7, జులై 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (190) : భండారు శ్రీనివాసరావు


నాకు సముద్రం అంటే వల్లమాలిన ప్రేమ. తీరంలో కూర్చుని ముందుకు వెనక్కి వెళ్ళే అలలు చూస్తూ, సముద్రపు హోరు వింటూ గంటలు గంటలు గడపాలని అనిపిస్తుంది. కానీ నా చదువు సంధ్యలు సాగిన విజయవాడలో కానీ, ఖమ్మంలో కానీ, ఉద్యోగాలు వెలగబెట్టిన హైదరాబాదు, మాస్కోలలో కానీ ఎక్కడా సముద్రం లేదు. పెద్దయ్యేవరకు సినిమాల్లో చూసి సంతోషించడమే.

అలాంటిది 2025 జులై ఆరో తేదీ, ఒకే రోజున ఒకే సముద్రంతో, అదీ ప్రపంచంలో అతిపెద్దదైన పసిఫిక్ మహాసముద్రంతో  మూడు చోట్ల ములాఖత్తులు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ మొదలుకుని  రాత్రి డిన్నర్ వరకూ పసిఫిక్ తీరాల్లోనే గడిపాము.  కేనన్ బీచ్, హగ్ పాయింట్ బీచ్, షార్ట్ శాండ్ బీచ్ ఈ సముద్రానికి సంబంధించి అరెగాన్ రాష్ట్రంలో మూడు ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలు. లాంగ్ వీకెండ్ కావడంతో జనం పోటెత్తారు. ఫలితం రహదారులపై వాహనాల వరద. కారు పార్కింగ్ కోసం వెతుకులాట. చాలా సమయం కృష్ణార్పణం. 

హగ్ పాయింట్

వున్నవూరు వాడికి వల్లకాడు  భయం, పొరుగూరువాడికి  ఏటి భయం అనేది మా బామ్మగారు. 

వున్న ఊరు వాడికి ఏటి భయం వుండదు. ఏట్లో ఎంత వరద పారుతోందో, ఎక్కడ సుడిగుండాలు వున్నాయో ఈ వివరాలు తెలుసు కనుక భయం లేకుండా ఏరు దాటేస్తాడు. అదే స్మశానం అంటే జంకుతాడు. పొరుగూరు వాడికి అంటే పరదేశికి ఏటిలో ఎక్కడ ఎంత లోతు ఉన్నదో అని భయపడి ఏరు దాటడానికి భయపడతాడు. వల్లకాడు అని తెలియదు కాబట్టి నిక్షేపంగా అందులో నడిచి వెడతాడు.

హగ్ పాయింట్ బీచ్ లో నా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో విలాసంగా కూర్చుని ఎదురుగా కనబడుతున్న అనంత జలరాశిని చూస్తూ కాలక్షేపం చేస్తున్న సమయంలో, మూడు నాలుగేళ్ల కుర్రాడు ఒకడు సముద్రం ఎదురుగా వెడుతూ కనిపించాడు. చుట్టుపక్కల చూస్తే అతడి తాలూకు వాళ్ళు ఎవరూ కనిపించలేదు. అరెరే అనుకుంటుంటే ‘భయపడకండి ఇక్కడి వాళ్లకు ఇవన్నీ మామూలే’ అన్నట్టు మా వాళ్ళు కళ్ళతోనే వారించారు. ఆ పిల్లాడు కూడా సముద్రంలో దిగి అలలతో ఆడుకుంటున్నాడు. ముందుకు పోవడం, ఎగిసే కెరటాలతో పాటు వెనక్కి రావడం. కాసేపటి తర్వాత  ముందు పరిగెత్తుతున్న ఓ కుక్క, దాని వెనుకనే పరిగెత్తుకుంటూ అతడి తలితండ్రులు కాబోలు,  పిల్లాడికంటే అదే ఎక్కువ అన్నట్టు కనిపించారు.    

మా చిన్నప్పుడు  మా ఊళ్ళో కొందరు నా దోస్తులు లోతయిన దిగుడుబావిలోకి పైనుంచిదూకేవారు. వాళ్ళ పెద్దవాళ్లు కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. మోచేతులు, మోకాళ్లు చీరుకుపోయినా తేలిగ్గా తీసుకునే వారు. జీవితంలో ఢక్కా మొక్కీలు తినాలంటే ఇవన్నీ తప్పవు అన్నట్టు వుండేది వాళ్ళ వ్యవహారం.

పసిఫిక్ తీరంలో ఇసుక కూడా సాయంత్రపు సూర్య కాంతికి మిలమిలా మెరుస్తోంది. నాలుగుసార్లు మర పట్టించిన బియ్యపు తవుడులా ఎంతో మెత్తగా వుంది. ఈ బీచ్ లోకి వెళ్ళాలి అంటే పైన కార్లు ఆపుకుని కాలినడకన దాదాపు ఓ కిలోమీటరు  కొండ దిగి వెళ్ళాలి. ఆ కొండదారికి ఇరువైపులా ఆకాశాన్ని తాకుతున్నట్టు పొడవైన వృక్షాలు.  నడుమ సెలయేళ్ళు. వాటి మీద కర్ర వంతెనలు. ఆ కాలిబాటలో నడిచేవాళ్ళు ఒక నిబంధన పాటించడం గమనించాను. దిగేవాళ్ళు కుడివైపుగా దిగుతుంటే, పైకి వచ్చేవాళ్ళు ఎడమవైపుగా ఎక్కుతున్నారు.

ఆ చెట్లని చూస్తుంటే ఇవి కూడా పసిఫిక్ సముద్రంతో పాటే పెరిగాయా అన్నట్టు కొన్ని గజాల చుట్టుకొలతతో, మెడలు రిక్కించి చూడాల్సిన  ఎత్తులో వున్నాయి. గొడ్డలి వేటు అంటే ఏమిటో తెలియనట్టుగా పెరుగుతున్నాయి. పెనుగాలులు వీచినప్పుడు కూకటి వేళ్ళతో కూలిన పెద్ద చెట్టు ఒకటి కనిపించింది. అది అలాగే పడివుంది. దాని కాండం మీద మరికొన్ని చెట్లు పెరుగుతున్నాయి.  

ఆ కిలోమీటరు నడవడానికి నా ఒళ్ళు నాకే బరువనిపించి ఆయాసపడుతుంటే, ఆడా మగా తేడా లేకుండా చాలామంది బరువైన సర్ఫింగ్ బోట్లు పట్టుకుని చులాగ్గా నడిచి వెడుతున్నారు. రోజంతా బీచిలో, సముద్రంలో గడపడానికి తమవెంట తెచ్చుకున్న టెంట్లు, కుర్చీలు, తిండి పదార్ధాలు ఈ బరువుకి అదనం. బీచిలోకి అడుగు పెట్టగానే దుస్తులు తీసేసి, ఈత దుస్తుల్లోకి మారిపోయి సర్ఫింగ్ బోట్లు తీసుకుని, నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ  సర్ఫింగ్ చేయడం వాళ్ళకో ఆట మాదిరిగా వుంది. 

రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా వెలుతురు తగ్గలేదు. నీరెండలో నా నీడ పొడవు రెండింతలు సాగింది. సముద్రం మీద నుంచి వీస్తున్న బలమైన గాలులకు వాతావరణం బాగా చల్లబడింది. ఆ చలి గాలి తగలకుండా నన్ను రెండు గుట్టల నడుమ కూర్చోబెట్టారు. కోడలు భావన ముందుగా సిద్ధం చేసి తీసుకువచ్చిన పులిహార పెరుగన్నం తింటూ మెత్తటి ఇసుకపై మా చిన్న మనుమరాలి పేరు తెలుగులో రాశాను. అదోతుత్తి. అంతే!


కేనన్ బీచ్ లో, సముద్ర జలాల మధ్య వుండే  హే క్ కొండని చూడడానికి వెళ్ళాము. విపరీతమైన రద్దీ. పెయిడ్ పార్కింగ్ కోసం అరగంట వెతికినా దొరకలేదు. పదిహేనేళ్ల క్రితం వచ్చినప్పుడు దీన్ని దగ్గర నుంచి చూశాము. అప్పుడు సముద్రం బాగా వెనక్కి పోయింది. దానితో  కొండ తీరంలోకి వచ్చింది. చుట్టూ నీళ్ళ మధ్య వుండే ఈ కొండను పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి చేశారు.   

కేనన్ బీచ్ కి వెళ్లే దోవలో అడవి మలుపులో అడవి దుప్పి ఒకటి  కనిపించింది. చాలా బలిష్టంగా వుంది. అడవి జంతువుల స్వేచ్ఛకు భంగం కలిగించడం కానీ, అడవిలో దొరికే ఆహారం తప్పిస్తే, వాటికి  వేరే ఆహారం అందించడం కానీ వీల్లేదు. ‘మీరు అడవి జంతువుల ఆవాసాల్లోకి అతిధులుగా వచ్చారు. అలాగే వెళ్లిపోండి’ అనే బోర్డులు కొన్ని చోట్ల కనిపించాయి. 

ఇలాంటిదే ఒకటి అమెరికా కెనడా సరిహద్దులో చూశాను.

‘పక్షులు విశ్రాంతి తీసుకుంటున్నాయి వాటికి ఇబ్బంది కలిగించకండి’ అని బోర్డు పెట్టారు.

పోర్ట్ లాండ్ లో నాలుగు రోజులు గడిపి ఈ ఉదయం సియాటిల్ తిరిగివస్తూ మధ్యలో వాషింగ్టన్ రాష్ట్ర రాజధాని అయిన ఒలింపియాలో కాసేపు ఆగి అసెంబ్లీ భవనం, సుప్రీం కోర్టు (టెంపుల్ ఆఫ్ జస్టిస్) భవనాలను చూశాము. ఈరోజు ఆదివారం అనే కాకుండా చూడాలనుకునే వారు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. నిషేధాలు లేవు. అనుమతి పత్రాలు అక్కరలేదు. సెక్యూరిటీ తనిఖీలు లేవు. అసలు పోలీసులే లేరు. పైగా ఒక గైడ్ ని పెట్టి భవన విశేషాలను వివరిస్తారు. స్వేచ్ఛగా ఫోటోలు తీసుకోవచ్చు. చాలా పెద్ద భవనం. అనేక మెట్లు ఎక్కి వెళ్ళాలి. భవన నిర్మాణ శైలి అద్భుతంగా వుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అసువులు బాసిన అమర వీరుల స్మారక స్థూపం ఆ ఆవరణలో వుంది. 

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా చట్ట సభల్లో శాసనాలు చేస్తారు. ఆ భవనంలో పౌరుల ప్రవేశానికి అభ్యంతరాలు  ఎందుకు? ఆంక్షలు ఎందుకు అనే ప్రశ్నలకు తావు లేకుండా చేశారు.    

కింది ఫోటోలు: అరెగాన్ రాష్టంలో పసిఫిక్ మహాసముద్ర తీరాల్లో విహారం 



















(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: