మా బావగార్లలో ఇద్దరు శ్రీ అయితరాజు రామారావు (వల్లభి), శ్రీ కొలిపాక రామచంద్ర రావు (రెబ్బారం) స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఖమ్మం జిల్లాలో బ్రిటిష్ వ్యతిరేక ఆందోళనలు నడిపి పద్నాలుగు మాసాలకు పైగా కఠిన జైలు శిక్ష అనుభవించారు. మహాత్ముని బోధనలకు ప్రభావితులై తమ గ్రామాల్లో అంటరానితనాన్ని నిర్మూలించే విషయంలో గ్రామీణులను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించేవారు. వున్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తేడా లేకుండా వూరివాళ్ళతో రోజంతా తిరిగొచ్చి మళ్ళీ ఇంట్లో అనుష్టానాలు చేసేవాళ్ళు. అన్ని కులాలవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో స్వేచ్చగా మసిలేవాళ్ళు. భోజనాలు చేసేవాళ్ళు. అందరూ వాళ్ళది కాంగ్రెస్ మడి’ అనే వాళ్ళు. పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు, వాళ్ళ వూరు వల్లభిలో ఏకంగా ఒక హరిజనుడిని రామాలయ పూజారిగా నియమించారు. ఆ రోజుల్లో అదొక సంచలన వార్త. మా నాన్నగారు మా వూరు కంభంపాడుకు కరణీకం చేస్తున్న రోజుల్లో మా ఇంటి ప్రధాన ద్వారాన్ని ఆనుకుని ఒక చావిడి లాంటిది వుండేది. ఆయన దగ్గర పనిచేసే వెట్టివాళ్ళు ఇంట్లోకి రాకుండా ఆ చావిడిలోనే కూర్చొనే వారు. మా నాన్నగారి మరణానంతరం కరణీకం బాధ్యతలు స్వీకరించిన మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వరరావు చేసిన మొట్టమొదటి పని ఆ చావిడిని నేలమట్టం చేయడం. చేసి, వెట్టివారిని ఇంట్లో తిరిగేలా చేయడం. వూళ్ళో నిరసన వెల్లువెత్తినా మా అన్నయ్య లెక్కచేయలేదు. ఆయన చనిపోయినరోజు ఊళ్ళోని దళితులందరూ ఆడామగా తేడా లేకుండా దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.
మా బాబాయ్ కుమారుడు సత్యమూర్తి అన్నయ్య మా ఊరికి సుదీర్ఘ కాలం సర్పంచ్ గా పనిచేశారు. మా గ్రామానికి
ఆయనే మొదటి సర్పంచ్. తండ్రి లేని మా కుటుంబానికే కాకుండా ఊరంతటికీ పెద్ద అండగా
ఉండేవాడు. సహాయకారి. పైపెచ్చు ధైర్యశాలి కూడా. దేనికీ భయపడే తత్వం కాదు.
రాజకీయాల్లో తిరిగినా, హింస, దౌర్జన్యాలకు తావులేకుండా సామరస్య పూర్వకంగా వ్యవహారాలు నడిపేవాడు. గ్రామాభివృద్ధికి బాగా పాటుపడ్డాడు. కాకాని వెంకటరత్నం గారికి
ఏకలవ్య శిష్యుడు. చదువుకోసం వెళ్ళిన మా పెద్దన్నయ్యను తప్పిస్తే ఆయనే మా వూరునుంచి హైదరాబాదు వ్యవహారరీత్యా వెళ్లి వచ్చిన మొదటి వాడు. ఆయన హైదరాబాదులో
బస్సు దిగి నేరుగా ఖైరతాబాదులో, అప్పుడు మంత్రిగా ఉన్న కాకాని వెంకట రత్నం ఇంటికి వెళ్ళిపోయేవాడు.
వూరికి తిరిగి వచ్చిన తరువాత ‘హైడ్రాడ్’ (ఆయన ఉచ్చారణ అలానే వుండేది) విశేషాలను వైన వైనాలుగా వివరంగా
చెప్పేవాడు. ఊరివారందరు గుమికూడి ఆ సంగతులన్నీ ఆసక్తిగా వినేవారు. ఊళ్ళోకి కరెంటు
తీసుకు రావడానికి, రోడ్డు పడడానికి ఎంతో శ్రమ పడ్డాడు. గుండె జబ్బుతో ఆయన అకాల మరణం
చెందకపోతే, మా వూరికి ఆయన తిరుగులేని నాయకుడిగా ఉండేవాడు. వూళ్ళో కలిగిన వాళ్ళే
కాకుండా బీదాబిక్కీ కూడా ఆయన్ని విపరీతంగా అభిమానించేవారు. ఆయన చనిపోయినప్పుడు
వారంతా తాము దిక్కులేని వాళ్ళు అయిపోయినట్టు దుఖించారు. ఆయన మృతదేహాన్ని మోసే
హక్కు మీకే కాదు మాకూ వుందని ఇంటి వాళ్ళతో పోట్లాడి, మామూలుగా పాడె మీద కాకుండా బండి మీద ఆయన బౌతిక
కాయాన్ని వుంచి, ఎడ్లు లేకుండా మనుషులే లాగుతూ
గ్రామంలో వీధివీధిలో తిప్పుతూ ఊరేగింపుగా దాన్ని శ్మశానానికి చేర్చారు. మేమందరం
నిమిత్తమాత్రులుగా చూస్తూ ఉండిపోయాం. ఆరోజుల్లో స్మశానాలకు ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు
కాదు. కాని అదేమిటో ఆరోజు వూరు వూరంతా తరలివచ్చింది. అక్కడ కులబేధం అని కాని, చిన్నా పెద్దా అని కాని లేకుండా అంతా ఆయన చితిలో కట్టెపుల్లలు
వేయడానికి తొక్కిసలాడారు. ‘మేమంతా ఆయన పిల్లలమేగా, ఆయన చితికి నిప్పంటించే కర్తవ్యం మాకు
లేదా’ అంటూ షెడ్యూల్డ్ కులాలవారు పెద్దగా ఏడుస్తూ ఆయన చితిపై కొరవులు వేయడం అందరి హృదయాలను కదిలించింది. ఆరోజు మొత్తం
గ్రామంలో ఎవరింట్లో పొయ్యి వెలిగించలేదు. అంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న
సత్యమూర్తి అన్నయ్య ధన్యజీవి. చిరంజీవి. ఇప్పటికీ గ్రామంలో ఏదయినా సమస్య తలెత్తితే ‘ సత్యమూర్తి గారు ఉంటేనా ..’ అనుకోవడం సర్వసాధారణం అయిపోయింది.
నేను చెబుతున్నది అరవై ఏళ్ల కిందటి
విశేషాలు. సాంప్రదాయంతో పాటు ఆధునిక భావాలు
చెట్టాపట్టాలు వేసుకున్న కుటుంబం మాది అని చెప్పడానికి ఈ సంగతులు
ఉదహరిస్తున్నాను.
మా ఏడుగురు అక్కయ్యలు అందరూ
శాంతమూర్తులు. వారిలో శారదక్కయ్య,
ప్రేమక్కయ్య ఇద్దరూ పరమ శాంతమూర్తులు. పరమ అంటే
పరమ.
శాంత స్వభావి శారదక్కయ్యను, మేనరికం సంబంధం, మరో మూర్తీభవించిన శాంతమూర్తి,
ఖమ్మం జిల్లా రెబ్బారం కాపురస్తులు కొలిపాక రామచంద్రరావు గారికి ఇచ్చి పెళ్లి
చేశారు. మా బావగారికి ఎవరి మీద అయినా కోపం వుంది అంటే అది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మీద మాత్రమే.
1947 ఏప్రిల్ 11న మా బావగారు ఇతర
సత్యాగ్రహులతో కలిసి రెబ్బవరం గ్రామంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ విషయం తెలిసిన
వెంటనే ఆయన్ని అరెస్టుచేసి జైల్లో పెట్టారు. అదే సమయంలో మా పెద్ద బావగారు అయితరాజు
రాం రావు గారిని కూడా అరెస్టు చేశారు.
వాళ్ళిద్దరూ పద్నాలుగు మాసాల కఠిన కారాగార శిక్ష అనుభవించారు. అక్కడ జైలులో
వీరితోపాటు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, బూర్గుల రామకృష్ణారావు గారు కూడా
ఉండేవారు. జైలులో ఉన్నవారికి స్వాతంత్ర్య
సంగ్రామనికి సంబంధించిన బయటి విషయాలు
పెద్దగా తెలిసేవి కావు. జైలులో
పనిచేస్తున్న ఒక అటెండర్ ఎవ్వరికీ తెలియకుండా ఒక వార్తా పత్రిక ముక్కను 1947
ఆగష్టు 15న రామచంద్రరావు బావగారికి అందించాడు. దాని ద్వారా దేశానికి స్వాతంత్ర్యం
వచ్చిన విషయం ఆయనకి తెలిసింది. ఆ పేపర్ ముక్కను
ఒక కర్రపుల్లకు అన్నం మెతుకులతో అంటించి, జైలు గోడ మీద
నుంచి బురుజు మీదకు ఎక్కి, జెండాలా ఊపుతూ స్వాతంత్ర్యం వచ్చిన విషయాన్ని అందరికీ
తెలియచేసారు. అది గమనించిన జైలు అధికారులు మా బావగారిని 3 ఆడుగుల వెడల్పు, 6 ఆడుగుల పొడవు
గల ఒక చిన్న గదిలో ఏకాంతంగా నిర్బందించారు.
రామచంద్రరావుగారు కనబడకపోయే సరికి, జైలులోని సత్యాగ్రహులు ఆందోళన చేశారు. బావగారిని బయటకు తీసుకువచ్చి
చూపెట్టిన తర్వాత కానీ వాళ్ళు శాంతించలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, జైలు నుంచి
విడుదలై వచ్చిన మా బావగారు ఇచ్చిన రెండు
ఎకరాల స్థలంలో రెబ్బవరంలో ఐదు గదుల పాఠశాలను నిర్మించారు. అప్పటి తెలంగాణా
ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు ఆ పాఠశాలను ప్రారంభించారు. మా బావగారు ఆ స్కూలుకు చేసిన సేవలకు గుర్తింపుగా
ఆయన శిలా విగ్రహాన్ని స్కూలు ఆవరణలో నెలకొల్పారు.
ఇద్దరు బావగార్లు స్వతంత్ర ఉద్యమ
కాలంలో సత్యాగ్రహాలు చేసి జైలు పాలయ్యారు. వారు జైలుకు వెళ్ళినప్పుడు మా
పెద్దక్కయ్య రాధ డాక్టర్ రంగారావును కడుపుతో
వుంది. పద్నాలుగు నెలలు జైల్లో ఉండడంతో మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు, తన కన్న కొడుకును మొదటిసారి కళ్ళారా చూడడానికి
ఎన్నో నెలలు పట్టింది.
“1949 సెప్టెంబర్ ఆఖరి వారంలో మా బావగారు జెయిలునుంచి విడుదల అయ్యారు. హైదరాబాద్ స్టేట్,
ఇండియన్ యూనియన్ లో విలీనం కావడంతో జైళ్లలో
పెట్టిన స్వాతంత్ర్య సమరయోధులనందరినీ వొదిలిపెట్టారు. మా ఊర్లో వుంటున్న భార్యా పిల్లల్ని చూడడానికి
మా బావగారు మూడు, నాలుగు మైళ్ల దూరంలోవున్న
పెనుగంచిప్రోలులో బస్సు దిగి
కాలినడకన కంభంపాడు చేరారు.
“అప్పటికి మా పెద్ద మేనల్లుడికి నడక
వచ్చింది. కొంతమంది పిల్లలతో కలిసి
చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని ‘జై హింద్’ అని
అరుస్తూ పరిగెత్తుకుంటూ మా బావగారికి ఎదురెళ్ళారు. “అంతమంది పిల్లల్లో
తనపిల్లవాడెవరన్నది ముందు ఆయనకు అర్ధం కాలేదు. అయితే వెంటనే తేరుకుని, కొడుకును గుర్తుపట్టి చేతుల్లోకి తీసుకుని ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు.
ఆ అనుభూతి తన గుండె గోడల నడుమ పదిలంగా వుండిపోయిన మధుర మధుర
జ్ఞాపకం అని డాక్టర్ రంగారావు తన జీవిత
చరిత్రలో రాసుకున్నారు.
మా అక్కయ్యలు అందరూ అదృష్టవంతులే.
వారిలో మా రెండో అక్కయ్య శారద, ఏడో అక్కయ్య భారతి పరమ అదృష్టవంతులు. ఈ అదృష్టం వారికి సంతానం
రూపంలో లభించింది. పెద్ద తనంలో పిల్లలు వారిని పొత్తిళ్ళలో పాపాయిని చూసినంత
జాగ్రత్తగా కనిపెట్టి చూసుకున్నారు.
మా కుటుంబంలో పిల్లలు, కవిత్వం
అడక్కుండానే పుడతాయి. చిన్నాపెద్దా అంతా ఎంతో కొంత కలం తిరిగిన వాళ్ళే!
శారదక్కయ్య రెండో కుమారుడు కొలిపాక రాంబాబు తలితండ్రుల
గురించి ఇలా రాశాడు:
‘నాన్న పోయాడు
కొంగున కట్టిన
బ్రహ్మ ముడి విప్పేసి
‘నాన్న పోయాడు
మిగిల్చిన భాధ్యతల్ని
అమ్మ కొంగున ముడివేసి
‘అమ్మ కూడా పోయింది
ఇవన్నీ వదిలేసి
అమ్మ కూడా పోయింది
ఇంటిని దుఃఖనది చేసి
‘నాన్న పోయినప్పుడు
అమ్మ ఒక సశేషం
అమ్మ కూడా పోయినప్పుడు
బంధాలు నిశ్శేషం ..’
కింది ఫోటోలు : కొలిపాక రామచంద్ర రావు
గారు, శారద, స్వతంత్ర పోరాట సమయంలో ఇతర నాయకులతో కలిసి మా బావ గారు (కుడి వైపు
నుంచి రెండో వ్యక్తి)
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి