హెచ్ ఎస్ సీ
పరీక్షల్లో నేనెక్కిన ఎం.ఎస్.ఎం. బండి మొత్తం మీద చివరి స్టేషన్ చేరి ఆ మార్చిలో పరీక్ష
గట్టెక్కాను. ఖమ్మం గుట్టల బజారు దాటి వెళ్ళిన తర్వాత ఫుడ్ కార్పొరేషన్ వారు వాడి
వదిలేసిన రేకు గోడౌన్లలో కొత్తగా పెట్టిన శ్రీ రామ భక్త గెంటేల నారాయణ రావు ప్రభుత్వ
కళాశాలలో పీ యూ సీ సైన్స్ గ్రూపులో చేరాను. అది ఏడాది కోర్సు. తరువాత బీ ఎస్సీ మూడేళ్లు.
అయితే పీ యూ సీ సైన్స్ గ్రూపు తీసుకున్న ప్రతివాడు తరువాత కాలు పెట్టేది మెడికల్
కాలేజీలోనే అనే ధీమాతో కాలర్ ఎగరేస్తుంటాడు. దానికి నేనూ మినహాయింపు కాదు. చదువు
సరిగా రానివాడికి ఆశల పల్లకీలో ఊరేగింపులు ఎక్కువ. సరే ఇక్కడ కో ఎడ్యుకేషన్.
ఆడపిల్లలు కూడా వుంటారు. చదువులో రాణించి వాళ్ళను ఆకట్టుకోవడంకష్టం కాబట్టి నా
బోటి మగపిల్లలు ఇతర మార్గాలు అన్వేషిస్తూ వుంటారు. నాకు తేలిగ్గా కనబడింది
కవిత్వం. కాపీ కవిత్వం అయినా సరే ఏదో విధంగా కుర్రకవిని అని అనిపించుకోవాలని
తాపత్రయం.
సైన్స్ లాబ్ లో జువాలజిలో
కప్పలను కోసి చూపించేవాళ్ళు. రైలు కట్త పక్కన నీటి మడుగుల్లో కప్పలను వెతికి
పట్టుకుని హీరోల మాదిరిగా కాలేజీ లాబ్ లో డిసెక్షన్ చేసేవాళ్ళం.
‘నే కోసిన కప్పల
నెత్తురు భగవంతుని హృదయంలో నిప్పులు, ఈ ఏటిలో నే చేసిన పాపాలన్నీ పై
చదువుకు సోపానాలే’ అంటూ కవితలు గిలకడం. ఆర్ట్స్
సెక్షన్ లో అయితే ఈ ట్రిక్కులు కొంత పనిచేస్తాయి. సైన్స్ గ్రూపు పిల్లలు చాలావరకు బుద్ధిమంతులు.
బాగా చదివి డాక్టర్ కావాలనుకునే బాపతు. నా స్నేహితుడు రావులపాటి గోపాలకృష్ణ ఈ
కోవలోకి వస్తాడు. బాగా చదివి నిజంగానే డాక్టర్ అయ్యాడు.
అతి తెలివితేటలు
వికసించేది కూడా బహుశా ఆ వయసులోనే అనుకుంటా.
తెలుగు మాస్టారు
మనుచరిత్ర పద్యాలను మనోహరంగా పాడేవారు.
"అటజనికాంచెభూమిసురుడంబరచుంబి
శిరస్సరజ్ఝరీపటలముహుర్ముహుర్లుఠదభంగతరంగమృదంగనిస్వన
స్ఫుటనటనానుకూలపరిఫుల్లకలాపకలాపిజాలమున్
గటకచరత్కరేణుకరకంపితసాలముశీతశైలమున్"
ఈ పద్యం చదివి
ప్రతిపదార్ధం చెబుతుంటే, రవిగాంచనిచో కవి
గాంచును అని ఎందుకు అంటారో బోధపడింది. పెద్దన ఎక్కడి వాడు, హిమాలయాలు
ఎక్కడివి, ఎప్పుడు వెళ్ళని చోటును గురించి పెద్దనామాత్యులు అంత కవితాత్మకంగా
ఎలా ఊహించి వర్ణించ గలిగాడు అనే విషయాలను వివరిస్తుంటే తెలుగు మాస్టారి గొప్పతనం పట్ల
గౌరవం మరింత పెరిగేది.
అదేమిటో తెలియదు, విద్యార్ధులు ఏడిపించాలని
చూసేది కూడా ఈ లెక్చరర్లనే. ఒకరోజు పాఠం
చెబుతుంటే, ప్లవంగం అనే మాట వచ్చింది. ఒకడు లేచి ప్లవంగం అంటే ఏమిటి అదో రకం
లవంగమా అనే వెక్కిరింతగా అన్నాడు. మాస్టారు కోపం తెచ్చుకోకుండా ప్లవంగం అంటే ఎవరో
కాదు, నువ్వే అన్నారు. అప్పుడు ఎవరికీ అర్ధం కాలేదు. తరువాత డిక్షనరీ
చూస్తే, ప్లవంగం అంటే కోతి అనే అర్ధం కనబడింది.
నేను ఒక ఏడాది
మాత్రమే చదువుకున్న ఈ కాలేజీకి పూర్వచరిత్ర వుంది. నిజాం పాలన ముగిసిన తరవాత
హైదరాబాదు స్టేట్ (సంస్థానం) ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారికి కలిగిన
ఆలోచన ఫలితమే ఈ కాలేజి. వరంగల్ జిల్లా నుంచి విడదీసి ఖమ్మం కేంద్రంగా కొత్తగా
ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ కాలంలో ఒక్క హైదరాబాదు నగరం, వరంగల్ మినహాయిస్తే
మొత్తం తెలంగాణా ప్రాంతంలో ఎక్కడా డిగ్రీ కాలేజి లేదు. అప్పుడు ముఖ్యమంత్రిగా
వున్న బూర్గుల రామకృష్ణారావు గారు, తెలంగాణలో ప్రతి జిల్లాలో ఒక డిగ్రీ కాలేజి ఏర్పాటు చేయాలని నిర్ణయం
తీసుకున్నారు. నాటి జిల్లా కలెక్టర్ జీ.వీ.
భట్, జిల్లాకు చెందిన ప్రముఖులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీయుతులు బొమ్మకంటి
సత్యనారాయణ రావు, ఎస్.ఎన్. మూర్తి, వి.శ్రీనివాసరావు, కౌటూరి కృష్ణ మూర్తి, (మా
నాలుగో బావగారు), రావులపాటి జానకి రామారావు ఈ కమిటీలో సభ్యులు. కళాశాల స్థాపనకు
నిధుల సేకరణ పెద్ద ఇబ్బందిగా మారింది. భద్రాచలం సీతారామస్వామి దేవాలయంలో సీతమ్మ
వారికి భక్తరామదాసు చేయించి ఇచ్చిన పచ్చల పతకాన్ని అమ్మాలనే ఆలోచన కూడా చేశారు. ఈ
విషయం గెంటేల నారాయణ రావుగారి చెవిన పడి మనస్తాపానికి గురయ్యారు. ఆయన గొప్ప రామ
భక్తుడు. వెంటనే ఆయన వెళ్లి జిల్లా కలెక్టర్ ని కలిసి, అమ్మవారి పతకం
అమ్మే పనికి పూనుకోవద్దని, భూసేకరణకు అవసరం అయ్యే లక్ష రూపాయలు తాను విరాళంగా ఇస్తానని
చెప్పడమే కాకుండా ఆ డబ్బు అందచేశారు.
ఈ కారణంగా ఈ
కాలేజీకి శ్రీ రామభక్త గెంటేల నారాయణ రావు గారి పేరు పెట్టారు.
ఖమ్మం జిల్లాలో ఈ
మొట్టమొదటి కాలేజీని ప్రారంభించడానికి అప్పటి హైదరాబాద్ స్టేట్
ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఖమ్మం వచ్చారు. ముఖ్యమంత్రి వచ్చిన నాన్
ఏసీ అంబాసిడర్ కారులో ఆయనతో పాటు బొమ్మకంటి సత్యనారాయణ
రావు గారు కూడా వచ్చారు. ఎలాటి హడావిడీ లేదు.
బూర్గుల గారు తమ
ఉపన్యాసంలో చెప్పారు.
‘తెలంగాణా
మొత్తంలో అటు హైదరాబాదు, వరంగల్ మినహాయిస్తే ఎక్కడా కాలేజీలు లేవు. అందుకే జిల్లాకు ఒక కాలేజీ
పెట్టుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఖమ్మం వంతు. పెద్దలు బొమ్మకంటి గారు ఖమ్మం వచ్చి
తీరాలని ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞాబద్ధుడనై వచ్చాను’.
ముఖ్యమంత్రి తన
ప్రసంగంలో ప్రస్తావించిన బొమ్మకంటి సత్యనారాయణరావు గారు మా బాబాయి.
మా రెండో
అన్నయ్య రామచంద్ర రావు గారు కొత్తగా ఏర్పాటయిన ఈ కాలేజీలో రెండో బ్యాచ్ స్టూడెంటు. డాక్టర్ ఏపీ రంగా రావు, డాక్టర్ మనోహర్, జ్వాలా నరసింహా రావు ఈ కాలేజీలోనే చదువుకున్నారు.
ఇప్పుడా
కాలేజీని కలెక్టర్ ఆఫీసు సమీపంలో విశాలమైన ప్రాంగణానికి మార్చారు.
సరే! కొత్తగా
చెప్పాల్సిన పని లేదు. ఖమ్మం కాలేజీలో నా ఒక సంవత్సరం చదువు మళ్ళీ ఎం.ఎస్.ఎం. బండి
ఎక్కింది.
నేను మా ఊరు
వెళ్లేందుకు రైలు బండి ఎక్కాను.
కింది ఫోటో:
శ్రీరామ భక్త
గెంటేల నారాయణరావు గారు, వారి భార్య సీతమ్మ గారు) (Photo Courtesy : Smt. Annapurna, Khammam)
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి