ఆ రోజుల్లో ఆడపిల్లలకు పదో ఏటినుంచే పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు. మా ఇంట్లో పెద్దాడపిల్ల రాధక్కయ్య. ఆమెకు పదేళ్లు నిండకుండానే సంబంధాలు చూడడానికి తొందరపడేవాళ్లు. ఈ సంగతులు గురించి మా మూడో అక్కయ్య సరస్వతక్కయ్య కొన్ని సరదా ముచ్చట్లు చెబుతూ వుండేది. పెళ్లి సంబంధాల వాళ్లు ఎవరు వచ్చినా సరే మా పెద్దక్కయ్యతో పాటు రెండో అక్కయ్య శారదక్కయ్య కూడా పక్కనే కూర్చుని స్వాములవారు చెప్పిన హిందీ రామాయణం గడగడా చదివేసేదిట.
మావూరికి
కొద్ది కోసులదూరంలో వున్న ఖమ్మం జిల్లా వల్లభినుంచి ఓ సంబంధం వచ్చింది. వరుడి పేరు
రాంరావు. ఇంటిపేరు అయితరాజువారు. పెద్దమోతుబరులకింద లెక్క. పెళ్ళిచూపుల్లో ఇద్దరు
అక్కయ్యలు కలసి మళ్ళీ హిందీ రామాయణం వినిపించారు. అంత పల్లెటూరులో హిందీ తెలిసిన పిల్లలు వుండడం
విచిత్రమనిపించిందో యేమో కాని మొత్తానికి మా రాధక్కయ్యకు వల్లభి సంబంధమే
ఖాయమయింది. అయిదువందల రూపాయల కట్నం, అయిదు రోజుల పెళ్లి వొప్పుకుని వెళ్ళిపోయారు.
సంబంధం
అయితే కుదిరింది కాని మా నాన్నకు కాలూ చేయీ ఆడని పరిస్తితి. చివరికి మూడెకరాలు
అమ్మి పెళ్ళిచేశారు. పిల్లకు నూటయాభై కాసుల బంగారం పెట్టారు. పల్లెటూరు. దొంగల భయం
ఎక్కువ. అంత బంగారం ఇంట్లో పెట్టుకుని ఎలారా అని మా నాన్న భయపడుతుండేవాడు.
మొత్తం మీద ఎలాటి అవాంతరం లేకుండా పెళ్లి ఘనంగా జరిగిపోయింది.
సంవత్సరం
గడిచింది. రెండో అక్కయ్య శారదక్కయ్యకు పెళ్లి సంబంధాలు అంటూ ప్రత్యేకంగా
చూడలేదట. మేనరికం ఇద్దామనుకున్నారు. మా పెద్ద మేనత్త గారు శారదక్కయ్య పుట్టగానే ‘ఇది నా కోడలు’ అని
డిక్లేర్ చేసింది. రాధక్కయ్య పెళ్లి కావడం ఆలస్యం, వాళ్ల పెద్ద అబ్బాయి రామచంద్రరావుకు
శారదను చేసుకుంటానని కబురుచేసిందిట. ఇంట్లో పెళ్లి హడావిడి మొదలయింది కాని ఏదో
గుబులు. ఆ రోజుల్లో శారదా చట్టం వుండేది. చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు. బ్రిటిష్
ఇండియాలో వివాహాలకు కనీస వయసును
నిర్ధారిస్తూ,
స్వాతంత్రానికి పూర్వమే నాటి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టంచేసింది. హర్
బిలాస్ శార్దా ( Harbilas Sarda) అనే
సభ్యుడు ప్రవేశ పెట్టిన బిల్లు తదుపరి చట్టంగా మారింది. దీనికి శారదా చట్టం అనే
పేరు స్థిరపడింది. ఎవరైనా ఏమైనా పిటీషన్
పెడితే గోల అవుతుందనే భయంతో, నైజాం సంస్థానంలో ఈ చట్టం లేదు కాబట్టి, ఖమ్మం జిల్లా రెబ్బారం వెళ్ళి పెళ్లి
చేసుకువచ్చారు. శారదక్కయ్యకు కూడా యాభయ్ కాసుల బంగారం పెట్టారు. పెద్దక్కయ్య
పెళ్ళప్పుడు దొంగల భయం గుర్తు ఉందేమో, ఈసారి నాన్న బెజవాడ వెళ్ళి లల్లూరాం కంపెనీ వాళ్ల ఇనప్పెట్టె
కొనుక్కుని వచ్చాడు.
పెద్ద
రంగయ్య అనే మాస్టారు పొరుగున
వున్న పెనుగంచిప్రోలు నుంచి మా వూరు స్కూలుకు బదిలీపై వచ్చారు. ఆయన దగ్గర
కూడా మా అక్కయ్యలు హిందీ నేర్చుకునేవాళ్లట. ప్రాధమిక, మాధ్యమిక హిందీ పరీక్షలు రాయడానికి
మా బామ్మ బండి కట్టించి వాళ్ళను మాచినేనిపాలెం తీసుకువెళ్ళి వచ్చేది. ఆడపిల్లలకు
చదువెందుకు అనేరోజుల్లో మా ఇంట్లో చదువురాని పెద్దవాళ్ళు చదువు గురించి తీసుకున్న
శ్రద్ధాసక్తులు అలాటివి.
మా
పెద్దవాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఆ తరువాత కొంత
మార్పు వచ్చింది. పిల్ల సంవర్త అయినా పెళ్ళికి తొందరలేదనేవారు. అందువల్ల మా ఇంట్లో
మిగిలిన ఆడపిల్లల వివాహాలు పదహారేళ్ళు వచ్చిన తరువాతనే జరిగాయి. ఏడుగురు
అక్కయ్యల్లో అయిదుగురి పెళ్ళిళ్ళు నేను పుట్టకమునుపే మా నాన్న చేతుల మీదుగానే
జరిగాయి. ఇంట్లో చిన్నవాడిని కావడంవల్ల అనేక సంగతులు వాళ్ళు చెప్పుకునే ముచ్చట్ల
ద్వారానే నాకు తెలిసాయి.
పెనుగంచిపోలు
నుంచి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అక్కడ చినకరణం గారు కొమరగిరి లక్ష్మీ కాంతారావు
గారు. ఆయనకు ఒక్కడే కొడుకు. వెంకట అప్పారావు. బోలెడు ఆస్తి. అతగాడేమో ఇంట్లో
చెప్పకుండా మిలట్రీలో చేరాడు. చేరినవాడు అక్కడ కాలు నిలవక తప్పించుకుని వచ్చాడు.
మిలట్రీ నుంచి పారిపోయి రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వారంటు జారీ అయింది.
తెలిసిన వాళ్లు కాబట్టి మా నాన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి కృష్ణమూర్తి అని పేరు
మార్చి రెబ్బారంలో మా రెండో అక్కయ్య ఇంట్లో వుంచాడు. అక్కడి నుంచి కూడా మార్చి
కొన్నాళ్ళు కేసు ఎత్తివేసేదాకా ఎలకలపల్లి అనే పల్లెటూర్లో పెట్టారు. అప్పారావు
తలిదండ్రులు కాంతయ్య గారు, రంగమ్మ
గారు. మా నాలుగో అక్కయ్య సరస్వతిని వాళ్ల పిల్లవాడికి చేసుకుంటామని కబురు చేశారు.
కానీ మా నాన్న సుతరామూ దానికి వొప్పుకోలేదు. ‘కేసు పూర్తిగా ఎత్తివేసినట్టు
గవర్నమెంట్ నుంచి కాగితం వచ్చేదాకా పిల్లనిచ్చేది లేదని, పెళ్లి ప్రసక్తి తేవద్ద’ని
తెగేసి
చెప్పాడు.
తరువాత
సరస్వతక్కయ్యకు వేరే సంబంధాలు చూడడం మొదలయింది. మా వూరిలో చలువాది నరసింహం అనే
షావుకారు వున్నారు. ఆమెకు ఒక్కతే కూతురు. ఆమెతో మా పెద్దక్క య్యలు ఇద్దరికీ తగని
స్నేహం. ఆమె పేరు తిరుపతమ్మ. పొద్దునలేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేదాకా మా
ఇంట్లోనే వుండేది. ఆమెను నందిగామ తాలూకాలోని తుర్లపాడు ఇచ్చారు. ఆ వూళ్ళో
తిరుపతమ్మ అత్తగారి ఇల్లు, ఆ వూరి
కరణం గారయిన తుర్లపాటి భైర్రాజు గారి ఇల్లు పక్కపక్కనే వుండేవి. ఆ కరణం
గారికి ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు సత్యనారాయణకు పెళ్ళయి ముగ్గురు పిల్లలు
పుట్టిన తరువాత పొలంలో పాము కరచి చనిపోయాట్ట. రెండోవాడు బియ్యే పాసయి ఎమ్మే
చదువుతాను అన్నాట్ట. కాని కరణం గారు మాత్రం ‘నీ చదువు ఇక నా వల్లకాదు, పెళ్లి చేసుకుని మీ మామగారు
చదివిస్తే చదువుకో అభ్యంతరం లేదన్నా’రట. మామగారిని డబ్బు అడగడం ఇష్టం లేక ఇంట్లో
చెప్పకుండా ఆయన సైకిల్ అమ్ముకుని కాశీ వెళ్ళి ప్రైవేట్లు చెప్పుకుంటూ ఎమ్మేలో
చేరారు. ఎమ్మేనే కాకుండా లా పరీక్ష కూడా రాసి బెనారస్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్
అందుకుని బెజవాడ వచ్చి ప్లీడరు ప్రాక్టీసు మొదలు పెట్టారు.
గవర్నర్
పేటలో లక్ష్మీ టాకీసు, జైహింద్
టాకీసు నడుమ రాజగోపాలచారి వీధిలో చక్రవర్తి గారి తెల్లమేడ ఎదురుగా సోవమ్మగారి
ఇంట్లో మూడుగదుల వాటా ఇరవై
రూపాయల అద్దెకు మాట్లాడి దిగిపోయారు.
తుర్లపాడులో
వుండే ఆ
తిరుపతమ్మ మావూరు వచ్చి
‘మా కరణంగారి అబ్బాయికి పెళ్లి చేస్తారుట. ఇరవైఎనిమిది ఏళ్ళు. బాగా చదువుకున్నాడు.
బుద్ధిమంతుడు. బెజవాడలో ప్లీడరీ చేస్తున్నాడు. మీ అమ్మాయిని అయితే తప్పకుండా
చేసుకుంటారు’ అని మా నాన్నతో చెప్పింది.
ఇట్లావుండగానే
ఆ తిరుపతమ్మ మొగుడు రమణయ్య, పిల్లాడి
తండ్రి భైర్రాజుగారు మా వూరు వచ్చి షావుకార్ల ఇంట్లో దిగి మా ఇంటికి కబురు
పెట్టారు. మా నాన్న వెళ్ళి వారిని ఇంటికి తీసుకువచ్చారు.
‘అతికితే
గతకదు. మీఇంట్లో భోజనం చేసేది లేద’ని ముందే చెప్పారు. అందుకని మా ఇంటికి
పక్క వీధిలో వున్న గూడా రామచంద్రయ్యగారింట్లో వాళ్లకు భోజనం ఏర్పాట్లు చేశారు. తరువాత
మా అక్కయ్యను
చూపించారు. అప్పుడు మా ఇల్లు ఒక పెండ్లివాళ్ళ ఇల్లులాగా వుండేది. మా బామ్మ,
ఆమె తల్లి,
మా మేనత్త,
మా అమ్మ,
పది మంది
పిల్లలు. (అప్పటికి
మా ఇంట్లో అందరికంటే చిన్నవాడినైన
నేను పుట్టనేలేదు). ఇంకా మా సీతంబామ్మ, సుబ్బయ్య తాతయ్య, జీతగాళ్ళు
ఇట్లా ఇంతమందితో ఇల్లంతా ఎంతో సందడిగా వుండేది. ఇదంతా చూసి పిల్లాడి తాలూకువాళ్ళు ముఖ్యంగా
పిల్లాడి తండ్రి భైర్రాజు గారు ‘ఈ సంబంధం నాకు నచ్చింది’ అని అక్కడికక్కడే
చెప్పేసారు. కార్తీక మాసంలో కంభంపాడులోనే ఇంటిముందు పందిరి వేసి పెళ్లి చేశారు.
ఈ
పెళ్లి నా భావి జీవితం ఒక గాడిన పడడానికి ఒక పునాది అయింది. చిత్రం ఏమిటంటే
అప్పటికి నేను పుట్టనే లేదు.
కింది
ఫోటో:
మధ్యలో
మా అమ్మ, మా
అమ్మతో ఆమె కన్న ఆడపిల్లలు,
వాళ్ళు కన్న ఆడపిల్లలు. కోడళ్ళు ఫొటోకు చిక్కింది మా అమ్మ సంతానంలో ఒక చిన్న బృందం
మాత్రమే.
(ఇంకా
వుంది)
2 కామెంట్‌లు:
-
ఈ పెళ్లి నా భావి జీవితం ఒక గాడిన పడడానికి ఒక పునాది అయింది. చిత్రం ఏమిటంటే అప్పటికి నేను పుట్టనే లేదు
ఆరుద్ర లెవల్కి వెళ్లిపోయేరు కథల్ చెప్పడం లో :)
ఆరుద్ర లెవెల్ బాగానే ఉంది కానీ భండారు వారు తను వ్రాసిన ఆ వాక్యంలోని నిగూఢార్థం ఏమిటో అంటే ఆ పెళ్ళి తన భావి జీవితానికి ఏ రకమైన పునాది అయింది వగైరా వివరించలేదు కదా “జిలేబి” గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి