15, డిసెంబర్ 2021, బుధవారం

బస్సులో వచ్చిన మనిషి హెలికాప్టర్ ఎలా సంపాదించాడు?

 రోశయ్య గారి గురించిన మరో జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

నాయుడమ్మ అవార్డు తీసుకునేవాడు అల్లాటప్పా మనిషి కాకూడదు అనేది ఆ అవార్డు కమిటీ బాధ్యుడు అయిన  విష్ణుమూర్తిగారి  మొదటి షరతు. దానికి కట్టుబడే ఇరవై నాలుగుమంది ప్రముఖులకు  ఏడాదికి ఒక్కరి చొప్పున ఇన్నేళ్ళుగా ఆ అవార్డును తెనాలిలో ఇస్తూనే వచ్చారు.

 ఇక ముఖ్య అతిధి సంగతి, ఆయన ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా తెనాలి రావాల్సిందే. విష్ణుమూర్తి గారి  ఈ షరతు కారణంగా కొందరు రావడానికి ఒప్పుకుని కూడా రాలేని పరిస్తితి. వారిని తప్పుపట్టడానికి కూడా వీల్లేదు.

ఒకసారి సామ్ పెట్రోడా కి నాయుడమ్మ అవార్డు  ఇవ్వాలనుకున్నారు. కానీ ఆయన్ని ఒప్పించడం ఎలా! సీనియర్ జర్నలిస్ట్  ములుగు సోమశేఖర్  ఇత్యాది బృందం తలలు పట్టుకున్నారు. ఈ బృందంలో హిందూ మాధవరావు గారు, వెనిగళ్ళ  వెంకటరత్నం,  జ్వాలా, నేనూ శాశ్వత ఆహ్వానితులం. మా కార్యస్థానం లక్ డి కా పూల్ లోని ద్వారక హోటల్ లో ఒక రూము. తెనాలి నుంచి బస్సులో హైదరాబాదు వచ్చి విశుమూర్తి గారు రెగ్యులర్ గా దిగే హోటల్ అదే.

చేతులకు, మూతులకు పనులు చెబుతూనే, తలలు పట్టుకోగా, పట్టుకోగా  చివరికి ఓ మార్గం దొరికింది. ప్రముఖ చిత్రకారుడు ఎస్వీ రామారావు గారు చికాగోలో వుంటారు. ఆయనకీ, పెట్రోడా గారికీ స్నేహం అన్న సంగతి సోమశేఖర్ బయట పెట్టాడు. అంతే! అమెరికాలో ఉన్న ఆయన్ని పట్టుకుని పెట్రోడా మహాశయుల్ని ఒప్పించడం జరిగింది.  అక్కడికి ఒక సమస్య తీరింది.

అవార్డు కార్యక్రమం రోజు ఉదయం  సామ్ పెట్రోడా మహాశయులు ఢిల్లీ నుంచి హైదరాబాదు విమానంలో  వస్తారు. ఆయన్ని అదేరోజు తెనాలి తీసుకుపోయి, మళ్ళీ తీసుకురావాలి అంటే హెలికాప్టర్ కావాలి. రోడ్డు మార్గంలో సమయం సరిపోదు. మరెలా!

మళ్ళీ మిత్రబృందం ద్వారకలో భేటీ అయి మరోసారి తలలు పట్టుకుంది. అంతే! ఓ ఐడియా తలుక్కున మెరిసింది.

హెలికాప్టర్ సదుపాయం వున్న ముఖ్యమంత్రిని ముఖ్య అతిధిగా పిలిస్తే!

ఇక్కడ తెనాలి, తెనాలి వరస కుదిరింది. పొలోమని వెళ్లి రోశయ్యగారికి చెప్పుకోవడం, ఆయన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని ముఖ్య అతిధిగా ఒప్పించడం చకచకా జరిగిపోయాయి. అప్పుడు మరో అవాంతరం. అది బయట వాళ్ళనుంచి కాదు, ఏకంగా విష్ణుమూర్తి గారి నుంచి. చెప్పాకదా! ఆయనో సీతయ్య. ఎవరి మాట వినరు.

హెలికాప్టర్ వెలుతురు వున్నప్పుడే తెనాలి నుంచి టేకాఫ్ అవ్వాలి. ప్రోగ్రాంని కాస్త ముందుకు జరపవయ్యా మగడా అంటే  విష్ణుమూర్తి గారు ససేమిరా అంటాడు.

మొత్తం మీద కాస్త పట్టు సడలించేలా చేయడానికి ద్వారకలో కాస్త ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది.

 ఇక శుభం కార్డు వేయొచ్చు అనేంతలో, వై.ఎస్.ఆర్. ఆ కార్యక్రమానికి హాజరుకాలేనటువంటి అర్జంటు పనేదో పడింది. అయితే ఆ సమస్యను ఆయనే తెలివిగా పరిష్కరించారు. రోశయ్యగారయితే ప్రసంగాలు చేయడంలో దిట్ట, నా బదులు ఆయన వస్తారని చెప్పి మొత్తం మీద టెన్షన్ తగ్గించారు. ముఖ్య అతిధిగా రోశయ్యగారు, అవార్డు గ్రహీతగా సామ్ పెట్రోడా గారు హెలికాప్టర్ లో హైదరాబాదునుంచి తెనాలి వెళ్లి వచ్చారు.

ఇన్నిన్ని పనులు చక్కబెట్టాలంటే ఆ వ్యక్తి వెనుక యెంత దన్ను వుండాలి?

విష్ణుమూర్తి గారి వెనుక ఏమీ లేదు, కేవలం పట్టుదల, పని పట్ల నిబద్ధత తప్పిస్తే!

కామెంట్‌లు లేవు: