ఆగస్టు వస్తోంది అంటే అదో రకం జలదరింపు.
నిజానికి కొన్నేళ్ళ క్రితం వరకు ఆగస్టు నెల మా కుటుంబానికి ఎంతో కావాల్సిన మాసం. మా పెద్ద వాడు పుట్టింది, నేను పుట్టింది, మా పెద్ద మనుమరాలు పుట్టిందీ ఈ నెలలోనే. మా పెళ్లి పెళ్ళిలా జరక్కపోయినా ఈ పుట్టిన రోజులు మాత్రం మా వాళ్ళు ఏటా ఒక పండుగలా జరిపేవారు.
అలాంటి ఆగస్టు నెల నా పాలిట ఒక పీడ కలలా తయారవగలదని నేనే నాడు అనుకోలేదు.
నన్ను మన్నించు! నన్ను క్షమించు!
గత ఏడేళ్ళుగా ఈ మాటలు నాలో నేను ఎన్ని లక్షల సార్లు అనుకుని ఉంటానో, ఇంకా అనుకుంటూనే వున్నానో లెక్క లేదు. ఇప్పుడు ఎన్ని అనుకున్నా, ఎన్నిసార్లు అనుకున్నా ఏమి లాభం, వినే మనిషి మనుషుల్లో లేకుండా పోయిన తర్వాత.
భద్రాద్రి రాముడిని ప్రస్తుతిస్తూ రచించిన దాశరధి శతకంలో కంచర్ల గోపన్న ఇలా అంటాడు.
“సిరిగల నాడు మైమరచి చిక్కిననాడు దలంచి పుణ్యముల్
పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలి చిచ్చుపై
గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త
త్తరమున ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ!”
శరీరానికి ముసలితనం వచ్చిన తరవాత, ఇప్పటి వరకు పుణ్యమైన పనులను ఏమీ చేయలేకపోయానే అని ఎంత బాధపడినప్పటికీ ప్రయోజనం ఉండదు. వేసవి వడగాడ్పులకు గొంతు ఎండి పోతుంటే అప్పటికప్పుడు బావి తవ్వాలని అనుకుంటే ఏం లాభం. అంచేత ఓపికగా ఉన్న రోజులలోనే భగవంతుడి మీద భక్తితో పుణ్య కార్యాలను చేయాలి. లేకపోతే ముదిమి వయసులో చింతించాల్సి వస్తుంది అనేది తాత్పర్యం.
భార్యాభర్తల్లో ఎవరు ముందో, ఎవరు వెనకో ఎవరూ చెప్పలేరు. అంచేత జీవించి ఉన్నప్పుడే ఒకరినొకరిని బాధ పెట్టే పనులు చేయకుండా, మనసును నొప్పించే మాటలు అనకుండా వుంటే ఆ తర్వాత కుమిలిపోవాల్సిన అవసరం వుండదు.
అలా అని మా ఆవిడని నేనేదో నానా బాధలు పెట్టానని కాదు, బ్రహ్మాండంగా సుఖ పెట్టాననీ కాదు, ఆమె జీవించి వుండగా ప్రేమించాల్సినంతగా ప్రేమించలేదేమో, ఆదరంగా పలకాల్సిన పలుకులు పలకలేదేమో అని మనసు మూలల్లో ఓ బాధ.
ఇది తీరేది కాదు.
ఆగస్టు మాసం వస్తోంది అంటే ఇది మరింత సెల వేస్తుంది.
2019 ఆగస్టు మొదటి వారంలో అనేక సినిమాలు చూశాము. రెండో వారంలో అనేక శుభ కార్యాలకు వెళ్ళాము. శ్రావణ మాసపు నోములు నోచుకుంది. అనేక మంది బంధువులు, స్నేహితుల ఇళ్లకు పేరంటాలకు వెళ్ళింది. వాయనాలు ఇచ్చింది, పుచ్చుకుంది. మూడో వారం చివర్లో తన జీవితపు చివరి అధ్యాయం ముగించుకుని వెళ్ళిపోయింది. మనుషులు ఇలా కూడా పోతారా అనే సందేహాన్ని నాకు మిగిల్చి వెళ్ళింది.
గుప్పెడు గుండె ఆగిపోయి గుప్పెడు బూడిదగా మారింది ఆగస్టులోనే.
ప్రతి మనిషి మెదడు ఒక టూత్ పేస్ట్ ట్యూబ్ లాంటిది. నొక్కిన కొద్దీ కొద్ది కొద్దిగా జ్ఞాపకాలు బయటకు వస్తుంటాయి. అయితే ఇది శాశ్వతం కాదని తెలుసు. ఎప్పుడో ఒకప్పుడు ట్యూబ్ లో పేస్ట్ అయిపోక తప్పదు. జ్ఞాపకాల దొంతర మాయమవక తప్పదు.
ఆ తర్వాత ఎంత నొక్కినా ఫలితం వుండదు. ఎంత జుట్టు పీక్కున్నా ఏదీ గుర్తుకు రాదు.
నా ఈ రాతలకు ఏదో ఒక రోజు ముగింపు తథ్యం.
నా రాతలు, చేతలు నాకెందుకు పనికి రాలేదు. చదివే వారిలో నూటికో కోటికో ఒక్కరికి పనికి వచ్చినా అదే పది వేలు. మీ జీవన సహచరులతో ఎలా మెలగాలో అలాగే మెలగండి. నా వంటి దురదృష్ట వంతులు కాకండి.
వయసు మీదపడ్డ కొద్దీ ఈ రకమైన జ్ఞానం కొత్త చిగుళ్ళు వేస్తుంది. కానీ లాభం లేని జ్ఞానం.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి