30, అక్టోబర్ 2019, బుధవారం

రేడియో రోజులు – 2 - భండారు శ్రీనివాసరావు

(30-10-2019 తేదీ బుధవారం సూర్య దినపత్రికలో ప్రచురితం)

ఉద్యోగం చేసేవాడికి డ్రెస్ కోడ్ వుండాలనేది మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి నిశ్చితాభిప్రాయం. అంటే  యూనిఫారం అని కాదు. హుందాగా వుండే దుస్తులు వేసుకుంటే అవతలవారికి మనపట్ల సరయిన అభిప్రాయం కలుగుతుందని ఆయన ఉద్దేశ్యం. అయితే, ‘రేపటి మనిషి’ గా నాకు నేను కితాబు ఇచ్చుకునే నాకు మాత్రం  వేసుకునే దుస్తులమీద అంత పట్టింపులు ఏమీ లేవు. ఆంద్ర జ్యోతిలో పనిచేసేటప్పుడు న్యూస్ పేపర్ నమూనాలో ప్రింట్స్ వున్న చొక్కాలు వేసుకుని తిరిగేవాడిని. రేడియోలో చేరిన తరవాత మా అన్నయ్య పట్టుబట్టి నా వేష ధారణలో కొంత మార్పు తీసుకురాగలిగారు. ఒకరోజు ఏదోపనిమీద రేడియో స్టేషనుకు వచ్చిన అయన మా న్యూస్ ఎడిటర్ పన్యాల రంగనాధరావు గారిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటె ఆయన రంగురంగుల బొమ్మల బుష్కోటు(బుష్ ష ర్ట్) తో ఆఫీసులో కనిపించారు.చూడడానికి చిన్న ఆకారమయినా - రంగనాధరావు గారిది నిజమయిన రేడియో స్వరం. ఆయన వార్తలని ఈ నాటికీ గుర్తుచేసుకునేవారు వున్నారు.
“ఆకాశవాణి – తెలుగులో వార్తలు చదువుతున్నది – పన్యాల రంగనాధరావు –డిల్లీ నుంచి ప్రసారమవుతున్న ఈ వార్తలను హైదరాబాద్, విజయవాడ, మద్రాసు  రేడియో  కేంద్రాలు రిలే చేస్తున్నాయి.” అంటూ ఆ వార్తలు మొదలయ్యే తీరు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అలాగే, జగ్గయ్యగారు వార్తలు చదివితే ఆయన కంఠం కంచులామోగేదని వినడమే కానీ ఎన్నడు ఆ వార్తలు వినలేదు. వార్తలు వినే వయసు వచ్చేసరికే బహుశా ఆయన సినిమా రంగానికి వెళ్ళిపోయివుంటారు.
హైదరాబాద్ లో రేడియోలో చేరిన కొత్తల్లో ఒక రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లేసరికి రంగనాధరావు గారు ఏదో పనిచేసుకుంటూ కనిపించారు.  ఏం పని మీద వచ్చావన్నట్టు నా వైపు చూసారు. నా  మోహంలో రంగులు మారడం చూసి – “ఇక్కడ మీకు పనేమిటి? మీరు రిపోర్టర్. బయట తిరిగితే కదా నాలుగు వార్తలు తెలిసేది?  రోజూ సెక్రెటేరియట్ కు వెళ్ళండి. మంత్రులు చెప్పేది వినండి. నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకు వచ్చి- తెచ్చి నా మొహాన కొట్టండి. అంతే! సింపుల్” అని తేల్చేసారు. అలా అంటూనే, “ఇంతకీ ఆఫీసుకు ఎలా వచ్చారు?” అని మరో అర్ధం కాని ప్రశ్న సంధించారు. “ఆటోలో వచ్చుంటారు. అవునా! అలా అయితే మీ జీతం డబ్బులన్నీ ఈ రిపోర్టర్ తిరుగుళ్ల