27, జూన్ 2014, శుక్రవారం

భారం కాదు బాధ్యత అనుకోవాలి

ఈరోజు (27-06-2014) ఉదయం ఏడు గంటలకి ఐ న్యూస్ 'న్యూస్ మార్నింగ్' ప్రోగ్రాంలో పృచ్చకుడి ప్రశ్నలు నా జవాబులు.


'కరెంటు కోతలు'
'దీర్ఘ కాలిక ప్రణాళికల విషయంలో గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలె ప్రస్తుత పరిస్తితికి కారణం. చౌక అనే కారణంతో జల విద్యుత్ మీదా, బొగ్గు లభ్యత కారణంతో థర్మల్ మీదా ఆధారపడుతూ వచ్చాం. పెట్టుబళ్ళ గురించి సందేహపడి ప్రత్యామ్నాయ విద్యుత్  వనరులపై దృష్టి పెట్టలేదు. అదే గుజరాత్ లో మోడీ ప్రభుత్వం ఖర్చు ఎక్కువయినా సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించింది. అలాగని అక్కడ కరెంటు చార్జీలు తక్కువేమీ కాదు. నాణ్యమైన విద్యుత్ సరఫరాపట్ల అక్కడి ప్రజలు కూడా మొగ్గుచూపారు. కొత్త రాష్ట్రాల పాలకులు కూడా తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నాలు చేసినా దీర్ఘ కాలిక పధకాలపై శ్రద్ధ పెట్టాలి'
'అయోమయంలో విద్యార్ధులు'
'ఎక్కడ చదువుకునే వారికి అక్కడి ప్రభుత్వాలే ఫీజు భరించాలి అనేది వినడానికి బాగానే వుంటుంది. కొంత నేపధ్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పధకం ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రం విడిపోయిలేదు. కలిసే వుంది. నాణ్యమైన విద్య బోధించే కాలేజీలన్నీ సహజంగా రాజధానీ నగరం  హైదరాబాదు చుట్టు పక్కలే వెలిశాయి. దాంతో శ్రీకాకుళం. అనంత పురం, ఆదిలాబాదు  జిల్లాల వాళ్లు కూడా ఈ కాలేజీల్లో చేరడానికే మొగ్గు చూపారు. ఫీజుల విషయంలో రెండు రాష్టాల ప్రభుత్వాలు పేచీ పడితే నష్ట పోయేది విద్యార్ధులు అనే వాస్తవం గుర్తుంచుకోవాలి.1956 కు ముందు అనే వాదం లేవదీయడానికి కూడా కారణం వుంది. విభజన ఉద్యమానికి  ఉద్యోగాలు కూడా కారణం. ఇప్పుడు ఇక్కడ చదువుకున్నవారికి ఫీజులు కడితే,  ముందు ముందు వారికి  ఉద్యోగాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అందుకని 1956 ముందు అనే వాదన బయలుదేరి వుంటుంది. సచివాలయం  యుద్యోగుల విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశమై చర్చించినట్టు   పత్రికల్లో వచ్చింది. అలాగే వారు మళ్ళీ సమావేశమై ఎక్కడ చదువుకుంటున్నా తమ తమ  ప్రాంతపు విద్యార్ధుల ఫీజు భారం తామే భరిస్తామని ఒప్పందానికి వస్తే సరిపోతుంది. భారం అనుకోకుండా బాధ్యత అనుకుంటే సమస్య సులువుగా తేలిపోతుంది'

కామెంట్‌లు లేవు: