9, డిసెంబర్ 2021, గురువారం

కలంపాళీ ఎటు తిరుగుతోంది?


అరవై ఏళ్ళ క్రితం, మా వూళ్ళో సత్యనారాయణ సిద్ధాంతిగారనే ఏజెంటుకి మూడున్నర రూపాయలు చందా కడితే నెల రోజులపాటు ఆనాటి ఆంధ్రపత్రిక మా ఇంటికి వచ్చేది. కానీ, అది మా వూరు చేరేసరికి సాయంత్రం అయ్యేది. అయినా ఏ రోజు వార్తలు, ఆరోజే చదువుతున్న ఫీలింగ్‌ కలిగేది. (తర్వాత, 1987లో, రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళినప్పుడు హిందూ పేపర్ని ఇండియన్‌ ఎంబసీ నుంచి తెప్పించుకుని చదివేవాళ్ళం. కానీ అది బెంగుళూరు ఎడిషన్‌ కావడం వల్ల అందులో మన ప్రాంతం వార్తలు చాలా తక్కువ. హైదరాబాద్‌ నుంచి కీర్తి శేషులు హిందూ బ్యూరో చీఫ్‌ ఆర్‌. జె. రాజేంద్రప్రసాద్‌ రాస్తుండే రాష్ట్ర సమాచార లేఖ ఒక్కటే మాకు వూరట.
అప్పట్లో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ ఐ . వెంకటరావు, జర్నలిస్టుల ప్రతినిధి బృందంలో సభ్యుడిగా మాస్కో వచ్చారు. తెలుగు పత్రిక కోసం అక్కడి తెలుగు కుటుంబాలు పడుతున్న వెంపర్లాటని ఆయన గమనించారు. హైదరాబాద్‌ వెళ్ళీ వెళ్ళగానే ఆంధ్రజ్యోతి దిన పత్రికని ఇండియన్‌ ఎంబసీ ద్వారా ఉచితంగా పంపించడం ప్రారంభించారు. సొంత రాష్ట్రం తాలూకు సమాచారాన్ని వారం రోజుల తర్వాతనయినా తెలుసుకోగల వీలు దొరకడం అదో కథ. అదో మధుర స్మృతి).

ఇక వెనక్కి వెడితే

అప్పట్లో అంటే యాభయ్‌, అరవై సంవత్సరాలక్రితం దినపత్రికల ఖరీదు అందరికీ అందుబాటులో ఉండేది. అయితే కొని చదివే అలవాటు మాత్రం చాలా తక్కువ.

ఆ రోజుల్లో పత్రికలకి ప్రకటనల రూపంలో కానీ, ఇతరత్రా కానీ లభించే ఆదాయం అంతంత మాత్రమే. పత్రికలు నడిపేవారుకూడా , దాన్నే తమ ప్రధాన ఆదాయవనరుగా భావించేవారు కాదు. దినవారీ నిర్వహణ బాధ్యతని పూర్తిగా సంపాదకులకు వదిలిపెట్టేవారు. అందుకే ఒక కోటంరాజు రామారావు, ఒక నార్ల, ఒక గోరాశాస్త్రి , ఒక రాఘవాచారి, ఒక నీలంరాజు, ఒక పండితారాధ్యుల, ఒక నండూరి రామమోహనరావువంటి సంపాదకులు ఆంధ్రదేశానికి లభించారు. వీరిలో నాకు తెలిసినంతవరకూ ఒక నార్ల వారు మాత్రమే రాజ్యసభ సభ్యులు కాగలిగారు.
ఆరు దశాబ్దాల తర్వాత ఈ నాటి పరిస్థితులను పరిశీలిస్తే తెలుగు జర్నలిజం కార్పొరేట్‌ స్ధాయిని అందుకుంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అదనపు హంగులను, రంగులను సమకూర్చుకుంది. వార్తా సేకరణలో, ముద్రణలో, పంపిణీలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. కొని చదవాలన్న ఉత్కంఠని పాఠకుల్లో ప్రేరేపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ఆహ్వానించతగ్గవే. అందరూ కాకపోయినా కొందరు జర్నలిస్టు సోదరులు గతంలో కనీవినీ ఎరుగని ఆకర్షణీమయైన జీతభత్యాలను, సదుపాయాలను అందుకుంటున్నారు. తమ రచనలతో కూడగట్టుకున్న పాఠకాభిమానంతోపాటు, మీడియా చర్చల్లో పాల్గొంటూ , బుల్లితెరపై తరచుగా కనిపిస్తూ సెలబ్రిటీ స్టేటస్‌ని సయితం సంపాదించుకుంటున్నారు.
ఈ లక్షణాలని పుణికి పుచ్చుకున్న తర్వాత విలువలని కాపాడుకోవడం తలకి మించిన భారం కానూ కావచ్చు. చెప్పలేం!
నేను 70వ దశకంలో ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు ప్రకటనల రీత్యా ఆదాయం లేదని అనలేను కానీ, దాని మీదనే పత్రిక నడిచేదని చెప్పడానికి కూడా వీలులేదు. అందుకే నార్లగారు, నండూరి వారు పత్రిక నడిపిన తీరుపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి కావు. వారి సంపాదకీయ వ్యాఖ్యలకీ, వారి ఆధ్యర్యంలో ప్రచురితమయ్యే వార్తలకూ ఒక నిబద్ధత ఉండేది. ఆ తరువాతి తరంలో కూడా ఆ సాంప్రదాయం, ఆ పరంపర కొంతకాలం కొనసాగాయి.

మంచి పత్రిక ఎప్పుడూ మంచి పాఠకులను తయారు చేస్తుంది. వారిని తమ అభిమానులుగా మార్చుకుంటుంది. అందుకే కొందరు పాఠకులు కొన్ని పత్రికలని ప్రగాఢంగా అభిమానిస్తుంటారు. వాటిని చదవడానికే అలవాటు పడుతుంటారు. వాటిల్లో ప్రచురితమయ్యే వార్తలని, వ్యాఖ్యలని విశ్వసిస్తుంటారు. నిజమని నమ్ముతుంటారు. పాఠకుల భావజాలాన్నీ, ఆలోచనా రీతులను ప్రభావితం చేసే ఒక రకమైన సమ్మోహన శక్తి పత్రికలకు ఉంటుంది. అందుకే వాటిల్లో పనిచేసే జర్నలిస్టులకు సంఘంలో అంత మర్యాదా, మన్ననా.

కానీ వర్తమానానికి వస్తే,

పత్రిక నిర్వహణ, ఆ మాటకి వస్తే, మీడియా నిర్వహణ ఒక పరిశ్రమ మాదిరిగా తయారయింది. ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు లాభనష్టాలు బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దానితోబాటు వార్తలకూ, వ్యాఖ్యలకూ నడుమ ఉండాల్సిన సన్నటి విభజన రేఖ అదృశ్యమవుతోంది. వెనకడుగు వేస్తే వెనకబడిపోతామనే విశృంఖల పోటీ యుగం ప్రారంభమయింది. భుజకీర్తులు తగిలించుకునే భజన పరుల సంఖ్యా, రాజకీయ పార్టీలకూ, బడా పారిశ్రామిక సంస్థలకూ కొమ్ముకాసేవారి సంఖ్యా, మీడియాలో పెరుగుతోందన్నది కాదనలేని సత్యం. ప్రజా శ్రేయస్సు దిశగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే పవిత్రమైన బాధ్యత కలిగిన పత్రికల్లో, తమ అభిప్రాయాలను ప్రజల మీద రుద్దే దుష్ట సంస్కృతి రూపు దిద్దుకుంటోంది.

పత్రికలకు ప్రాణం స్వేచ్ఛ. అంతే కాదు, పత్రికాస్వేచ్ఛ జర్నలిస్టుల జన్మహక్కు. ఈ స్వేచ్ఛపై ఎవరు దాడి చేసినా, నిందలు వేసినా అది ప్రజా స్వామ్యానికి కీడుచేస్తుంది. అందుకే బాధ్యత కలిగిన పౌరులెవ్వరూ, ఈ రకమైన దాడులని, నిందలని హర్షించరు. అయితే అదే సమయంలో నిష్ఠురమైన నిజాన్ని కూడా మీడియా అర్ధం చేసుకోవాలి.
స్వేచ్ఛ అనే జన్మ హక్కు సయితం, పవిత్రమైన బాధ్యత నుంచి తప్పించలేదు.
నిబద్ధత వున్న చోటే నిజం నిలుస్తుంది. విశ్వసనీయతే హక్కుల్ని కాపాడుతుంది. అది వున్నంత కాలం దాడులకు, నిందలకు వెరవనక్కరలేదు. పాఠకులే పెట్టని కోటగా నిలబడి పత్రికలని కాపాడుకుంటారు.
కానీ ఆ పరిస్థితిలో, అలాంటి ఉన్నత స్థానంలో నేటి పత్రికలు, మీడియా వ్యవహార శైలి ఉంటోందా!
ఉంటే ఇటువంటి గీత బోధనలు చేయాల్సిన అవసరం ఏముంటుంది?

4 కామెంట్‌లు:

bonagiri చెప్పారు...

మీ బ్లాగు లో మాత్రం ప్రకటనలు బాగానే కనిపిస్తున్నాయి.

అజ్ఞాత చెప్పారు...

హిందూ‌ పేపరును మీరు ఏఎడిషన్ చదివినా అందులో మదరాసు (సారీ చెన్నై అనాలి కదా) వార్తలే హెచ్చుగా ఉంటాయి. చివరికి టూ-లెట్ ప్రకటనలతో సహ అన్ని ప్రకటనలూ అనగరానివే ఉంటాయి, అది కేవలం మదరాసీలకోసం ఒక పత్రిక. అసంగతి స్పష్టం అయ్యాకా దశాబ్దాల క్రిందటనే ఆ హిందూ‌ పత్రికను పట్టించుకోవటం మానేసాను. వేష్ట్ పేపర్!

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నేనూ డిటో.
హైదరాబాద్ ఎడిషన్లో కూడా లోకల్ వ్యాపార వివరాలు తక్కువ, చెన్నై నగరంలోని చిన్న చిన్న షాపుల వివరాలు ఎక్కువ. అదంతా చూసే చందా కట్టటం మానేశాను. ఒకసారి ఆ పేపర్ సేల్స్ రిప్రజెంటేటివ్ అంటూ ఒకతను వచ్చాడు, ఈ మాటే చెప్పి పంపించేశాను.

అజ్ఞాత చెప్పారు...

చిందూ పేపర్ బిపిన్ రావత్ గారు అమరులైన వార్తను ఇలా ప్రచురించి తన నీచత్వాన్ని బయట పెట్టుకుంది.

https://twitter.com/TVMohandasPai/status/1469664914117566464?t=ck50bZ1V5typo5dN5ZR3fw&s=19

దేశ ప్రేమికులైన ప్రతి భారతీయుడు కంటతడి పెట్టిన సైనిక అధికారుల మృతి హిందూ పత్రిక
శీర్షిక ద్వారా అగౌరవ పరచింది.