8, ఏప్రిల్ 2018, ఆదివారం

చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత


“ఏవిటండీ ఈ రాజకీయ నాయకులు మాట్లాడే భాష రోజురోజుకూ ఇలా దిగజారిపోతోంది?”
అన్నారు ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ పొద్దున్నే ఫోను చేసి.
ఆయన మృదు స్వభావులు. సున్నిత మనస్కులు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం డైరెక్టర్ గా పనిచేశారు. రేడియో కార్యక్రమాల్లో  ఏదైనా అప్రాత్యపు వాక్యం దొర్లినా విలవిలలాడేవారు. ఇక నేటి రాజకీయుల ఇష్టారాజ్యపు మాటల తూటాలు టీవీల్లో వింటూ ఇంకా యెంత మధన పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అనకూడని మాట, అనదగ్గ మాట అనే తేడా లేకుండా పోతోందని ఆయన బాధ. కానీ చేయగలిగింది ఏముంది? ఆయనంటే త్రేతాయుగం నాటి మనిషి.
త్రేతాయుగం అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ కాలంలో కూడా ఇలా ప్రల్లదనపు మాటలు మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. సీతను అపహరించుకుని పోయి లంకలో అశోకవనంలో బంధించిన రావణుడు సీతమ్మ వారితో అంటాడు.
“చనిపోయాడో, బతికున్నాడో తెలియని నీ మొగుడు రాముడి కోసం బాధపడుతూ నీ నిండు జీవితాన్ని ఎందుకిలా, ఎన్నాళ్ళిలా పాడు చేసుకుంటావు. నువ్వు ఊ అను, నా భార్యగా చేసుకుని లంకకు రాణిగా చేస్తా. జీవితంలో కనీ వినీ ఎరుగని భోగాలు అనుభవించేలా చేస్తా!” అంటూ పరాయి స్త్రీతో అనకూడని మాటలు అంటాడు.
దానికి సీత జవాబు చెప్పేముందు అక్కడ కనపడ్డ ఒక గడ్డిపోచను తనకూ, రావణుడికీ నడుమ ఉంచుతుంది, ‘నా దృష్టిలో నువ్వు తృణప్రాయం’ అనే సంకేతం ఇస్తూ.
ఇక ద్వాపర యుగంలో ఉచితానుచితాల అన్వయం  మరింత రూపు మార్చుకుంది.
నిండు కొలువులో ఏకవస్త్ర అయిన ద్రౌపదిని వలువలు ఊడ్చే ముందు, దుర్యోధనుడు ఆమెకు తన వామాంకాన్ని చేతితో  చూపుతూ, ‘రా! వచ్చి ఇక్కడ కూర్చో!’ అని సైగ చేస్తాడు. సభలో ఉన్న భీష్మ ద్రోణా దులు సిగ్గుతో మెలికలు తిరుగుతారు.
ఇక కలియుగం సంగతి చెప్పేది ఏముంది!
విలువల పతనం అనేది శంభుని శిరంబందుండి....అన్నట్టుగా అతివేగంగా సాగుతోంది. ఇక ఔచిత్యం, అనౌచిత్యం అనే తేడా లేకుండా పోతోంది. అందరూ ఔను అంటున్నప్పుడు ఇక ఈ తేడాపాళాల ప్రసక్తి ఏముంది?
పూర్వం కవులు తమ రచనల అవతారికలో ఒక విన్నపం చేసుకునేవారు.
“అనౌచిత్యంబు పరిహరించుచు, ఔచిత్యంబు పాటించుచు, ఈ రచన చేసాను” అని పేర్కొనేవారు, తెలిసీ తెలియక ఏమైనా రాయకూడని పదాలు వాడామేమో అనే శంకతో.
ఇప్పుడా కుశంకలు దివిటీ పెట్టి వెతికినా కనబడవు.           
పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నాడు వేమన. అలాగే, విభక్తుల్లో సంబోధన  ప్రథమా విభక్తి తరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కాలవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ఒసే’ అనడం, తండ్రిని ఒరే’ అనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగావడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతోంది.
వెనుకటి రోజుల్లో ....
పిల్లలు ఒకర్నొకరు సరదాగా గురూ, గురూ’ అని పిల్చుకుంటూ ఉంటే విని, పెద్దలు గుర్రుమనే వారు. ‘అలాంటి అపభ్రంశపు మాటలు మళ్ళీ మాట్లాడితే జాగ్రత్త’ అంటూ తొడపాశం పెట్టేవాళ్ళు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి, బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది. ఇంట్లో ‘అమ్మా’ అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం ‘మా అమ్మగారు’ అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు, ‘గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి’ అనోపూజ్యులైన తాతయ్యగారికి’ అనో వినమ్రత కనబరిచేవారు. వినయాన్ని సంస్కారంగావిధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతాసంస్కారాలకు అదే కొలమానంగా భావించేవారు.

ఇకపత్రికల్లో వాడే భాషసినిమాల్లో వినిపించే సంభాషణలుచట్టసభల్లో జరిగే చర్చలు  చాలా వరకు పరిధులకుప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణిదూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలువార్తలు గిరి గీసుకునిమడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానంగా  చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు. 
కానీకాలం ఒక్క తీరుగా ఉండదు కదా! జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టితరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడంఅమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత వేగవంతం’ చేయడంలో ఈనాటి ఎ టూ జెడ్’ ఛానెళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.

తరాలు మారుతున్నప్పుడు, వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడంహేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు, రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే, ఏది ఒప్పోఏది తప్పో చెప్పేవాళ్ళు లేకచెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతూ వుంటుంది.  తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలువైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను ఒసే అనడంనాన్నను ఒరే అనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకుపత్రికలకుపుస్తకాలకుచట్టసభలకు విస్తరించి, సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులుమేధావులుజర్నలిస్టులుకవులురచయితలుకళాకారులు  చెప్పే మాటల్లోప్రవచించే పలుకుల్లోరాసే రాతల్లో  సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు  ఈనాటి సినిమాలేఈనాటి ఛానళ్ళే, ఈనాటి పత్రికలేఈనాటి పుస్తకాలే, ఈనాటి సాంఘిక మాధ్యమాలే, ఈనాటి చట్ట సభలే! 
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు. రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు. 
 
పాలితులను బట్టే పాలకులు. పాఠకులను బట్టే పత్రికలు. ప్రేక్షకులను బట్టే సినిమాలు. వీక్షకులను బట్టే ఛానెళ్ళు.
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

తొక్క ,బొంగు, దూల,పుడింగి ,తోపు ..ఈ పదాలు ఇరవై యేళ్ళ క్రితం లేవు.తల్లి తండ్రులను ఒసే ఒరే అని రాసే రచయితలను దర్శకులని నటులని చెప్పుతో కొట్టాలి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “ ...... చెప్పుతో కొట్టాలి.“ //
పబ్లిగ్గా 😡.

Zilebi చెప్పారు...


డోన్ట్ వర్రీ బ్రో అన్నీ సర్దుకుంటాయ్ :)

గురూ , మచ్చా , బామ్మర్దీ ఇవన్నీ నేటి కాలానికి బ్రో గా మారిపోయేయి :)

సో కొత్త కొత్త పలుకులూ వచ్చేస్తాయ్ బ్రో :)
జిలేబి

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఏవిటి సర్దుకునేది “బ్రో” (లేక “సిస్” అనాలా?), ఇప్పటికే జనబాహుళ్యం లోకి చొచ్చుకుపోయి దైనందినభాషలో భాగమైపోయాయి. మరిన్ని కొత్త కొత్త పలుకులూ వస్తాయి అని మీరన్నది నిజం; ఎందుకంటే భ్రష్టుత్వం సంపూర్ణం అవ్వాలి కదా. అంతా సినిమావాళ్ళూ ఛానెళ్ళవాళ్ళూ చూసుకుంటారు లెండి, మనమేం శ్రమ పడక్కరలేదు.

Surya Mahavrata చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
instv చెప్పారు...

good afternoon
its a nice information blog...
The one and only news website portal INS media.
please visit our website for more news update..
https://www.ins.media/

Movie Masti చెప్పారు...

good afternoon
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..

https://www.ins.media/

Unknown చెప్పారు...

Good afternoon
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/