27, ఏప్రిల్ 2021, మంగళవారం

కరోనా అనుభవాలు గుణ పాఠాలు కావాలి

 

‘పెసరట్టు వేయాలంటే  పెసర పిండి కావాలి. పెసర పిండి కావాలంటే పెసలను నానబోసి రుబ్బాలి. పెసలు నానడం అనేది మనిషి చేతిలో లేదు. దానికి కొంత వ్యవధానం అవసరం. ఎంత డబ్బువున్నా, ఎంత అధికారం వున్నా పెసలని వున్నట్టుండి నానేలా చేయడం అసాధ్యం. కాబట్టి డబ్బుతో అన్ని పనులు సాధ్యం కావు’  అనే అర్ధం వచ్చే ఒక సన్నివేశం బాపూరమణల అందాల రాముడు సినిమాలో వుంది.

విస్తరిస్తున్న కరోనాని మట్టుపెట్టడం అనేది తమ ఒక్కరి చేతిలో లేదని అటు పాలకులకు, ఇటు పాలితులకు తెలిసివచ్చేటప్పటికి ఏడాది పుణ్య కాలం గడిచిపోయింది. ఈ అంతుపట్టని రోగాన్ని అంతం చేసే వాక్సిన్ తయారు చేయడం అనేది ఏడాదిలోపే పూర్తి చేయడం భారత దేశం సాధించిన ఘనకార్యంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ వాక్సిన్  తారక మంత్రం కాదని కూడా  శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ వాక్సిన్ మంచి ఫలితాలి ఇచ్చినప్పటికీ,  దేశంలో అందరికీ ఈ వాక్సిన్ అందుబాటులోకి తీసుకు రావడం అంత త్వరగా సాధ్యపడేట్టు లేదు.

ఈ లోగా పులిమీద పుట్రలా  కరోనా రెండో దాడి మొదలయింది. మొదటిదే నయమనిపించేలా వుంది ఈ రెండో దాడి. అసలు కరోనా గురించే జనాలకు సరైన అవగాహన లేదు అనుకునే తరుణంలో ఈ వ్యాధి గురించి రకరకాల కధనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. కరోనా ఎప్పటికప్పుడు తన స్వరూప స్వభావాలు  మార్చుకుంటున్నదని మరో సమాచారం. ఇవన్నీ  వింటుంటే ఏదో హాలీవుడ్ సైంటిఫిక్ సినిమా గుర్తుకు వస్తోంది.

ఒకటి వాస్తవం. ఈ కరోనాని అంత  తొందరలో అదుపు చేయడం కష్టం. ఎప్పటికి అంటే చెప్పలేని పరిస్థితి. వారాలు కావచ్చు. నెలలు కావచ్చు.  చూస్తుండగానే ఏడాది గడిచింది. వాక్సిన్ కనుక్కుంటే చాలు దీన్ని తరిమి తరిమి కొట్టొచ్చు అనుకున్న ఆశలపై రెండో వేవ్ నీళ్ళు చల్లుతోంది.

టీవీ పెడితే, పేపరు తెరిస్తే చాలు  ఆందోళన కలిగించే వార్తలు. గతంలో బింకంగా వున్న వాళ్ళు కూడా బెంబేలు పడుతున్నారు. మందులు, మాస్కులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, వాటిల్లో తగిన సదుపాయాలు, ఆఖరికి ఆక్సిజన్ అన్నింటికీ కొరత  అంటుంటే, వాటిని వింటుంటే భయం వేయకుండా ఉంటుందా!

ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. ఈ కరోనా ప్రపంచంలో అడుగిడడానికి ముందు ఎన్ని ఆసుపత్రులు వున్నాయో ఇప్పుడూ అన్నే వున్నాయి.  అప్పుడున్న సంఖ్యలోనే  సిబ్బంది. నలుగురు వస్తే భోజనం పెట్టగల ఇంటికి హఠాత్తుగా నలభయ్ మంది చెప్పాపెట్టకుండా వస్తే,  ఏ ఇల్లాలు అయినా ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు పరిస్థితులు అలాగే వున్నాయి.

మామూలుగా ఏ ఆసుపత్రిలో అయినా, అది సర్కారీ దవాకానా కావచ్చు, ప్రైవేటు ఆసుపత్రి కావచ్చు సదుపాయాలు పరిమితంగానే వుంటాయి. ఒక వంద పడకల ఆసుపత్రిలో డెబ్బయి అయిదు జనరల్ వార్డులోనో, ప్రత్యేక గదుల్లోనో వుంటే,  ఓ పాతిక పడకలు ఐ.సీ.యూ. లో వుంటాయి. ఇది ఉదాహరణకు చెప్పే లెక్క మాత్రమే. ఇప్పుడు కరోన వచ్చిన తర్వాత జనరల్ వార్డులో వుండే రోగులందరూ ఐ.సీ.యూ.ల్లో ఉండాల్సిన పరిస్థితి. అందరికీ ఆక్సిజన్ కావాలి. ముందు అందాల రాముడు సినిమా గురించి చెప్పింది ఇందుకే. డాక్టర్లను, నర్సులను తాత్కాలిక ప్రాతిపదికన రిక్రూట్ చేసుకోవచ్చు. కానీ ఆక్సిజన్ ఎక్కడ నుంచి తెస్తారు. నిజానికి చుట్టూ వున్న గాలిలో ఆక్సిజన్ వుంటుంది. కానీ దాన్ని రోగులకు అవసరమయ్యే రీతిలో తయారు చేయడం, సరఫరా చేయడం  రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పనా!  ఎంత అధికారం వున్నా, ఎన్ని వనరులు వున్నా, ఎంత చిత్తశుద్ధి వున్నా కొన్ని సాధ్యం కానివి వుంటాయి. వీటికి మంత్ర దండాలు వుండవు.      

మళ్ళీ లాక్ డౌన్ మాటలు వినపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితి వస్తే తప్పదు కూడా. అయితే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే ముందు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవడం అవసరం.

కిందటిసారి హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల సమాజంలో అనేక మంది ప్రత్యేకంగా  రెక్కాడితేకాని  డొక్కాడని  బీదాబిక్కీ, వీధి వ్యాపారులు పలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వలస కూలీలు. లాక్ డౌన్ కారణంగా పని దొరక్క, స్వగ్రామాలకు తిరిగి వెళ్ళడానికి రవాణా సదుపాయాలు లేక, సామాను నెత్తిన పెట్టుకుని  మైళ్లకు మైళ్ళు నడిచి వెడుతున్న దృశ్యాలు ఇంకా జనం మనస్సులో పచ్చిగానే వున్నాయి. వాళ్ళందరూ  సొంత ఊళ్లకు వెళ్లి పోయేలా వారికి తగిన వ్యవధానం ఇస్తూ లాక్ డౌన్ ప్రకటించాలి. లేని పక్షంలో గత ఏడాదిలో చూసిన హృదయవిదారక దృశ్యాలే పునరావృతం అయ్యే ప్రమాదం వుంది.

ఇక్కడ కేంద్రమా, రాష్ట్రాలా అని కాదు, పాలకులు అందరికీ ఒకే విజ్ఞప్తి.

అనుభవాల నుంచి గుణ పాఠాలు నేర్చుకోకపోతే ఈ దేశాన్ని భగవంతుడు కూడా కాపాడలేడు.    

(27-04-2021)

3 కామెంట్‌లు:

bonagiri చెప్పారు...

దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.

అజ్ఞాత చెప్పారు...

ఈ దరిద్రం ఇప్పట్లో వదలదు. ఓ కోటిమంది దాకా పోయినా అది అలా రౌండు మీద రౌండ్లు లాగుతూనే ఉంటుంది. దీనికి మందు రావాలి. దానికి మరో ఏడాది పట్టవచ్చు. కొత్తగా చెప్తున్న విషయం, టీకా తీసుకున్నా కరోనా వస్తుందిట. ఎందుకంటే అది మన శరీరంలోకి వచ్చాక అనేకానేక స్ట్రైన్ లలాగా మారుతోంది. ప్రతీదేశం నుంచీ ఒక్కో రకం తన్నుకొస్తోంది. ఇప్పటిదాకా మనం చూసినది టిప్ ఆఫ్ ఐస్ బర్గ్ మాత్రమే. ముందున్న ప్రశ్న ఏమిటంటే, మనం అందరం బతికి ఉంటామా, లేకపోతే పోతామా అనేది మాత్రమే. మొదట్లో ఇటలీ, తర్వాత అమెరికా, బ్రెజిల్, ఇప్పుడు ఇండియా, తర్వాత ఏ దేశమో ఎవరూ చెప్పలేరు. ఎవరైనా "అబ్బే ఇదేం పెద్ద ప్రోబ్లమ్ కాదు" అంటే, దారికాచి చూసి కొట్టినట్టూ అలా వాగుతున్న వాళ్లనే కొడుతోంది ఈ వైరస్. ఇది మనం నాశనం చేసుకుంటున్న ప్రపంచం మీద కక్ష తీర్చుకోవడానికి భగవంతుడు వదిలిన తిరుగులేని బ్రహ్మాస్త్రం. ఆయనకి తప్ప వేరెవరికీ దీన్ని ఉపహరించడం చేతకాదు.

Chiru Dreams చెప్పారు...

మొదటగా.. అప్పడాలు తింటే, గోమూత్రం తాగితే కరోనా తగ్గదని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం ఏమాత్రం దేశద్రోహం కాదని గ్రహించాలి. కరోనాకి మందు సైన్సు మాత్రమే కనిపెట్టగలదు. నమ్మకాలూ, చెట్లకి పెళ్ళిల్లూ, నూనె ప్రార్ధనలు, దేవుల్లూ ఎదో చేస్తారిని నమ్మినవారు, జాగ్రత్తలు గాలికొదిలి కరోనాకి గురౌతారు.