16, మే 2015, శనివారం

బుక్ షెల్ఫ్ - 6 ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు


(శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)
"పరీక్షలు అయిన తరువాత ఇంటికి వెళ్లాను, గుడ్లవల్లేరు. రిజల్ట్ వచ్చిన సంగతి ఆలస్యంగా తెలిసింది. హైసెకండ్ క్లాసులో పాసయ్యాను. హైదరాబాదు వెళ్లి నిజాం కాలేజీలో అడ్మిషన్ కోసం అప్లికేషన్ ఇచ్చాను. టర్నర్ అనే ఆయన ప్రిన్సిపాల్. ఆయన వేసవి సెలవులకు ఇంగ్లండు వెళ్ళాడు. మహమ్మద్ సిద్దికీ అని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన్ని తాత్కాలికంగా ప్రిన్సిపాల్ గా వేసారు. టర్నర్ వుంటే నా మార్కులు చూసి సీటు  ఇచ్చేవాడే. మహమ్మద్ సిద్దికీ గారు 'నువ్వు ఆలస్యంగా వచ్చావు. సీట్లు నిండి పోయినై. నువ్వు మద్రాసు ప్రెసిడన్సీ వాడివి. అయినా మంచి మార్కులు వచ్చాయి కనుక ముల్కీ సర్టిఫికేట్ తెస్తే సీటు ఇస్తాన'ని అన్నారు. ముల్కీ సర్టిఫికేట్ అంటే నిజాం రాజ్యంలో పుట్టయినా వుండాలి. లేదా పన్నెండేండ్లు నివాసం అయినా వుండాలి. మాకు నైజాంలో భూములు వున్నాయి కాని అవి పరాధీనంలో వున్నాయి. నైజాంలో పుట్టినట్టు సర్టిఫికేట్ కావాలంటే సాక్ష్యం వుండాలి. ఆరోజుల్లో నైజాంలో పుట్టుకల గిట్టుకల రిజిష్టర్  వుండేది కాదు. అంచేత అనేకమంది దొంగ సర్టిఫికేట్లతో చేరేవారు.  మా బావ స్నేహితుడి తండ్రి  ఆబ్కారీ శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయినాడు.  ఆయన సాక్ష్యం  ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మర్నాడు ఇద్దరం అప్లికేషన్ తో తాలూక్ దార్ ఆఫీసుకు వెళ్ళాము. 'ఇతను  మీకెలా తెలుసు అని తాలూక్ దార్ అడిగితె, ఆబ్కారీ డిపార్టుమెంటులో పనిచేస్తూ వాళ్ళ  వూరు వెళ్ళేవాడిని, అల్లా పరిచయం' అనిచెబుతాను. నువ్వూ  అట్లాగే చెప్పు' అని నాతొ అన్నాడాయన. ఫారం లోపలి పోయింది. మాకన్నా ముందు వచ్చిన ఒకాయన తప్పుడు సాక్ష్యం చెప్పాడని మజరద్ గార్ నిర్ణయించి రెండువందలు ఫైను వేసాడు. అది చూసి సాక్ష్యం ఇవ్వడానికి నాతొ పాటు వచ్చిన పెద్దమనిషి భయపడి పోయాడు. ఐనా నేను లోపలకు వెళ్లి మజరాద్ గారిని  కలిసాను. చిన్నవాడు. మంచి  మనిషిలా కనిపించాడు. 'నీకు నిజాం కాలేజీలో సీటు వచ్చింది చేరడానికి ముల్కీ కావాలి. ఎవర్నన్నా సాక్ష్యం తీసుకురా ఇస్తాన'ని చెప్పాడు. నాకు సాక్ష్యం  ఎవ్వరూ లేరు. ముల్కీ రాలేదు. సీటూ  రాలేదు. అందుకే  ఇంటికి వెళ్ళిపోయాను.  తరువాత బందరులో హిందూ కాలేజీలో నాలుగేళ్ళు చదివాను. (ఇంకా వుంది)

5 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

దొంగ ముల్కీ సర్టిఫికేటు పెట్టనందుకు శాస్త్రి గారికి ధన్యవాదాలు. తనకు తెలిసిన దొంగ ముల్కీల భండారం బయట పెట్టాలని మనవి.

hari.S.babu చెప్పారు...

@jai
మొదటి సాక్షి భయపదకుండా వుంతే,మరో సాక్షి దొరికివుంతే ఆయనా పెట్తేవాదే గదా!
ధన్యవాదాలకి బదులు అప్పుడు తెలంగాణాని దోచుకున్న ద్రోహుల్లో ఒకడని తిట్టేవారా?

అజ్ఞాత చెప్పారు...

@Jai

As far my knowledge:
Mulk means a Country. So we can justify having Mulki rules when hyderabad was independent nation.

When Hyderabad is integrated to Indian union, Mulk means entire Indian union. In that case a NON mulki need not say that i will not be mulki of another indian state. .

Jai Gottimukkala చెప్పారు...

@Hari Babu Suraneni:

కారణాలు ఏమయినా చివరకు శాస్త్రి గారు మోసం చేయలేదు కనుక ధన్యవాదాలు చెప్పాల్సిందే.

@అజ్ఞాత:

హైదరాబాదు అప్పటి కూడా *దేశం* కాదు, రాష్ట్రమే. సాలార్జంగ్ లాంటి మంత్రులు సైతం భారత పాసుపోర్టు పైనే విదేశీ ప్రయాణం చేసారు.

FYI ముల్క్ అనే పదానికి దేశమే కాదు ఒక ప్రదేశం అని కూడా అర్ధం వస్తుంది.

YJs చెప్పారు...

శాస్త్రిగారు రాసినదాని బట్టి: నాకు సాక్ష్యం ఎవ్వరూ లేరు. ముల్కీ రాలేదు. సీటూ రాలేదు. అందుకే ఇంటికి వెళ్ళిపోయాను.
ఆయనకి దొంగ సాక్ష్యం సృష్టించే అవకాశం రాలేదు కాబట్టే, అందుకే ఇంటికి వెళ్ళిపోయారు. అవకాశం వుంటే?