నిద్ర పట్టని రాత్రి
‘నా టార్గెటెడ్ రీడర్స్ ఆడవాళ్ళు కాదు, మగవాళ్లు, అదీ పెళ్ళయిన వాళ్ళు’ అని చాలా కాలం క్రితం ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాను, నా భార్య విషయంలో నేను చేసిన తప్పులు, పొరబాట్లు వాళ్ళు చేయకుండా వుంటారు అనే ఉద్దేశ్యంతో. ఇలా పోస్టులు చదివి మనుషులు మారతారనే నమ్మకం నాకు లేదు. మారక పోయినా కొంత ఆలోచన మొదలవుతుంది అనే నమ్మకం మాత్రం వుంది.
‘డొమెస్టిక్ వయొలెన్స్ మాత్రమే హింస కాదు. ఉనికిని గుర్తించకుండా నిర్లక్ష్యం చేయడం అంతకంటే హింస’ అని సుజాత వేల్పూరి Sujatha Velpuri రాశారు ఒక పోస్టులో. ఇది చదివినప్పుడు నన్ను దృష్టిలో వుంచుకునే రాశారా ఏమిటి అనే సందేహం కలిగింది. ఎందుకంటే నా భుజాల మీద గుమ్మడికాయ గుర్తులు అలాగే వున్నాయి.
‘సమయానికి టిఫిను బట్టలు, భోజనం అమరుతుంటే నేను ఇంట్లో లేననే సంగతి కూడా గుర్తించడు మీ మామయ్య’ అదేమిటో చిత్రం, సుజాత అత్తయ్యగారు చెప్పిన ఈ మామయ్య పాత్రలో కూడా నాకు నేనే కనపడ్డాను.
‘అత్తయ్య అన్న ఆ మాటలో పెయిన్ తర్వాతెప్పుడో పెద్దయ్యాక కానీ, అర్ధం కాలేదని కూడా సుజాత రాసారు.
అచ్చు నాదీ ఇదే పరిస్థితి. మా ఆవిడ చనిపోయిన తర్వాత కానీ ఆమె అనుభవించిన బాధ నాకు అర్ధం కాలేదు. అర్ధం అయిన తర్వాత కొన్నాళ్ళపాటు ఆమె పడ్డ బాధలు గురించి తలచుకుంటూ అలా అలా రాస్తూ పోయాను. గతజల సేతు బంధనం వంటి నా పోస్టులు చదివి చాలామంది, ముఖ్యంగా మగవాళ్లు నా పట్ల సానుభూతి చూపుతూ ఓదార్పు మాటలు పలికారు. కొందరయితే, భార్యల పట్ల తమ వైఖరి మార్చుకుంటున్నామని కూడా రాసారు. అసలు ఆ ఆలోచన కలగడమే మారినంత ఫలం.
కరిగిన కాలాన్ని మళ్ళీ పట్టుకోలేము. మా ఆవిడ వున్నంతవరకు కాలం లేడిలా పరుగులు తీసింది. చుట్టూ వున్న ప్రపంచమే సర్వస్వం అయింది.
నేను రేపటి మనిషిని, నా ఆలోచనలు అభిప్రాయాలు వర్తమానం కంటే చాలా ముందుంటాయి’ అనేది నా గురించి నేను చాలా కాలంగా పెట్టుకున్న నమ్మకం.
అయితే వయసు దెబ్బయి తొమ్మిది దాటి, రేపోమాపో ఎనభయ్యవ పడిలో పడే సమయంలో కానీ, ఇందులోని డొల్లతనం నాకు తెలిసి రాలేదు.
నేను రేపటి మనిషిని కాకపోగా, ఎప్పటిదో పాతరాతి యుగం మనిషిని అనే వాస్తవం తెలిసి వచ్చింది. నిద్ర పట్టని రాత్రులు పెరిగాయి. కలత నిద్రల్లో పీడ కలలు పెరిగాయి. జ్ఞాపకాల ముసురుల్లో నిలువునా తడవడమే మిగిలింది.
గరుడ పురాణంలో పాపులకు వేసే శిక్షలు జ్ఞాపకం ఉన్నాయా!
అయితే ఒక ప్రేమ కధ చెబుతా వినండి. నాకు ఎలాగో నిద్రలేదు. మీరు మాత్రం ఎందుకు హాయిగా నిద్రపోవాలి?
అనగనగా ఓ అమ్మాయి. బుద్ధి తక్కువై ఓ అబ్బాయిని ప్రేమించింది. అంతటితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకుంది. దాంతో మొదలయ్యాయి ఆ అమ్మాయికి అంతులేని కష్టాలు.
అలాగని అతడు పెళ్ళాన్ని రాచిరంపాన పెట్టే బాపతు కాదు. ఆ అమ్మాయి అతడ్ని ప్రేమించినంత గాఢంగా, ఘాటుగా కాకపోయినా భార్యపై ఓ మోస్తరు ప్రేమకి తక్కువేమీలేదు.
మరిక కష్టాలు ఏమిటంటారా!
అతడికి దేవుడు అంటే నమ్మకమే. కానీ మూఢ భక్తి కాదు. గ్రహణాల పేరుతొ చూలింతలను చీకటి గదిలో పగలంతా పడుకోబెట్టడం వగయిరాలు నచ్చవు. భార్య తొలిచూలుతో వున్నప్పుడు సూర్య గ్రహణం వచ్చింది. చుట్టపక్కాల మాటల్ని, సలహాల్ని ఖాతరు చేయకుండా గర్భిణి అయిన భార్య చేత గోధుమ పిండి తడిపించాడు. ముద్దలు చేసి, చపాతీలు చేయించాడు. ఉల్లిపాయలు కోయించాడు. రోజువారీ పనులన్నీ పట్టుబట్టి అవసరం లేకపోయినా చేయించాడు. మూర్ఖంగా ఇవన్నీ చేయించాడే కానీ మనసు మూలల్లో ఏదో కలవరం. గ్రహణ కారణంగా పుట్టబోయే శిశువు అవకరంగా పుడితే... ఆ భయం అతడికి ఏ కొద్దోగొప్పో వుండివుండవచ్చేమో కానీ ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె ప్రేమలో ఏమాత్రం స్వార్ధం లేదు. అతడిపై పెంచుకున్న నమ్మకంలో అణుమాత్రం అపనమ్మకం లేదు. ఆమెది నిఖార్సయిన ప్రేమ. అందుకే అతడు చెప్పినవన్నీ నిశ్చింతగా చేసేసింది. తన భర్తపై ఆమెకు ఉన్న నమ్మకమే మూఢనమ్మకాలను జయించేలా చేసింది. మూఢాచారాలపై తన భర్త పెంచుకున్న అపనమ్మకాలకు ఒక విలువ దక్కేలా చూసింది. ఈ క్రమంలో అంత చిన్న వయస్సులోనే అంతులేని ధైర్య సాహసాలను ప్రదర్శించింది.
ఇప్పుడు చెప్పండి. గరుడ పురాణం నిజమే అయితే, భార్యను మానసికంగా ఇన్ని చిత్ర హింసలు పెట్టిన నాకు ఆ శిక్షలు పడాలంటారా లేదా!
అందుకే నా తోటి వారికి చెబుతున్నాను.
మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని అభిమానించేది...
మనం ఒకరిని ప్రేమించేది....
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికేనా?
పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికేనా?
పొద్దస్తమానం ఆగర్భ శత్రువుల్లా పోట్లాడుకోవడానికేనా?
ఎక్కడైతే, హక్కుల ప్రస్తావన రాకుండా వుంటుందో
ఎక్కడైతే, చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా వుంటుందో
ఎక్కడైతే, అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా వుంటుందో
ఎక్కడైతే, బలహీనతలను చూసీ చూడకుండా వుండడానికి వీలుంటుందో
ఎక్కడైతే, పొరపాట్లను మన్నించే మనస్సు వుంటుందో
ఎక్కడైతే, తన మాటే నెగ్గాలనే పంతాలు, పట్టింపులు వుండవో
ఎక్కడైతే, అవసరానికి కాకుండా ఆత్మీయతకు మాత్రమే చోటుంటుందో
ఎక్కడైతే, చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో
అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.
అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.
పొరబాట్లే చేయని సీతలు, శ్రీరామచంద్రులే కావాలంటే అలాటివాళ్ళు, గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.
తప్పులు చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు, సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!.
ఆలోచించండి!
ప్రేమను పంచండి, ప్రేమను పొందండి.
సంసారం వన్ వే కాదు.
ఇది నా అనుభవంతో చెబుతున్న మాట.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి