13, సెప్టెంబర్ 2011, మంగళవారం

9/11 - తలకెక్కని చరిత్ర పాఠాలు - భండారు శ్రీనివాసరావు

9/11 - తలకెక్కని చరిత్ర పాఠాలు - భండారు శ్రీనివాసరావు


9/11
ఈ రెండంకెలు అమెరికన్ ప్రజల మనస్సులో ఎంత బలంగా నాటుకు పోయాయంటే పదేళ్లు గడిచిన తరువాత కూడా సెప్టెంబర్ 11 వ తేదీన జరిగిన ఘోర సంఘటనను వారెవ్వరూ మరచిపోలేకుండా వున్నారు. న్యూ యార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు ఉగ్రవాదుల వైమానిక దాడికి గురయి పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు ప్రతి అమెరికన్ మదిలో కళ్ళకు కట్టినట్టు కదలాడుతూనే వుండి వుండాలి.

ఈ దాడి జరిగి మొన్నటికి పదేళ్లు గడిచాయి. ఇందులో ప్రాణాలు కోల్పోయిన దాదాపు మూడువేలమంది తాలూకు కుటుంబ సభ్యులు ఆ దుఖం నుంచి, ఆ దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకున్నట్టు కనబడదు. అలాగే, అమెరికన్ అగ్రరాజ్య అభిజాత్య అహంకార పూరిత చర్యల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక వేలమంది ఇన్నేళ్ళుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. వారి కుటుంబాల పరిస్తితి ఇదే. ఇదంతా ఎందుకోసం, ఇంత మారణ హోమం ఎవరికోసం అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. మానవ జాతిని పీడిస్తున్న పెను విషాదాల్లో ఇదొకటి.

తన అధికారానికీ, తన పెత్తనానికీ ఎదురులేదని విర్రవీగే అమెరికన్ పాలకులకు 2001 దాడితో తగిలిన తొలిదెబ్బతో తల బొప్పికట్టింది. ఇన్నాళ్ళుగా తన స్వార్ధ ప్రయోజనాలకోసం పెంచి పోషిస్తూ వచ్చిన ఉగ్రవాద భూతం కోరలు సాచి కబళించడానికి వచ్చిన తరువాత కానీ అగ్రరాజ్యానికి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. ఈ దారుణ అవమానం నుంచి బయటపడేందుకు 9/11 దాడి సృష్టికర్త ఒసామా బిన్ లాడెన్ ను, వెంటాడి, వేటాడి మట్టు పెట్టేంతవరకు అగ్ర రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రతీకారేచ్చలతో అట్టుడికి పోతున్న రెండు వైరి వర్గాల మధ్య పోరు నిరంతరంగా సాగుతోంది. ఈ కారణంగా ప్రపంచదేశాలకు నిష్కారణంగా జరుగుతున్న కీడు గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు.సెప్టెంబర్ దాడి గురించి మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి కారణభూతుడయిన ఒక వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగయి పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.

2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని నడుపుతూ, మన్ హటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని దానితో డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది పేరే మహమ్మద్ అత్తా.

అత్తా పుట్టింది ఈజిప్టులో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలోనే, అమెరికాకు చెందిన ఒక అద్భుత కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి, బహుశా 1968 సెప్టెంబర్ లోనే పుట్టిన అత్తాకు తెలిసుండదు.

అత్తా చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.

కెయిరో విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల ప్రభావితుడై, వారి ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు. చివరకి, ఒసామా బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.

అత్తా మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.

1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విదిచిపెట్టాల్సిన పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు మరకలు’ అంటిన ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు. దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్ అత్తా కూడా వారిలో ఒకడు.

చూసే కంటిని బట్టి ప్రపంచం కనబడుతుందంటారు. అందుకే, ఉగ్రవాదుల దృష్టిలో అత్తా ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడు. అమెరికా దృష్టిలో కరడుగట్టిన ఉగ్రవాది.

దశాబ్దం క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కిచెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఈ పదేళ్ళ కాలంలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది. ముఖ్యంగా మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉగ్రవాద నిర్మూలన అనేది భరించలేని భారంగా మారింది. ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన విలువయిన వనరులను భద్రతా చర్యలకు మళ్ళించాల్సి వస్తోంది.

హైదరాబాదులో, ముంబైలో, మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిన పేలుళ్లు జనంలో పెచ్చరిల్లుతున్న అభద్రతా భావానికి పునాది రాళ్ళుగా మారుతున్నాయి.

ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు. (13-09-2011)6 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

"...డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం..."

ఏమిటీ దృఢ నిశ్చయం? ఏమీ చెయ్యకుండా కూచోవటమా? కొవ్వొత్తుల పరిశ్రమని ప్రోత్సహించటమా? ఏమన్నా జరిగినప్పుడల్లా ఒక స్టీరియో టైప్ ప్రకటన పారేసి మెదలకుండా ఉన్నపదవి అనుభవించటమా? ఏమిటా దృఢ నిశ్చయం చెప్పండి శ్రీనివాసరావు గారూ.

రాజ్యం వీరభోజ్యం అన్నారు అది లేకుండా వెర్రి మొర్రి ఇజాల పాలిటబడి మన దేశం అధోగతి వైపు పయనిస్తున్నది.

KumarN చెప్పారు...

నిజమే, శివరామప్రసాదు గారు అడిగినట్లు, ఆ 'రాజకీయ ధృడ నిశ్చయం' ని వివరిస్తే, ఆర్టికల్ కి ఇంకొంచెం completeness వస్తూందేమో శ్రీనివాసరావ్ గారూ!

Everyone agrees on 'Ends'. 'Means' are where people differ. Instead of leaving it to the imagination of the reader, spelling out specifics would certainly enrich the article.

Rao S Lakkaraju చెప్పారు...

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు.
-----------
హిట్లర్ ప్రపంచాన్నంతా కబళిస్తూ ఉంటేనూ, యూదులను ఊచకోత కోసి చంపుతున్టేనూ ఆపింది అమెరికా. జపాను పెట్రేగిపోయి దేశాల్నికబళిస్తూ అసలు యుద్డంలోలేని అమెరికా పెరల్ హార్బోర్ మీద వీరంగం చేస్తే మళ్ళా తలెత్తుకోకుండా చేసింది అమెరికా. ఇవన్నీ చరిత్రలో జరిగినవే అటువంటివి మళ్ళా జరుగకూడదని అమెరికా ప్రయత్నం, చరిత్ర ప్రాముఖ్యం తెలిసి గుణ పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి.

డిల్లీ మీద, బాంబే మీద బాంబులు వేస్తున్నా పట్టనట్టు ఊర్కోటం చరిత్ర ప్రాముఖ్యం తెలిసి గుణ పాఠాలు నేర్చుకోక పోవటం.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శివరామప్రసాద్ కప్పగంతు -".....రాజకీయ దృఢ నిశ్చయం" అగ్రరాజ్యమయినా అల్ప రాజ్యమయినా ముందు తన స్వార్ధ ప్రయోజనాలు చూసుకుంటూ వుండడమే ఈనాటి ఈ దైన్యతకు కారణమనుకుంటున్నాను.ఉగ్రవాదం ఇలా పెచ్చుపెరిగిపోవడానికి ఈ ప్రయోజనాలే కారణమవుతున్నాయి.మీరన్నట్టు 'ఏదయినా జరిగినప్పుడల్లా ..'ఓ డంబాల ప్రకటన పారేసి చేతులు దులుపుకునే పధ్ధతి మానుకోవాలి.ఇక దృఢనిశ్చయమంటారా- అమెరికాని చూసి నేర్చుకోవాలి. ఈ దుర్ఘటనకు ముందూ తరువాత కూడా నేను ఆ దేశానికి వెళ్లి వచ్చాను.భద్రత విషయంలో వారు అనుసరిస్తున్న పద్ధతులు శ్లాఘనీయం.మన లాగా వీ.ఐ.పీ.లకు మినహాయింపు ఇవ్వరు.ఒక్క ఎంట్రీ పాయింట్ మినహాయిస్తే దేశంలో హాయిగా తిరగగలిగేలా వ్యవస్థను రూపొందించుకున్నారు. ఈ పదేళ్ళ కాలంలో మరో దుర్ఘటన పునరావృతం కాలేదంటే అక్కడ భద్రతా వ్యవస్థ ఎంత విజయవంతం అయిందో అర్ధం చేసుకోవచ్చు. గుడ్డిగా అనుకరించడంలో మాత్రం మనల్ని కొట్టేవాళ్ళు లేరు. మాల్స్ లో, సినిమా హాల్స్ లో ఇక్కడా అక్కడా అనిలేకుండా వొళ్ళు తడిమే తనిఖీలు.వీటివల్ల బాగుపడుతున్నది ప్రైవేటు సంస్థలు. ఫలితం మాత్రం సున్నకు సున్నా హళ్లికి హల్ళీ. బాంబు దాడులు కానీ,పేలుళ్లు కానీ ఆగిన దాఖలాలు లేవు. విస్తరణ భీతివల్ల కొన్ని విషయాలు వివరంగా రాయలేకపోయాను.మన్నించాలి. - భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Kumar N - 'రాజకీయ దృఢ నిశ్చయం ' అని రాసింది మన దేశం గురించే. సమస్య కాదు దాన్ని పరిష్కరించే మార్గం సూచించడం కూడా అవసరమే. కాదనను. మన దేశం లో ఉగ్రవాదం పెచ్చరిల్లడానికి అనేకానేక కారణాలున్నాయి. వీటిల్లో ప్రధానమయినది మతం.బహిరంగ వేదికలపై, చర్చల్లో పేరు పెట్టి పేర్కొనడం వల్ల ఒనగూడే ప్రయోజనం కంటే జరిగే కీడే ఎక్కువని నా అభిప్రాయం. అందుకే - ..as you said'I left it to the imagination of the reader.However, very many thanks for your observation which is, in my opinion cent percent correct.If you give your mail id, we can exchange views. Mine is - bhandarusr@yahoo.co.in or bhandarusr@gmail.com - భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Rao S Lakkaraju - జర్నలిష్టులు సహజంగా గీసుకునే 'చావు రేఖలే' (DEAD LINES) నా ఈ వ్యాసం లోని అయోమయానికి,అస్పష్టతకు కారణ మనుకుంటున్నాను.ఒక్కోసారి రాద్దామనుకున్నది సమగ్రంగా రాయడానికి వ్యవధానం వుండదు. అయితే ఈ సంజాయిషీ సమర్ధనకు నిలవదు.మరికొంత వివరంగా రాసివుండాల్సింది.ఈ వివరణ ఇచ్చే అవస్థ తప్పేది.పై ముగ్గురికీ విడివిడిగా సమాధానాలు రాయాలన్న కుతూహలం మరికొన్ని సందేహాలకు తావివ్వకుండా వుండాలంటే 'మూడు జవాబులను' ముగ్గురూ చదవాలని నా ప్రత్యేక అభ్యర్ధన.- భండారు శ్రీనివాసరావు