19, జూన్ 2014, గురువారం

మహా టీవీ 'న్యూస్ అండ్ వ్యూస్'


ఈరోజు (19-06-2014) ఉదయం ఏడుగంటలకు  మహా టీవీ 'న్యూస్ అండ్ వ్యూస్'  కార్యక్రమంలో సీనియర్ యాంఖర్ శ్రీనివాస్ ప్రస్తావించిన అంశాలపై నాతొ పాటు పిఠాపురం నుంచి ఎన్నికయిన టీడీపీ అనుబంధ శాసన సభ్యుడు శ్రీ ఎస్వీ ఎస్ ఎన్ వర్మ స్పందించారు. నా స్పందన క్లుప్తంగా:


"గత కొన్ని సంవత్సరాలుగా శాసన సభ సమావేశాలు సజావుగా సాగిన దాఖలాలు లేవు. మొన్నీమధ్య ముగిసిన తెలంగాణా కొత్త శాసన సభ సమావేశాలు సంతృప్తి కరంగా సాగిన తీరు చూసిన తరువాత కొంత ఆశలు కలుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ అనే పేరు పాతదే అయినప్పటికీ, నిజానికి కొత్తదే. పాత అసెంబ్లీ భవనంలో జరగనున్న ఈ సమావేశాల్లో పాల్గొనే సభ్యుల సంఖ్య మునుపటి ఉమ్మడి శాసన సభతో పోల్చి చూస్తే బాగా తగ్గిపోయింది. అయితే, మొదటి సారి సభలో కుడికాలు పెడుతున్న కొత్త సభ్యుల సంఖ్య తక్కువేమీ కాదు. అందువల్ల అనుభవం కలిగిన సీనియర్ల ప్రవర్తన వాళ్లకి ఆదర్శంగా వుంటుంది.  కాబట్టి పాత  వాళ్ళమీద వుండే బాధ్యత కూడా ఎక్కువే.  ఈసారి పటిష్టమైన ప్రతిపక్షం కూడా వుంది. వాస్తవానికి పాలక పక్షం, ప్రతిపక్షం రెండే వుండే కొత్త సాంప్రదాయం అనుభవంలోకి  రాబోతోంది. దీన్ని ఉభయపక్షాలు బాధ్యతగా ఉపయోగించుకోవాలి. ఒకరి మీద మరొకరు నెపాలు మోపుకోవడానికీ, నిలదీయడానికీ వాడుకుంటే ప్రయోజనం వుండదు."
'ఇక లోకేష్ పార్టీ బాధ్యతల స్వీకరణ గురించి. ఇదేమంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. తండ్రి రాజకీయవారసత్వం అనేది రాజకీయాల్లో ప్రవేశం వరకు పనికొస్తుంది. ఆ తరువాత ఎవరైనా ఎదిగి రావడానికి సమర్ధతే గీటురాయి అవుతుంది. ఆ గుర్తింపు తెచ్చుకోగలిగితే రాణింపుకు అవకాశం లభిస్తుంది."

కామెంట్‌లు లేవు: