17, సెప్టెంబర్ 2020, గురువారం

విలువల పతనంలో వ్యవస్థల పోటీ – భండారు శ్రీనివాసరావు

 చేదు మాత్ర:

వ్యవస్థలలో దాపరికం లేకుండా పోయినప్పుడే ప్రజాస్వామ్యం మూడు పూవులు ఆరు కాయలుగా విలసిల్లుతుంది.

కోర్టుల్లో విచారణలో భాగంగా అనేక అంశాలు ప్రస్తావనకు వస్తుంటాయి. లాయర్ల నుంచి సరైన సమాచారం రాబట్టడానికి న్యాయమూర్తులు అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు. నిజానికి అంతిమంగా వెలువడే తీర్పుకి ఈ వ్యాఖ్యలకి ఎలాంటి పొంతన ఉండక పోవచ్చు. అయినా కానీ, ఇరవై నాలుగు గంటల వార్తా ప్రసారాల్లో వాటిని పదేపదే స్క్రోల్ చేస్తుంటారు. జడ్జీలు వీటి విషయంలో కూడా తగిన ఆదేశాలు ఇస్తే మంచిది. గతంలో ప్లీడర్లు జడ్జీల మీద విసుర్లు విసిరేవారు. వాటికి సినిమాల్లో కూడా మంచి ఆదరణ లభించేది. ఇప్పుడు న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలకు మీడియాలో అలాంటి ఆదరణే దొరుకుతోంది. అసలు వాదోపవాదాలకంటే ఇటువంటి వాటికి ప్రచారం ఇస్తున్నారు అంటే ఎక్కడో ఏదో స్వీయ ప్రయోజనం ఉన్నట్టుగా జనం భావించే అవకాశం వుంది.

స్వీయ ప్రయోజనాలు కలిగిన మీడియాకు స్వేచ్ఛ కోరే వెసులుబాటు వుండదు. స్వేచ్ఛ కావాలంటే కొన్ని త్యాగం చేయక తప్పదు. సొంత ప్రయోజనాలా సమాజం ప్రయోజనాలా అన్నది మీడియా తేల్చుకోవాల్సి వుంది. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదు. అలాంటి స్వేచ్ఛకి ప్రజల మద్దతు లభించదు.

అలాగే ఇతర రాజ్యాంగానికి మూడు మూల స్తంభాలుగా ఏర్పరచిన వ్యవస్థలు కూడా. వీటికి రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలు వుంటాయి. వీటితో పాటు కొన్ని బాధ్యతలు వుంటాయి. విశాల జాతి ప్రయోజనాలను కాపాడేందుకే ఆ వ్యవస్థలకు ఈ అధికారాలు, హక్కులూ అన్నది అవి మరచిపోరాదు.

కనపడని మరో మూల స్తంభంగా పేర్కొనే ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాకు అధికారాలు అంటూ ఏమీ వుండవు. కాకపోతే స్వేచ్ఛ, దానికి తగ్గట్టుగా హక్కులు, బాధ్యతలు వుంటాయి.
అపరిమితమైన, అవాంఛిత స్వేచ్ఛకు రక్షాకవచం మాదిరిగా ఒక్కోసారి ఈ హక్కులను ఓ ఉపకరణంగా వాడుకోవడం ఇటీవలి కాలంలో చూస్తున్నాం. మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలు చాలాకాలం వరకు మీడియా స్వేచ్ఛను గౌరవిస్తూనే వచ్చాయి. మీడియా రంగంలో స్వీయ ప్రయోజనాలు చొరబడిన నాటి నుంచి ఆ గౌరవ ప్రతిపత్తులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇది గమనించని మీడియా వెనుకటి మాదిరిగానే తమ హక్కుల పరిరక్షణ కోసం మిగిలిన వ్యవస్థలతో ఘర్షణ వాతావరణంలో చిక్కుకుంటోంది. ఇది కేవలం స్వయంకృతాపరాధం.
విలువల పతనంలో మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఏమీ వెనుకబడి లేవు. ఒకప్పుడు వాటికి ఉన్న పేరు ప్రతిష్టలు వేగంగా మసకబారుతున్నాయి. కాలానుగుణంగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలను అన్ని వ్యవస్థలు అతి సహజంగా తీసుకోవడమే ఓ విషాదం. ఇతరుల తప్పులను వేలెత్తి చూపడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం అనే విష క్రీడలో అవి మునిగి తేలుతున్నాయి. పౌర సమాజం కూడా ఈ క్రీడలను చూస్తూ వినోదిస్తున్నది. వారి మౌనానికి కారణం వెరీ సింపుల్. వారిని ఉత్తేజపరచాల్సిన మీడియా, మేధావి సమాజం ఏదో ఒక రాజకీయ గుడారానికి అనుబంధంగా పనిచేస్తూ, తమ స్వీయ ప్రయోజనాలు కాపాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండడమే. ఇలా ఎవరి ప్రయోజనాలు వారికి ప్రధానం అయినప్పుడు, వాళ్ళు కూడా విలువల పతనానికి సాగుతున్న యాగంలో సమిధలుగా మారుతూ తమ తాత్కాలిక ప్రయోజనాలను నెరవేర్చుకొంటున్నారు. ఈ కోవలోనే సాధారణ జనం. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కదా!
ఆ విధంగా చక్రభ్రమణం పూర్తయి ప్రజాస్వామ్యానికి చెదలు పడుతున్నాయి.

ఈ స్థితిని చక్కదిద్దాలని కోరని వారుండరు. కానీ ఆ ప్రయత్నం తమ నుంచే ఎందుకు మొదలు కారాదని ఆలోచించే వాళ్ళే లేరు. (17-09-2020)

కామెంట్‌లు లేవు: