డెబ్బయ్యవ
దశకానికి ముందు మా అన్నయ్య పర్వతాలరావు గారికి ఖమ్మం నుంచి బెజవాడ బదిలీ కావడం
వల్ల నేను ఎస్సారార్ కాలేజీలో, బీ కామ్ మొదటి సంవత్సరంలో చేరాను.
చేరిన కొత్తల్లోనే విద్యార్ధి సంఘం ఎన్నికల్లో భాగంగా లాంగ్వేజ్ అసోసియేషన్ ఎన్నిక
జరిగింది. మా క్లాసులో శతమానం భవతి అన్నట్టు వంద మంది. అదే కాలేజీలో బీ ఎస్సీ
చదువుతున్న నా మేనల్లుడు తుర్లపాటి సాంబశివరావు పూనికపై నేను కూడా పోటీ
చేస్తున్నట్టు పేరు ఇచ్చాను. మాచవరం నుంచి ఇద్దరం రిక్షాలో కాంగ్రెస్ ఆఫీసు
రోడ్డులో సింహాల మేడలోని విశ్వా టైప్ ఇన్స్తిటూట్ లో సూర్యనారాయణ అనే
ఫ్రెండ్ ని కలిసి, తెలుగులో అక్కడికక్కడే ఒక గేయం రాసి టైపు చేయించి, సైక్లో
స్టైల్ చేయించి కాలేజీకి తిరిగి
వచ్చి వాటిని క్లాసులో పంచిపెడుతుండగానే గంట మోగింది. వందలో నాకు పదిహేడు ఓట్లు
వచ్చినట్టు జ్ఞాపకం. దండిగా ఓట్లు తెచ్చుకుని గెలిచినదెవరంటే జేవీడీఎస్ శాస్త్రి.
చదువులోనే
కాకుండా శాస్త్రి, ఇతర విషయాల్లో కూడా ముందుండేవాడు. కాలేజీ కల్చరల్ అసోసియేషన్ కు ఆయనే
మకుటంలేని కార్యదర్శి. కవితలు,
గేయాలు గిలికే అలవాటున్న నాకు కూడా ఆ మకుటంమీద
కన్నుపడింది. వెనకాముందూ చూసుకోకుండా ఏకంగా ఆయనపైనే పోటీ చేశాను. అయితే ఆయన మకుటం
గట్టిది, నేను కొట్టిన దెబ్బ ఓటిది అని ఇట్టే తేలిపోయింది. ఓడిపోతే పోయాను
కానీ, ఆయనతో నా స్నేహం గట్టిపడింది. ఆయన మిత్ర బృందంలో నాకూ స్థానం
దొరికింది. ఇక ఆ మూడేళ్ళూ కలిసే తిరిగాము చదువయినా, సంధ్యయినా!
ఆ 'ఒక్కక్షణం' అనే గేయం
ఇలా సాగుతుంది.
"ఒక్క
క్షణం తొందరపడి ఓటు వృధా చేయకు - నిప్పుకణికెలాంటిదది నిర్లక్ష్యము చేయకు -
మాటలాడబోవుముందు ఒక్కసారి యోచించు - ఓటు వేయబోవుముందు కొద్దిగ ఆలోచించు -
స్నేహితునకు ఇవ్వదగిన బహుమానము కాదు ఓటు - శత్రువైన సరే నీకు! అర్హతున్నవానికేయి -
చేతులు కాలిన పిమ్మట ఆకులకై
వెదుకకు - మంచికైన చెడుకైన నీదే బాధ్యత మరువకు
- అర్హుడైన వాని గెలుపు నిజము సుమ్ము నీ గెలుపే"
ఎందుకో మా
తరగతిలో చాలామంది నా మాట మన్నించారు. చివరి పాదంలో చెప్పినట్టు జేవీడీఎస్ శాస్త్రిని
గెలిపించారు.
పూర్తి పేరు జంధ్యాల
వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే
జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి క్లుప్తంగా చేస్తే జంధ్యాల. తెలుగు సినీ ప్రేక్షకుల అభిమాన, ఆహ్లాద దర్శకుడు, రచయిత.
మొదటి పొడుగాటి
పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ
రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ అనే ‘కలం పేరు’ చిరస్థాయిగా
వెండి తెరపై స్థిరపడిపోయిన పేరు. తెలుగు హాస్యానికే వన్నె తెచ్చిన పేరు. అందుకే, తెలుగు
ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకుని అలా వుండిపోయింది.
ఈ భూమ్మీద పడ్డ
ప్రతి బిడ్డా ఏడుస్తూనే కళ్ళు తెరుస్తుంది. 1951లో నరసాపురంలో జంధ్యాల పుట్టినప్పుడు
బొడ్డు కోసిన మంత్రసాని జాగ్రత్తగా గమనించి వుంటే, ఏడుస్తున్న ఆ పిల్లాడి పెదవుల నడుమ
సన్నటి నవ్వుతెర కనిపించి వుండేదేమో.
జంధ్యాల
నాన్నగారు జంధ్యాల నారాయణమూర్తి బెజవాడలో పేరుమోసిన వ్యాపారి. అనేక జిల్లాలకు బుష్
రేడియో డీలరు. ఆ రోజుల్లో రేడియోలకి మంచి గిరాకి. అంచేత నారాయణ మూర్తిగారి
వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోయింది.
పుటకల నాటికే
జంధ్యాల బంగారు పిచిక. బీసెంటు రోడ్డులో ఏడంతస్తుల భవనం.
(ఏడంటే ఏడు అనికాదు, పెద్ద భవనం అని
కవి హృదయం. నిజంగానే చాలా పెద్ద ఇల్లు. ఎదురుగా వున్న మోడరన్ కేఫ్ కంటే ఎత్తుగా
వుండాలని నారాయణమూర్తిగారు ముచ్చట పడి కట్టించుకున్నారని ఆ రోజులనాటి ముచ్చట) అది
కట్టుకున్నాక వాళ్ళ నివాసం, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి దగ్గర నుంచి బీసెంటు రోడ్డుకి మారింది.
మాచవరం
ఎస్సారార్ కాలేజీలో మేము, అంటే జంధ్యాల, నేను ఒకే బెంచిలో కూర్చుని బీకాం చదువుతున్నట్టు నటిస్తున్నరోజుల్లో, కాలేజీ
ప్రిన్సిపాల్ తో సహా అయ్యవార్లందరూ రిక్షాలు, సైకిళ్ళమీద కాలేజీకి వస్తుండేవారు. మన జేవీడీఎస్
శాస్త్రి మాత్రం, అంబాసిడర్ కారులో వెనక సీట్లో కూర్చుని దర్జాగా వచ్చేవాడు. డ్రైవరు
డోరు తెరిచి నిలబడితే, కారు దిగి కాలేజీలో కాలు పెట్టే జంధ్యాలకు ‘కారున్న
కుర్రకారు’ అని పేరు పెట్టింది కూడా నేనే. (మరో విషయం జంధ్యాల చెప్పిందే. ఒకసారి
ఆయన హైదరాబాదు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చాడు. అప్పుడు తెలిసింది ఆయన నోటి నుంచి, మా ఆవిడ నిర్మల, పూర్వాశ్రమంలో
పేరు బాండ్ జేమ్స్ బాండ్ మాదిరిగా దుర్గ, కనక దుర్గ, ఆవిడా ఆయనా మాంటిసొరి స్కూల్లో క్లాస్ మేట్లు అని)
జంధ్యాల రాసిన
‘సంధ్యారాగంలో శంఖారావం’ నాటకం రిహార్సల్స్ హనుమంతరాయ గ్రంధాలయంలో వేస్తుంటే
వెంట నేనూ వుండేవాడిని,
ఏ వేషమూ వేయకపోయినా. ఏదో కవితలు గిలకడం వచ్చనే
పేరు నాకూ వుండేది. దాంతో మా స్నేహం మరింత చిక్కబడింది. డిగ్రీ తరువాత మా దారులు
వేరయ్యాయి. నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. ఆయన కధ సినిమా మలుపులు తిరుగుతూ
చెన్నై చేరింది.
కట్ చేస్తే...
మద్రాసులో
చందమామ రామారావు గారింట్లో ఒక ముందు గదిలో జంధ్యాల అఫీసు తెరిచాడు.
నేనొకసారి వెళ్లాను. గది బయట ‘జంధ్యాల, స్క్రిప్ట్ రైటర్’ అనే నేమ్ ప్లేటు. గదిలో ఒక మేజా బల్ల. దాని వెనుక కుర్చీలో
కూర్చుని రాసుకుంటున్న జంధ్యాల అనే జేవీడీఎస్ శాస్త్రి. వెనుకటి
రోజుల్లో మాదిరిగా లేడు. మామూలుగానే మంచి
ఛాయ కలిగిన మనిషి. కాకపోతే
జుట్టు కాస్త పలచబడింది. మొహంలో నవ్వు, ఆ నవ్వులో అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. హాయిగా పలకరించాడు. హాయిగా
కబుర్లు చెప్పుకున్నాము. హాయిగా నవ్వించాడు. హాయిగా నవ్వుకున్నాను. ఆ హాయి మనసంతా
నింపుకుని బెజవాడ తిరిగొచ్చాను.
మళ్ళీ కట్
చేస్తే...
నేను బెజవాడ
ఆంధ్రజ్యోతిని ఒదిలి, హైదరాబాదు రేడియోలో చేరాను. జంధ్యాల మద్రాసులో సినిమాల్లో బిజీ
అయిపోయాడు. పదేళ్ళలో రెండువందల సినిమాలకు మాటలు రాశాడంటే ఎంత పని రాక్షసుడిగా
మారివుండాలి!
ఒకసారి
హైదరాబాదు వచ్చాడు. రేడియో స్టేషన్ కు వచ్చాడు. తన దర్శకత్వంలో మొదటి సినిమా
‘ముద్దమందారం’ తీస్తున్నట్టు చెప్పాడు. ఒక గ్రామ ఫోను రికార్డు ఇచ్చి తన సినిమా
పాటలు రేడియోలో వచ్చేలా చేయడం కుదురుతుందేమో చూడమన్నాడు. ఎలాగూ వచ్చాడు కదా అని
రేడియోలో ఇంటర్వ్యూ రికార్డు చేసాము. స్టేజి నాటకానికీ, రేడియో
నాటకానికీ వుండే తేడా ఆయన అందులో విడమరచి చెప్పిన తీరు నన్ను విస్మయపరిచింది. నాకు
తెలిసిన జంధ్యాల, ఇప్పుడు చూస్తున్న జంధ్యాల ఒకరేనా అనిపించింది.. ఇంకోసారి కట్
చేస్తే...
ఓసారి ఢిల్లీలో
కలిశాడు. హైదరాబాదుకు చెందిన ఓ లాయర్ తో కలిసి, నేనూ జ్వాలా ఫైవ్ స్టార్
హోటల్లోని పుస్తకాల షాపులో తిరుగుతుంటే, తెలుగులో మాట్లాడుతున్న మమ్మల్ని జంధ్యాల
గుర్తుపట్టి అదే హోటల్లోని తన గదికి
తీసుకుపోయాడు.
గదికి వెళ్ళగానే, మాతో వచ్చిన లాయరు గారు ఎలాటి మొహమాటం లేకుండా, కొత్త చోటనికానీ,
కొత్త మనిషని కానీ సందేహించకుండా ‘ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా’ అని అడుగుతూనే జవాబుకోసం ఎదురుచూడకుండా
అందులో దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే ఆ గదిలో పరచిన తివాచీ పై
తల కిందకు పెట్టి, కాళ్ళు పైకి లేపి లిప్త మాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా
అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. చిన్న తల, పెద్ద బొజ్జ, అంత భారీకాయంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెర పోయారు.
ఏనుగు శీర్షాసనం వేస్తే ఎలా వుంటుందో అలాంటి దృశ్యాన్ని ఆరోజు చూశాము.
తరువాత
వారిరువురి నడుమ సాగిన కవి పండిత చర్చ విని తీరాలి. అప్పటికే ‘శంకరాభరణం’ సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల, విశ్వనాద్ గారిదే మరో సినిమా ‘సప్తపది’కి మాటలు రాస్తున్నాడు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ జరిగిన సంభాషణ
నిజానికి ఇద్దరు పండిత శ్రేష్ఠుల మధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం
స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకర్ని మించి మరొకరు, అక్షర
లక్షలు చేసే తర్కవిన్యాసాలు ప్రదర్శించారు. ‘సప్తపది’ సినిమా క్లైమాక్స్ లో ధర్మాధర్మ
విచక్షణకు సంబంధించిన ఈ అంశాలలో కొన్నింటిని జంధ్యాల పొందుపరచినట్టున్నారు కూడా.
ఈ చర్చ సాగిన
తీరు గమనిస్తే, నాకు కాలేజీలో తెలిసిన శాస్త్రి, ఇప్పుడు చూస్తున్న ఈ జంధ్యాల, ఈ ఇద్దరూ ఒకరేనా అన్న సందేహం మరోసారి కలిగింది. అంతటి పరిణతి ఆయనలో కనబడింది.
మరోసారి కట్
చేస్తే....
నా మకాం
మాస్కోకి మారింది. జంధ్యాల మద్రాసుకి అతుక్కుపోయాడు. క్షణం తీరిక లేని
జీవితచట్రంలో ఒదుగుతూ, ఎదుగుతూ
ఏళ్ళతరబడి ఉండిపోయాడు. కధా చర్చలు జరపడం కోసం, రాసుకోవడం కోసం
ఒకటి రెండు పెద్ద పెద్ద హోటళ్ళలో ఆయనకు పర్మనెంటు గదులు ఉండేవి. మాస్కో నుంచి విశ్వప్రయత్నం చేస్తే
మద్రాసులో ఏదో ఒక అయిదు నక్షత్రాల హోటల్లో
దొరికేవాడు. అంత దూరం నుంచి ఫోను చేస్తున్నందువల్లనో ఏమో, కాసింత తీరిక
చేసుకుని లైన్లోకి వచ్చి మాట్లాడేవాడు. అప్పటికే ఆయన బిజీ డైరెక్టర్ల కోవలోకి
చేరిపోయాడు. మాస్కో థియేటర్లో శంకరాభరణం చూశానని చెబితే ఎంతో సంబరపడ్డాడు. మాస్కో రమ్మని, అక్కడి మంచు వాతావరణంలో ఒక తెలుగు సినిమా తీయమని అనేక మార్లు
చెప్పాను. రెండేళ్ళదాకా కొత్త సినిమాలు గురించి ఆలోచించే తీరుబాటు లేదని
చెప్పేవాడు.
సోవియట్ యూనియన్
పతనానంతరం నేను హైదరాబాదు తిరిగి వచ్చి రేడియోలో చేరాను. జంధ్యాల మకాం కూడా చెన్నై
నుంచి భాగ్యనగరానికే మారింది. సినిమాల హడావిడి కొంత తగ్గినట్టు వుంది. ఎప్పుడయినా వెళ్లి
కలిసినా తీరిగ్గానే కనిపించేవాడు.
తరువాత చాలా
సార్లు కలుసుకున్నాము. భక్త రామదాసు ప్రాజెక్టు కోసం తరచూ ఖమ్మం వెడుతుండేవాడు.
