‘ఏవేవో పాత సంగతులు రాస్తున్నారు, ఇంతకీ మీ కధ ఎప్పుడు మొదలవుతుంది?‘ ఫోన్ చేసి ఓ పెద్ద మనిషి అడిగారు.
‘ముందు
నన్ను పుట్టనివ్వండి. పుట్టి పెరిగిన తర్వాత కదా నా కధ మొదలయ్యేది ‘ అన్నాను నేను.
‘భలే
వాళ్ళే!‘ అంటూ పెట్టేశారు ఫోను.
ముందు
మాటలో చెప్పినట్టు, ఇది
నా కధే కానీ, నా
ఒక్కడి కధ కాదు. నా చుట్టూ అల్లుకున్న ఒకనాటి సమాజపు తీరుతెన్నులు, నాటి రోజులు
గురించి ఏ మాత్రం తెలియని నేటి తరానికి చెప్పాలనే తాపత్రయంతో మొదలు పెట్టిన కధ ఇది. నిజానికి మా కుటుంబంలోనే
ఆరో తరం నడుస్తోంది. వారిలో చాలామందికి కూడా తమ పూర్వీకుల జీవన విధానాల పట్ల
అవగాహన లేదు. నాకు సయితం తెలియని కొన్ని
విషయాలను మా అన్నయ్యలు, మా
అక్కయ్యల ద్వారా నాకు తెలిసిన సంగతులను
నలుగురితో పంచుకోవడం ఈ రచనలోని ప్రధాన
ఉద్దేశ్యం. ఇందులో హెచ్చు భాగానికి నేను కేవలం రాయసకాడిని (Amanuensis) మాత్రమే.
మా నాలుగో
అక్కయ్య సావిత్రి, ఐదో
అక్కయ్య అన్నపూర్ణల పెళ్ళిళ్ళు మా నాన్న
గారి హయాములోనే జరిగాయి.
సావిత్రక్కయ్య
పెళ్లి చూపులు వల్లభిలో రామారావు బావ ఇంట్లో జరిగాయి. వరుడు కౌటూరి కృష్ణ మూర్తి.
గానుగపాడు. ప్లీడరీ చేశారు.
మా
అమ్మ సంతానంలో సుదీర్ఘ కాలం జీవించినది ఈమె ఒక్కరే. తొంభయ్ ఏళ్ళు మీద పడిన తర్వాత
కూడా తన పనులు తానే చేసుకునేది. ప్రతి పండగకి ఆమె నుంచి ఠంచనుగా ఫోన్ వచ్చేది.
‘ఒరేయ్! నీకు పండుగ శుభాకాంక్షలు. సంతోష్ కు
సంతోష్ భార్యకు కూడా నా శుభాకాంక్షలు చెప్పు’
గడగడా
చెప్పేసి, మరో మాటలేకుండా ఫోన్ పెట్టేసేది. సావిత్రక్కయ్య ఎప్పుడూ ఇంతే! తను
చెప్పదలచుకున్న రెండు మాటలు రెండు ముక్కల్లో చెప్పేస్తుంది.
సంక్రాంతికే
కాదు, ఏ
పండుగ వచ్చినా, పుట్టిన రోజులకు సయితం సావిత్రక్కయ్య ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేది.
నా ఒక్కరికే కాదు, కుటుంబంలో ప్రతి ఒక్కరికీ. తొంభయ్ రెండేళ్ల వయస్సులో ఎంతటి ఓపికో, ఎంతటి ఆపేక్షో! ఆ వయసులో కూడా
ఎప్పటెప్పటి విషయాలో ఆమెకు గుర్తు. అవన్నీ ఆమె నోటంట చెప్పించాలని నాకో కోరిక.
కాగితం,
కలం లేకుండా
రేడియోకి ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను. అది నా గొప్పతనం కాదు. రేడియోకి వార్తలు పేరాలు పేరాలు ఇవ్వక్కరలేదు.
చెప్పిన దాంట్లో కీలకమైన
అంశం దొరకబుచ్చుకుని మూడు ముక్కల్లో వార్త తయారు చేసే వెసులుబాటు వుండేది.
ఈ
సోదంతా ఎందుకంటే ఒకసారి
ఖమ్మంలో మా అక్కయ్యను ఇంటర్వ్యూ చేసాను, ఇలాగే చేతిలో పెన్ను లేకుండా. కాగితం మీద
రాసుకోకుండా. అప్పుడు తెలిసింది విషయాలను గుర్తుపెట్టుకుని సవిస్తరంగా రాయడం ఎంత
కష్టమో.
ఓసారి సంక్రాంతి పండక్కి కాబోలు నాలుగయిదు
కార్లలో హైదరాబాదు నుంచి మా స్వగ్రామం బయలుదేరి, దారిలో ఖమ్మంలో సావిత్రక్కయ్య
ఇంట్లో ఆగాము.
ఆమె వయసు
అప్పటికే ఎనభయ్ తొమ్మిదేళ్ళు. కుటుంబంలో పెద్దావిడ. పాత తరానికి చెందిన విషయాలు తెలుసుకోవడానికి
మిగిలివున్న ఏకైక వారధి. అందుకే ఆమెతో కూర్చుని కబుర్లు మొదలు పెట్టాను. ముందు
ఏముంటాయిరా అంత గుర్తుంచుకునే విషయాలు అంటూనే దాదాపు రెండు గంటలు మాట్లాడింది. ఆమె
ధారణ శక్తి చూసి ఆశ్చర్యపోవడం మా వంతయింది.
పుట్టి
పెరిగిన కంభంపాడు గురించీ, ఎప్పుడో
ఎనభై ఏళ్ళనాడు కాలిపోయిన మా ముత్తాతలు నిర్మించిన మండువా లోగిలి గురించీ, ఆ తర్వాత మా నాన్న హయాములో కట్టిన పెంకుటిల్లు
గురించీ, చిన్ననాటి
చదువుసంధ్యలు గురించీ, అక్కచెల్లెళ్ళ
పెళ్ళిళ్ళు గురించీ అనేక విషయాలు చెబుతూ పోయింది. మేమంతా వింటూపోయాము. ఈ ధ్యాసలో
పడి అంశాల వారీగా గుర్తుపెట్టుకునే అసలు పని మరిచేపోయాను. నిజానికి ఇది ఇంటర్వ్యూ
కాదు. ఆమె తనంతటతానుగా అభివ్యక్తీకరించిన ఆత్మావలోకనం.
ఊళ్ళో
అప్పయ్యగారి వీధిబడి దగ్గర ఆమె చదువు
ఆగిపోయింది. కానీ మా చెల్లమ్మమ్ముమ్మ పక్కన కూర్చుని, ఆమె నుంచి నేర్చుకున్న భారత, రామాయణాలు కంఠతా పట్టింది. పొద్దున్నే
బామ్మ తోటకు వెడుతూ తననూ, అన్నపూర్ణక్కయ్యను
వెంటబెట్టుకుని తోటకు వెళ్ళేది. ఇంటికి వస్తూ ఆ రోజుకు కావాల్సిన కూరగాయలు కోసుకుని
తెచ్చుకునేవారు.
సావిత్రక్కయ్య
పెళ్లిచూపులు వల్లభిలో రామారావు బావ ఇంట్లో జరిగాయి. వరుడు కౌటూరి కృష్ణ మూర్తి.
గానుగపాడు. ప్లీడరీ చేశారు. రాధక్కయ్య ఇంట్లో పెళ్లి కుదిరింది. విచిత్రం ఏమిటంటే
మళ్ళీ ఖమ్మంలో రాధక్కయ్య ఇంటి పక్కనే వీళ్ళూ ఇల్లు కట్టుకున్నారు. అంతకు ముందు
బ్రాహ్మణ బజారులో వుండేవాళ్ళు. అద్దె పది రూపాయలు.
“కాపురం
కొత్తల్లో చాలా ఇబ్బందులు. కొత్త ఇంట్లో చేరిన తర్వాత కూడా అవి వెంటే వచ్చాయి.
అయితే దేవుడి దయవల్ల మా వారి ప్రాక్టీసు, ఆయన రెక్కల కష్టం వృధా పోలేదు. పిల్లలు ఎదిగి వచ్చారు. ఆడపిల్లలకు,
మగపిల్లలకు
మంచి సంబంధాలు కుదిరాయి. (పోలీసు ఐజీ గా రిటైర్ అయిన ప్రముఖ రచయిత రావులపాటి సీతారాం రావు గారు ఈ
ఇంటి అల్లుడే). ఇవ్వాళ ఈ స్తితిలో వున్నామంటే మా వారి చలువే.” అంది తృప్తిగా.
“మా వారి
ప్రాక్టీసు అంతంత మాత్రంగా వున్నప్పుడు నేను ఎక్కువ రోజులు పుట్టింట్లోనే వుండేదాన్ని.
పెద్దమ్మాయి విమల, పెద్దపిల్లాడు
దుర్గాప్రసాదు ఇద్దరూ నేను పుట్టిన ఊరు
కంభంపాడులోనే పుట్టారు. తర్వాత కాపురానికి ఖమ్మం వెళ్ళిపోయాను. ప్రతి వేసవి
సెలవుల్లో మా అక్కచెల్లెళ్ళ పిల్లాజెల్లా అందరూ పొలోమని అమ్ముమ్మగారి ఇంటికి
వెళ్ళేవాళ్ళు. ఒక్క నేనూ, మా
పిల్లలూ తప్ప. అలాగే నాన్న తద్దినం నాడు కూడా నేను వెళ్ళలేకపోయేదాన్ని. మా వారికి
పిల్లలు అంటే ప్రాణం. కోర్టు నుంచి ఇంటికి రాగానే పిల్లలు అందర్నీకంటినిండా
చూసుకుంటే కాని ఆయనకు తృప్తిగా వుండేది కాదు. అన్నపూర్ణ మా వారిని ‘ ‘ఏం బావా
సావిత్రిని, పిల్లల్నీ రెండు రోజులు కంభంపాడు పంపిస్తే, నిన్ను పిల్లులు ఎత్తుకుపోతాయా ఏమిటని’ ఆటలు
పట్టిస్తుండేది. కానీ అయన మనసు నాకు తెలుసు. చెప్పాకదా పిల్లలు అంటే ప్రాణమని. ఆ
పల్లెటూళ్ళో ఆడుకుంటూ కాలికి చేతికీ దెబ్బలు తగిలించుకుంటారేమో అని భయం. పెళ్ళికి
ముందు, పెళ్ళయిన
కొత్తల్లో పుట్టింట్లో ఎక్కువ రోజులు వున్నా కనక, పుట్టింటికి
తరచూ వెళ్ళలేకపోతున్నాను అనే బాధ అంతగా వుండేది కాదు. నాకు ఇల్లే వైకుంఠం’
చెప్పింది. ఆమె కళ్ళల్లో నిండుగా
సంతృప్తి.
సావిత్రక్కయ్య
పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్ (ఈ మధ్యనే
పోయాడు) ఒక మంచి పనిచేసాడు. అందర్నీ సంప్రదించి, ఒప్పించి పాత ఇంటిని పడగొట్టి కొడుకులు, కోడళ్ళు, కూతుళ్లు, అల్లుళ్లు అంతా కలివిడిగా వుంటూనే
విడివిడిగా ఉండేలా అందరికీ ఒకే చోట ఒకే భవనంలో అపార్ట్ మెంట్లు కట్టించాడు.
కుటుంబం మొత్తం ఒకే గొడుగు కింద వుండే ఏర్పాటు అన్నమాట. వృద్ధాప్యంలో వున్న
తల్లికి ఇంతకంటే ఏం కావాలి.
‘కన్నపిల్లలు
కంటి ఎదుట కనబడేలా ఇప్పుడు ఏర్పాటు చేసారు. అల్లుళ్ళు, కోడళ్ళు మంచివాళ్ళు దొరికారు.
చిన్నవాడు అచ్యుత లలిత అనే అమ్మాయిని హమేషా నా దగ్గర ఉండేలా నాకు తోడుగా
పెట్టాడు. రోజులు మంచిగా గడిచిపోతున్నాయి. ఎవరైనా అడిగితే కానీ, నేను తొంభయ్యవ పడిలో పడుతున్నాను అనే
సంగతి గుర్తురావడం లేదు.” అన్నది ప్రశాంత చిత్తంతో.
అదే ప్రశాంత చిత్తంతో అనాయాస మరణం పొందింది.
తోక
టపా:
‘బయట తిరక్కండిరా!’
‘అలా ఎండలో తిరిగితే వడ దెబ్బ
తగులుతుంది’
‘వానలో తడిస్తే జలుబు చేస్తుంది’
‘చలిగాలిలో తిరగకండి వంటికి మంచిది
కాదు’
ఇలా ఆరుగాలమూ ఆంక్షలే! అందుకే
పెద్దవాళ్ళ కళ్లుగప్పి బజార్నపడే వాళ్ళం. వాళ్ళ కళ్ళబడితే ఇంతే సంగతులు! వీపు
విమానం మోతే!
ఇప్పటి పెద్దవాళ్ళ చిన్నప్పటి
సంగతులన్నీ ఈ మోస్తరుగానే వుంటాయి.
ఆ రోజు పొద్దున్న ఖమ్మం నుంచి మా
సావిత్రక్కయ్య ఫోను. ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి. చెప్పడానికి మా ఇంట్లో
ఉగాదులు లేవు, ఉషస్సులు లేవు. మా ఆవిడతోనే అన్నింటికీ
కృష్ణార్పణం. ఆ సంగతి చటుక్కున గుర్తు వచ్చింది కాబోలు మాటమార్చి అంది.
“బయట తిరక్కురా! అసలే (కరోనా) రోజులు
బాగా లేవు”
ఎనభయ్ తొమ్మిది నిండి తొంభయ్యవ పడిలో
అడుగుపెట్టిన అక్కయ్య, డెబ్బయి నాలుగేళ్ల తమ్ముడికి ఇలా
సుద్దులు చెబుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
కింది
ఫోటో:
సావిత్రక్కయ్యతో
మా కుటుంబం
3 కామెంట్‌లు:
🙏 మహానుభావురాలు 🙏
ఆ కాలం వేరు, ఆ జీవనవిధానం వేరు, ఆ మనుషులు వేరు.
భండారు వారు, మీ టపా సీరియల్ నెంబర్లు వరస తప్పుతున్నట్లున్నాయి (ఉదా: 5, మళ్ళీ 5) / టపాలు కూడా రిపీట్ అవుతున్నట్లున్నాయి (ఉదా: 4 “ఆ రోజుల్లో ….”), సరి చూసుకో గలరు.
ఇగ్గో ఇగ్గో ఇందుకే నండి
వినరా వారిని వెంటపెట్టుకుని వ్రాయండీ అన్నది :)
విన్నకోట నరసింహా రావు గారికి మీ నిశిత పరిశీలనకు ధన్యవాదాలు. సరిదిద్దుకున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి