“ఇవ్వాళ ఆంధ్రజ్యోతి చదివిన తరువాత కేసీఆర్ పట్ల
నాకున్న దురభిప్రాయాలు పూర్తిగా తొలగిపోయాయి”
హైదరాబాదులో సెటిలయిన ఒక తెలుగు మిత్రుడు
పండగ రోజు పొద్దున్నే ఫోను చేసి చెప్పిన మాట ఇది.
ఆయన ఇంకా ఇలా అన్నారు.
“ఉద్యమం రోజుల్లో ఒక పార్టీ నాయకుడిగా
ఆయన మాట్లాడిన మాటలు విని జీర్ణించుకోలేనంత కోపం పెంచుకున్న వాళ్ళలో నేనూ ఒకడ్ని.
అయితేనేం పాలకుడిగా కేసీఆర్ కు నేను నూటికి నూటపది మార్కులు వేస్తాను. ఉగాది రోజు
ఆయన చెప్పిన మాటలు పత్రికలో చదువుతుంటే పంచాంగ శ్రవణం మాదిరిగా వున్నాయి. ‘అధికారం
తలకెక్కొద్దు. పదవులతో మిడిసిపడవద్దు. మంచి, మర్యాద ముఖ్యం. పోస్టుల్లోకి రాగానే
మారిపోవద్దు. అదివరకు ఎలా వున్నారో అలాగే వుండండి.’ అని పార్టీవారికి చెప్పడం
నాకెంతో నచ్చింది. అంతేనా ! గుళ్ళ విషయంలో అనవసర జోక్యం పెట్టుకోవద్దని సొంత
పార్టీ శాసన సభ్యుడినే బహిరంగంగా హెచ్చరించిన తీరు చూసి నేను మురిసిపోయాను.
“నీకు సంబంధం లేని విషయాల జోలికెందుకు
పోతున్నవు? ఎవడన్నా గుళ్ళ తెర్వుకు పోతడా! చేయడానికి పనిలేనట్టు గుళ్ళ ఎంబడి
ఎందుకు పడుతున్నవు? నన్ను చూడు. యాదగిరి గుట్ట అభివృద్ధి మొత్తం చిన జీయరు
స్వామికి అప్పగించా! ఖతమైపోయింది. అన్నీ ఆయనే చూసుకుంటుండు.”
“యెంత లక్షణమైన మాటలు చెప్పారు
ముఖ్యమంత్రి. పాలకుడు అంటే ఇల్లా వుండాలి. ఒకానొక రోజుల్లో ఆయన్ని ద్వేషించినందుకు ఇప్పడు
సిగ్గుపడుతున్నాను” అన్నాడు గుంటూరు జిల్లాకు చెందిన నా మిత్రుడు.
ఇక ఎవరయినా చెప్పేది ఏముంటుంది?