ఆయన కారులోనే అప్పుడప్పుడు ఖమ్మం వెళ్లి వస్తుండేవాణ్ని. దోవలో ఎన్నో జోకులు
చెప్పేవాడు. చెప్పే సంగతులు మారేవి కానీ చెప్పే తీరులో మాత్రం తేడాలేదు.
ఇరవైనాలుగు
గంటలు బిజీ బిజీగా అనేక సంవత్సరాలు గడిపిన మనిషి ఖాళీగా వుండడం ఎంత బాధాకరంగా
వుంటుందో ఎప్పుడూ నవ్వుతుండే ఆయన మొహంలో అప్పుడప్పుడూ లీలగా కానవచ్చేది.
నిండు నూరేళ్ళ
జీవితం అనుకుంటే జంధ్యాల బతికింది యాభయ్ యేళ్ళే. కానయితేనేమి నూరేళ్ళకు సరిపడా
నవ్వులు నలుగురికీ పంచి పెట్టిపోయాడు.
ఆరోజు, 2001 జూన్,19, నాకు బాగా జ్ఞాపకం వుంది.
నేను రేడియోలో వుంటే, రాంపా ఫోను చేసి జంధ్యాల పోయాడని చెప్పాడు. నేను వెంటనే వార్త రాసి
ఇచ్చేసి రాజభవన్ రోడ్డులోని వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పుడే కబురు తెలిసి
ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఓ కుర్చీలో జంధ్యాల నాన్నగారు నారాయణమూర్తి గారు కూర్చుని వున్నారు. కానీ ఆయనకు ఏదీ తెలియని పరిస్తితి. జ్ఞాపక
శక్తి పూర్తిగా పోయింది. ఏమి జరిగిందన్నది, ఒక్కగానొక్క కొడుకు పోయాడన్నది
అర్ధం చేసుకునే స్తితి కాదు. ఏమిటో ఈ జీవితం అనిపించింది.
జంధ్యాల
చనిపోయిన రెండేళ్లకు వేటూరి సుందరరామమూర్తి ఇలా గుర్తుచేసుకున్నారు.
“హాస్యం, సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసం, నిన్నటి దరహాసం, జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు
గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు. ఎంత కాదనుకున్నా కన్నీళ్ళు కళ్ళతోనే
మింగటం కన్నా శరణ్యం లేదు”.
తెలుగుజాతి
‘చిరునవ్వు’, జంధ్యాల అన్నారు వేటూరి.
ఆ వేటూరిగారు
కూడా ఇప్పుడు లేరు. జంధ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.
కాని, ఆయన అన్నట్టు జంధ్యాల మార్కు నవ్వుకు మాత్రం మరణం లేదు.
తెలుగు సినిమా
రంగంలో ఓ వెలుగు వెలిగిన నాగయ్య ఒక తరానికి తెలుసు. నాగేశ్వరరావు మరో తరానికి
తెలుసు. నాగార్జున ఇంకో తరానికి తెలుసు. ఒక తరానికి తెలిసిన వాళ్ళు మరో తరానికి
అట్టే తెలియకపోవడంలో విడ్డూరం ఏమీ లేదు. అన్ని తరాలను నవ్వుల్తో రంజింప చేసిన
జంధ్యాల నిజంగా అమరుడు
తోక టపా :
" నేను వంటింట్లోకి వేరే పనిమీద వెళ్ళినాకూడా, వంట చేస్తున్న మా అమ్మగారు, ‘పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు
నిముషాలు’ అనేవారు నొచ్చుకుంటూ,
నేను అన్నం కోసం వచ్చాననుకుని.
ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే !”
అమ్మ ప్రేమ
గురించి ఇంత గొప్పగా చెప్పడం ఆ జంధ్యాలకే సాధ్యం!
కింది ఫోటోలు:
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి