22, సెప్టెంబర్ 2020, మంగళవారం

సహనావతు - భండారు శ్రీనివాసరావు

 వేదకాలం నుంచి వినవస్తున్న హితోక్తి ఇది. ఎల్లకాలం మననం చేసుకుంటూ ఆచరించాల్సిన మహా సూక్తి. దీన్ని గుర్తు చేయాల్సిన పరిస్తితి దాపురించడమే ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.

ఇప్పుడు దేశ వ్యాప్తంగా మీడియాలో సహనం, అసహనం అనే రెండు పదాల చుట్టూ చర్చోపచర్చలు సాగిపోతున్నాయి. ‘సహనం పాటించండి’ అని నోటితో ఓపక్క చెబుతూనే, నొసటితో అసహనం ప్రదర్శించడం ఇందులోని విషాదం.
సహనం గురించి సాధారణ జనాలు అసహనానికి గురయ్యే విధంగా చర్చలు, వాదోపవాదాలు సాగిపోతున్న నేపధ్యంలో (ఆరేడేళ్ళ క్రితం అప్పటి) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు వేర్వేరు సందర్భాలలో విడివిడిగా చేసిన ఉద్బోధలు గుర్తు చేసుకోవడం అవసరమనిపిస్తోంది.
ప్రధాని ప్రసంగం సాగిన తీరు పత్రికల్లో ఇలా వచ్చింది.
'మతపరమైన హింసపై కఠినంగా వ్యవహరిస్తాము. మత విద్వేషం ప్రేరేపించేవారు ఎవరయినా సరే సహించేది లేదు. ఈ దేశంలో ఎవరయినా తమకు నచ్చిన మత విశ్వాసాలను పాటించేందుకు పూర్తి స్వేచ్చ వుంది. ఈ విషయంలో ఎలాటి వొత్తిళ్లు పనిచేయవు. మెజారిటీ వర్గం అయినా, మైనారిటీ వర్గం అయినా బాహాటంగా కాని, చాటుమాటుగా కాని అన్య మతానికి వ్యతిరేకంగా విద్వేషానికి పాల్పడినా, కుట్రలు చేసినా సహించేది లేదు. అలాటి చర్యలను ఉక్కుపాదంతో అణచి వేస్తాము'

ప్రధాని ప్రసంగ సందర్భం ఢిల్లీలో క్రైస్తవ మతాధికారుల సమావేశం. ప్రధాని హోదాలో వున్న వ్యక్తి అలాటి సదస్సుల్లో ఏవిధంగా మాట్లాడుతారో మోడీ గారి ప్రసంగం అదే విధంగా సాగిపోయింది.

మన దేశానికి చెందిన కురియా కోస్ అలియాస్ చవర, మదర్ యాప్రేసియాలకు సెయింట్ హుడ్ ప్రకటించిన సందర్భంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కాబట్టి దానికి అనుగుణంగానే ప్రధాని ప్రసంగించారు. అంతకుముందు ఢిల్లీలో క్రైస్తవులకు చెందిన చర్చీల మీద జరిగిన దాడుల నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకున్నవాళ్లకు, ప్రధాని వ్యక్తపరచిన ఈ అభిప్రాయాల ప్రాముఖ్యం అర్ధం అవుతుంది. ఈ విషయంలో ఆయన మొదటిసారి పెదవి విప్పారని అనుకోవాలి. మోడీ భారతీయ జనతా పార్టీకి నాయకుడు అయినప్పటికీ, మొత్తం దేశానికీ ఆయన ప్రధాన మంత్రి. అంచేత అటువంటి సమావేశాల్లో వేరే విధంగా మాట్లాడే అవకాశం లేదు.

మత ఘర్షణలు జరక్కుండా చూడడానికి, మతం పేరుతొ ఉగ్రవాదులు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందనీ, అటువంటి అనాగరిక చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామనీ ప్రతి ప్రధానమంత్రి నొక్కివక్కాణించడం ఒకరకంగా పరిపాటిగా మారిపోయింది. సరే. అదలా వుంచితే, లౌకిక రాజ్యంగ వ్యవస్థను ఎంచుకున్న భారత దేశాన్ని పాలించేవారికి దేశంలోని మైనారిటీ ప్రజల్లో అభద్రతా భావాన్ని దూరం చేయడం కూడా ఒక కర్తవ్యమే. ఆవిధంగా ప్రధాన మంత్రి మోడీ మాటలవల్ల అలాటి ఫలితాలు వస్తే అంతకంటే కావాల్సింది లేదు.

ఇక రెండో సందర్భం కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్ధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జరిపిన మాటా మంతీ.
దేశ ప్రధమ పౌరుడు భావి పౌరులతో ముచ్చటిస్తూ తన మనసులోని మాట విప్పి చెప్పారు. దశాబ్దాల రాజకీయ అనుభవసారాన్ని మొత్తం రంగరించి మరీ చెప్పారు. పాలకపక్షం వారికీ, ప్రతిపక్షం వారికీ అందరికీ పనికొచ్చే పసిడి ముక్కలు చెప్పారు. దేశ పరిస్తితులను అవగాహన చేసుకుని ఆవేదనతో కూడిన హితబోధ చేశారు.

చురుక్కుమనిపించేలా మాత్రమే కాదు, ఆలోచింపచేసేలా కూడా వున్నాయి ఆయన మాటలు. ఆ హితవచనాలు విని ఆచరించగలిగితే అది జాతి హితానికి ఎంతో మంచి చేసేలా కూడా వున్నాయి.

ప్రస్తుతం దేశాన్ని పాలిస్తోంది భారతీయ జనతాపార్టీ. పేరుకు సంకీర్ణ ప్రభుత్వం. కానీ , ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో, ఆయన పేరుతొ ఎదురులేకుండా సాగిపోతున్న ప్రభుత్వం అది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో. ప్రస్తుతం ఆ పార్టీ, లోకసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్తితిలో వుంది. ప్రధాని మోడీకి, ఆయన పార్టీ అయిన బీజేపీకి కాంగ్రెస్ అంటేనే చుక్కెదురు. ఇలాటి నేపధ్యంలో రాష్ట్రపతి తనకున్న పరిమితుల్లోనే హితబోధ చేశారు. జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, జరగాల్సిన విధి విధానాలను విశ్లేషించారు. అలాగని ఆయన ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఎవ్వరు నొచ్చుకునే విధంగా మాట్లాడలేదు. ఒక కుటుంబ పెద్ద తన కుటుంబ విషయాలను తనవారితో యెలా మాట్లాడతాడో ఆవిధంగానే సాగింది రాష్ట్రపతి ప్రసంగం.

ప్రతిపక్షం యెలా వ్యవహరించాలో, పాలక పక్షం యెలా నడుచుకోకూడదో శ్రీ ప్రణబ్ ముఖర్జీ అన్యాపదేశంగా ప్రస్తావించారు. ప్రజల ద్వారా ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన చట్టసభల్లో కనబరుస్తున్న ప్రవర్తనను ఆయన ప్రశ్నించారు. ఒకరకంగా చెప్పాలంటే యావద్దేశ పౌరుల మనస్సుల్లో కదలాడుతున్న అంశాలనే రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి తమ ప్రసంగాలలో చెప్పిన మాటల్ని ఇన్నేళ్ళ తరువాత గుర్తు చేయాల్సిన అవసరం, గుర్తుంచుకోమని చెప్పాల్సి రావడం బాధాకరం.

ముందు చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం దేశంలో సహనం, అసహనాలు గురించిన చర్చ సాధారణ జనం సహనం కోల్పోయే స్థాయిలో అనంతంగా సాగిపోతోంది. తమ మాట వినమని చెప్పే వాళ్ళే కాని ఎదుటివారు చెప్పేది వినిపించుకునే ఓపిక ఎవ్వరికీ లేకుండా పోతోంది.

పార్టీలకు అతీతంగా సమాజ హితాన్ని కోరుకునే వారి మనసులను కలవర పరుస్తున్న అంశం ఇదే.

( ఈ వ్యాసం రాసింది: 04-11-2015 తేదీన)

1 కామెంట్‌:

బుచికి చెప్పారు...

సహనావవతు అన్నది సరి అయిన పదం . అది విడతీస్తే సహ+నౌ+అవతు అంటే మా ఇరువురిని కాపాడు అనే అర్థం వస్తుంది. సహనం అన్న అర్థం లేదు.