15, నవంబర్ 2019, శుక్రవారం

రేడియో రోజులు - 16 భండారు శ్రీనివాసరావు
(Published in SURYA daily on 15-11-2019, Friday)


ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో చెన్నారెడ్డిది చెరపలేని ముద్ర. మనసులో ఏదైనా పడితే ఇక ఇంతే సంగతులు. అంత ఉడుం పట్టుతో ప్రత్యర్ధిని తొక్కేయాలని విశ్వ ప్రయత్నం చేయడంలో ఆరితేరిన మనిషి.
రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అయినప్పటికీ, ఆయన తన  సొంత పార్టీ మనిషి  వై.ఎస్. రాజశేఖరరెడ్డినే ప్రధాన ప్రత్యర్ధిగా భావించేవారు. అవకాశం దొరికినప్పుడల్లా వై ఎస్  ని బద్నాం  చేయడం ఆయన వ్యూహాల్లో ఒకటిగా వుండేది. ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి ఒక సమాచారం అందింది. ఆయన  పార్టీ వాళ్ళే దాన్ని చెన్నారెడ్డికి మోశారు. ఆంధ్రాభవన్ గేటు దగ్గర సెక్యూరిటీతో వై ఎస్ గొడవ పడ్డాడన్నది దాని సారాంశం. ఆ విషయం స్థానిక పత్రికల్లో, ప్రత్యేకించి ఇంగ్లీష్ పత్రికల్లో ప్రముఖంగా వచ్చేట్టు చూడాలని పీ ఆర్ వో ఆదేశించారు. అ అధికారి ఆ వార్తను పట్టుకుని ప్రధాన పత్రికల ఎడిటర్లను కలుసుకుని స్వయంగా విన్నవింపులు చేసుకోవడం జరిగింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ ఆయన్ని  హెచ్చరించారు, ఈ విషయం వై.ఎస్. కి తెలిస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోమని. మొత్తం మీద ఆ వార్త ముఖ్యమంత్రి అనుకున్నంత ప్రముఖంగా కాకపోయినా మర్నాడు పత్రికల్లో వచ్చింది. వై ఎస్ సామాన్యుడు కాదుకదా! ఆంధ్రా భవన్ లోకి అడుగు పెట్టేది లేదని భీషణ ప్రతిన పూనారు. ముఖ్యమంత్రి అయిన తరువాతనే అందులో కాలు పెట్టారు. మరో విచిత్రం ఏమిటంటే, తాను  ముఖ్యమంత్రి కాగానే,  తన గురించిన వార్త పత్రికల్లో చెడ్డగా  రావడానికి కారణం అయిన  వ్యక్తినే పీఆర్వో గా తీసుకోవాలని ఆలోచన చేశారు కూడా. అలా వుండేది వై. ఎస్. తరహా.     
చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనతో సహా ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తిరుపతిలో సమావేశం అయ్యారు. నదీ జలాల పంపిణీ ప్రధాన ఎజెండా. బొంబాయి నుంచి వచ్చిన బ్లిట్జ్ కరస్పాండెంటుకు  మర్నాడు హైదరాబాదులో ముఖ్యమంత్రి  ఇంటర్వ్యూ ఇచ్చారు. కొద్ది రోజుల తరువాత అది ఆ పత్రికలో వచ్చింది. అయితే ఆ వార్త నదీజలాలకు సంబంధించింది కాదు. ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేతులు కలుపుతున్నారన్నది అందులోని సమాచారం. అది చూసి ఆయన పీ ఆర్వో కంగారు పడుతుంటే, ‘ఏమవుతుంది ఆ వార్త వస్తే. కాస్త మనమంటే ఏమిటో ఆవిడకూ తెలియాలి కదా, ఆ మాత్రం బెదురు వుండాల్సిందే’  అన్నారాయన తాపీగా.

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: