20, డిసెంబర్ 2024, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (44) - భండారు శ్రీనివాసరావు

 

హైస్కూలు నుంచి కాలేజీలో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి లాగే నేనూ ఏదో ప్రమోషన్ వచ్చినట్టు ఫీలయ్యేవాడిని. బట్టలు వేసుకోవడంలో, జుట్టు దువ్వుకోవడంలో, పుస్తకాల సంచీ కాకుండా ఏదో ఒక నోటు పుస్తకం మాత్రం చేతిలో పట్టుకుని ఉల్లాసంగా క్లాసులకు వెళ్ళడంలో ఈ మార్పు చాలా కొట్టవచ్చినట్టు కనిపించేది. క్లాస్ మేట్స్ ని ఏరా అనడం కాకుండా మీరు అని గౌరవంగా సంబోధించడం ఇవన్నీ ఎవరూ చెప్పకుండానే అర్ధం అయ్యాయి.

సైన్స్ గ్రూపు తీసుకున్న ప్రతివాడు భవిష్యత్తులో తానో డాక్టర్ కాబోతున్నట్టు కలలు కనేవాళ్ళు. ప్రవర్తన కూడా అదేవిధంగా వుండేది.

మా క్లాసులో రావులపాటి గోపాలకృష్ణ అని మా బంధువు ఉండేవాడు. రావులపాటి జానకి రామారావు గారి కుమారుడు. చక్కని పసిమి ఛాయ. నల్లటి రింగులు తిరిగిన ఒత్తయిన జుట్టు. చాలా అందగాడు. బాగా చదివేవాడు. క్లాసులో ఫస్ట్ మార్క్ టైపు. దానికి తగ్గట్టే జీవితంలో నిజంగానే డాక్టరు అయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద పదవులు నిర్వహించి రిటైర్ అయ్యాడు. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యారు. నాకు మంచి స్నేహితుడు. చదువుసంధ్యల్లో నాకు అంత మంచి పేరు లేకపోయినా, కాలేజీలో మంచి విద్యార్ధులు అందరూ నాకు మంచి స్నేహితులు. కవితలు గిలికే అలవాటు ఇక్కడ అక్కరకు వచ్చింది.

ఆ రోజుల్లో ఎన్.సీ.సీ. లో కేడెట్లుగా చేరే అవకాశం వుండేది. అందులో చేరితే రెండు జతల ఖాకీ యూనిఫారాలు, జత బూట్లు, సాక్స్, టోపీ ఇస్తారు. వీటిల్లో నన్ను ఆకర్షించింది బూట్లు. అంతవరకూ హవాయ్ శాండల్స్ తప్పిస్తే షూస్ మొహం ఎరగం కనుక మరో మాట లేకుండా అందులో చేరిపోయాము చాలామందిమి.

యూనిఫారాలు చూసుకుని మురిసిపోయాము. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మా కొలతలు తీసుకుని కుట్టించినవి కావు. లుడుంగు బుడుంగు మంటూ అవి వేసుకుని కవాతు చేస్తుంటే మమ్మల్ని  చూసి మాకే విచిత్రం అనిపించేది.

ఒకసారి వరంగల్ అనుకుంటా క్యాంపుకి తీసుకువెళ్ళారు. ఊరి బయట ఎక్కడో ఆ క్యాంపులో పెట్టారు. చుట్టూ అడవిలా వుంది. ప్రతితోజు పొద్దున్నే లేవడం, కాసేపు డ్రిల్లు, ప్లేట్లు పట్టుకుని లైన్లో నిలుచకుంటే రెండు రొట్టెలు, కూరా వడ్డించేవారు. తిని, ప్లేట్లు కడుక్కుని మళ్ళీ మనకు ఇచ్చిన బెడ్ రోల్ పైన పెట్టి మళ్ళీ లెఫ్ట్, రైట్.

చిన్నప్పుడు ఈ మిలిటరీ పదాలు బాగా వినవచ్చేవి, ఎందుకంటే మా చుట్టాల్లో కొందరు మిలిటరీలో కొంత కాలం పనిచేసిన వాళ్ళే. ఆ రోజుల్లో లెఫ్ట్ రైట్, అబౌట్ టర్న్, అటెన్షన్, స్టాండిటీజ్ (Stand at ease)  ఇలా ఉండేవి. సీవీఆర్  స్కూల్లో డ్రిల్లు టీచర్స్ కూడా ఇలానే డ్రిల్ చేయించేవారు.  వరంగల్ క్యాంపులో సావదాన్, విశ్రాం, పీచేముడ్, తేజ్ చల్.   ఇలా అవన్నీ  హిందీలోకి మారిపోయాయి.

రాత్రి పూట క్యాంపులో నిద్రపట్టేది కాదు. కీచురాళ్ళు చేసే ధ్వని. ఇళ్ళల్లో ఇలా పడుకునే అలవాటు లేకపోవడం. అయితే పొద్దంతా చేసిన కసరత్తుల వల్ల కాసేపటికి నిద్ర పట్టేది.

క్యాంపు ఒక రోజులో ముగుస్తుంది అనే సమయంలో ఆ రాత్రి ఒక కబురు తెలిసింది. దగ్గరలో వున్న ఒక దిగుడు బావిలో ఎవరో దూకి ఆత్మహత్య చేసుకున్నారని. భయం భయంగా వెళ్లి చూస్తే ఆ శవం బొక్కబోర్లాగా నీళ్ళపై తేలుతోంది. అప్పటికే నాని, బాగా ఉబ్బిపోయి వుంది. చాలామంది ఆ రాత్రి నిద్రపోలేదు. గమ్మత్తయిన విషయం ఏమిటంటే సైన్స్ గ్రూపులో చేరిన ప్రతి ఒక్కరు డాక్టరు కావాలనుకున్న వాళ్ళే. శవాలను అతి దగ్గరగా చూసి, వాటిని కోసి చదువు నేర్చుకోవాల్సిన వాళ్ళే. కానీ ఆ రాత్రి వారి భయం వర్ణనాతీతం.

మర్నాడు రైలు టైము కల్లా మమ్మల్ని  రైలు స్టేషన్ కు చేర్చారు. ఖమ్మంలో దిగి ఇంటికి చేరాము అన్నమాటే కానీ బావిలో తేలిన శవం కళ్ళల్లో మెదులుతూనే వుంది.

భయం సంగతి ఏమో కాని, ఎన్.సీ.సీ. లో చేరడం వల్ల కొంతలో కొంతయినా క్రమశిక్షణ అలవడింది.

కొన్ని దేశాల్లో వున్నట్టు విద్యాభ్యాసం పూర్తి కాగానే కొంత కాలం నిర్బంధంగా మిలిటరీలో పనిచేయాలనే నిబంధన మన దేశానికీ చాలా అవసరమేమో అని అనిపిస్తోంది. కుల, మత,  ప్రాంతీయ, భాషా  సంబంధమైన వివక్షల నుంచి భావి భారత పౌరులను విముక్తులను చేయాలి అంటే ఈ  రకమైన శిక్షణ విద్యార్థిదశ నుంచే అవసరం అనిపిస్తోంది.

ఇక నా చదువు విషయానికి వస్తే షరామామూలుగా తప్పడం, మళ్ళీ సెప్టెంబరులో ఊహాతీతంగా గట్టెక్కడం, ఈ  లోగా మా పెద్దన్నయ్యకు విజయవాడ బదిలీ కావడం, నేను కూడా వెళ్లి మాచవరం లోని ఎస్సారార్ అండ్ సీవీఆర్  ప్రభుత్వ కళాశాలలో బీ కాం లో చేరిపోవడం అన్నీ కామ్ గా జరిగిపోయాయి.  

కింది ఫోటో:


పీయూసీ లో నా క్లాస్ మేట్: డాక్టర్ రావులపాటి గోపాలకృష్ణ, భార్య డాక్టర్ రుక్మిణి


      

(ఇంకా వుంది)

 

 

 

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “ ఆ రోజుల్లో ఎన్.సీ.సీ. లో కేడెట్లుగా చేరే అవకాశం వుండేది.” //

కంపల్సరీ అని గుర్తే, భండారు వారూ🤔. స్కూల్లో కాదు గానీ ఆ రోజుల్లో కాలేజీలో కంపల్సరీగా NCC లో చేరాలని అనుకుంటాను.