22, ఏప్రిల్ 2023, శనివారం

అన్వర్ గారూ

 రంజాన్ శుభాకాంక్షలు

మీ ఈ పోస్టు చదవక పొతే జీవితంలో బోలెడు మిస్సయ్యేవాడిని. అంచేత అందులో కొన్ని పేరాలను, వాక్యాలను రాసి దాచి పెట్టుకున్నాను. తెలిసిన విషయాలను, తెలిసిన వాటిలో ఇంతవరకు తెలియని సంగతులను, అసలు బొత్తిగా తెలియని విషయాలను ఈ పోస్టు ద్వారా అందించినందుకు ధన్యవాదాలు.  

నేను ఏరుకున్న ఆణిముత్యాలలో కొన్ని.

“అసలు పండగలంటేనే తెల్లవారు ఝామునుండే మొదలయేవి”

“కొత్త బట్టలంటేనే తాను నుండి గుడ్డ చింపించి, చక్కగా కొలతలు తీపించి, కుట్టించి, నలభైసార్లు దర్జీ షాపు చుట్టూ తిరిగి, చొక్కాయ్ సాధించి దానిని బొగ్గుల పెట్టెతో ఉల్టా పల్టా ఇస్త్రీ లాగించి మన చొక్కాని తొలిసారిగా వాడెవడో కాక మనమే తొడుక్కోడం. ఇప్పుడు మనం కొత్తంగి అని తొడుక్కునేది ఎక్కడని కొత్తది? ఆ రెడీమేడ్ షో రూమ్ ట్రైల్ రూమ్‌లో ఎంతమంది దానిని వేసుకుని, విడిచి, నలగ్గొట్టి బాలేదని బయట పడేసింది వచ్చి మన వాటాకు దక్కిందో!”

ప్రార్థనలు త్వరగానే ముగిసేవి. కళ్ళు మూసుకుని ప్రార్థనలు చేసే తోటివాళ్ళు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తుంటాడు కదా! మన మనసు గమనిస్తుంటుంది కదా! సిగ్గుగా ఉండదూ? మనమీద మనకు అసహ్యం వేయదూ?

“అసలు రంజాన్‌ను రంజాన్ అని కూడా అనకూడదట రమ దాన్ అనాలని మళ్ళీ అదొక రుద్దుడు జ్ణానము. వద్దురా దేవుడా!”

“సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్దల రాత్రి అని ఒక దినం ఉంటుంది. ఆ దినాన మా ఇంట్లో మరణించిన వారినందరిని గుర్తు చేస్తుకుంటూ, వారు తమ జీవితకాలంలో దేన్నయితే ఇష్టపడేవాళ్ళో ఆ పదార్దాలను నైవేద్యంగా పెట్టేవారు. వారి కొరకు కొత్తబట్టలు తెచ్చేవారు. మా జేజినాయనకు గణేష్ బీడి ఇష్టమని బీడి కట్ట ఒకటి, గళ్ళుగళ్ళు గల లుంగి, మా అమ్మకు చీర, చిన్నతనానే చనిపోయిన చిన్నపిల్లల కోసం లడ్డు, బాదుషా, మినపగారెలు, ఇంకా అవీలు ఇవీలు. ఎవరికి ఏది ఇష్టమేదయితే అది అన్నమాట. “మనసు నిండుతో వారందరి పేర్లను తలుచుకుంటూ సాంబ్రాణి పొగను, మా భక్తితో పాటే ఆకాశం వైపు పంపించేవాళ్ళం. వారందరితో పాటు ఆమధ్యే మాకు దూరమయిన బాపుగారు, పతంజలిగారు, నాయుని కృష్ణమూర్తిగారు, మోహన్‌గారికి కూడా సాంబ్రాణి భక్తిని వేసేవాళ్ళం.”

“పెద్దలందరి పేరిట సాంబ్రాణి ధూపాలు వేసిని తరువాత ఇంటిల్లిపాది అంతా తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి కాసేపు బయట కూచోవాలి. అప్పుడు మా పెద్దలు అందరూ దివినుండి దిగి వచ్చి మేము తెచ్చిపెట్టిన బట్టలు ఇష్టంగా కట్టుకుని, వండిన అన్నాలు తిని వెళ్ళిపోతారని చెప్పేవారు. అవన్నీ మనం చూడకూడదని అందుకే తలుపులు మూయాలని చెప్పెవారు. చిన్నతనాన అప్పుడప్పుడూ మా ఇంట్లోకి ఝుమ్మంటూ కందిరీగ వచ్చేది. దాన్ని చూసి ఎక్కడ కుడుతుందోని భయంతో దూరం తోలడానికి విసనకర్రో, చేటో పుచ్చుకుంటామా, దానిని కొట్టవద్దని, పాపమని మా మేనత్త చేప్పేది. అది కందిరీగ కాదట. చనిపోయిన మా జేజినాయన అలా వచ్చాడని చెప్పింది. జీవితంలో చాలావాటికి హేతువులు, సమాధానాలు, తెలివితేటలు వాడనక్కరలేదు. కొన్ని విషయాలపై ప్రేమ కలిగి ఉంటే చాలు. చాలా బావుంటుంది.”

“అటూ ఇటూ నడుస్తూ, పరిగెడుతూ, నిక్కర్ జేబులో నాణేల బరువు, ఘల్లు ఘల్లు చప్పుడు అవుతుంటే అచ్చం లక్ష్మీదేవి మా చిల్లర జేబుల్లో కొలువు తీరినట్లుగా ఉండేది”

“వయసు పెరిగేకొద్ది పండగ కూడా ముసలిదవుతుందని తెలీదు, విషయం తెలిసిన పెద్దలు ఎవరూ మాకు చెప్పలేదు. కరిగిపోతుందని తెలుసు కాబట్టి పుల్ల ఐసుని కొంచెం కొంచెం కొరుక్కుతిన్నట్టుగా పండగలని ఆ రంగులని నిముషానికి ఆరు లక్షల తొంబై మూడు వేల నాలుగువందల పదహారు సెకండ్ల చొప్పున అనుభవించాలని తెలీదు.”

“మా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ దేవుడు లేడని నాకు చెప్పింది కానీ పండగలు మాత్రం ఉన్నాయని నా చిన్ననాటి ఇల్లు నేర్పింది నాకు” “జీవితంలోని అసలైన కొన్ని ఉదయాలు, మధ్యాహ్నాలు, సాయంత్ర రాత్రుళ్ళు, నక్షత్రాలు నశించాయి. ఇక అవి ఎప్పటికీ లేవు. ఇప్పుడు పండగ లేదు. భగవంతుడే ఉన్నాడు. ఆయన దయ వలన జ్ఞాపకాల్లో పండగ మిగిలి ఉంది”

మరోసారి ధన్యవాదాలు అన్వర్ గారు మీ విలువైన  పండగ కానుకకు.

ఈద్ ముబారక్!

భండారు శ్రీనివాసరావు


(Image courtesy: Cartoonist Anwar)


22-04-2023

కామెంట్‌లు లేవు: