22, జూన్ 2014, ఆదివారం

టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీ పీ


ఈరోజు (22-06-2014) సాయంత్రం నాలుగున్నర గంటలకు జెమినీ న్యూస్ పబ్లిక్ వాయిస్ ప్రోగ్రాంలో ప్రధాన అంశం అసెంబ్లీ బిజినస్ అడ్వైజరీ కమిటీ సభ్యత్వం గురించి టీడీపీ, వై.ఎస్.ఆర్.సీ.పీ. నడుమ చెలరేగుతున్న వాగ్యుద్ధం. యాంఖర్ శ్రీ శివ."అసలిది  అత్యల్ప స్వల్ప విషయం. ఈ కమిటీలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఒకరిద్దర్ని ఎక్కువ నామినేట్ చేయడం వల్ల  పాలకపక్షానికి వచ్చే  నష్టం ఏమీ వుండదు. అలాగే,  అజాగళ స్తనంలాంటి ఈ కమిటీ సభ్యులుగా మరో ఇద్దరిని పట్టుబట్టి వేయించుకోవడం వల్ల ప్రతిపక్షానికి అదనంగా వొనగూడే లాభమూ లేదు. కాకపోతే,  అసలీ చిచ్చు రాజుకోవడానికి అసలు  కారణం పైకి కనిపించని  రాజకీయం. వై.ఎస్.ఆర్.సీ.పీ. నుంచి మంచి సంఖ్యలోనే ఆ పార్టీవారు ఎన్నికయ్యారు. కాలం ఖర్మం కలిసిరాక ఇలాటి పదవులే  దిక్కయ్యాయి కాని వారిలో చాలామంది ఆ పార్టీ అధికారంలోకి వచ్చివుంటే ఏకంగా మంత్రులే అయ్యేవారు. అందువల్ల చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఇప్పించి పార్టీలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి మీద వుంటుంది. కానీ అదేసమయంలో పాలక పక్షం తద్విరుద్ధంగా ఆలోచించడం సహజం.  ప్రతిపక్షంలో చీలికలు రావాలి. చీలికలు రావాలంటే అసంతృప్తి పెరగాలి. అది పెరగాలంటే ఇదిగో ఇలాటి రాజకీయాలు చేయాలి. మొదటే చెప్పినట్టు అసెంబ్లీ బీ.ఏ.సీ.లో  సభ్యత్వం వల్ల వొరిగేది ఏమీ వుండదు. సమావేశాలప్పుడు స్పీకర్ ఏర్పాటు చేసే  మీటింగులకు హాజరు కావడం తప్ప. పోనీ అక్కడ వారి మాట ఏమన్నా చెల్లు తుందా అంటే అదీ లేదు. అన్నీ ముఖ్యమంత్రి లేదా స్పీకర్ చెప్పినట్టే జరుగుతాయి. నిర్ణయాలు కూడా అంతే. కానీ, రాజకీయాల్లో పదవులు, హోదాలు  ముఖ్యం. చిన్నవా  పెద్దవా  అన్నది తరువాత సంగతి."     

కామెంట్‌లు లేవు: