8, మార్చి 2017, బుధవారం

పూబోండ్లకు పూల కానుకలు

అలనాటి, అంటే ముప్పయ్యేళ్ళ నాటి మాస్కో ముచ్చట. మేము అయిదేళ్లున్న  కమ్యూనిస్ట్ రష్యాలో మహిళా దినోత్సవం వేడుకలు చూడడానికి రెండు కళ్ళు చాలవు. మొత్తం దేశం దేశం అంతా పండగ వాతావరణంతో నిండి పోతుంది. ఆడవారికి ఆ దేశంలో ప్రతి రోజూ ప్రత్యేకమైన రోజయినా ఇక మార్చి ఎనిమిదో తేదీ మరింత ప్రత్యేకం. మహిళలకు కానుకలు ఇవ్వడానికి పురుష ప్రపంచం పోటీ పడుతుంది. రష్యన్ మహిళలకు నగలూ, నాణ్యాలు కన్నా పూలు అంటే ముచ్చట ఎక్కువ. పూలంటే జడలో పెట్టుకునే పూలు కాదు. సన్న సన్న కాడలతో వున్న పూలు. మైనస్ ఫార్టీ డిగ్రీలు వుండే  ఆ చలిదేశంలో నిజానికి పూలకు పెద్ద కరువు.  ఆడవారికి కానుకగా ఇచ్చేటప్పుడు  బొకేల్లో వుండే పూల కాడలు బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. సరి సంఖ్య పనికి రాదు. అంటే, మూడు, అయిదు, ఏడు, తొమ్మిది ఇలా అన్నమాట. తెలిసినా తెలియకున్నా, ముఖ పరిచయం కూడా లేకున్నా ఈ పూల గుత్తులను ఆరోజు బహుకరిస్తే వారు చాలా ఆనందంగా స్వీకరిస్తారు. వెలిగిపోతున్న మొహంతో కృతజ్ఞతలు చెబుతారు. ముందే చెప్పినట్టు ఈ దృశ్యాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. 
  

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనాటి (08-మార్చ్-2017) "ఈనాడు" వార్తాపత్రికలో మొదటి పేజ్ లో కుడిపక్క వచ్చిన "నెత్తికెత్తుకున్న బాధ్యత" అనే చిన్న ఐటెమ్ చిత్తగించండి. స్టేజ్ వేసి దాని మీద సినిమా డాన్సులలాంటివి చెయ్యడం, నెక్లెస్ రోడ్ మీద పరుగులు పెట్టడం, టీవీల్లో అరుచుకుంటూ చర్చలు చెయ్యడం వల్లనే అవగాహన వచ్చెయ్యదు అనిపిస్తుంది ఈ న్యూస్ ఐటెమ్ చూస్తే.

నెత్తికెత్తుకున్న బాధ్యత

మేరా భారత్ మహాన్.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు: బాగా చెప్పారు.