13, డిసెంబర్ 2021, సోమవారం

గాంధీభవన్ పంతులు గారు

 (2014 డిసెంబరులో మరణించిన ఎస్వీ. పంతులు గారి సంస్మరణార్ధం)

"ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక ఆయన జీవనం చాలా దుర్భరంగా గడిచేది. మద్రాసులో న్యాయవాదిగా సంపాదించిన అపార ధన రాశులు, అంతులేని ఆస్తిపాస్తులు స్వాతంత్రోద్యమ కాలంలో హారతి కర్పూరంలా కరిగిపోయాయి. రాజకీయాల్లో సమస్తం పొగొట్టుకున్న ఆంద్ర కేసరి చివరి రోజుల్లో కనాకష్టమైన జీవితం గడిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినెలా గౌరవ వేతనం కింద అందించే 750 రూపాయలను నేనే (గాంధీ భవన్ పంతులు గారు) స్వయంగా తీసుకెళ్ళి ఆయనకు అందించేవాడిని. సిరి సంపదలతో తులతూగిన ప్రకాశం పంతులు గారిని ఆ స్తితిలో చూస్తుంటే కడుపు తరుక్కుపోయేది"

హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన గాంధీభవన్ లో శేషజీవితం గడిపిన ఎస్వీ పంతులు గారు ఒకప్పుడు గుర్తుచేసుకున్న విషయాలు ఇవి. ముఖ్యమంత్రులుగా పనిచేసిన శ్రీయుతులు నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వై యస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, వీరందరికీ గాంధీ భవన్ లో 'తలలో నాలుక' పంతులు గారే. 'నేనూ కోట్లు కొల్లగొట్టే వాడినయితే ఇంతమంది గొప్పవాళ్ళ స్నేహం నాకు దొరికేదా' అనుకునే అల్ప సంతోషి పంతులు గారు మాత్రం సాయంత్రం సిటీ బస్సెక్కి ఇంటికి పోయేవారు. వీరిలో రోశయ్యగారితో పంతులు గారి అనుబంధం సుదీర్ఘ కాలం సాగింది. ఉదయం నుంచీ రాత్రి పొద్దుపోయే వరకు రోశయ్య గారితోనే వుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరినన్నా రెండు రూపాయలు అడిగి తీసుకుని సిటీ బస్సెక్కి పోయేవారు. 'మళ్ళీ రేపు రావాలి కదా ఈ పదీ వుంచండి' అని ఏ ధర్మాత్ముడన్నా అంటే 'టిక్కెట్టుకు రెండు రూపాయలు చాలు, రేపటి సంగతి రేపే' అనేసి వెళ్ళిపోయేవారట. దటీజ్ పంతులు గారు. అలాటి పంతులు గారు, ఎవర్నీ టిక్కెట్టుకు డబ్బులు అడక్కుండా ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. నాకాయనతో నలభయ్ ఏళ్ళ అనుబంధం.


(ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలి  చైర్మన్ గా పనిచేసిన చక్రపాణి గారితో పంతులు గారు)




 

1 కామెంట్‌:

Rakesh చెప్పారు...

ధన్యవాదాలు 🙏