కోసం ఆటోలకే తగలెయ్యాల్సి వుంటుంది. వార్తల సంగతి తరవాత. ముందు నేనో ఉత్తరం ఇస్తాను. దాన్ని తీసుకువెళ్ళి సమాచార శాఖలో ఇవ్వండి. అక్కడ అక్రిడేషన్ కార్డు తీసుకుని  ఆర్టీసీ ఆఫీసుకు వెళ్ళండి. వాళ్ళు ఇచ్చే బస్  పాసు తీసుకున్న తరవాతే –మిగిలిన ఏ పనులయినా! – తెలిసిందా” అన్నారు. తెలియకపోవడానికి ఏముంది. కానీ ఇలాటి పై అధికారులు కూడా వుంటారా అన్నదే అంతవరకూ తెలియని విషయం.
ఆంద్ర జ్యోతిలో పనిచేసేటప్పుడు నార్ల గారితో నాకు ఇలాటి అనుభవం ఇంకో రూపంలో ఎదురయింది. ఆయనకు   చండశాసనుడనే పేరు. పెద్దవాళ్ళకే ఆయన గారితో మాట్లాడాలంటే కాళ్ళల్లో వొణుకు. జ్యోతిలో చేరిన నాలుగు  నెలలకే నాకు రెండు రోజులు సెలవు కావాల్సివచ్చింది. ధైర్యం కూడదీసుకుని వెళ్లాను. ఏకళన వున్నారో ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే సంతకం పెట్టి ఆ రోజు  సంపాదకీయం రాసే పనిలో మునిగిపోయారు. నిజానికి ఎవరికీ సెలవు ఇచ్చే పరిస్తితి లేదు. ఆ విషయం నాకూ తెలుసు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధం ఒక కొలిక్కి వస్తున్నరోజులవి. అందరం రాత్రీ పగలూ అనకుండా పనిచేస్తుండేవాళ్ళం. నేను చేసే సబ్ ఎడిటర్ పనికి తోడు, యుద్ధ రంగంలో  భారత సైన్యం కదలికలను సూచించే మ్యాపులను కూడా తయారుచేసే పని చూసేవాడిని.
సరే. సెలవునుంచి వచ్చిన తరవాత వెళ్లి నార్లగారిని కలిసాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చిన సంగతి చెప్పాను. అప్పుడు ఆయన అన్న మాటలు ఇప్పటికీ జ్ఞాపకం వున్నాయి. “ఆదర్శాలు అంటూ ఏదేదో రాస్తూ వుంటాము. కానీ కుర్రాడివి నువ్వు చేసి చూపట్టావు. పో!  మళ్ళీ సెలవు ఇస్తాను పో! హాయిగా తిరిగి  నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగిరా! పో!” అన్నారు ఆయన స్టయిల్లోనే కరుగ్గా.
“నిండుమనంబు నవ్య నవనీత సమానము పల్కుదారుణాఖండలశస్త్రతుల్యము” అని వూరికే అన్నారా!   (ఇంకా వుంది)

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// "నిండుమనంబు నవ్య నవనీత సమానము పల్కుదారుణాఖండలశస్త్రతుల్యము” అని వూరికే అన్నారా!" //

పెద్దలు ఊరికే అనలేదనుకోండి గానీ దానిలో ఒక ఇబ్బంది ఏమిటంటే మనసు నవనీతం అనే సంగతి ఆ వ్యక్తికి దగ్గరగా వస్తేనే కదా ఎదుటివారికి బోధపడేది. పలుకు పెళుసు అన్న మాట మాత్రం త్వరగా ప్రచారం అవుతుంది. దాని వల్ల ... ఇటువంటి సూక్తిని నమ్మిన ... ఆ వ్యక్తికి నష్టం జరిగే ప్రమాదం బాగా ఉంటుంది ..... చెడ్డపేరు సంక్రమించడం, అవకాశాలు నిరాకరించబడడం వగైరా.