23, జూన్ 2014, సోమవారం

రుణ మాఫీలు - మల్లగుల్లాలు


ఈరోజు (23-06-2014) ఉదయం ఏడుగంటలకు ఐ న్యూస్ ఛానల్ లో న్యూస్ వాచ్ ప్రోగ్రాం. యాంఖర్ ప్రసన్నతో."రుణ మాఫీలు -  కొత్త ప్రభుత్వాల మల్లగుల్లాలు. ఆంధ్రాలో మాట ఇవ్వడం అన్నా తెలంగాణలో వాదా అన్నా రైతులకు అర్ధం అయ్యేది మాత్రం ఒక్కటే. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ల రుణాలు రద్దు  చేయడం. యెలా చేస్తారు అన్నది మాట ఇచ్చిన వారు ఆలోచించుకోవాలి. అసలు మొత్తం మన రామాయణమే ఇచ్చిన మాట మీద నడిచింది. కైకకు దశరధుడు మాట ఇవ్వడం , ఆడిన  మాట తప్పకపోవడం వల్లనే అంత కధ అంతగా సాగింది. రాముడి మీద ప్రేమతో దశరధుడు ఒక దశలో,  ఇచ్చిన మాటకు సవరణలు ప్రతిపాదిస్తాడు.  'మాట ప్రకారం భరతుడికి రాజ్యం ఇస్తాను, రాముడి వనవాసం గురించి మరచిపోయి ఇంకేదయినా కోరుకొమ్మ'ని భార్యను ప్రాధేయ పడతాడు. రాముడి బదులు వనవాసానికి తాను సిద్ధం అంటాడు. కైకేయి ససేమిరా అనడంతో  రామాయణం అన్ని కాండలుగా విస్తరించింది. రుణ మాఫీ అనేది తమ చేతిలో లేనప్పుడు రాజకీయ పార్టీలు అలాటి వాగ్దానాలు చేయడం మానుకోవాలి. రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన కొత్త ఇబ్బందులు అప్పట్లో  తెలియక చేసామని భావిస్తూ వుంటే, ఇప్పటికయినా వున్న  వాస్తవాలను  ప్రజలకు వివరించి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేయాలి. అది ధీమంతుల లక్షణం. ప్రజలు కూడా హర్షిస్తారు. అంతే కాని,  ఇంకా ఇప్పటికీ 'ఆరు నూరయినా ఇచ్చిన మాట ప్రకారం రుణ మాఫీ అమలుచేసి తీరతాం' అనే పద్దతిలో ప్రకటనలు గుప్పిస్తూ, బింకాలు ప్రదర్శించడం వల్ల,  రైతుల్లో లేని పోని ఆశలు మరింత పెంచినట్టు అవుతుంది. పోతే, దీన్ని ఒక పాఠంగా తీసుకుని  భవిష్యత్తులో రాజకీయ పార్టీలు తమ పరిధిలో లేని వాగ్దానాలు చేయకుండా, ఏవన్నా షరతులు అవీ వుంటే వాటిని గురించి  ముందే ప్రజలకు చెప్పేలా  చట్ట పరిధిలో కొన్ని నిబంధనలు విధించాలి"              

కామెంట్‌లు లేవు: