12, నవంబర్ 2021, శుక్రవారం

నా నడక చూడ తరమా! – భండారు శ్రీనివాసరావు

 “ఎక్కడికి వెళ్ళాలి పాపా! నేను డ్రాప్ చేస్తాను అంది నా కోడలు నిషా నేను చెప్పులు వేసుకోవడం గమనించి.

“ఇక్కడికి దగ్గరే. స్టేట్ బ్యాంకుకు వెళ్ళాలి. అప్పుడప్పుడు నాలుగడుగులు వేస్తుండడం నాకూ మంచేదేగా” అంటూ కిందికి వచ్చాను.
నేను వెళ్ళాల్సిన స్టేట్ బ్యాంకు బ్రాంచి కిలోమీటరు లోపలే వుంటుంది. మెయిన్ రోడ్డులో మధురా నగర్ మెట్రో స్టేషన్ దగ్గర.
మధ్యలో మెట్రో వుండడం వల్ల రోడ్డు కాస్త కుంచించుకు పోయింది. ఫుట్ పాతులు వున్నాయి కానీ దుకాణాల వాళ్ళ మోటారు సైకిళ్ళు, కార్లతో నిండి పోయాయి. కొంత దూరం నడవగానే మురికి నీళ్ళు ధారగా పారుతున్నాయి. ఏదో అపార్ట్ మెంటు లోపలనుంచి వస్తున్నాయి. వాళ్ళూ పట్టించుకుంటున్న దాఖలా లేదు. మహాకవి శ్రీశ్రీ తన గేయంలో చెప్పినట్టు “ఇటు చూస్తే అప్పులవాళ్లూ, అటు చూస్తే బిడ్డల ఆకలి!" అన్నట్టు రోడ్డు మీద ఎదురుగా వస్తున్న వాహనాల నుంచి తప్పించుకుని పక్కకు జరిగి బురదలో కాలు పెట్టాలో లేదా ధైర్యం చేసి వాహనాలకు ఎదురు వెళ్ళాలో అర్ధం కాలేదు. ఈ రెంటికీ ధైర్యం చాలక అక్కడ ఓ పండ్ల బండి వాడిని అడిగాను. అతడు కుడి వైపు సందులోకి తిరిగి కొంత దూరం పోయి మళ్ళీ ఎడమ వైపు తిరిగితే బ్యాంకు వస్తుంది అని తరుణోపాయం చెప్పాడు. అతడికి థాంక్స్ చెప్పి కుడికి తిరిగాను. కొంత దూరం పోగానే మళ్ళీ రోడ్డు మీద మురికి నీళ్ళు. అవి కూడా ఒక అపార్ట్ మెంటు వాళ్ళ పుణ్యమే. తమ ఇంటి నుంచి డ్రైనేజి నీళ్ళు బయటకి పోతున్నాయి కదా! అంతే చాలు! అని భావిస్తున్నట్టు వుంది.
అక్కడి వీధులకు ఈ నీళ్ళ ప్రవాహాలకు ఏదో లింక్ ఉన్నట్టుంది. కొద్ది దూరం పోగానే మళ్ళీ రోడ్డు మీద వైతరణి. తప్పించుకోవడానికి అలా కుడి ఎడమ రోడ్లు చుట్టబెడుతూ ఆఖరికి బ్యాంకుకు చేరాను.
అదేదో వాకర్స్ వాడే మిషన్/ మీటర్ ఉన్నట్టయితే ఎన్ని కిలోమీటర్లు ఆఫ్టర్ నూన్ వాక్ చేసిందీ లెక్క తేలేది.
వచ్చేటప్పుడు ఆటో పట్టుకు వచ్చాను అని వేరే చెప్పక్కర లేదు.
(12-11-2021)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మనోళ్లు తెలివి తేటలు ఇలాంటివే ... నా ఇంటి నుండి బయటకి వెళ్తే చాలు చెత్త అయినా , మురికి నీళ్లు అయినా ... గోడ మీద నుండి బయటకి విసిరేయడం, నీళ్లు బయటకి రోడ్ మీద కి తోసేయడం . వాకిలి ఊడ్చి చెత్త రోడ్ పక్కన తోసేయడం అంతే .
అధమం లో అధమ స్థాయి , లేకపోతే ఓటు కి మాకు డబ్బులు ఇవ్వలేదు అని ధర్నా చేసే అంత ఆలోచనలు ఏ దేశ పౌరులు కి వస్తాయి.(AP/TG)

ఇవే విషయాలు తిరిగి చెప్తే రోషం పోసుకుని వస్తుంది జనాలకి . సీరియస్ గ ఇంటికి వెళ్లి దుప్పటి కప్పుకుని కాసేపు పడుకుని లేచి మళ్ళి మామూలే ..