25, జూన్ 2014, బుధవారం

అసెంబ్లీలో టీడీపీ వైసీపీ వాదోపవాదాలు - 10 టీవీ చర్చ

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో టీడీపీ - వైసీపీ నడుమ వాదోపవాదాలపై '10 టీవీ' సోమవారం రాత్రి  ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది.  
పాలకపక్షం, ప్రతిపక్షం ఆరోపణలు-ప్రత్యారోపణలు, వాదోపవాదాలకు పోకుండా ప్రజా సమస్యలపై చర్చించడానికి అధిక ప్రధాన్యత ఇవ్వాలని చర్చలో పాల్గొన్న  వక్తలు సూచించారు.   ఈ చర్చా కార్యక్రమంలో నాతొ పాటు  టిడిపి నేత రామకృష్ణ ప్రసాద్, వైసిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పాల్గొని, మాట్లాడారు. యాంఖర్ శ్రీ సతీష్.  క్లుప్తంగా నా అభిప్రాయాలు: 
"ప్రజా ప్రయోజనాలకు భంగం కలగనంత వరకు వాదోపాదాలు, విమర్శలు చేసుకోవడంలో తప్పు లేదు... కానీ ప్రజా సమస్యలను పక్కన పెట్టి వాదోపవాదాలకు దిగడం భావ్యం కాదు.  ప్రతిప్రక్షం అధికార పక్షానికి నిర్మాణాత్మక సలహాలు, సూచలను ఇవ్వాలి. పాలక పక్షం వారు ప్రతిపక్షానికి తగినంత వ్యవధానం కల్పించాలి. గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో వున్నప్పుడు 'మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు, మైకులు కట్ చేస్తున్నారు' అని పిర్యాదు చేసిన విషయాన్ని గమనంలో వుంచుకోవాలి. ప్రతిపక్షం కూడా అవసరం అయినా కాకపోయినా స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకుపోవడం, వాయిదా తీర్మానాలు ఇచ్చి వాటిపై వెంటనే చర్చ జరగాలని పట్టుపట్టడం చేయకూడదు. అయితే ఈసారి ఎప్పుడూ లేనట్టుగా రెండే రెండు పార్టీలు అసెంబ్లీలో వున్నాయి. మూడో పార్టీ వున్నా అది పేరుకు మాత్రమే. ఆ పార్టీ సభ్యులు నలుగురిలో ఇద్దరు మంత్రివర్గంలో వున్నారు. కాబట్టి అధికార పక్షం. ప్రతిపక్షం రెండే వున్నట్టు లెక్క. ఈ అంశాన్ని స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలి. అసెంబ్లీ సమావేశాలు ఉచిత వినోద ప్రదర్శనగా తయారు చేయకూడదు. ఇరు పార్టీల ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. పుచ్చలపల్లి సుందరయ్య, నీలం సంజీవరెడ్డి లాంటి  నేతలు గతంలో అసెంబ్లీలో చాలా హుందాగా వ్యవహరించిన తీరును గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబుకు సీఎంగా, ప్రతిపక్ష నేతగా చేసిన అనుభవం వుంది. ఆ అనుభవాన్ని సభను సజావుగా నిర్వహించుకోవడంలో వాడుకోవాలి" 

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

కొత్తేముంది, ఈ ధోరణి గత అసెంబ్లీలలో చూసినదే గదా. "మీవాళ్ళు అలా చెయ్యలేదా" అని ఒక పార్టీ అంటే "మీవాళ్ళు ఇలా చేశారు కదా" అని ఎదుటి పార్టీ అంటుంది. "అన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమీ చెయ్యని మీరు మాట్లాడటమేమిటి" అని చర్చకు సంబంధంలేని దాడులు, ఏరోజూ సభా కార్యకలాపాలు సవ్యంగా నడవనివ్వకపోవటం. ఇదే తీరుగా ప్రస్తుత అసెంబ్లీ కూడా ఐదేళ్ళూ సాగుతుందనిపించటంలో ఆశ్చర్యం లేదు.

దీని మీద టీవీ చర్చలు కూడా అనవసరం అనిపిస్తుంది, ఎందుకంటే ఆ చర్చల్లో ఒకళ్ళ మీద ఒకరు అరవటం అడ్డు తగలటం తప్ప అర్ధవంతంగా ఉండటం అరుదు కదా (మీ గురించి కాదు, జనరల్ గా చెప్తున్నాను). చర్చల్లో ఈ అరుచుకోవటం చేసేది రాజకీయ నాయకులైతే బహుశా తమ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు "చూశారా, నేను ఎలా కడిగి పారేస్తున్నానో" అని షో ఆఫ్ చేసుకోవటానికని నా అనుమానం.

అవునండీ, మీరు టీవీ చర్చల్లో తరచూ పాల్గొంటారు కదా, చర్చల్లో ఈ అరుపులు, ఎదుటివారు చెప్తున్నది పూర్తి చెయ్యనివ్వకుండా అందరూ ఒకేసారి గోలగోలగా మాట్లాడటం జరుగుతుంటే ఆ టీవీ ఏంకర్లు కొంచెమన్నా మోనిటర్ చెయ్యకుండా చోద్యం చూస్తారేమిటి? Decency of debate అనేది ఒకటుంటుందని తెలియదా వీళ్ళకి?