వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ
కొప్పుల
సుబ్బారావు, ప్రయాగ
రామకృష్ణ, జ్యోత్స్నాదేవి
వీరంతా విజయవాడ నుంచి రేడియోలో వార్తలు
చదివినవారు. తమ స్వరమాధుర్యంతో శ్రోతలని
మెప్పించిన వాళ్ళు. వీరిలో సుబ్బారావు, ప్రయాగలతో కలిసి బెజవాడలో
తాత్కాలికంగా పనిచేసిన అనుభవం వుంది. అక్కడ న్యూస్ ఎడిటర్లు సుదీర్ఘకాలం సెలవులో
వెళ్ళినప్పుడు నేను హైదరాబాదు నుండి వెళ్ళి అక్కడ మూడు నాలుగు వారాలపాటు
బులెటిన్ వ్యవహారాలు చూసేవాడిని. ఆ విధంగా సుబ్బారావు, ప్రయాగలతో నాకు చక్కని సాన్నిహిత్యం
ఏర్పడింది. వీరిద్దరిదీ వొకే వూరు. మంచి స్నేహితులు కూడా. పాపం సుబ్బారావు రిటైర్
అయిన కొన్నేళ్లకే కన్ను మూసాడు. ప్రయాగ హైదరాబాదు వచ్చి సుజనా కంపెనీలో మంచి
పొజిషన్ లో చేరి సమాజానికి పనికివచ్చే మంచి కార్యక్రమాలు చేస్తున్నాడని విన్నాను.
ప్రయాగ భార్య నిర్మల గారు మంచి
రచయిత్రి. ప్రయాగ ఎంత బిజీగా వున్నా తనకు
ఇష్టమైన రచనా వ్యాసంగానికి దూరం కాలేదు. చక్కటి సుబోధకమైన ఆధ్యాత్మిక రచనలు చేస్తుంటాడు. అది ఇంకా మంచి విషయం.
పోతే,
బెజవాడ
వెళ్ళినప్పుడల్లా వీరిద్దరూ ప్రాంతీయ వార్తల ప్రసారం విషయంలో నాకు చక్కని సహకారం
అందించేవారు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. రాత్రి బస్సెక్కి పొద్దున్నే బెజవాడ
చేరేవాడిని. రేడియో కేంద్రానికి నేరుగా వెళ్ళి ఆ రోజు ఉదయం ప్రాంతీయ వార్తలు
నేనే చదివేవాడిని, అది నా
డ్యూటీ కాకపోయినా. దానికి ఒక కారణం వుంది. పొద్దున్న నేను చదివిన వార్తలు
హైదరాబాదులో వున్న మా ఆవిడ రేడియోలో విని, నేను బెజవాడ క్షేమంగా చేరిన సంగతి
తెలుసుకునేది. ఇవన్నీ వినడానికి విచిత్రంగా అనిపించినా నిజంగా జరిగిన విషయాలే.
రేడియోలో నేను అనుభవించిన స్వేచ్ఛకు నిలువెత్తు ఉదాహరణలే.
సుస్వరం,
వాక్సుద్ధి, విషయ
పరిజ్ఞానం, పాండిత్యప్రకర్ష, అసాధారణ
ధారణ శక్తి ఇవన్నీ ప్రయాగకు న్యూస్ రీడర్ గా మంచి పేరు సంపాదించుకోవడానికి పనికొచ్చాయి.
కార్యక్రమాల
ప్రసారం విషయంలో ఒక్క ఆలిండియా రేడియోలోనే సమయపాలన అనేది పాటిస్తూ రావడం
దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ఒక మంచి సాంప్రదాయం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్సన్
లో కూడా ఈ విధానం లేదు. అందుకే రేడియో టైం ని బట్టి ప్రజలు తమ గడియారాల్లో టైం
సరిచేసుకోవడం ఆనవాయితీ. ఢిల్లీ నుంచి మొదలు పెట్టి కన్యాకుమారి వరకు అన్ని రేడియో
కేంద్రాల్లో వార్తల ప్రసారం ఒక క్రమపద్ధతి
ప్రకారం ఒకే సమయానికి మొదలవుతుంది, ఒకే
సమయానికి ముగుస్తుంది. పావు నిమిషం కూడా తేడా రాదు. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే:
బెజవాడ
న్యూస్ యూనిట్ లో ప్రాంతీయ వార్తల బులెటిన్ మొత్తం తెలుగులోనే తయారు అవుతుంది.
హైదరాబాదులో అలా కాదు. ఉర్దూ బులెటిన్ కూడా వుంది కాబట్టి మెయిన్ బులెటిన్ ఇంగ్లీష్ లో తయారు చేసి తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్లకు చెరొక కాపీ
ఇస్తే, ఎవరి భాషలో వాళ్ళు అనువాదం చేసుకునేవాళ్ళు. పైగా ఎడిటర్లకు మరో సులువు ఏమిటంటే, ఇంగ్లీష్ టైపులో వంద వాక్యాలు వుంటే, వాటిని తెలుగులోకి అనువాదం చేసుకుంటే పది
నిమిషాలు వార్తలు చదవడానికి సరిగ్గా సరిపోతాయి అనే ఒక అంచనా వుండేది. అంచేత స్టెనోకి డిక్టేట్ చేసేటప్పుడే ఆ వార్త ఎన్ని
వాక్యాలు వచ్చిందో ఎడిటర్ కి ముందే తెలుస్తుంది. ఆ పద్దతి విజయవాడలో లేదు కాబట్టి,
వార్తలను తెలుగులో రాసి ఇస్తాము కాబట్టి, ఒక్కోసారి బులెటిన్ నిడివి అంచనా తప్పి కొద్ది నిమిషాలు తక్కువయ్యేది.
వాటిని రాసి స్టూడియోకి తీసుకు వెళ్ళి అందించేలోగానే, రామకృష్ణ ఆశువుగా కొన్ని వార్తలు చదివి సమయాన్ని
సరిపెట్టడం నాకు బాగా గుర్తుంది. శ్రీరామనవమి, శివరాత్రి సందర్భాల్లో రాత ప్రతి
అవసరం లేకుండా ఏ ఏ క్షేత్రాలలో, ఏఏ
దేవాలయాల్లో ఏం జరుగుతున్నదో ఆ విశేషాలన్నీ తాను అక్కడే వుండి చూసి
చెబుతున్నట్టుగా, అనర్ఘళంగా, ఆశువుగా చెప్పేవాడు. ప్రయాగ గురించి నేను ముందు చెప్పిన విశేషణాలు, సుస్వరం, వాక్సుద్ధి, విషయ పరిజ్ఞానం, పాండిత్యప్రకర్ష, అసాధారణ
ధారణ శక్తి ఇవన్నీ అలాంటి సమయాల్లో అతడికి, మాకూ కూడా అక్కరకు వచ్చేవి.
వినే శ్రోతలకు సయితం అతడు అలా ఆశువుగా చదువుతున్నాడు అనే భావన కలిగేది కాదు.
బెజవాడనుంచి
మరో న్యూస్ రీడర్ కొప్పుల సుబ్బారావు.
మిన్ను
విరిగి మీదపడుతోందన్నా చలించని తత్వం. వార్తల టైం దగ్గరపడుతున్నా, బులెటిన్ పూర్తిగా తయారు కాకపోయినా,
వున్నంతవరకు
కాగితాలు తీసుకుని వెళ్ళి, అందుకు అనువుగా సమయం సర్దుబాటు చేసుకుంటూ వార్తలు
చదివే వాడు తప్ప, తను
కంగారు పడడం కానీ, ఇతరులను
కంగారు పెట్టడం కానీ నేను చూడలేదు.
ప్రయాగ
రామకృష్ణ,
కొప్పుల సుబ్బారావులది మంచి జోడీ. రేడియోలో చేరకముందు నుంచి కూడా స్నేహితులు.
వీరిద్దరికీ రేడియో స్టేషన్ దేవాలయం. వార్తలు చదివే స్టూడియో గర్భగుడి. అందులోకి
ప్రవేశించే ముందు కాలి జోళ్లు బయటే వదిలి లోపలకు వెళ్ళేవాళ్ళు. ఎదురుగా వున్న
మైక్రోఫోన్ కి రెండు చేతులు జోడించి దణ్ణం
పెట్టి వార్తలు చదవడం మొదలుపెట్టేవాళ్ళు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆ ఇద్దరి పేర్లూ జనం
గుర్తు పెట్టుకుంటున్నారు అంటే ఈ నిబద్ధతే ప్రధాన కారణం.
‘తలలో
నాలుక’ అంటే
సుబ్బారావే అని అతడి సహోద్యోగులు చెబుతుంటారు. సాధారణంగా ఉద్యోగంలో హోదాలు
పెరుగుతున్నకొద్దీ, అంతకు
ముందు చేసిన ఉద్యోగం పట్ల చిన్న చూపు కలిగివుండడం కద్దు. కానీ, కొప్పుల సుబ్బారావు తరహానే వేరు.
ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఆయన అడ్డా ఆకాశవాణే! వార్తా విభాగంలో పనిలేకపోతే,
మరో విభాగంలో
ప్రత్యక్షం. అక్కడి వారికి, అడగకుండానే,
డబ్బింగులో
సాయపడడం అతడి నైజం. డబ్బింగు ప్రస్తావన వచ్చింది కాబట్టి సుబ్బారావు గురించి మరో
కోణాన్ని గుర్తు చేసుకోవాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించిన అనేక
కార్యక్రమాలకు జాతీయ స్తాయిలో పురస్కారాలు లభించాయి. వాటిల్లో చాలా వాటికి
డబ్బింగు బాధ్యత నిర్వహించింది సుబ్బారావే అన్న సంగతి చాలామందికి తెలియదు.
ఎందుకంటే అతడు పేరు కోసం ఎప్పుడూ చూసుకోలేదు. పని మీదనే దృష్టి.
కొప్పుల
సుబ్బారావుతో కలసి విజయవాడ ఆకాశ వాణి కేంద్రంలో న్యూస్ ఎడిటర్ గా బాధ్యతలు
నిర్వహించిన ఆర్వీవీ కృష్ణారావు గారు సుబ్బారావుతో తన సాన్నిహిత్యాన్ని
గుర్తుచేసుకున్నారు.
‘విజయవాడలో
దాదాపు పదకొండేళ్లపాటు కలసి పనిచేశాము. సుబ్బారావుకు ఆఫీసే సర్వస్వం. స్టుడియోలో
అడుగుపెట్టేముందు బయటనే చెప్పులు వొదిలేసి వెళ్ళేవాడు. ఒక్కరోజు కూడా ఈ నియమాన్ని
దాటలేదు. వార్తలు చదివే గదే అతడికి గుడి. వృత్తిపట్ల అంతటి నిబద్ధతత వున్న
ప్రభుత్వ ఉద్యోగిని నేను చూడలేదు. అలాగే, తనకు సాయం చేసిన వారిని ఎన్నడూ
మరచిపోయేవాడు కాదు. అతడు ఆకాశవాణిలో ప్రవేశించడానికి అప్పటి డైరెక్టర్ బాలాంత్రపు
రజనీకాంత రావు గారు మాట సాయం చేశారన్నది అతగాడి నమ్మకం. అందుకు కృతజ్ఞతగా తన
కుమార్తెకు ‘రజని’ అని పేరు పెట్టుకున్నాడు.’
పదమూడేళ్ల
కిందటి ఆ రోజు నాకు బాగా గుర్తుంది.
దాదాపు
రెండు దశాబ్దాలకు పైగా ప్రతిరోజూ ఉదయం ఆరూ నలభయ్ అయిదు కల్లా ఠంచనుగా వినిపిస్తూ వచ్చిన
ఆ స్వరం 2012 జులై ఐదో
తేదీ రాత్రి
శాశ్వతంగా మూగబోయింది.
విజయవాడ
కేంద్రంలో న్యూస్ రీడర్ ఉద్యోగంలో చేరకముందు కూడా సుబ్బారావు న్యూస్ రీడరే. చేరిన
తరువాత న్యూస్ రీడరే. ఉద్యోగ విరమణ అనంతరం కూడా న్యూస్ రీడరే. తాత్కాలిక
ప్రాతిపదికపై వార్తలు చదివినప్పుడూ అదే నిబద్ధత. ఉద్యోగం శాశ్వతమై, చకచకా
మెట్లెక్కి, పైమెట్టు చేరుకున్న తరువాత
కూడా వార్తలు చదవడం అంటేనే అతడికి ఇష్టం. అరవైయేళ్ళు నిండి ఉద్యోగ విరమణ చేసిన
తరువాత కూడా వార్తలు చదవడానికే అతడిష్టపడ్డాడు. బహుశా, గుండె జబ్బు రాకుండా వుంటే, అతడలా వార్తలు చదువుతూనే
వుండేవాడేమో.
తను
పనిచేసేది విజయవాడలో. నేనేమో హైదరాబాదు రేడియోలో. ఉదయం, మధ్యాహ్నం వార్తలకోసం ఫోను చేసేవాడు.
అడిగినప్పుడల్లా ఏదో ఒక వార్త లేదనకుండా చెప్పేవాడిని. అంతే! దాన్ని యధాతధంగా
రాసుకుని ముక్కునపట్టి ఒప్పచెప్పినట్టు వెంటనే వార్తల్లో చదివేసేవాడు.
హైదరాబాదు
ఎప్పుడు వచ్చినా వెంటనే నాకు ఫోను చేసేవాడు. ఏమాత్రం వీలున్నా వచ్చి కలిసి
వెళ్ళేవాడు. పాతికేళ్ళుగా మా నడుమ ఈ సంబంధం కొనసాగుతూ వచ్చింది.
అదేమిటో
ఆ రోజు అంటే 2012
జులై ఐదో తేదీన హైదరాబాదు
వచ్చాడట. ఫోను చేయలేదు. వచ్చి కలవలేదు.
ఎందుకంటే
అతడు హైదరాబాదు రాలేదు. తీసుకువచ్చారు.
నన్ను
కలవలేదు. ఎందుకంటే ఆసుపత్రిలో చేర్చారు.
ఇక
కలవడు కూడా. ఎందుకంటే కలవలేనంత దూరతీరాలకు తరలిపోయాడు.
అతడు
రాలేడు. నేనే వెళ్ళాలి.
కింది
ఫోటోలు:
ప్రయాగ
రామకృష్ణ,
కొప్పుల సుబ్బారావు
(ఇంకా
వుంది)
1 కామెంట్:
Very good information about dedicated persons.
కామెంట్‌ను పోస్ట్ చేయండి