15, డిసెంబర్ 2024, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (39) - భండారు శ్రీనివాసరావు

 


అలా వరసగా పరీక్షలు తప్పుతూ నాకు నేనుగా తెచ్చిపెట్టుకున్న సెలవులను మా స్వగ్రామం కంభంపాడులో కులాసాగా గడుపుతున్న రోజుల్లో ...కొన్ని పాత దస్త్రాలు నా కళ్ళపడ్డాయి. చదువు సరిగా అంటక పోయినా విషయాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి నాకు చిన్నతనం నుంచే వుండేది. అదే తరువాతి కాలంలో నేను ఎంచుకున్న వృత్తిలో ఎదగడానికి లేదా కొనసాగడానికి  దోహదం చేసింది. ఎప్పటిదో బ్రిటిష్ జమానానాటి  ఆ దస్త్రాలను మా మూడో అన్నయ్య కుమారుడు భండారు రాఘవరావు పదిలపరచడం నిజంగా గొప్ప విషయం. వాటి ద్వారా మా ఊరి గురించిన కొన్ని వివరాలు తెలిశాయి.  

1341 ఫసలీ (ఫస్లీ అనే ఈ పారశీక పదం  ఉర్దూలోకి దిగుమతి అయి చాలా భారతీయ భాషల్లో స్థిరపడింది. ఫసలీ అని, ఫస్లీ అని కూడా  అంటారు) బ్రిటిష్ జమానాలో ఇది వ్యవసాయక (HARVEST) సంవత్సరం. ఇప్పుడు  ఏప్రిల్ నుంచి మార్చి వరకు పన్నెండు నెలలను ఆర్ధిక సంవత్సరం అంటున్నారు కదా! అలా అన్నమాట. దీనికి 590 కలిపితే గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం 1931 అవుతుంది. గ్రెగేరియన్ అంటే  ఇప్పుడు వాడుకలో వున్న కేలండర్. 1931 అంటే  ఇప్పటికి అక్షరాలా తొంభయ్ మూడు సంవత్సరాలు గడిచాయి.  అప్పటినుంచి ఇప్పటివరకు మా వంశంలో మూడు తరాలు గడిచి నాలుగోది మా పిల్లల తరం నడుస్తోంది. 

‘DETAILED LIST OF JOINTLY REGISTERED  HOLDERS IN THE VILLAGE OF KAMBHAMPADU NO.144, NANDIGAMA TALUK, KISTNA DISTRICT అని ఇంగ్లీష్ లోను, కృష్ణ జిల్లా, నందిగామ తాలూకా, నె. 144 రు. కంభంపాడు గ్రామం, జాయింటు పట్టాదారుల లిస్టు వివరం’ అని తెలుగులోనూ వుంది. గ్రామంలోని యావత్తు పట్టాదారుల పేర్లు, పట్టా నెంబర్లు అన్నీ చక్కగా టైప్ చేసి వున్నాయి.

వివరాల్లోకి వెడితే, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దేశం మొత్తంలో గ్రామాల వారీగా సమగ్ర భూ సర్వే చేయించి ఆ వివరాలను అన్నిటినీ ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ ప్రభుత్వం పనుపున ఎలాంటి భూ సర్వే జరగలేదని ఊరిలోని కొందరు పెద్దవారు చెప్పారు. ఇది అప్పటి మాట. (అయితే ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలలో సమగ్ర భూసర్వే సర్వే జరుగుతోందని,  అధునాతన సర్వే పరికరాలు, డ్రోన్ల సాయంతో ఈ సర్వే సాగుతోందని, రేపోమాపో మా ఊరిలో కూడా భూముల సర్వే పూర్తయి కొత్త సరిహద్దు రాళ్ళతో కూడిన పట్టాలు ఇస్తారని అంటున్నారు. దశల వారీగా జరుగుతున్న ఈ పని కొంత పూర్తి అయిందని, ఇది పూర్తయితే  భూములకు సంబంధించిన వివాదాలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని ఓ చిన్ని చిన్ని ఆశ) 

ఇదలా ఉంచితే, తొమ్మిది దశాబ్దాల క్రితం జరిగిన ఈ సర్వేలో మా గ్రామానికి సంబంధించిన అనేక విషయాలు తెలిశాయి. అప్పటికే మా ఊరి చెరువు కింద, మునేరు ఆనకట్ట కాలువ కింద భూములకు సేద్యపు నీరు అందేది. (ప్రస్తుతం నాగార్జున సాగర్ ఎడమ కాలువ, బ్రాంచ్ కెనాల్ ద్వారా కూడా మా ఊరికి సేద్యపు నీరు అందుతోంది) సాగుకు వీలైన భూమి మొత్తం 3591.41 ఎకరాలు వుండేది. ఇందులో  128 ఎకరాల్లో వరి, 1101 ఎకరాల్లో జొన్న పండించేవారు. ఇవికాక, సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు, ప్రత్తి, పొగాకు మొదలైన పంటలు కూడా పండించేవారు.  సాగుకు పనికి రాని భూమి 3,440 ఎకరాలు, పోరంబోకు భూములు 365.14 ఎకరాలు కాగాగ్రామంలో భూమిశిస్తు మొత్తం  4720 రూపాయలు వసూలు అయ్యేది.   9.85 ఎకరాల్లో బందెలు దొడ్డి వుండేది. రికామీగా  తిరుగుతూ ఊళ్ళో వారి చేలపై పడి మేసే గొడ్లని పట్టుకుని  కట్టివేసే దొడ్డి అన్నమాట.  నిర్ణీత అపరాధ రుసుము చెల్లించి వాటి యజమానులు ఆ పశువులను విడిపించుకునేవారు. 

1929 వ సంవత్సరం జమాబందీ  లెక్కల ప్రకారం, ఊరి మొత్తంలో  1620 పశువులు (ఆవులు, ఎడ్లు, గేదెలు, దున్నపోతులు వగైరా)  675 గొర్రెలు, మేకలు వుండేవిట. 

అంత పాత కాలంలోనే ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా భూముల సర్వే గ్రామాల వారీగా జరిపి రికార్డులని భద్రపరిచారు అంటే అలనాటి రెవెన్యూ వ్యవస్థ ఎంత పకడ్బందీగా పనిచేసేదో అర్ధం చేసుకోవచ్చు.

ఒకప్పుడు, నాకు ఎరుక తెలిసేటప్పటికే  మా ఇంట్లోనే డజన్ల కొద్దీ పాడి పశువులు, ఎడ్లూ, కోడె దూడలు, ఎడ్ల బండ్లు, అరకలు   ఉండేవి. ఇప్పుడు ఆ పాడీ లేదు, పశువులూ లేవు. వెనుకటి రోజుల్లో పెరుగు, మజ్జిగ అమ్మడం నేను చూడలేదు. కొనుక్కోవడం అసలు ఎరగం. వూళ్ళో ఎవరింటికి అయినా చుట్టాలు వస్తే పాలూ, పెరుగూ ఇరుగింటి పొరుగింటి వారే పంపేవారు. వచ్చిన  బంధువులు పడుకోవడానికి నులక మంచాలు, నవారు మంచాలు  కూడా పంపేవారు. ఏదైనా సందర్భం వచ్చి ఊళ్ళో పదిమందికి భోజనాలు పెట్టాల్సి వస్తే, ఎవరి చెంబులు,  గ్లాసులు వాళ్ళే వెంట తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు వెనుకబడిన ప్రాంతం అనుకునే  మా ఊళ్లోనే వంట సామాన్లు, వడ్డన సామాన్లు, మీల్స్ టేబుల్స్, కుర్చీలు  అద్దెకు ఇచ్చే టెంటు హౌస్ లు రెండు మూడు వున్నాయి.   

వూరి నిండా కార్లూ, స్కూటర్లు, ట్రాక్టర్లు. వీటికి   మాత్రం కొదవలేదు. అందరి చేతిలో సెల్ ఫోన్లు. బస్తీలలో లాగే పల్లెల్లో కూడా ఓ  మాటా లేదు, ముచ్చటా లేదు. ఎవరి ప్రపంచం వారిదే.

కింది ఫోటో:


(Courtesy Cartoonist)







(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: