పరిపూర్ణానంద స్వామి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పరిపూర్ణానంద స్వామి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, మార్చి 2017, బుధవారం

మనసు వుండాలేకాని మనుషుల్ని ఇలా కూడా మార్చవచ్చు


బహిరంగ సభని తలపించే సందర్భం అది.
చిత్తూరు జిల్లాలో మూడువందల గడప వున్న ఆ పాత కాలువ  గ్రామానికి ఏకంగా  పదివేలమంది తరలి వచ్చారు. అంతమంది చేరిన చోట చిన్న చిన్న సంఘటనలు తప్పవు. చిన్నవి అని ఉపేక్షిస్తే అలవికానివిగా మారే ప్రమాదం పొంచి వుంటుంది. ఆ సమయంలో ఒక గంభీర స్వరం ఆ ప్రాంతంలో మారు మోగింది.
రండి, కూర్చోండి. ప్రశాంతంగా వినండి.
“నేను మీ వూరుని దత్తత తీసుకుంటున్నా.
“మీ ఊరికి జరిగే మంచి చెప్పుకుందాం”
“ ఇది ఒక ఊరన్న మాటే కానీ పిల్లలు చదువు కునేందుకు బడి లేదు.
“మీ  పిల్లలు చదువుకోవడానికి కింద కూర్చుని ఇబ్బంది పడనక్కరలేదు. .. ఆ ముందు వరుసలో కూర్చున్న రాజు గారు మీ బడి నిర్మాణం బాధ్యత తీసుకుంటారు. బడికి కావాల్సిన బల్లలూ, కుర్చీలు అన్నీ ఇస్తారు. ఇక అదిగో ఆ వారున్నారే  మంచి ఉదారులు. మీ ఊరూ కాదు, మీ ప్రాంతమూ కాదు. అయినా మీ ఊరిమొత్తానికి చక్కటి  తాగు నీటి సౌకర్యం కల్పిస్తారు. తాగే నీళ్ళు సరిగా లేకపోతే రకరకాల రోగాలు ఒంటిని చుట్టుకుంటాయి. అందుకే ఈ ఏర్పాటు. పిల్లలకి మంచి చదువు, మీకు శుద్ధమైన మంచి నీళ్ళు. ఇంకా ఏమిటి మీ సమస్యలు, మొహమాట పడకుండాచెప్పండి." 
అంతే! సర్వత్రా కాసేపు నిశ్శబ్దం. ఆ వెనువెంటనే హర్షధ్వానాలు.
అప్పటిదాకా వకుళామాత గుడి మూలంగా తమకి క్వారీ ఉపాధి పోతుందంటూ ఉద్రేక పడుతున్న గ్రామస్తులంతా ఒక్కసారిగా మారిపోయారు. ఆనందంతో చప్పట్లు కొట్టేశారు. "మన పాత కాలువ స్వామికి జై" అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు.
ఆ మాటలు చెప్పింది, ఒక రాజకీయ నాయకుడు కాదు, సర్వం త్యజించిన ఒక సన్యాసి.
పాతకాలువ స్వామీ దండాలుఅన్నాయి అక్కడి గొంతులు.
ప్రపంచానికి పరిపూర్ణానంద స్వామిగా పరిచితులయిన శ్రీ పీఠం స్వామి వారు, ఆ క్షణంలో పాతకాలువ స్వామిగా మారిపోయారు.
స్థానికులతో మమేకం కావడం అంటే ఇదే. స్థానికుల మనసులను దోచుకోవడం అంటే ఇదే!
మన రాజకీయ నాయకులు ఎప్పుడు నేర్చుకుంటారు - ఇలా ప్రేమతో మనుషుల్ని గెలవటం?

ఎప్పుడో కాదు ఇది జరిగింది, మొన్నీ మధ్యనే. మార్చి నెల ఐదో తేదీన.


5, ఆగస్టు 2016, శుక్రవారం

కృష్ణా పుష్కర కరదీపిక

శ్రీ పీఠంతో కృష్ణా పుష్కర యాత్ర  
మా  చిన్న తనంలో మా బావగారు కొమరగిరి వెంకటప్పారావు గారు  ‘ముముక్షువు’ అనే ఒక ఆధ్యాత్మిక  పత్రిక తెప్పించేవారు. చాలా విషయాలు అర్ధం అయ్యీ  కానట్టుగా ఉండేవి. అర్ధం చేసుకోవాలనే తాపత్రయం వున్నా, మనసు మరో వాటి మీదకు లాగేది. ఒకటి మాత్రం నిజం. ఈనాటికీ  కొన్ని ఆధ్యాత్మిక అంశాల గురించి రాయగలుగుతున్నాను  అంటే  అది ఆ పత్రిక పుణ్యమే.
ఇప్పుడు కూడా తెలుగునాట అనేక  ఆధ్యాత్మిక పత్రికలు వెలువడుతున్నాయి. పరిపూర్ణానంద స్వామి సంకల్ప బలంతో నెలనెలా శోభాయమానంగా ప్రచురితమవుతున్న ‘శ్రీ పీఠం’ పత్రిక వీటిల్లో ఒకటి. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని తాజా సంచికలో అనేక ఆసక్తికరమైన వ్యాసాలను పొందు పరిచారు.




పుష్కరాలు అనగానే తటాలున గుర్తుకువచ్చేవి నదీ జలాల్లో పుణ్య స్నానాలు. ఆ పుణ్యస్నాన ఫలితాలతో పాటు పుష్కర వైశిష్ట్యాలను అరటి పండు ఒలిచి చేతికి అందించేంత సులభశైలిలో పలు వ్యాసాలను ఈ సంచికలో ప్రచురించారు. పుష్కర యాత్రీకులకు ఒక రకంగా ఇది కరదీపిక.
పుష్కర స్నానం సరే, అనుదిన స్నానాలను గురించి పరిపూర్ణానంద స్వామి సూటిగా ఓ మాట సెలవిచ్చారు.
“ఉత్తమం నదీ స్నానంచ మధ్యమంతు తటాకే
అధమం కూప స్నానంచ భాండ స్నానేన నిష్పలం”
నదీ స్నానం ఉత్తమం. చెరువు స్నానం మధ్యమం. ట్యాంకుల్లో, బిందెల్లో నిల్వవుంచిన నీతితో స్నానం చేయడం వల్ల ఏ ఫలితం వుండదని అర్ధం.
అంటే ఈ ఆధునిక కాలంలో ఏదైతో చేయరాదో అదే చేయాల్సి వస్తోంది. అంచేత పన్నెండేళ్ళకు ఓసారి వచ్చే నదీ పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేయడం మంచిది. పుష్కరాలు, కుంభమేళాల రూపంలో మన పూర్వీకులు ముందు చూపుతో కల్పించిన బంగారు అవకాశం అనుకోవాలి. అందులో భాగమే ఆగష్టు పన్నెండున  సూర్యోదయంతో మొదలవుతున్న కృష్ణా పుష్కరాలు.  
పరిపూర్ణానంద స్వామి పుష్కర యాత్రీకులకోసం ప్రస్తావించిన కొన్ని పసిడి పలుకులు ఈ ‘శ్రీ పీఠం’ ప్రత్యేక సంచికలో వున్నాయి. గత గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన దుర్ఘటన నేపధ్యంలో అ పలుకులను ఒక హెచ్చరికగా తీసుకోవాల్సి వుంటుంది.
“పుష్కర స్నానానికి ఒక ప్రత్యేక ముహూర్తం అంటూ ఏమీ  వుండదు. పుష్కర దినాల్లో ఏరోజునైనా సరే, ఉదయం నుంచి మధ్యాన్నం లోపు ఎప్పుడు కృష్ణలో  స్నానం చేసినా సరిపోతుంది అని స్వామి చెప్పారు.
“స్నాన సమయంలో సబ్బులు, షాంపూలు, ఆఖరికి సున్నిపిండి వాడడం కూడా కూడదని ఆయన సెలవిస్తున్నారు. నదిలో మట్టి విసిరివేయడం, పసుపు కుంకుమలు చల్లడం తగదని కూడా చెప్పారు.
మానవ నాగరికత మూడుపూవులు ఆరుకాయలుగా విలసిల్లడానికి మూలకారణం అయిన నదీమతల్లులను గౌరవించి, పూజించి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశాన్ని కల్పించడానికి కూడా ఈ పుష్కర సంప్రదాయాలు ఎంతగానో తోడ్పడతాయి.
పరిపూర్ణానంద స్వామి అనుగ్రహ హితోక్తులతో పాటు, ‘పుష్కర మహాత్యం’ గురించి బాచంపల్లి సంతోషకుమార శాస్త్రి, ‘పుష్కర విధుల’పై అన్నదానం చిదంబర శాస్త్రి, ‘జలసంపద లక్ష్మీ నారాయణులే’ అంటూ ధూళిపాళ మహాదేవమణి, ‘నేను, మీ కృష్ణమ్మను’  అనే పేరుతొ కృష్ణానది పుట్టుక నుంచి సాగర సంగమం వరకు ఆ నదీమతల్లి పోకడలను వివరిస్తూ ప్రయాగ రామకృష్ణ రాసిన సచిత్ర వ్యాసం, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ‘కృష్ణవేణీ౦ నమామ్యహం’, ఆచార్య విజయశ్రీ కుప్పా రచించిన కృష్ణవేణి పుష్కర రాణి’, డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు చారిత్రిక నగరం పేరుతొ వివరించిన బెజవాడ వైశిష్ట్యం,   పురిఘెళ్ళ వెంకటేశ్వర్లు రాసిన ‘కృష్ణాతీరంలో పొంగిన దేశభక్తీ’, ‘కృష్ణా తీరం పుణ్య క్షేత్రాల నిలయం’, కృష్ణా పుష్కరాల ప్రధాన వేదిక  బెజవాడ గురించి భండారు శ్రీనివాసరావు జ్ఞాపకాలు  మొదలయిన విశేషాలతో కూడిన రచనలను ఈ సంచికలో పొందుపరిచారు. చిత్రకారుడు, స్వామి వారి అనుగ్రహపాత్రుడు 'బ్నిం'.     
ముందే చెప్పినట్టు పుష్కర యాత్రీకులకు ‘శ్రీ పీఠం ప్రత్యేక సంచిక’ నిజంగా ఒక కరదీపిక.
“కృష్ణవేణీ౦ నమామ్యహం!!”

(www.sreepeetham.in, www.facebook.com/paripoornandaswami)  

4, జనవరి 2013, శుక్రవారం

వ్యక్తిత్వ వికాసం బోధించే హిందూ దేవుళ్ళు




వ్యక్తిత్వ వికాసం బోధించే హిందూ దేవుళ్ళు







ఈ రోజు భక్తి టీవీ ఛానల్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.
పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ చక్కని ముక్కలు చెప్పారు.
శ్రీ దేవి అంటే లక్ష్మీదేవి. సకల సంపదలు అనుగ్రహించే దేవత. భూదేవి అంటే భూమాత. చరాస్తికి ప్రతిరూపం శ్రీదేవి. స్తిరాస్తికి సంకేతం భూదేవి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఈ ఇద్దరు దేవేరులను తన వక్షస్థలంపై కుడి ఎడమల  ప్రతిష్టించుకున్నాడు. తనను దర్శించ వచ్చే భక్తులకు   భౌతిక సుఖాలకు నెలవయిన ఈ ఇద్దరినీ కాకుండా   వామ హస్తంతో తన  పాదాలను చూపిస్తుంటాడు. చరాస్తులు, స్తిరాస్తులు ప్రధానం కాదు మనిషి అనేవాడు తన సొంత ప్రతిభతో  సొంత కాళ్ళపై నిలబడాలని  వ్యక్తిత్వ వికాస బోధకులు ప్రబోధించే సూత్రాన్ని స్వామి ఆ విధంగా భక్తులకు బోధిస్తున్నాడన్న మాట.
ఇక పరమేశ్వరుడిని తీసుకుంటే ఆయన వొంటిపై అన్నీ పాములే. ఒక సర్పాన్ని చూస్తేనే వొళ్ళు జలదరిస్తూ వుంటుంది. అలాటిది అన్ని నాగుపాములను ధరించి కూడా శాంత మనస్కుడిగా వుండగలగడానికి కారణం ఆయన సిగలో నెలవయిన గంగమ్మ తల్లి. అన్నిరకాల ఉద్రికతలను ఉపశమింపచేయడానికి మెదడును ఎల్లప్పుడు చల్లగా, ప్రశాంతంగా  వుంచుకోవాలని చెప్పడమే శివతత్వం.
పోతే కృష్ణుడు. గోవులను కాచే గోపాలకుడు. గోవర్ధన గిరిధారి. హిందీలో గోవర్  అంటే గోమయము. (ఆవు పేడ) ధన్ అంటే ధనము. ఏడాది పాటు లభించే  ఒక్క ఆవుపేడతో కొన్ని ఎకరాల భూమిని సారవంతం చేయడానికి వీలుపడుతుంది. అలా పరిపుష్టమయిన భూమిలో  పంటలు బాగా పండుతాయి. దిగుబడి ఇబ్బడిముబ్బడిగా వుంటుంది. ఆహారానికి కొరత వుండదు. ఆవిధంగా   సస్యశ్యామలమయిన పల్లెటూళ్ళే దేశానికి ఆయువుపట్లు.
ఇలా హిందూ దేవతలనుంచి వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే మంచి విషయాలను నేర్చుకోవచ్చని పరిపూర్ణానందస్వామి వాక్రుచ్చారు.
మంచి మాటలు నాలుగు చెవిన వేసుకోవడం మంచిదే కదా!
శుభం! 
(04-01-2013)