14, సెప్టెంబర్ 2011, బుధవారం

మోసం గురూ - భండారు శ్రీనివాసరావు


మోసం గురూఅనగనగా ఒక వూరు.


వున్నట్టుండి ఓ రోజున ముక్కూమొహం తెలియని వ్యక్తి ఒకడు తన సహాయకుడిని వెంటబెట్టుకుని ఆ వూరు వచ్చాడు. వచ్చీరాగానే రచ్చబండ దగ్గర వూళ్ళో వాళ్ళతో భేటీ అయ్యాడు.


‘నాది కోతుల వ్యాపారం. ఒక్కో కోతికీ పది వరహాల చొప్పున ఇస్తాను. పోయి కోతుల్ని పట్టుకు రండి.’ అని చెప్పాడు.


గ్రామస్తులకి మతి పోయింది. వూరికి వున్నదే కోతుల బెడద. పట్టుకువచ్చి ఒప్పచెబితే పది వరహాలంటు న్నాడు. బేరం భేషుగ్గావుంది. కోతుల పీడా వొదలడంతో పాటు నాలుగు రాళ్ళు కూడా వొళ్ళో పడతాయి.


వూరి జనమంతా పొలోమని కోతుల వేటలో పడ్డారు. మాట ఇచ్చినట్టే ఆ కోతుల బేహారి, కోతికి పది వరహాల చొప్పున లెక్కకట్టి మరీ చేతులో పెడుతున్నాడు. తెచ్చిన కోతిని తెచ్చినట్టు ఒక పెద్ద బోనులో పడేసి మేపుతున్నాడు.


కొన్నాళ్ళకు వూళ్ళోనే కాదు చుట్టుపక్కలకూడా కోతుల సంఖ్య తగ్గడం మొదలయింది. దాంతో బేహారి ధర పెంచాడు. ఒక్కో కోతి రేటు ఇప్పుడు అక్షరాలా పదిహేను వరహాలు.


కొన్నాళ్ళకి కోతుల కొరత మరీ ఎక్కువయింది. పదిహేను కాదు పాతిక వరహాలన్నాడు. జనం పెరుగుతున్న ధర చూసారు కానీ అందులో మర్మం ఏమిటో ఎవ్వరికీ అర్ధం కాలేదు. బేహారి కూడా కొన్న కోతుల్ని మారు బేరానికి అమ్మడం లేదు. తెచ్చిన కోతుల్ని తెచ్చినట్టు బోనులోనే వుంచుతున్నాడు. మనకు రావాల్సింది మనకు చెల్లిస్తున్నప్పుడు అతడా కోతుల్ని ఏం చేసుకుంటే మనకెందుకు అని జనమే సర్దిచెప్పుకున్నారు.


అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ వ్యాపారి రేటు యాభయి వరహాలకు పెంచాడు.


తమ పంట పండిందనుకున్నారు గ్రామస్తులు.


ఓ రోజు ఆ వ్యాపారి కోతుల కొనుగోలు వ్యవహారం సహాయకుడికి ఒప్పచేప్పి వ్యాపారపు పనులమీద పట్నం వెళ్లాడు.


అతడలా వెళ్ళగానే అతడి సహాయకుడు వూల్లోవాళ్లని పిలిచి చెప్పాడు.


‘ఆ బోనులో మేం కొన్న కోతులన్నీ అలాగే వున్నాయి చూశారు కదా. నేను మీకు వాటిని ముప్పయ్ అయిదు వరహాలచొప్పున అమ్ముతాను. మా వాడు వూరినుంచి రాగానే మీరు వాటిని యాభయికి అమ్మేయండి. శ్రమలేకుండా మీకు పదిహేను వరహాలు మిగులుతాయి.’


గ్రామస్తులకు మతులు పూర్తిగా పోయాయి. కోతులు అమ్మి సంపాదించిందే వారి దగ్గర చాలా వుంది. ఇక ఇప్పుడో ఇలా ఇచ్చి అలా తెచ్చుకోవడమే. వ్యాపారి సహాయకుడు చెప్పిన మాటలతో వారికి కోతికి కొబ్బరికాయ దొరికినంత సంబరపడ్డారు.పెళ్ళాం నగలు కుడువబెట్టీ, హెచ్చు వడ్డీలకు అప్పులు తెచ్చి కోతికి ముప్పయి అయిదు వరహాల చొప్పున ఆ సహాయకుడికి చెల్లించి వున్న కోతులనన్నింటినీ కొనుగోలుచేశారు.


అంతే. మర్నాటి నుంచి ఆ వ్యాపారి కానీ అతడి సహాయకుడు కానీ మళ్ళీ వాళ్లకు కనిపిస్తే వొట్టు.


ఆనాటి వరహాల రోజులనుంచి ఈ నాటి రూపాయల కాలం దాకా ఇదే తంతు.


మోసం చేసేవాళ్ళు మారలేదు. మోసగించబడే వాళ్లు మారలేదు.


మోసం చేసే తీర్లు ఏమన్నా మారుతున్నాయేమో.

(షేర్ సింగ్ లు చేసే మాయాజాలాల గురించి అంతర్జాలంలో షికారు చేస్తున్న ఆంగ్ల గల్పికకు స్వేచ్చానువాదం)

14-09-2011


8 కామెంట్‌లు:

Srinivas Addanki చెప్పారు...

చాలా బాగుంది!!

Saahitya Abhimaani చెప్పారు...

మంచి కథ శ్రీనివాసరావుగారూ. మనుషుల్లో దురాశ పోనంతవరకూ, మోసగించే వాళ్ళు ఉంటూనే ఉంటారు.

prabandhchowdary.pudota చెప్పారు...

బాగుందండి.

Rao S Lakkaraju చెప్పారు...

మంచి స్టొరీ. వారిని గ్రేట్ బిజినెస్స్ మైండ్స్ అంటారనుకుంటా.

విష్వక్సేనుడు చెప్పారు...

తెలిసిన సోల్లె కదా మాస్టారు............

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Srinivas Addanki,@శివరామ ప్రసాద్ కప్పగంతు,@prabandhchowdary.pudota,@Rao S Lakkaraju and @వినోద్ - ధన్యవాదాలు."ఆశ చచ్చినా దురాశ పుట్టినా ఆ మనిషి చచ్చినవాడితో సమాన"మన్నారు. - భండారు శ్రీనివాసరావు

GopiKrishna Gujjula చెప్పారు...

చాల బాగుందండి. అందుకేనేమో పెద్దలు "దురాశ దుఖానికి చేటు" అన్నారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Gopikrishna Gujjula - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు