‘ఎప్పుడూ ఈయనకు ఈ భార్య నామస్మరణ ఏమిటి? ఎవరికి లేరు భార్యలు?’ అనే మాటలు నా చెవినపడక పోలేదు. అది నిజమే కదా! సమర్థించుకోవాల్సిన అవసరమేముంది?
మా ఆవిడకి ప్రియనేస్తం వనం గీత ఈ వాక్బాణాన్నే మరోరకంగా మా ఆవిడ మీద ప్రయోగిస్తూ వుండేవారు.
‘వస్తానండీ! మా ఆయన వచ్చే వేళ అయింది’ అనగానే, ‘ఏమిటి దుర్గా! (మా ఆవిడకి మరోపేరు) మాకు లేరా మొగుళ్లు? మీరు పోయి కాఫీ కలిపి ఇవ్వాలా! ఆ మాత్రం ఆయన చేసుకోలేరా! మరీ గారాబం చేస్తున్నారు’ అనేది నవ్వుతూ.
నిజానికి భార్య నామస్మరణ వేరు, భార్యావియోగం కారణంగా ఆమెను పదేపదే తలచుకోవడం వేరు. ఈ వియోగబాధ శ్రీరామచంద్రులవంటి వారికే తప్పలేదు. రావణ వధ అనంతరం సీతాదేవిని మళ్ళీ కనులారా చూసేవరకు సీతా సీతా అంటూ ఎన్ని సార్లు తలచుకున్నది రామాయణం గురించి తెలిసినవారందరికీ తెలుసు.
భార్యా వియోగం గురించి విశ్వనాధ వారి అనుభవం ఫేస్ బుక్ మితృలు, పెద్దలు జేవీపీఎస్ సోమయాజులు గారు రాసిన విషయాలు చదివిన తర్వాత అంతటి కవి సామ్రాట్ కే ఈ వేదన తప్పలేదని అర్ధం అయింది. విశ్వనాధ ప్రియ శిష్యులు పేరాల భరత శర్మ గారి ద్వారా ఈ సంగతులు సోమయాజులు గారికి తెలిశాయి. వారు పేర్కొన్న విషయాలు సంగ్రహంగా .
విశ్వనాధ వారు రాసిన రామాయణ కల్పవృక్షం గ్రంధానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. బెజవాడ రేడియో స్టేషన్ వారి ఆహ్వానంపై విశ్వనాధ సత్యనారాయణ గారు, తన శిష్యులు అయిన పేరాల భరత శర్మ గారిని వెంటబెట్టుకుని కారులో వెడుతున్నారు. అప్పుడు ముచ్చట్ల నడుమ విశ్వనాధ గారు ఇలా చెప్పుకొచ్చారట.
‘ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూవున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా, చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో ఏవో తెప్పిస్తేగాని తృప్తిగా వుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టం వస్తే, వానికి ఏమి మర్యాద చేయగలమా అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదుగదా ! ఆ వేళకు మాఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడనుండి ఊడిపడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమృతాయమానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ! నా బీదకాపురానికి అటువంటి సృష్టిచేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహా యిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956 లో మేడ కట్టాను. అప్పటివరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. కాని అప్పటి మా ఆవిడ పడిన కష్టం అంతా ఇంతా కాదు. వాన కురిస్తే ఇంట్లో మోకాటి లోతు నీళ్ళు. ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటిమీద యింత ఉడకేసి పెట్టాల్సివచ్చేది. అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది. లోపల ఉన్న జీవుడు ముందు స్థితి మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడినంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుఃఖమేమిటో కష్టమేమిటో తెలిసినంత సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలా వుంటుంది? బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్య లేదు. ఆమెకీ అనుభవంలేదు. ఇప్పుడింత మహాకవిని, అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె’’ ఈ మాటలాయన కళ్ళల్లో చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా!
‘‘వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి
…….ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను
నేలుకొనిన నా పట్టమహిషి’’
‘‘నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా
లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు’’
అని చెప్పారు.
శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరుఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకు కూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగ మహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన’ అని ముగించారు భరత శర్మగారు.
ఇంత అద్భుతమైన వృత్తాంతాన్ని అందచేసిన సోమయాజులు గారికి ధన్యవాదాలు.
అంత పెద్దవారితో పోల్చుకుని నా భార్యా వియోగానికి ఉన్నతిని కల్పించడం కోసం కాదు ఇది మొదలు పెట్టింది.
అమెరికా వచ్చిన తర్వాత కాలక్షేపం కోసం నెట్ సంచారం చేస్తుంటే, కొన్ని పాత వీడియోలు కంటపడ్డాయి. వాటిల్లో ఒకటి మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత్రికేయ రంగంలో జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించి నాకు అందచేసింది. ముఖ్యమంత్రి నుంచి అది స్వీకరిస్తున్నప్పుడు దాన్ని పైలోకాల్లో వున్న మా ఆవిడకి చూపించడానికి పైకి ఎత్తాను. నా ఈ చర్యను ఎవరు గమనించారో లేదో నాకు తెలియదు. నాకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఆమెకు మనసులో కొంచెం కినుకగా వుండేది. అది వచ్చిన రోజున ఆమె లేదు.
తోకటపా!
ఈ అవార్డు వచ్చిన ముహూర్త బలం ఏమిటో కానీ అప్పటి నుంచి నా రాజకీయ రచనా వ్యాసంగానికి స్వస్తి చెప్పాల్సిన దుర్గతి దాపురించింది.
అది ఒక ప్రభుత్వం ఇచ్చిన అవార్డు.
అయితే అప్పటికే రాజకీయ పారావారాలుగా విడిపోయిన సోషల్ మీడియాలో ఒక వర్గం నామీద దాడి మొదలుపెట్టింది. ఆఖరికి ఈ ట్రోలింగు (అప్పుడే మొదటిసారి ఈ పదానికి వున్న పదును నాకు బోధపడింది) గొడవల్లో అభం శుభం ఎరుగని, చనిపోయిన నా ఇల్లాలిని కూడా ఇరికించి అభాండాలు వేశారు. నలభయ్ ఏళ్ళ జర్నలిజం కెరీర్ లో ఏనాడు ఇటువంటి అపప్రథకు గురికాని నాకు ఆ పరిణామాలు చాలా మనోవేదన కలిగించాయి. నా భార్య చనిపోయి బతికిపోయిందనే భావన కలిగింది. దానితో రాజకీయ రచనా వ్యాసంగానికి భరత వాక్యం పలికాను. ఇతరుల రాజకీయ పోస్టులు, అవి ఎంత సమ్మతంగా ఉన్నాసరే, వాటికి లైకులు కొట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ స్వచ్చందంగా మానేశాను. టీవీ చర్చల నుంచి తప్పుకున్నాను. ఒంటరి జీవితంలో కొంత ఉపశమనం ఇస్తున్న వ్యాసంగాన్ని వదులుకుని మళ్ళీ ఒంటరి గుహలో కూర్చుని నా జీవిత కధా రచనతో కాలక్షేపం చేస్తున్నాను.
కింది ఫోటో:
విశ్వనాధ సత్యనారాయణ గారు

(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి