22, జూన్ 2014, ఆదివారం

సాక్షి సండే హెడ్ లైన్ షో


ఈరోజు (22-06-2014) సాక్షి టీవీ హెడ్ లైన్ షో. ఆదివారం కాబట్టి అడిగే శ్రీరాం,  చెప్పే నేనూ తప్ప మరెవ్వరు 'పాల్గొనువారు' వుండరు కాబట్టి 'అదిగో ప్రశ్న ఇదిగో జవాబు'  మాదిరిగా అరగంట ప్రోగ్రాం ఫటాఫట్ గా చకచకా సాగిపోయింది.  


పోలీసు వ్యవస్థ మార్పుకు కేసీఆర్ సంకల్పం, రైలు చార్జీల పెంపు, గవర్నర్ ప్రసంగం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. షరా మామూలుగా సంక్షిప్తంగా:
"పోలీసు వ్యవస్థలో మార్పుకు శ్రీకారం చుట్టడం స్వాగతించతగిందే. డ్రెస్ కోడ్ మార్చడం ఒక్కటే కాదు వారి ప్రవర్తన మారేవిధంగా చర్యలు తీసుకోవాలి. ఒక మామూలు ప్రభుత్వ కార్యాలయానికి నిర్భయంగా వెళ్ళగలిగినట్టే పౌరులు  ముఖ్యంగా ఆడవారు  పిర్యాదు ఇవ్వడానికి నిస్సంకోచంగా  పోలీసు స్టేషన్ గుమ్మం ఎక్కగలిగిన పరిస్తితి ఏర్పరచాలి. పోలీసులంటే గౌరవం వుండాలి కాని భయం వుండకూడదు."
"పొజిషన్లో వున్నవాళ్ళు అప్పొజిషన్ లోకి అప్పోజిషన్ లోవాళ్ళు పొజిషన్ లోకి వెళ్లారు. పాత్రలు మారాయి. గాత్రాలు మారాయి. పాడే పద్యాలు కూడా  తారుమారయ్యాయి. 'రైలు చార్జీలు పెంచడం బాధాకరమైనా తప్పదు' ఇది షరా మామూలు పాలకపక్షం పాట. 'చార్జీలు ఇలా అమాంతం పెంచడం దారుణం, అమానుషం'  ఇది ప్రతిపక్షం మాట. వినీ వినీ జనాలకు విసుగెత్తి పోతోంది"         

"గవర్నర్ ది రాజ్యంగబద్ధంగా వ్యవహరించాల్సిన పాత్ర. రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ కావడం వల్ల రెండు సభల్లో విభిన్నమైన ప్రసంగాలు, అవి కూడా ఆయా మంత్రివర్గాలు ఆమోదించిన ప్రసంగ పాఠాలు చదవాల్సిన పరిస్తితి. ఇందువల్ల  కొంత విచిత్రంగా అనిపించవచ్చు. వెనకటికి సినిమా హీరోలు కధనిబట్టి ఒక చిత్రంలో ఒక హీరోయిన్ కు అన్నయ్యగా, మరో చిత్రంలో అదే హీరోయిన్ కు ప్రియుడిగా నటించేవారు. రెండు సినిమాలు పక్క పక్క ధియేటర్లలో ఆడేవి. జనం కూడా అంగీకరించేవారు"

కామెంట్‌లు లేవు: