10, నవంబర్ 2021, బుధవారం

ప్రభుత్వ ధనం

 

మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు ఖమ్మం జిల్లాలో జిల్లా పౌర సంబంధ శాఖ అధికారిగా పనిచేస్తున్న రోజుల్లో అప్పటి రెవెన్యూ బోర్డు సభ్యుడు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి అనంత రామన్ ఖమ్మం దౌరాకు వచ్చారు. రెవెన్యూ బోర్డు సభ్యుడు అందులోను మొదటి సభ్యుడు అంటే చీఫ్ సెక్రెటరీ తరువాత అంతటి హోదా కలిగిన ఆఫీసరు. ఆ రోజుల్లో ఉన్నతాధికారులు కూడా రైళ్ళల్లోనే ప్రయాణాలు చేసేవాళ్ళు. అలాగే అనంత రామన్ హైదరాబాదు నుంచి రైల్లో ఖమ్మం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సయ్యద్ హషీం ఆలీ ఆయన్ని రైల్వే స్టేషన్ లో రిసీవ్ చేసుకుని దగ్గరలోని ప్రభుత్వ అతిధి గృహం హిల్ బంగ్లాలో దిగబెట్టారు. మర్నాడు అధికారిక సమావేశాలు, సమీక్షలు ముగించుకున్న తర్వాత అనంత రామన్ గారు గుట్ట మీద నరసింహ స్వామి గుడి చూడాలని వుందని కోరిక వెలిబుచ్చారు. ఆ గుడికి తీసుకువెళ్ళి దర్శనం చేయించే బాధ్యతను మా అన్నగారికి ఒప్పగించారు. కలెక్టరు గారి జీపులో అనంత రామన్ గారు, తన వ్యానులో మా అన్నయ్య గుడికి వెళ్లి పూజలు అవీ ముగించుకుని వచ్చారు. హైదరాబాదు రైలెక్కేముందు అనంత రామన్ గారు కలెక్టర్ గారి చేతిలో కొన్ని నోట్లు పెట్టి చెప్పారు.
‘మీరు జీపు ఇచ్చినన్ను గుడికి పంపారు, సంతోషం. కానీ అది ప్రభుత్వ వాహనం. కాబట్టి ఈ డబ్బు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయించండి’.
అది విని మా అన్నయ్య కూడా ‘నేను కూడా గుడికి వ్యానులోనే వెళ్లాను. కాబట్టి నా తరపున కూడా డబ్బు ట్రెజరీలో వేయండి’ అని కలెక్టర్ గారితో చెప్పారు.
ప్రభుత్వ ధనం అంటే పాముగా పరిగణించే రోజులవి.
మా అన్నయ్య తరవాత అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పీఆర్వో గా పనిచేసారు. సమాచార శాఖ డైరెక్టర్ అయ్యారు. ఫిలిం డెవలప్మెంటు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేసి శేష జీవితాన్ని పుట్టపర్తిలో గడపడానికి వెళ్లి అక్కడే ఆకస్మికంగా గుండెపోటుకు గురయి సునాయాస మరణం పొందారు.


(ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు కుడి వైపు కూర్చున్నది భండారు పర్వతాల రావు )


(మా రెండో అన్నయ్య రామచంద్రరావుగారు చెప్పిన విశేషాలు ఆధారంగా)

కామెంట్‌లు లేవు: