12, డిసెంబర్ 2021, ఆదివారం

బెజవాడ ఆనకట్టకు గండి

(విజయవాడ వీధుల కధలు – రచన: లంక వెంకట రమణ)

మితృడు రమణ ఈ పుస్తకానికి విజయవాడ వీధుల కధలు అని ఎందుకు పేరు పెట్టాడో తెలియదు కానీ ఇందులో విజయవాడ విశేషాలే ఎక్కువగా వున్నాయి. బెజవాడ వద్ద కృష్ణానదిపై కట్టిన ఆనకట్టతో మొదలయిన ప్రకాశం బరాజ్ కధ వీటిల్లో ప్రధానమైనది. అదిలా సాగింది.
“ప్రధానమైన నిర్మాణాలన్నీ మాయా మంత్రాలతో నిర్మించినవి కావు. వాటి వెనుక అనేకమంది త్యాగం వుంది. చిందించిన స్వేదం వుంది. కాటన్ దొర కృష్ణపై ఆనకట్ట నిర్మించిన నూరేళ్ళకు ప్రకాశం బరాజ్ కధ మొదలయింది. 1855 లో ఆ ఆనకట్టను కాటన్ మహాశయుడు నిర్మించి ఇచ్చాడు. దరిమిలా దానికింద ఆయకట్టు విస్తీర్ణం అయిదు లక్షల ఎనభయ్ వేల ఎకరాల నుంచి బాగా పెరుగుతూ వచ్చింది. తదనుగుణంగా ఆనకట్ట ఎగువన ఏర్పాటు చేసిన మూడు అడుగుల తలుపుల ఎత్తును ఆరడుగుల వరకు పెంచుతూ పోయారు. అవి 1925 నుంచి 1954 వరకు నమ్మకంగా పనిచేశాయి. ఎనిమిది అడుగులకు పెంచాలని ఆలోచన చేస్తున్న సమయంలో 1954 సెప్టెంబరులో కృష్ణకు వరదలు వచ్చాయి. ఆ నెల నాలుగో తేదీ సాయంత్రం ఆనకట్ట బయట గోడకు పెద్ద గండి పడింది. క్రమంగా గండి వెడల్పు 70 అడుగుల నుంచి 134 అడుగులకు పెరిగింది. దిగువ ప్రాంతాలన్నీ ఆకస్మిక వరద ముంపుకు గురయ్యాయి. అప్పటి సూపరింటెండింగ్ ఇంజినీరు వేపా కృష్ణ మూర్తి గారు ఉన్నతాధికారులతో చర్చలు జరిపి గండి స్వరూప స్వభావాలు తెలుసుకునేందుకు పడవలో వెళ్లాలని నిర్ణయించారు. ఇంజినీర్లు, లస్కర్లు అంతా ఒక పెద్ద పడవలో బయలుదేరారు. తిన్నగా గండి వద్దకు చేరుకున్నారు కానీ ఏమైందో ఏమో పడవతో సహా అందరూ వరదలో కొట్టుకు పోయారు. అయినా ఇంజినీర్లు ప్రయత్నం మానలేదు. చీఫ్ ఇంజినీరు జి.ఏ. నరసింహారావు గారు పెద్ద పెద్ద పంటుల మీద బ్రహ్మాండమైన బండ రాళ్ళు పెట్టి, గండికి ఎగువన ఫర్లాంగు దూరంలో లంగరు వేసిన స్టీమరుకు పంటును కట్టాలని, సమయం చూసి పంటుకు రంధ్రాలు పెట్టి, అది మునిగిపోయేలోగా ఇనుప తాళ్ళను తెంచి వేయాలనీ, అలా చేస్తే పంటు సరిగ్గా గండి వద్దకు వచ్చి మునిగి పోతుందనీ, ఆ విధంగా గండికి అడ్డుకట్ట వేయవచ్చనీ నిర్ణయించారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. గండిని పూడ్చి వేయడం జరిగింది. అరవై ఏళ్ళకు పూర్వమే తెలుగు ఇంజినీర్లు ప్రదర్శించిన అసమాన ప్రతిభకు ఇది తార్కాణం.

కామెంట్‌లు లేవు: