ఈ బాంబు ధాటికి ఆ అగ్రదేశంలోని అనేక రాష్ట్రాలు, నగరాలు అతలాకుతలం అయ్యాయి. వీటిల్లో మా పెద్దవాడు నివసిస్తున్న వాషింగ్ టన్ స్టేట్ లోని సియాటిల్ కూడా వుంది. ఈ బాంబు కారణంగా ఆ నగరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ విచ్చిన్నం అయింది. గత మూడు నాలుగు రోజులుగా మా వాళ్ళు కరెంటు లేకుండానే కాలక్షేపం చేస్తున్నారు. ఈ విషయం తెలిస్తే నేను కంగారు పడతాను అని దాచిపెట్టారు. బాంబుకి కరెంటుకి సంబంధం ఏమిటంటారా? బాంబు అనేది సియాటిల్ తో పాటు అమెరికాలోని అనేక పశ్చిమ తీర ప్రాంత నగరాలను దెబ్బతీసిన తుపాను (STORM) పేరు.
పౌరజీవనం సాఫీగా సాగాలి అంటే ఈరోజుల్లో కరెంటు కావాలి.
అది లేకుండా అక్కడ కాలూ చేయీ ఆడదు. వెళ్లి ఏదైనా దూరం పోయి కరెంటు ఉన్న హోటల్లో
వుండాలి అంటే హోటళ్ళన్నీ నిండి పోయాయి. సియాటిల్ వాతావరణం రోజురోజుకు చల్లబడి
ఇళ్ళల్లో హీటర్లు పెట్టుకోవాల్సిన అవసరం పెరిగే కాలం ఇది. హీటర్ పెట్టుకోవాలంటే కరెంటు కావాలి. ఇంట్లో
స్వెట్టర్లు కోట్లు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి. సెల్ ఫోన్లు కంప్యూటర్లు
చార్జ్ చేసుకోవాలంటే కరెంటు కావాలి. అంచేత కరెంటు సరఫరా వున్న సుదూర ప్రాంతాలలోని
కాఫీ బార్లలో చార్జ్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే కారు బయటకు తీయాలి అంటే గరాజ్ షట్టర్
ఆటోమేటిక్. తీయాలన్నా, మూయాలన్నా
కరెంటు లేదు. అంచేత కష్టపడి మాన్యువల్ పద్దతిలో గరాజ్ షట్టర్ తెరచి కారు బయటకు
తీసుకోవాలి.
విషయం తెలిసి వాట్సప్
లో ఎలా వున్నారు అని మెసేజ్ పెడితే నిన్న ఫోన్ చేసి చాలాసేపు నిబ్బరంగా మాట్లాడాడు. ఫోన్ చార్జ్ అయిపోతుందేమో అంటే
పర్వాలేదు, బయట స్టార్
బక్స్ వంటి చోట్ల కూర్చుని చార్జ్
చేసుకుంటూ ఆఫీసు వర్క్ కూడా అటెండ్ అవుతున్నామని చెప్పాడు. మరి మీ మీడియా వార్తలు
చూస్తుంటే భయం వేసేలా వున్నాయి అని అంటే, భయపెట్టడమే వాళ్ళ పని అని జవాబు. మరో బాంబు పడబోతోందని
రాస్తున్నారు అంటే, మీకు
తెలియదు నాన్నా! 2005లో అమ్మా మీరు సియాటిల్ వచ్చి వెళ్ళిన తర్వాత, 2006-2007 లో ఇలాగే ఇంతకంటే పెద్ద బాంబు పడింది, అప్పుడు
ఏకంగా వారం రోజులు కరెంటు లేదు అన్నాడు.
ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోగలిగే తత్వం ఈ తరానికి బాగా వున్నట్టు
వుంది. ఇక్కడ మా ఇంట్లో వాటర్ ప్యూరిఫయర్ కేండిల్స్ మార్చాల్సి వస్తే, కంపెనీ వాడు గంట
లేట్ చేస్తే వాళ్ళమీద విరుచుకుపడేంత కోపం తన్నుకు వచ్చింది.
మరి అక్కడ నాలుగు రోజులుగా కరెంటు లేదు, మరికొన్ని
రోజులు వచ్చే అవకాశం లేదు అని తెలిసినా చాలా కూల్ గా ఎలా ఉంటున్నారని
నాకనిపించింది.
తిట్టడానికి అక్కడ కూడా ప్రభుత్వాలు వున్నాయి మరి.
పైగా వాట్సప్ లో నాకు ఒక ఫోటో పంపాడు, ఒక కామెంటు
జోడించి.
అదే ఇది.
“It is dark,
but there is always light”
(రెండు కేండిల్స్ నడుమ మా ఆవిడ ఫోటో)
(21-11-2024)
3 కామెంట్‌లు:
20 ఏళ్లల్లో అమెరికా , భారత దేశాల్లో జీవనశైలి దాదాపు సమానం అయిపోయినట్టుంది సార్, కనీసం మధ్య తరగతి వారికి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లాంటి టైట్ లు పెట్టి మరీ భయభ్రాంతులను చేసేస్తున్నారండి భం డర్
రావు గారూ :)
మీరు కూడా యూ ట్యూబ్ తంబ్ నెయిల్స్ లాగా సంచలనాత్మక టైటిల్స్ పెడుతున్నారే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి