వరదల్లో పులిహోర
రోశయ్య గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కృష్ణానదికి బ్రహ్మాండమైన వరదలు వచ్చాయి. కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కర్నూలు పట్టణంలోకి వరద నీరు ప్రవేశించి పెద్ద పెద్ద భవంతులు కూడా మునిగిపోయాయి. కొన్ని అపార్ట్ మెంట్లలో రెండో అంతస్తులోకి కూడా నీళ్ళు వచ్చాయి. ఇళ్లన్నీ వరద బురదతో పేరుకుపోయాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్తితులు చెప్పక్కర లేదు. హైదరాబాదు నుంచి చూడడానికి వెళ్లాము. ఒక అధికారి చెప్పాడు, ‘ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. ఇళ్లు వదిలిపెట్టి సహాయక శిబిరాలకు రావడానికి వాళ్ళు ఓ పట్టాన ఒప్పుకోవడం లేదు’
దీనికి సమాధానం ప్రజల దగ్గర నుంచే వచ్చింది. ఒకతను చెప్పాడు.
‘వున్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి రమ్మంటారు. ఎలా వెడతామ్. టీవీలు ఫ్రిజ్ లు చాలా ఖరీదైన వస్తువులు. మా పెద్దవాళ్ళ టైమ్ లో అయితే గోచీ పాత తప్పితే యేమీ వుండేవి కావు. ప్రతిసారీ వరదలు వచ్చినప్పుడల్లా వచ్చి ఖాళీ చేయమంటారు. మళ్ళీ వరదలు వస్తే మళ్ళీ ఇదే తంతు. మా బతుకులు గంగమ్మ నీడలోనే గడిచిపోతాయి. నీళ్ళను చూస్తూ పెరిగాము. నీళ్లంటే మాకు భయం లేదు. చూస్తున్నారు కదా. ఇక్కడ ఎన్ని కొంపలు వున్నాయో. ఇలా ప్రతిసారీ బోలెడు ఖర్చు పెట్టి ఖాళీ చేయించే బదులు వరద భయం లేని మెట్ట ప్రాంతాలలో మాకు ఇళ్లు కట్టించి ఇస్తే ప్రతియేడూ ఇలా తరలించే ఖర్చు ప్రభుత్వానికి కలిసి వస్తుంది కదా!’
బదులు చెప్పడానికి వీలులేని సమాధానం.
రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడు వుండడు అని సామెత. భయం కూడా అంతే! భయం అలవాటు అయిన కొద్దీ భయం పట్ల భయం పోతుంది.
కరోనా రోజులు గుర్తున్నాయా! ఒక పిట్టల్లా రాలిపోతున్నా, ప్రజలు ఏమాత్రం వెరపు లేకుండా వైన్ షాపులు తెరవగానే క్యూలు కట్టడం కళ్ళారా చూశాము కదా!
నేను హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తున్న రోజుల్లో ఓ సారి గోదావరి నదికి ఉధృతంగా వరదలు వచ్చాయి. పెరుగుతున్న వరద నీటి మట్టాలను గురించి ఎప్పటికప్పుడు చెబుతూ, ప్రజలని అప్రమత్తం చేయడానికి ఆ రోజుల్లో ఉన్న ఏకైక మీడియం చిన్న చిన్న బేటరీలతో పనిచేసే ట్రాన్సిస్టర్ రేడియో ఒక్కటే. దూరదర్సన్ వున్నా, ఆ ప్రసారాలకు కరెంటు వుండాలి. మామూలుగానే కరెంటు నిలకడగా వుండని ప్రదేశాలు. ఇక వానలు, వరదలు వస్తే చెప్పాలా! రోజుల తరబడి చీకటి రాత్రులే. వరదలు ముంచెత్తి లంకలుగా తేలిన గ్రామాలకు పత్రికలు చేరే ఛాన్స్ అస్సలు లేదు. అంచేత ఏ సమాచారం వాళ్లకు చేరవేయాలన్నా పనికొచ్చేది, అందుబాటులో వుండేది రేడియో మాత్రమే.
హైదరాబాదు నుండి ఆహార పొట్లాలను ప్రతి రోజూ రెండు దఫాలుగా హెలికాప్టర్ లో తీసుకు వెళ్ళి వరద ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు పైనుంచి జారవిడిచే వాళ్ళు. సహాయ కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరుతెన్నులను రేడియో వార్తల ద్వారా తెలియచెప్పడానికి రేడియో విలేకరిగా నేను కూడా ఒకసారి హెలికాప్టర్ లో భద్రాచలం ప్రాంతాలకు వెళ్లాను. అది మిలిటరీ హెలికాప్టర్. సీట్లు అవీ వుండవు. ఒక పక్కగా సీటు బెల్టులు ఉన్న ఒక చెక్క బల్ల లాంటిది వుంది. మిగిలిన జాగా అంతా పులిహోర పొట్లాలు, బిస్కెట్ల సంచులు. వాటిని కిందికి విసిరేసేటప్పుడు హెలికాప్టర్ ని బాగా కిందికి దించే వాళ్ళు. చెట్ల కొమ్మల మీదా, ఇంటి కప్పుల మీదా నిలబడిన జనం, హెలికాప్టర్ చప్పుడు వినగానే ప్రాణం లేచొచ్చినట్టు, పైకి చూస్తూ తమని గమనించమని చప్పట్లు కొట్టేవాళ్ళు. పైనుంచి సంచులను కిందికి వదిలేలోగా హెలికాప్టర్ వేగానికి బాగా ముందుకు వెళ్ళి పోయేది. ఆ సంచులు పడాల్సిన చోట పడకుండా ఎక్కడెక్కడో పడి నీళ్ళ పాలు అయ్యేవి. కానీ సైనికులది జాలిగుండె. మళ్ళీ వెనక్కి తిప్పి ఎక్కడనుంచి, ఎప్పుడు కిందికి పడేస్తే వాళ్లకు చేరుతుందో ఉజ్జాయింపుగా లెక్క వేసుకుని అనేక ప్రయత్నాలు చేసి, ఏదో ఒక విధంగా వాళ్లకు అందేటట్టు చూసే వాళ్ళు. నాచేత కూడా కొన్ని సంచులు కిందికి విసిరేయించారు.
హైదరాబాదు తిరిగి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ‘చుట్టూ నీళ్ళు వున్నా అవి తాగడానికి పనికి రాని నీళ్ళు’ అని చెప్పాను. అప్పట్లో ఈ వాటర్ బాటిళ్ళ పద్దతి లేదు. ప్లాస్టిక్ సంచుల్లో నీళ్ళు సప్లయి చేద్దామంటే అదీ కుదిరే పని కాదని తేలింది. రెండు మూడు రోజులు నిలవ వుండాలంటే పులిహోర తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదులా వుంది. కానీ పాచిపోయిన పులిహోర తింటే, డిసెంట్రి లాంటి రోగాలు వచ్చే ప్రమాదం కూడా వుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకు ముఖ్యంగా కావాల్సింది శుభ్రమైన నీళ్ళు అని డాక్టర్లు చెబుతారు. ఆ సంగతే నేను వాళ్ళతో చెప్పాను. ఈ ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చే లోగా గోదావరి వరదలు తగ్గుముఖం పట్టాయి.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి