్టూడియో వైపు పరిగెత్తుకుంటూ వెడుతుంటే,
శ్రీరాములు గారు మాత్రం తాపీగా నడుస్తూ మధ్యలోనే
కనిపించేవారు. ఆ కాగితం ఆయన చేతిలో పెడితే, దాన్ని చదువుకుంటూ అలాగే
అంతే నిదానంగా
నడుస్తూ వెళ్ళేవారు కాని, ఆయనలో ఏమాత్రం ఆందోళన కాని, కంగారు కాని ఏనాడు చూడలేదు. అలాగే
ఒక్కోసారి చివరి నిమిషంలో మొత్తం వార్తని తిప్పిరాసి ఇచ్చినా ఏమాత్రం అసహనం
ప్రదర్శించకుండా దాన్ని అనువాదం చేసేపనిలో నిమగ్నం అయ్యేవారు. ఇంత నిదానంగా, నింపాదిగా, తాపీగా వుండే మనిషి గుండెపోటుతో మరణించడం ఒక విషాదం.
అన్నట్టు
చెప్పడం మరిచాను. ప్రాంతీయ వార్తా విభాగంలో మాస్టర్ బులెటిన్ ను ఇంగ్లీష్ లో
తయారుచేసి ఇచ్చేవాళ్ళం. దాన్ని కాపీలు తీసి ఇస్తే తెలుగు న్యూస్ రీడర్, ఉర్దూ న్యూస్ రీడర్ తెలుగు, ఉర్దూ భాషల్లోకి అనువదించుకునేవారు.
కింది
ఫోటో :
తిరుమలశెట్టి
శ్రీరాములు గారు
(ఇంకా
వుంది)
1 కామెంట్:
తిరుమలశెట్టి శ్రీరాములు గారు తన పేరు పలికే తీరు విలక్షణంగా ఉండేది. అది మాత్రమే విని వార్తలు పై అంతగా ఆసక్తి ఉండేది కాదు.
అప్పట్లో అద్దంకి మన్నారు గొంతులో ఒక వాణిజ్య ప్రకటన ' డాబర్ చ్యవన ప్రాశ్ తిని నువ్వు కూడా బలిశావు ' అని చెప్పటం విని నవ్వుకునే వాళ్ళం. అది ఆంగ్లం నుంచి తర్జుమా చేయడం లో జరిగిన పొరపాటు అయి ఉంటుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి